పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత! | Shortage of funds in Panchayati Raj, Rural Development | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!

Published Tue, Mar 15 2016 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!

పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!

బడ్జెట్‌లో రూ. 4,686.16 కోట్ల కేటాయింపులతో సరి
ఈ శాఖకు గతేడాది కేటాయింపులు రూ. 6,927.48 కోట్లు
గ్రామీణాభివృద్ధిశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు
గత బడ్జెట్‌లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈసారి
రూ. 6,344.55 కోట్ల కేటాయింపు
మిషన్ భగీరథకు కేటాయింపులు శూన్యం

సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు మాత్రం చేయలేదు.

2015-16 ఆర్థిక బడ్జెట్‌లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల మొత్తంలో పంచాయతీరాజ్‌కు గతేడాదికన్నా నిధులను బాగా తగ్గించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం స్వల్పంగా కేటాయింపులు పెంచారు. అయితే పెరిగిన కేటాయింపులు కూడా కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించినవే కావడం గమనార్హం. పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు.

ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు.
 
పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా..
పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు.

ప్రణాళిక కింద ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ. 94.02 కోట్లు, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 45.16 కోట్లు, గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ. 45.16 కోట్లు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ. 45.16 కోట్లు కేటాయించారు. ఆస్తుల రూపకల్పన, ఉపాధి హామీ పనుల అప్‌గ్రెడేషన్ కోసం మొత్తం రూ. 1,078 కోట్లు కేటాయించారు. మండల పరిషత్ భవనాల కోసం రూ. 45 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్రం నుంచి రూ. 407 కోట్లు రావచ్చని చూపారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 164 కోట్లు కేటాయించారు. నిర్మల భారత్ అభియాన్, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూఎంపీ ప్రోగ్రామ్‌ల కింద కేంద్రం నుంచి మరో రూ. 1,040 కోట్లు వస్తాయని బడ్జెట్ కేటాయింపుల్లో చూపారు.
 
గ్రామీణాభివృద్ధికి ఇలా..
గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు.

స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ  జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 11.81 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 8.24 కోట్లకు కుదించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2.16 కోట్లు, టీసీపార్డ్‌కు గతేడాది రూ. 7.96 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 4.85 కోట్లకు కుదించారు.
 
‘మిషన్ భగీరథ’కు అప్పులే ఆధారం!
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 4 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఊసేలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన సంస్థల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుమారు రూ. 40 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. 2016 చివరికి 6,100 గ్రామాలు, 12 పట్టణాలకు సురక్షిత తాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది.
 
గ్రామజ్యోతికి నిధులు కరువు
ప్రభుత్వం గత ఆగస్టులో ప్రారంభించిన గ్రామజ్యోతికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల సూచనల ప్రకారం గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడమే గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement