గోదాములు.. వైకుంఠ ధామాలు | special interview of the PR the Minister of Agriculture Dayakar Rao | Sakshi
Sakshi News home page

గోదాములు.. వైకుంఠ ధామాలు

Published Sat, Feb 23 2019 2:48 AM | Last Updated on Sat, Feb 23 2019 10:39 AM

special interview of the PR the Minister of Agriculture  Dayakar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామం (శ్మశానం) ఏర్పాటు, గోదాముల నిర్మాణం చేస్తామని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.శ్మశాన వాటికలకు స్థలం దొరకని చోట అవసరమైతే గ్రామపంచాయతీ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుందని తెలిపారు.పల్లెల్లో కూడా తగిన వసతులతో స్వర్గధామాలు కూడా లేకపోవడంతో.. ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి ఈ చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. సచివాలయంలో శుక్రవారం పీఆర్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్వరాజ్యం సాధనకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులతో ముడిపడిన

కీలకంగా మారిన పంచాయతీ రాజ్‌..  
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అత్యంత కీలకంగా మారిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీకి సొంత భవన నిర్మాణం, రోడ్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఈజీఎస్‌ ద్వారా గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.  

ప్రతి ఊళ్లో గోదాంలు... 
గ్రామ స్థాయిలోనే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతీ ఊళ్లో గోదాంల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వీటితో పాటు ఫుడ్‌ ప్రాసె సింగ్‌ యూనిట్లను కూడా ఐకేపీ సెంటర్లు, గ్రూపుల ద్వారా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనలో భాగంగా మూడునెలల పాటు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వివిధ ప్రైవేట్‌సంస్థలు, ఆయా రంగా లకు సంబంధించి అవకాశాలు ఉన్న చోట్ల ఉద్యోగ,ఉపాధి కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.మిషన్‌ భగీరథలో భాగంగా వచ్చేనెలాఖరుకల్లా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు.ఏప్రిల్‌ చివరకల్లా గ్రామాల్లోని అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసేట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సర్కిల్‌ బిల్డింగ్‌ నిర్మాణ మంజూరుపై తొలి సంతకం
తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లకు తాను రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ పంచాయతీ రాజ్‌ సర్కిల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు తనను మోసం చేశారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో పొందని ఆనందం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను పొందానన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లా రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,శంకర్‌ నాయక్‌ , పెద్ది సుదర్శన్, గాంధీ, ప్రకాష్‌ గౌడ్, మాగంటి గోపీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, గుండు సుధారాణి, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు హాజరయ్యారు.  

ఇప్పటివరకూ పార్టీ సమన్వయ బాధ్యతలే.. 
మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ సంస్థాగత విషయాలు, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి వాటిపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన తనకు పీఆర్‌ శాఖ వంటి ప్రజలతో నిత్యం సంబంధముండే గురుతర బాధ్య తను సీఎం కేసీఆర్‌ తనపై ఉంచారన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎంకు, ఈ శాఖపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయన్నారు. వాటిని కచ్చితంగా పూర్తిచేసే దిశగా తన కార్యాచరణ ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. 

విధులు,బాధ్యతలపై దృష్టి పెట్టాలి..
కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా సర్పంచ్‌లకు అధికారాలతో విధులు, బాధ్యతలు కూడా ఉన్నందున వాటి నిర్వహణపై కొత్త సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లోనే ఉంటూ రోజువారి విధులు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్టంలో నిర్దేశించిన విధంగా నెలకోసారి గ్రామపంచాయతీ సమావేశం, మూడునెలలకోమారు సర్వసభ్య సమావేశం నిర్వహించడం, వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement