Panchayati Raj
-
గ్రామ స్వరాజ్య స్థాపనకు చర్యలెన్నో తీసుకున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ని ఆయన ఆవిష్కరించారు. మన హయాంలో గ్రామ స్వరాజ్య స్థాపనకు అనేక చర్యలు తీసుకున్నాం. స్థానిక సంస్థల బలోపేతానికి ఎంతో కృషి చేశాం. ఆర్థికంగా వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఎంపీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. -
పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో!
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన మంత్రిత్వ శాఖలనూ చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలను వేర్వేరు శాఖలుగా విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను వేరు చేసి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడం చర్చకు దారితీసింది. ఈ రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్నా రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన శాఖల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత వేధిస్తోందని ఆయన చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా ఫింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలోనే సాగుతోంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అలాంటిది సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్‌కు కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సెర్ప్‌కే అధికంగా నిధులుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్‌పరంగా చూసినా నిధుల కేటాయింపు సెర్ప్‌కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు రూ.27 వేల కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తోంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటూ తప్పనిసరి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే నిధులే. అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. ఓవైపు నిధుల కేటాయింపులోనూ అధిక వాటా కలిగి ఉండి, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యక్షంగా ప్రజల నుంచి మంచి పేరును తెచి్చపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్‌ను పవన్ కళ్యాణ్‌కు కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. నారాయణకు ప్రత్యేకం గ్రామాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ ఉన్నట్టే.. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మెప్మా పేరుతో ఒక విభాగం ఉంది. అయితే, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న మెప్మాను ఆ శాఖ మంత్రి నారాయణ పరిధిలోనే ఉంచడం గమనార్హం. -
సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఉపయోగించుకుంటూనే సొంత ఆదాయాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎ.సూర్యకుమారి సూచించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 27 పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులను కమిషనర్ సన్మానించి అవార్డులను అందజేశారు. పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాల కల్పన, హెల్దీ పంచాయతీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ, సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ, పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రదాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైనవారు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్లు సుధాకర్‌రావు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు ) -
పల్లెకు పట్టాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్లో పీఆర్‌శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్లో ఇచ్చిన రూ.29.586 కోట్ల కేటా యింపుల కంటే రూ.1,840 కోట్లు అధికం. ఐతే పీఆర్ శాఖతోపాటు మిషన్ భగీరథకు ఇచ్చిన రూ. 600 కోట్లు కూడా కలిపితే ఉమ్మడిగా (పీఆర్, ఆర్డీ, మిషన్‌భగీరథ శాఖకు కలిపి) రూ.32,026 కోట్లు కేటాయించినట్టు అవుతుంది. వివిధ పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు కోరుతూ ఈ శాఖ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ చాలామటుకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. కొత్తగా వేసే గ్రామీణ రోడ్లతోపాటు గతంలో వేసిన రోడ్ల నిర్వహణకు కలిపి రూ.2,587 కోట్లు, మిషన్ భగీరథ మెయింటెనెన్స్, మిషన్‌భగీ రథ ఇతర ఖర్చుల కోసం రూ.1,600 కోట్లు, జూని యర్ పంచాయతీ సెక్రెటరీల సర్వీసుల క్రమబద్ధీక రణ, దానికి తగ్గట్టుగా వేతనాల పెంపు నిమిత్తం రూ.315 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.849 కోట్లు, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పేస్కేళ్ల సవరణ నిమిత్తం కేటాయింపులు చేశారు. కాగా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు పైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు ఫైనాన్స్ ట్రెజరీల ఆమోదం కోసం వేచిచూడ కుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి
దిల్సుఖ్నగర్: ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ (ఐపీజీ) తరహాలోనె తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షుడుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటు అయిందని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఈ గ్రూప్‌కు ఆద్యులని తెలిపారు. బీజేఆర్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్‌ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు, అప్పుడప్పుడు సెమినార్లు, అంతర్‌జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి, ఆయా అంశాలను ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీల దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రజాప్రతినిధులు సోషల్ ఇంజనీర్లని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. -
పల్లెకు తగ్గని ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ఈసారి కూడా పల్లెకు పట్టం కట్టారు. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు. 57 ఏళ్ల అర్హత వయసుతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎస్టీ పంచాయతీ భవనాలకు నిధులు గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కింద రూ.800 కోట్లు కేటాయించింది. -
పంచాయతీల్లోనూ టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతుల జారీ కోసం అమలు చేస్తున్న ‘టీఎస్–బీపాస్’విధానాన్ని ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనకు రావడంతో, వాటిని కఠినంగా నియంత్రించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల్లో కొత్త లేఅవుట్ల అనుమతులు టీఎస్–బీపాస్ ద్వారానే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల మెమో జారీ చేశారు. పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్, ఈ–పంచాయతీ విధానాన్ని టీఎస్–బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జాప్యం చేసే అధికారులపై జరిమానాలు టీఎస్–బీపాస్ విధానం కింద భవనాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని అధికారులపై జరిమానాలు విధించనున్నారు. జరిమానాల విధింపు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు పురపాలక శాఖ టీఎస్–బీపాస్ పోర్టల్‌లో ప్రకటించింది. అక్రమ లేఅవుట్లకు 2 నెలల సమయం టీఎస్–బీపాస్ చట్టం మేరకు లేఅవుట్ల అనుమతులకు వచ్చే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లేఅవుట్ కమిటీ ముందు పెడతారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు సంబంధిత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు మీద అనుమతులు జారీ చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి టీఎస్–బీఎస్ కింద రెండు నెలల్లోగా క్రమబద్ధీకరణ/అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని, విఫలమైన పక్షంలో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అక్రమ లేఅవుట్ల తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లను కోరింది. -
డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీకూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్ వేస్టేజ్ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ప్రత్యేక నంబర్‌ను గ్రామాల్లో డిస్ప్లే చేయాలని, దానికి కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వేస్టేజ్ సేకరించి ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ‘వైఎస్సార్ జలకళ’ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ అన్నారు. లక్ష మందికి పైగా రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. చిన్నచిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని, కనీసం 3, 4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకుసాగాలని, దానిపై ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేయాలని, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సమగ్రసర్వేను ఉద్ధృతంగా చేయడంపై కమిటీ దృష్టిపెట్టనుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీ: 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ.. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు. గాంధీ స్ఫూర్తితో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్ లేకుండా వచ్చారో జాగ్రత్త సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం -
జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ‘తెలంగాణ’
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ఏటా ఇస్తున్న అవార్డుల్లో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 12 పురస్కారాలు సాధించింది. ఒక ఉత్తమ జెడ్పీ (మెదక్–సంగారెడ్డి) అవార్డు, రెండు ఉత్తమ మండల పరిషత్ (కోరుట్ల, ధర్మారం) అవార్డులతో పాటు మరో 9 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు తెలంగాణను వరించాయి. 2019–20 సంవత్సరానికి గాను జాతీయ పంచాయతీ అవార్డులు–2021 కింద రాష్ట్రంలోని వివిధ పంచాయతీరాజ్ సంస్థలకు ఈ అవార్డులు లభించాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయ్ కుమార్ బెహరా బుధవారం రాత్రి ఈ పురస్కారాలను ప్రకటించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డు, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ తదితర అవార్డులు ఇచ్చినట్టు బెహరా తెలియజేశారు. గత ఏడాది యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీలు) సమర్పణకు అనుగుణంగా అవార్డులు గెలుచుకున్న పంచాయతీరాజ్ సంస్థలకు అవార్డుకు సంబంధించిన నగదు విడుదల చేస్తామని చెప్పారు. మెదక్ జెడ్పీ (సంగారెడ్డి), జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండల పరిషత్, పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండల పరిషత్‌లు జనరల్ కేటగిరీలో అవార్డులు సాధించాయి. అవార్డులు సాధించిన పంచాయతీలివే.. థిమేటిక్–మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కేటగిరీ కింద కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (ఎల్ఎండీ) మండలం పార్లపల్లి, థిమేటిక్–నాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం హరిదాస్‌నగర్, థిమేటిక్–శానిటేషన్ కేటగిరీలో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి, ఇదే జిల్లాలోని నారాయణరావు పేట మండలంలోని మల్యాల్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి, జనరల్ కేటగిరీలో మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండంలోని చక్రాపూర్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ పురస్కార్‌కు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినీకుంట, గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డుకు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల అవార్డులు సాధించాయి. మంత్రి ఎర్రబెల్లి హర్షం రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 12 అవార్డులు రావడంపై పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధి అనే ట్యాగ్ లైన్ తీసుకుని కేంద్రం ఉత్తమ జిల్లా, మండల, గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు లభించాయని చెప్పారు. రాష్ట్రానికి ఏటా అవార్డులు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
సచివాలయ వ్యవస్థ సూపర్
సాక్షి, అమరావతి/ హిందూపురం సెంట్రల్: రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించటం, సచివాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించ తలపెట్టడం వంటి చర్యలను అభినందించింది. ప్రజల జీవన ప్రమాణాలను దగ్గర నుండి పరిశీలిస్తూ, వారికి ప్రభుత్వ పథకాలు చేరవేసే సులభమైన విధానం సచివాలయ వ్యవస్థ అనే విషయం నిరూపితమైందని ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కొనియాడారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కమిషనర్ నేతృత్వంలోని కర్ణాటక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం అనంతపురంలో పర్యటించింది. ఉద్యోగులు, వలంటీర్లతో ముఖాముఖి సోమందేపల్లి మండల కేంద్రంలో సచివాలయం–3ని సందర్శించి, వెలుగు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడారు. చిలమత్తూరు మండల కేంద్రంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిశీలించారు. మండలంలోని కోడూరు మన్రోతోపులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని చూశారు. అనంతరం చిలమత్తూరు రైతుభరోసా కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సచివాలయాలు, ఆర్బీకేల్లో అందుతున్న సేవలు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రజలతో తమ అనుభవాలు వివరిస్తున్నప్పుడు కమిషనర్ ప్రియాంక భావోద్వేగానికి లోనయ్యారు. సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ వలంటీర్ల సహకారం లేకపోతే తాము ఇంత తక్కువ కాలంలో ఇంతటి విజయాన్ని సాధించలేమంటూ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో కలసి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వలంటీర్లు చేసిన సేవలను వివరించారు. అనంతరం కమిషనర్ ప్రియాంక మాట్లాదారు. సచివాలయ ఉద్యోగితో పథకాల అమలుపై చర్చిస్తున్న ఐఏఏస్ నందిని 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఆషామాషీ కాదు – సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నట్లు గుర్తించాం. – 2వేల జనాభాకు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఏర్పాటు చారిత్రక నిర్ణయం. – సచివాలయాల ఏర్పాటు ద్వారా నాలుగు లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఆషామాషీ కాదు. ఇది నిరుద్యోగులకు గొప్ప వరం. – రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఇంటి వద్దనే లభ్యమవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రైతులు అదృష్టవంతులనిపిస్తోంది. – మహిళల సంక్షేమం కోసం సచివాలయానికో మహిళా సంరక్షకురాలి ఏర్పాటు అభినందనీయం. -
పంచాయతీలకు కొత్త ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగానే కాదు.. అధికారాల్లోనూ గ్రామ పంచాయతీలకు పెద్దపీట దక్కింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ, కొత్త రెవెన్యూచట్టంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక సమృద్ధి సాధించే దిశగా అడుగుపడింది. ఇప్పటివరకు కేవలం 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడిన పంచాయతీలకు ఇకపై మరిన్ని ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. సొంత వనరులకు అవకాశంతో పాటు కొత్త అధికారాలు కూడా సంక్రమించాయి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త చట్టంలో పొందుపరచడంతో పాత బకాయిలు వసూలు కానున్నాయి. ఇంటి, నల్లా పన్ను, విద్యుత్ చార్జీలకు సంబంధించి బకాయి లేనట్లు స్థానిక పంచాయతీ జారీ చేసిన ధ్రువపత్రం/రసీదును రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియను కూడా సబ్ రిజిస్ట్రార్లే పూర్తి చేయనున్నారు. తద్వారా ఆయా పంచాయతీల్లో ఉన్న మార్కె ట్ విలువకు అనుగుణంగా 1 నుంచి 5 శాతం వరకు రుసుము వసూలు చేయనున్నారు. ఇన్నాళ్లు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ పూర్తయినా.. గ్రామ పంచాయతీలకు సమాచారం ఉండేది కాదు. మ్యుటేషన్ కోసం దస్తావేజు సమర్పిస్తేనే పంచాయతీలకు తెలిసేది. ఇకపై దీనికి ఫుల్స్టాప్ పడనుంది. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా మ్యుటేషన్, పంచాయతీ ఖాతాలో ఆదాయం జమకానుంది. కొత్త నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ దస్తావేజులు, బహుమతి, వారసత్వం లేదా ఇతర చట్టం ద్వారా బదిలీ అయిన వ్యవసాయేతర రికార్డులు ధరణి పోర్టల్ ద్వారా ఈ– పంచాయతీ పోర్టల్‌కు అనుసంధానం కానున్నాయి. తద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీలు తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఎల్ఆర్ఎస్తో నిధుల వరద! స్థలాల క్రమబద్ధీకరణతో గ్రామ పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టం కానున్నాయి. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను ఇన్నాళ్లూ కేవలం నగర, పురపాలక సంస్థలు, పట్టణాభి వృద్ధి సంస్థల పరిధిలోనే అమలు చేసిన ప్రభుత్వం.. పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం పల్లెల్లోనూ అమలు చేయా లని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పంచాయతీల పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణతో వచ్చిన ఆదాయాన్ని స్థానిక పంచాయతీలకే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలకు దండిగా ఆదాయం రానుంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో అనధికార లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేదిలేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో ప్లాటు ఉన్న ప్రతి వ్యక్తి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో పంచాయతీలకు భారీగా ఆదాయం సమకూరనుంది. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీ కూడా.. ఇప్పటివరకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను తహసీల్దార్లు జారీ చేసేవారు. ఇటీవల శాసనసభలో ఆమోదం పొందిన నూతన రెవెన్యూచట్టంలో తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తొలగించిన ప్రభుత్వం.. వీటిని స్థానిక సంస్థలకు కట్టబెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగా ఇకపై కుల ధ్రువపత్రాలను పంచాయతీలే ఇవ్వనున్నాయి. అలాగే సమగ్ర కుటుంబసర్వే, ఇతర మార్గాల ద్వారా సేకరించిన వివరాలకు అనుగుణంగా ఆదాయ ధ్రువపత్రాలను కూడా అక్కడికక్కడే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ఇది సంస్కరణల తెలంగాణ
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో అనేక సంస్కరణలకు వేదిక అయిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన పల్లె ప్రగతిపై పంచాయతీరాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పది జిల్లాలు ఉన్న తెలంగాణ పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలుగా మారిందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలతో ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. పల్లె ముఖచిత్రం మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని, ఆ మార్పును కొనసాగించే దిశగా ఇప్పుడు గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంచి పల్లెలను తీర్చిదిద్దాలని కోరారు. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని, ప్రతి ఊరిలో ట్రాక్టర్ ఉండాలన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పనిచేయకుంటే పదవులు కోల్పోతారని, ఈ విషయంలో కఠినంగా ఉంటామని మంత్రి హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్లనే ముందు తొలగిస్తామని స్పష్టం చేశారు. పల్లె ముఖచిత్రం మారాలి ప్రతి ఊరిలో నర్సరీ ఉండాలని, చెత్త లేకుండా వీధి శుభ్రంగా ఉండాలని, డంపుయార్డులు, శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు ఉండాలని కేటీఆర్ సూచించారు. పల్లెల్లో సేకరించే తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తామని చెప్పారు. ఏ ఊరికి ఆ ఊరి ప్రజాప్రతినిధులే కథానాయకులై పల్లెల్లో మార్పు తేవాలన్నారు. అందరూ మిషన్ భగీరథ నీళ్లనే తాగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయి పల్లెల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా అందరూ క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పల్లెల్లో మార్పు కనిపించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటిన మొక్కల్లో 85% బతకాలన్నారు. జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లకు ప్రభుత్వం త్వరలో నిధులు మంజూరు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతాం ఆడపిల్లలకు ఆత్మరక్షణకు శిక్షణ ఇస్తామని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బాలికల హాస్టల్లో లైంగిక వేధింపుల ఘటనపై ఆయన గురువారం హాస్టల్‌ను సందర్శించి బాలికలతో మాట్లాడారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఎవరూ చేసినా తప్పేనని కేటీఆర్ అన్నారు. ఈ విషయం తెలియగానే దేవయ్యను టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించామని, చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
పంచాయతీరాజ్,విద్యాశాఖాధికారులతో ఆర్కే సమీక్ష
-
గోదాములు.. వైకుంఠ ధామాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామం (శ్మశానం) ఏర్పాటు, గోదాముల నిర్మాణం చేస్తామని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.శ్మశాన వాటికలకు స్థలం దొరకని చోట అవసరమైతే గ్రామపంచాయతీ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుందని తెలిపారు.పల్లెల్లో కూడా తగిన వసతులతో స్వర్గధామాలు కూడా లేకపోవడంతో.. ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి ఈ చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. సచివాలయంలో శుక్రవారం పీఆర్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్వరాజ్యం సాధనకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులతో ముడిపడిన కీలకంగా మారిన పంచాయతీ రాజ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అత్యంత కీలకంగా మారిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీకి సొంత భవన నిర్మాణం, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈజీఎస్ ద్వారా గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రతి ఊళ్లో గోదాంలు... గ్రామ స్థాయిలోనే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతీ ఊళ్లో గోదాంల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వీటితో పాటు ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లను కూడా ఐకేపీ సెంటర్లు, గ్రూపుల ద్వారా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనలో భాగంగా మూడునెలల పాటు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వివిధ ప్రైవేట్సంస్థలు, ఆయా రంగా లకు సంబంధించి అవకాశాలు ఉన్న చోట్ల ఉద్యోగ,ఉపాధి కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.మిషన్ భగీరథలో భాగంగా వచ్చేనెలాఖరుకల్లా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు.ఏప్రిల్ చివరకల్లా గ్రామాల్లోని అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసేట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్కిల్ బిల్డింగ్ నిర్మాణ మంజూరుపై తొలి సంతకం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు తాను రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ పంచాయతీ రాజ్ సర్కిల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు తనను మోసం చేశారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో పొందని ఆనందం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను పొందానన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లా రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,శంకర్ నాయక్ , పెద్ది సుదర్శన్, గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకూ పార్టీ సమన్వయ బాధ్యతలే.. మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ సంస్థాగత విషయాలు, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి వాటిపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన తనకు పీఆర్ శాఖ వంటి ప్రజలతో నిత్యం సంబంధముండే గురుతర బాధ్య తను సీఎం కేసీఆర్ తనపై ఉంచారన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎంకు, ఈ శాఖపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయన్నారు. వాటిని కచ్చితంగా పూర్తిచేసే దిశగా తన కార్యాచరణ ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. విధులు,బాధ్యతలపై దృష్టి పెట్టాలి.. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా సర్పంచ్‌లకు అధికారాలతో విధులు, బాధ్యతలు కూడా ఉన్నందున వాటి నిర్వహణపై కొత్త సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లోనే ఉంటూ రోజువారి విధులు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్టంలో నిర్దేశించిన విధంగా నెలకోసారి గ్రామపంచాయతీ సమావేశం, మూడునెలలకోమారు సర్వసభ్య సమావేశం నిర్వహించడం, వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. -
సమష్టిగా నిజాయితీతో పనిచేద్దాం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖలపై సీఎం కేసీఆర్‌కు ఎంతో నమ్మకం ఉందని, దానిని వమ్ము చేయకుండా అధికారులు, ఉద్యోగులు అందరం కలసి నిజాయితీతో పనిచేద్దామని ఆ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు. గురువారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు, ఉద్యోగులతో మంత్రి ఎర్రబెల్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ శాఖలకు సంబంధించిన అధికారులందరూ ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం సూచించినట్టు ఆయన తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నిధుల దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. సర్పంచ్‌లను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పంచాయతీరాజ్‌కు భారీగా నిధులు వస్తున్నాయని, వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆ శాఖ కమిషనర్ నీతూప్రసాద్, సెర్ఫ్ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేడు బాధ్యతల స్వీకరణ శుక్రవారం ఉదయం 9.30కి సచివాలయంలోని తన చాంబర్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు. ఒక మంచి పనికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేసేలా దస్త్రాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. సెక్రటేరియట్ డీబ్లాక్ మొదటి అంతస్తులోని చాంబర్ 251 (ఆ శాఖ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చాంబర్)ను ప్రభుత్వం ఆయనకు కేటాయించిన విషయం తెలిసిందే. -
సర్పంచ్ బరిలో తోటికోడళ్లు
సూర్యాపేటరూరల్ : వారిద్దరూ తోటి కోడళ్లు. కానీ సర్పంచ్ పదవి కోసం ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచారు. సూర్యాపేట మండలం ఆరెగూడెం గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు అన్నదమ్ముల సతీమణులు పోటీలో నిలవడంతో ఆ గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆరెగూడెం గ్రామపంచాయతీ ఆవాసం పుల్గంవారిగూడెంకు చెందిన పుల్గం చిన లింగా రెడ్డి, సుగుణమ్మ పెద్ద కుమారుడైన పుల్గం వెంకటరెడ్డి, చిన్న కుమారుడైన పుల్గం రాఘవరెడ్డి తమ సతీమణులను సర్పంచ్ బరిలో నిలిపారు. ఆరెగూడెం గ్రామపంచాయతీ జనరల్ మహిళ కావడంతో తమకు రిజర్వేషన్ కలిసి రాలేదని వారు తమ భా ర్యలను సర్పంచ్ పోటీకి దించారు. ఇంటికి పెద్ద వాడైన పుల్గం వెంకటరెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా తన భార్య సుజాతను పోటీలో నిలపగా ఆయన తమ్ముడు పుల్గం రాఘవరెడ్డి కూడా తన భార్య స్వాతిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంచారు. అన్నదమ్ముల భార్యలు సర్పం చ్ బరిలో ఉండడంతో ప్రజలు ఎవరికి ఓటు వేయాలనే ఆలోచనలోపడ్డారు. 226 ఓట్లకుపైగా వస్తే గెలుపు బాలెంల గ్రామ ఆవాసమైన ఆరెగూడెంను ఇటీవల ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేసింది. పుల్గంవారిగూడెం, ఆరెగూడెం గ్రామాలను కలిపి ఆరెగూడెం గ్రామపంచాయతీగా చేసింది. ఈ గ్రామంలో 549 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ తక్కువ ఓట్లు ఉండడం, పోటీలో ఉన్న వారు ఇద్దరూ తోటి కోడళ్లు కావడం విశేషం. 226 ఓట్ల పైచిలుకు ఎవరికి వస్తే వారిదే గెలుపు తధ్యం. ఇప్పటికే ముమ్మరంగా ఇరువురు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. -
జగిత్యాల: పేరుకే పంచాయతీలు..!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): నిధులు లేక పంచాయతీలు నీరసించిపోతున్నాయి. తండాల నుంచి పంచాయతీలుగా మారినా.. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. పంచాయతీలుగా గుర్తించి ఆర్నెళ్లయినా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదంటే అతిశయోక్తికాదు. పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రత్యేక అధికారులకు పాలనపగ్గాలు అందించడం.. అదనపు బాధ్యతలతో వారు సరిగా విధులు నిర్వర్తించకపోవడంతో గ్రామాల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 500 జనాభా దాటిన తండాలను చాయతీలుగా చేస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న పంచాయతీలు గిరిజన తండాలకు, గిరిజనేతర శివారు గ్రామాలకు దూరంగా ఉండి, తక్కువ జనాభా కలిగి ఉన్నా అట్టి తండాలను, శివారు గ్రామాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ప్రకటించి, రాష్ట్ర అవతరణ రోజైన జూన్ రెండు నుంచి తండాల్లో ప్రత్యేక పంచాయతీల పాలన ఆరంభించింది. పంచాయతీలు 21 జిల్లాలో మొత్తం 380 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జూన్ 2న జిల్లాలో గిరిజన, గిరజనేతర జనాభా ప్రాతిపదికన కొత్తగా 60 గ్రామపంచాయతీలను ఏర్పాటుచేశారు. గతంలోనే రాయికల్ మండలం జగన్నాథపూర్ గిరిజన గ్రామపంచాయతీగా ఉండగా.. కొత్తగా 20 తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించగా..ఇక్కడ 100 శాతం గిరిజనులే ఉన్నారు. మండలాల వారీగా గిరిజన గ్రామపంచాయతీలు సారంగాపూర్ మండలంలో భీంరెడ్డిగూడెం, ధర్మనాయక్తండా, మ్యాడారం తండా, లచ్చనాయక్‌తండా, నాయికపుగూడెం బీర్పూర్ మండలంలో చిన్నకొల్వాయి, చిత్రవేణిగూడెం, కందెనకుంట, రాయికల్ మండలం అలియనాయక్తండా, జగన్నాథపూర్, కైరిగూడెం, మంత్యనాయక్తండా, లొక్యనాయక్తండా, వాల్మీకితండా, మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ తండా, వాల్గొండతం డా, మెట్పల్లి మండలంలో ఏఎస్ఆర్ తండా, కేసీఆర్ తండా, పటిమిడి తండా, ఇబ్రహీంపట్నంలో తిమ్మాపూర్ తండా, కథలాపూర్‌లో రాజారంతండాలు కొడిమ్యాల మండలంలో గంగారాంతండా గిరిజన గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా అభివృద్ధి లేదు గ్రామపంచాయతీలు ఏర్పాటు జరిగినా తండా పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మినహాయించి ప్రభుత్వం నుంచి ఇతర అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలే దు. దీంతో పంచాయతీల ఏర్పాటు ద్వారా పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమిలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. జూన్ 2న పంచాయతీలను ఏర్పాటు చేసిన సమయంలో పంచాయతీ కార్యాలయాల కోసం తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కమ్యూనిటీ భవనాలు, పాఠశాల భవనాలు, కొన్ని గ్రామాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని పంచా యతీ కార్యాలయాలను ప్రారంభించారు. పంచా యతీలు ఏర్పాటు జరిగినా, ఇప్పటి వరకు ఆయా పంచాయతీ కార్యాలయాల్లో సరిౖయెన ఫర్నిచర్ కూడా అందుబాటులో లేదు. కొత్తగా నిధులు లేవు గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి జనాభా ప్రాతిపదికన వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కార్యదర్శి పేరును జమ చేశారు. ఈ నిధులను తండాలోని వీధిదీపాల ఏర్పా టు, బావుల్లో క్లోరినేషన్ నిర్వహించడంతోపాటు, మురికి కాల్వలను శుభ్రం చేయడానికి వినియోగించారు. ఇతరనిధులు మంజూరు కాకపోవడంతో గ్రామాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదు. అధికారుల హాజరు చుట్టచూపే ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన గ్రామాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారే తప్ప, గిరి జనులతో ఎలాంటి ప్రత్యేక సమావేశాలు జరప డం లేదని సమాచారం. చుట్టపుచూపుగా గ్రామాలకు వస్తున్నారని, తండాల్లోని సమస్యలపై చర్చలు నిర్వహించడం లేదని పేర్కొంటున్నారు. -
పనోడు అని సంబోధిస్తారా?
ఒంగోలు టూటౌన్ : జిల్లా పరిషత్ సీఈఓ టి. కైలాష్ గిరీశ్వర్‌ని పనోడు అని మిగిలిన ఉద్యోగులను చిన్న పనోళ్లని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు సంబోధించడం దురదృష్టకరమని ఎంపీడీఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బి. సాయికుమారి, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసకుమార్, పంచాయతీ కార్యదర్శిల అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ రామోహన్, పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ వై. పోలయ్య (పాల్‌రాజ్), ఈఓఆర్డీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు గురువారం తీవ్రంగా ఖండించారు. 18వ తేదీ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఈ సంఘటన అందరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలే కానీ ఒకరికి ఒకరు జవాబుదారీ తనం కాదని చెప్పారు. జరిగిన సంఘటనను పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ తరఫున అన్ని అసోషియేషన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. -
ఏ ఊరికెంత?
సాక్షి, హైదరాబాద్: గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వరుసగా మూడేళ్లపాటు గ్రామాలకు కేటాయించే నిధులపై ప్రణాళిక రూపొందిస్తోంది. 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన, కేటాయించాల్సిన నిధుల వివరాలను ఇవ్వాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పంచాయతీ ఎల్జీడీ కోడ్‌తోపాటు ఆర్థిక సంవత్సరాల వారీగా కేటాయింపులను పొందుపరచాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు మంజూరయ్యే నిధుల వివరాలను పేర్కొనాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది జూలై 31తో ముగుస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ కొత్త చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాతే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని సీఎం కేసీఆర్ పలుసార్లు ప్రకటించారు. దీంతో కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాత ప్రత్యేక అభివృద్ధి నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి గ్రామ పంచాయతీలకు రూ.1500 కోట్లతో పాటు ఇవి కాకుండా ఇతర సాధారణ అభివృద్ధి నిధులను మంజూరు చేస్తారు. ఏ గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించాలనే అంచనా కోసం ప్రస్తుత కేటాయింపు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. -
అసెంబ్లీలో రోడ్ల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు బీటీ పునరుద్ధరణపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్న వేశారు. ఈ అంశంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ వాపోయారు. ప్రజలు తిట్టకుండా వెళ్లడం లేదు: రామలింగారెడ్డి అధికారుల తప్పుడు నివేదికల వల్ల దుబ్బాకలోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ‘సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వారు తిట్టకుండా వెళ్లడం లేదు. ఇదే రహదారిని ముస్తాబాద్ నుంచి అవతలి వరకు బాగా చేశారు. రోడ్లను మరమ్మతు చేయకుండానే చేసినట్లు నివేదికలు రూపొందించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోడ్లలో నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డుపైనే మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లొస్తుంటారు. ఆయనకు పరిస్థితి తెలుసు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పంచాయతీరాజ్ మంత్రికి వివరించినా ఫలితం లేదు. ముస్తాబాద్ రోడ్డును గత పదేళ్లలో ఒక్కసారి మరమ్మతు చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా’అన్నారు. వాస్తవాలను పట్టించుకుని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిధుల్లేవంటున్నారు: భాస్కర్‌రావు ఇదే అంశంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాలేదన్నారు. ‘పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల మంత్రులను అడిగితే నిధుల్లేవంటున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినందుకో ఏమోగానీ మా నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’అని వాపోయారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ.. ‘అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు సరిగా ఉండటం లేదు. అందుకే మరమ్మతు పనులు జరగడం లేదు’ అన్నారు. సగానికే ఆగిపోతున్నాయి: రమేశ్ అధికారులు నివేదికలు సరిగా రూపొందించకపోవడం వల్ల కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారం వంటి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు దూరాన్ని సరిగా లెక్కగట్టక మధ్య వరకే బీటీ ఆగిపోతోంది. అక్కడ గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’అన్నారు. అసెంబ్లీలో దాదాపు 15 మంది తమ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చేతులు ఎత్తారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని.. ‘ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. దీనిపై చర్చ జరిగితే మంచిది. అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి సమాధానం ఇవ్వాలి’ అన్నారు. 358 గ్రామాలకు రోడ్లు లేవు: జూపల్లి తెలంగాణ ఏర్పడిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రోడ్ల అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2004–2014 మధ్య బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.416 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 14 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు చేశామని.. 2,925 కిలోమీటర్ల రోడ్లను విస్తరించామన్నారు. మరో 4,695 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 358 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరాలకు తగినట్లు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
చట్ట సవరణ తర్వాతే ‘సహకార’ ఎన్నికలు
బీర్కూర్: పంచాయతీరాజ్ చట్ట సవరణ తరహాలోనే సహకార చట్టాన్ని సవరించిన తర్వాతే సహకార సంఘా లకు ఎన్నికలు నిర్వహిస్తామని వ్యవ సాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని శ్రీవేంకటేశ్వరాలయంలో నిర్వహించిన గోదా దేవి–రంగనాథుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సహకార ఎన్నికల విషయమై ఇప్పటికే రెండు, మూడు సార్లు సమావేశమయ్యా మన్నారు. పాలక వర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు నాలుగు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిం చడం, అఫీషియల్, నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలతోపాటు మరో ముగ్గురు అధికారులతో కమిటీ వేయడం, ప్రస్తుత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
తప్పుల తడకగా ‘ఇంటింటి సర్వే’
-
‘ట్రాన్స్ఫర్’ చేయరూ
► టీడీ బకాయిలపై తకరారు ► నిధులు రాకపోవడంతో అభివృద్ధి పనులు ఆగాయంటున్న సర్పంచులు సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో గ్రామ పంచాయతీలకు అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ(టీడీ) బకాయిలు అందకుండా పోయాయి. ఫలితంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెలా భూముల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ బకాయిలను రిజిస్ట్రేషన్ల శాఖ గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం లేదు. ఎవరి వాదన వారిది.. పంచాయతీరాజ్ శాఖ నుంచి తమకు ఆయా గ్రామ పంచాయతీల డీడీవో కోడ్లు, పీడీ అకౌంట్ల వివరాలు అందకపోవడమే ప్రధాన కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అంటుండగా, ట్రాన్స్ఫర్ డ్యూటీని ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీల ఖాతాలకు జమ చేయాలని తాము కోరినా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్పందన కరువైందని పంచాయతీరాజ్ అధికారులు ఆరోపిస్తున్నారు. వడ్డీలు కట్టలేక సతమతం రెండేళ్లుగా పంచాయతీలకు అందాల్సిన టీడీ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వమే వాడుకుంటోంది. ఉపాధిహామీ పథకం కింద మూడు నెలల కిందట దాదాపు రూ.350కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రహదారులను నిర్మిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. రోడ్లు నిర్మించిన కాంట్రాక్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని దుస్థితి. – అందోల్ కృష్ణ, సర్పంచుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇప్పటి వరకు టీడీ బకాయిల మొత్తం సుమారు రూ.కోట్లు 600 16 నెలలుగా విడుదల చేయడం లేదు ఆస్తి విలువలో టీడీగా వసూలు చేసేది 1.5% 30 రోజులు ఈ మొత్తాన్ని పంచాయతీల ఖాతాల్లో జమచేయాల్సిన సమయం: 30 రోజులు(నెల) -
8 స్థానిక సంస్థలకు పురస్కారాలు
- లక్నోలో 24న ‘జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ - అవార్డులు అందజేయనున్న యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రి తోమర్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుపనున్నారు. జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలకు రాష్ట్రం నుంచి 8 స్థానిక సంస్థలు ఎంపికయ్యాయి. లక్నోలోని రాం మనోహర్ లోహియా నేషనల్ యూనివర్సిటీలో సోమవారం జరగనున్న అవార్డుల ప్రదాన కార్యక్రమానికి కేంద్ర మంత్రి తోమర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కార్‌కు ఎంపికైన సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మీయాదమ్మకు యూపీ సీఎం అవార్డును అందజేయనున్నారు. అలాగే పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలను కేంద్ర మంత్రి తోమర్ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ తుల ఉమ, వనపర్తి జిల్లా ఘనపూర్, వరంగల్ జిల్లా తాడ్వాయి మండల పరిషత్‌ల అధ్యక్షులు(ఎంపీపీ) కె.కృష్ణానాయక్, కొందురు శ్రీదేవి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సర్పంచ్ నీరడి భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బెకట్కూర్ గ్రామ సర్పంచ్ పొన్నం మంజుల, గోపాల్రావుపల్లి గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి రాంరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నిజలాపూర్ గ్రామ సర్పంచ్ జి.ఇంద్రయ్య అందుకోనున్నారు. పురస్కారాలకు ఎంపికైన జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.50 లక్షలు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతులను కేంద్రం ఇవ్వనుంది. పంచాయతీరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ ప్రసాద్ లక్నో వెళ్లనున్నారు. -
మంత్రిగా లోకేశ్‌కు సలహాలు ఇస్తా...
విశాఖ : రోడ్లు భవనాల శాఖలో అందరి సమన్వయంతో పనిచేస్తానని ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగిందని, అందరికీ పదవులు ఇవ్వడం కష్టమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనకు కేటాయించిన ఆర్అండ్బీ శాఖ సంతృప్తికరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబంలోని మూడు తరాల వారితో పనిచేయడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్నందున... కొత్తగా ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు మంత్రిగా సలహాలు ఇస్తానని అయ్యన్న తెలిపారు. కాగా ఏపీ మంత్రివర్గ పునరవ్యవస్థీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్ కోసం పంచాయతీ రాజ్ శాఖను కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే అయ్యన్న ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీరాజ్ శాఖను చిన్నబాబు లోకేశ్‌కు కేటాయింపుతో ఆ శాఖను అయ్యన్న త్యాగం చేయాల్సి వచ్చింది. -
స్థానిక సంస్థలకు చేరని టీడీ నిధులు
9 నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్న రూ.458 కోట్లు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం స్థానిక సంస్థలను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి నిధుల్లేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు రిజిస్ట్రేషన్ల ద్వారా అందాల్సిన కోట్ల రూపాయల ఆస్తి బదలాయింపు చార్జీల (ట్రాన్స్ఫర్ డ్యూటీ) నిధులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్దే మూలుగుతున్నాయి. గత 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3.80 లక్షల రిజిస్ట్రేషన్లకు సుమారు రూ.458 కోట్ల మేర ట్రాన్స్ఫర్ డ్యూటీ (టీడీ)గా రిజిస్ట్రేషన్ల శాఖ ఖాతాలో జమ అయింది. కాగా, వివిధ కారణాలతో ఆయా సంస్థలకు బదిలీ కావాల్సిన టీడీ మొత్తం నెలల తరబడి రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉండిపోయింది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పబ్లిక్ డిపాజిట్(పీడీ) అకౌంట్లు, డీడీవో కోడ్లు తమవద్ద లేనందునే టీడీ మొత్తాలను సంస్థలకు బదలాయించ లేదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
పంచాయతీలపై ‘పచ్చ’పవర్
-
పంచాయతీలపై ‘పచ్చ’పవర్
జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు.. సర్పంచుల ఆఖరి అధికారంపై వేటు ►కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలు ►భూసేకరణకు అడ్డంకులు లేకుండా సర్కారు పెద్దల ఎత్తులు ►సర్పంచులు ఇక డమ్మీలే.. పెత్తనం అధికార పార్టీ కార్యకర్తలదే ►పంచాయతీరాజ్ చట్టం అపహాస్యం..స్థానిక సంస్థలు నిర్వీర్యం ►పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు పచ్చచొక్కాల జేబుల్లోకే సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచుల అధికారాలను ఒక్కొక్కటిగా కత్తిరించేసిన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆఖరి అధికారంపై కూడా వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ.. గ్రామ సర్పంచులను డమ్మీలుగా మార్చేసి, వారికి ఉండే కీలక అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు జరగాల్సిన గ్రామసభల నిర్వహణ అధికారాన్ని ఇకపై జన్మభూమి కమిటీలకు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఆదేశించారు. 1994 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం.. గ్రామసభలకు స్థానిక సర్పంచి అధ్యక్షత వహించాలి. సర్పంచి లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించాలి. గ్రామ సర్పంచే గ్రామసభ నిర్వహణకు అనుమతి తెలపాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జన్మభూమి కమిటీ సభ్యుల నేతృత్వంలో గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించడం గమనార్హం. భూసేకరణకు అడ్డు తొలగించుకోవడానికే! రాష్ట్రంలో విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ పెద్దల కుట్రలకు గ్రామసభలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. ఏ గ్రామంలోనైనా భూసేకరణ చేపట్టాలంటే అక్కడి గ్రామసభ ఆమోదం తప్పనిసరి. నిబంధనల ప్రకారం.. గ్రామంలో అందరూ అంగీకరించి, తీర్మానం చేస్తే తప్ప భూములను సేకరించడానికి వీల్లేదు. ఇదే నిబంధన ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఆటంకంగా మారింది. అందుకే గ్రామసభ నిర్వహణ అధికారాన్ని సర్పంచుల నుంచి లాగేసి, సొంత పార్టీ కార్యకర్తలతో నిండి ఉండే జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఇక తమకు అడ్డే ఉండదని నిర్ణయానికొచ్చారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య భావనను సమాధి చేస్తూ గ్రామాల్లో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో పింఛన్లు, ఇళ్ల మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ కమిటీల చలవతో నకిలీ లబ్ధిదారులు ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నారు. అసలైన లబ్ధిదారులు మాత్రం నష్టపోతున్నారు. భూసేకరణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడంతోపాటు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ‘పచ్చ’ చొక్కాల జేబులు నింపడానికే గ్రామసభల అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ కమిటీల నిండా టీడీపీ మనుషులే ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సర్పంచులకు ఉండే అధికారాలను ప్రభుత్వం తెగ్గొట్టి, జన్మభూమి కమిటీ సభ్యులకు విశేషాధికారాలు కల్పించిన విషయం తెలిసిందే. జన్మభూమి కమిటీ సభ్యులుగా దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులే నియమితులయ్యారు. రాజకీయ కారణాలతో పలువురు అర్హులకు పింఛన్లు నిలిపి వేసినట్లు లక్షల్లో ఫిర్యాదులు వచ్చాయి. వందలాది మంది హైకోర్టును ఆశ్రయించి తిరిగి పింఛన్లు పొందారు. ఇప్పడు గ్రామసభ నిర్వహణ అధికారాన్ని జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల అధికారాలకు తూట్లు గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు పెరిగాయి. 14వ ఆర్థిక సంఘ సిఫార్సులతో గ్రామ పంచాయతీకి కేంద్రం నేరుగా ఇచ్చే నిధులతోపాటు ఉపాధి హామీ పథకంలో గ్రామాలవారీగా కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల కోసం స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు పథకాల అమలుకు మూడేళ్లుగా ఏటా రూ.5,000 కోట్ల చొప్పున కేంద్రం నుంచి నిధులొచ్చాయి. జనాభాపరంగా పంచాయతీని బట్టి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.25 లక్షలు ఆర్థిక సంఘం రూపేణ నిధులు అందగా, ఉపాధి హామీ పథకంలో అదనంగా ప్రతి పంచాయతీకి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. పంచాయతీల వారీగా కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలకు మళ్లిస్తున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు ప్రభుత్వం సర్పంచుల అధికారాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. సర్పంచుల అధికారాల విషయంలోనూ జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం పెరుగుతోంది. గ్రామసభ అంటే? గ్రామంలోని ఓటర్లు ప్రతి ఏటా విధిగా నాలుగు సార్లు సమావేశం కావాలి. దీన్నే గ్రామసభ అంటారు. సమావేశమై రాష్ట్ర ప్రభత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలి. గ్రామ సభకు పూర్తి ప్రచారం కల్పించాలి. గ్రామం లో ఓటర్లందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో పగటి పూటే ఈ సభ నిర్వహిం చాలి. గ్రామ పంచాయతీలో చేపట్టాల్సిన పనుల గురించి సమీక్షించాలి. అనంతరం తీర్మానం చేయాలి. గ్రామ సర్పంచి గ్రామ సభకు అధ్యక్షత వహించాలని పంచాయ తీరాజ్ చట్టం సెక్షన్ 6 రూల్ నంబరు 5లో స్పష్టంగా పేర్కొన్నారు. 1997 ఏప్రిల్‌లో పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవో 162లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. గ్రామసభలో గ్రామ ఆదాయ, వ్యయాలపై చర్చించి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. ఏ పనికి ఎంత ఖర్చు పెట్టాలో కూడా సభలో నిర్ణయిస్తారు. జూలైలో నిర్వహించాల్సిన రెండో సభలో గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు గ్రామ పరిధిలో లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలి. అక్టోబరు నెలలో నిర్వహించాల్సిన గ్రామసభలోనూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికతోపాటు గ్రామంలో మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించాల్సి ఉంటుంది. జనవరి 2న నాలుగో గ్రామసభ నిర్వహించాలి. ఏడాదిపాటు గ్రామంలో చేపట్టిన పనులపై నాలుగో గ్రామసభలో చర్చించాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, విధులు, అధికారాలపై 2013 నవంబరు 7న రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం జీవో నంబరు 791 జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు గ్రామానికి కేటాయించిన ఇతర నిధులతో స్థానికంగా ఏయే పనులు చేపట్టాలన్న దానిపై గ్రామసభలో చర్చించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
శాఖల స్వరూపం ఇలా..
- ప్రభుత్వానికి చేరిన తుది ప్రతిపాదనలు - ‘సంక్షేమం’పై కొనసాగుతున్న సందిగ్ధత కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.. మరి ప్రభుత్వ శాఖల స్వరూపం ఎలా ఉండబోతోంది..? ఏయే మార్పులు చేయబోతున్నారు..? వేటిని విలీనం చేయబోతున్నారు..? వీటిపై ఆయా శాఖలు ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలు సమర్పించాయి. ఆ వివరాలు శాఖల వారీగా ఓసారి చూద్దాం.. - సాక్షి, హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి..ఒకే కమిషనర్ కిందకు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విలీనమవుతుండడంతో ఇకపై ఈ సంస్థలన్నీ ఒకే కమిషనర్ కింద పనిచేస్తాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జిల్లా స్థాయి హెడ్లుగా వ్యవహరిస్తారు. మిషన్ భగీరథ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆర్టీసీ.. 18 మంది డివిజినల్ మేనేజర్లు.. 27 జిల్లాలను 18 మంది డివిజినల్ మేనేజర్లు పర్యవేక్షిస్తారు. విస్తీర్ణం, డిపోల సంఖ్య ఆధారంగా పెద్ద జిల్లాలకు ఒక డివిజినల్ మేనేజర్, చిన్నవైతే రెండిటికి కలిపి ఒకరు చొప్పున ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్‌కు సంబంధించి నిర్మల్‌లో ప్రధాన కార్యాలయం ఉంటుంది. కరీంనగర్, పెద్దపల్లికి కలిపి కరీంనగర్లో, వరంగల్, భూపాలపల్లికి కలిపి వరంగల్‌లో, హన్మకొండ, మహబూబాబాద్‌కు కలిపి హన్మకొండలో, మహబూబ్‌నగర్, వనపర్తికి కలిపి మహబూబ్‌నగర్‌లో, నల్లగొండ, సూర్యాపేటకి కలిపి నల్లగొండలో, మెదక్, సంగారెడ్డికి కలిపి సంగారెడ్డిలో, హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరిలకు హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రాలుంటాయి. రిజిస్ట్రేషన్ల శాఖ పనిభారం మేరకు ఉద్యోగుల కేటాయింపు ఉండనుంది. ప్రస్తుతం 12 మంది జిల్లా రిజిస్ట్రార్లు ఉండగా, మిగిలిన 15 పోస్టుల్లో సీనియర్ సబ్ రిజిస్ట్రార్లను డీఆర్లుగా నియమించనున్నారు. పంచాయతీరాజ్.. రాష్ట్రంలో కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటవుతున్నందున ప్రస్తుతం ఉన్న ఎంపీడీవోలనే కొత్త మండలాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదించింది. వేర్వేరు మండలాల్లోని గ్రామాలతో ఏర్పాటవుతున్న 10 నుంచి 12 మండలాలకు ఒక ఓఎస్డీని నియమించనున్నారు. వాణిజ్య పన్నులు కొన్ని జిల్లాల సర్కిల్ పరిధిలో మార్పు చేర్పులు జరుగుతాయి. జనగామలోని కేంద్ర కార్యాలయాన్ని యాదాద్రి జిల్లా కేంద్రానికి మారుస్తారు. భూపాలపల్లి, నాగర్ కర్నూలు, వికారాబాద్‌లలో సీటీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఉప్పల్‌లో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లో ఇక డీఐఈవో.. ఇన్నాళ్లూ జిల్లా ఇంటర్మీడియట్ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), ఇంటర్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్ఐవో) వ్యవస్థ ఉండేది. ఇకపై ఇది రద్దు కానుంది. కొత్త జిల్లాల్లో ఈ రెండింటిని కలిపి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) పేరుతో కొత్త కేడర్‌ను సృష్టించి అమలు చేయనున్నారు. ఇక జిల్లాల్లో పాఠశాలలను పర్యవేక్షించేందుకు ఇకపై జిల్లా విద్యాశాఖాధికారి వ్యవస్థ మాత్రమే ఉండనుంది. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ (డీపీవో) వ్యవస్థను రద్దు చేయాలని ప్రతిపాదించారు. విద్యుత్.. కొత్త జిల్లాల్లో డిస్కంల జిల్లాధికారులుగా డివిజ నల్ ఇంజనీర్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పరిధిలోని 12 సర్కిల్ కార్యాలయాల సూపరింటెండెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలో కొత్త జిల్లాల డీఈలు పనిచేయనున్నారు. జెన్కో, ట్రాన్స్‌కో, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, నెడ్‌క్యాప్, సింగరేణి సంస్థలపై కొత్త జిల్లాల ప్రభావం ఏమీ లేదు. రెవెన్యూలో సెక్షన్ల కుదింపు కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిది సెక్షన్లు ఉండగా వాటిని ఆరుకు కుదిస్తారు. గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. రోడ్లు భవనాలు రెండు మూడు జిల్లాలను ఓ సర్కిల్‌గా చేసి ప్రతి సర్కిల్‌కు ఒక ఎస్ఈని కేటాయిస్తారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల విలీనం జిల్లా స్థాయిలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారు. వీటన్నింటికీ కలిపి జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల డిప్యూటీ డెరైక్టర్లు, పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల స్థాయి అధికారులు డీఏవోలుగా ఉంటారు. ‘సంక్షేమం’ ఏం చేస్తారో..? సంక్షేమ శాఖల విలీన ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్ని ప్రభుత్వ శాఖలు తమ తుది ప్రతిపాదనలను అందజేయగా, సంక్షేమ శాఖల నుంచి మాత్రం మూడు ప్రతిపాదనలు అందాయి. అవేంటంటే.. 1. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన వివిధ విభాగాలను వాటి మాతృశాఖలో కలిపేయడం. 2. రెండు శాఖలు విలీనమైతే... ► బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల విలీనం ► ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమాలు విలీనం ► ఇతర సంక్షేమ శాఖలన్నీ ఒకటవుతాయి 3. అన్ని శాఖలు విలీనమైతే... ► జిల్లా మొత్తానికి ఒకే సంక్షేమ అధికారి ఉంటారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో సహాయ సంక్షేమ అధికారులుగా ఉన్న వారే జిల్లా సంక్షేమ అధికారులుగా కొనసాగుతారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుత జిల్లాలకు డీఎం హెచ్వోలే అధిపతులుగా కొనసాగుతారు. కొత్తగా వచ్చే 17 జిల్లాలకు మాత్రం అడిషనల్ డీఎంహెచ్వోలు, ఏడీఎంహెచ్‌వో(పీహెచ్)లు డీఎంహెచ్‌వోలుగా నియమితులవుతారు. -
ఎప్పుడిస్తారో తెలియని ‘ఆసరా’
* పింఛన్ల పంపిణీపై అంచనాల కమిటీ అసంతృప్తి * పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరుపై ఎమ్మెల్యేల ఆక్షేపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఎప్పుడు అందుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని, 36 లక్షలమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే విషయంలో స్పష్టమైన తేదీలను ప్రకటించ లేకపోవడం శోచనీయమని అంచనాల కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన గురువారం అసెంబ్లీలో అంచనాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసరా పింఛన్లు, పంచాయతీరాజ్ రహదారులు, ఉపాధిహామీ పనులు.. తదితర అంశాలపై సభ్యులు సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని సెర్ప్ సీఈవో పౌసమి బసును నిలదీశారు. ఆధార్ కార్డులో పేర్కొన్న వయసు ఆధారంగా వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారని, దీంతో లక్షలాదిమంది తమ వయసును మార్చుకొని అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని ఆమె ఆరోపించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఎంతోమంది అర్హులకు ఇప్పటికీ పింఛన్లు అందడం లేదన్నారు. సెర్ప్ సీఈవో స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదలలో జాప్యం జరగడం వల్లే పింఛన్లను సకాలంలో అందజేయలేకపోతున్నామని వివరించారు. ఆధార్‌కార్డు వయసును పరిగణనలోకి తీసుకోవడం లేదని, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రతినెలా కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. 30% ‘లెస్’ వేస్తుంటే ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం బాగోలేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు 30 శాతం లెస్‌కు టెండర్లు వేస్తున్నారంటే ఎస్టిమేషన్స్ వేయడంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనుకోవాల్సి వస్తుందన్నారు. కేవలం కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసమే లెస్‌కు టెండర్ వేసి, ఆపై కాంట్రాక్టర్లు పనులను సరిగా చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖలో టెండర్లకు బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ నిర్ధారించిన విధంగా పంచాయతీరాజ్‌లోనూ 5 శాతం కన్నా తక్కువగా టెండర్‌వేస్తే సదరు సొమ్మును డిపాజిట్ చేయించుకోవాలని సూచించారు. ఉపాధిహామీ కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వ్యవసాయానికి కూడా ఉపాధిహామీని అనుసంధానం చేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని సూచిం చారు. ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్ కింద చేపట్టిన స్కీమ్‌లకు సకాలంలో సొమ్ము చెల్లించక రైతులు అవస్థలు పడుతున్నారని మరికొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులున్నారు. -
ఐకేపీ సిబ్బంది జీతాల పెంపు!
ప్రతిపాదనలు పంపాలని పీఆర్ కమిషనర్‌ను ఆదేశించిన సీఎం సాక్షి, హైదరాబాద్ : ఐకేపీ సిబ్బందికి ఇచ్చే నెలసరి జీతాన్ని (రెమ్యూనరేషన్) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రితో చర్చించి రెమ్యూనరేషన్ పెంపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నిరుపేద నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలో దాదాపు 4,264 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దాదాపు యాభై లక్షల మందికి పైగా మహిళా సభ్యులున్న ఐకేపీ సంఘాలను బలోపేతం చేయటంలో వీరిదే కీలకపాత్ర. పదిహేనేళ్లుగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఐకేపీ ఉద్యోగులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల తరహాలోనే ఐకేపీ సిబ్బందిని పరిగణిస్తూ అలవెన్సులు, హెచ్ఆర్ పాలసీ విధానాన్ని అమలు చేస్తూ 58 ఏళ్ల రిటైర్మెంట్ వరకు ఉద్యోగ భద్రత కల్పించింది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మేరకు వేతన సవరణ చేసిన ప్రభుత్వం.. ఐకేపీ సిబ్బంది జీతాలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఐకేపీ సిబ్బంది జీతాన్ని పెంచేందుకు సీఎం చొరవ తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కొలువుదీరాయి
జంట నగరాల్లో రాష్ట్ర కార్యాలయాల సందడి 17 ప్రభుత్వ విభాగాల ప్రారంభం విజయవాడలో 14 శాఖలు, గుంటూరులో రెండు, మంగళగిరిలో ఒకటి ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయం గుంటూరులో ఎక్సైజ్, పంచాయతీరాజ్ సహా ఇతర ప్రధాన కార్యాలయాలు బెజవాడలో విజయవాడ : జంట నగరాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల రాష్ట్ర కార్యాలయాల సందడి మొదలైంది. అద్దె భవనాల్లో తాత్కాలిక వసతులు, సౌకర్యాలు చూసుకొని కీలక విభాగాల కార్యాలయాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి సోమవారం పెద్ద సంఖ్యలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావటంతో రెండు నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హడావుడితో కోలాహలం నెలకొంది. ఈ నెల 29 కల్లా విజయవాడ, గుంటూరులో అన్ని ప్రభుత్వ రాష్ట్ర శాఖలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సోమవారం రెండు నగరాల్లో కలిపి 17 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో 14, గుంటూరులో రెండు, మంగళగిరిలో మరోటి ప్రారంభించారు. దీంతో ఆయా శాఖల మంత్రులు, రాష్ట్ర కమిషనర్లతో రెండు నగరాల్లో సందడి వాతావరణం కనిపించింది. కార్యాలయాలు ఇలా... ఈ నెల 27 కల్లా హైదరాబాదు నుంచి ఉద్యోగులందరూ తరలిరావాలని తొలుత ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. తర్వాత 29 వరకు దీనిని పొడిగించింది. ఈ క్రమంలో ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో సోమవారం పెద్ద సంఖ్యలో కార్యాలయాలు తరలివచ్చాయి. విజయవాడ నగరంలో కొన్ని కార్యాలయాలు ప్రభుత్వ ప్రాంగణాల్లో, మరికొన్ని నగర శివారుల్లోని అద్దె భవనాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బందరు రోడ్డు, ప్రసాదంపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడిలో కార్యాలయాలను ఏర్పాటుచేశారు. ప్రసాదంపాడులో ఐదు ఫ్లోర్ల అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని దానిలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ రాష్ట్ర కమిషనర్ కమిషనర్ కార్యాలయాన్ని, దానితో పాటు బెవరేజెస్ ఎండీ కార్పొరేషన్ కార్యాలయాన్ని, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాలను సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా, ఎంపీ కొనకళ్ల నారాయణ, మేయర్ శ్రీధర్, ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రసాదంపాడులోని ఏఎన్ఆర్ టవర్స్‌లో ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం, సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యాలయం, సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్లను ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణ, కమిషనర్ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో రాష్ట్ర అర్థ గణాంక శాఖ కార్యాలయాన్ని సంస్థ డెరైక్టర్ డాక్టర్ పి.దక్షిణామూర్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం కమిషనరేట్ కార్యాలయాన్ని ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎస్.ఉమామహేశ్వరరావు, మైలురాయి సెంటర్లోని టీటీడీసీ కార్యాలయ ప్రాంగణంలో సెర్ఫ్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) కార్యాలయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా, సెర్ఫ్ సీఈవో పి.కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఏలూరు రోడ్డులో ఉన్న మారుతీనగర్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రారంభించారు. విజయవాడ నగరంలోని నక్కల్ రోడ్డులో ఉన్న చరితశ్రీ హాస్పిటల్ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని, బందరు రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న జెడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంలో శాప్ తాత్కాలిక కార్యాలయాన్ని శాప్ చైర్మన్ వీఆర్ మోహన్ ప్రారంభించగా, శాప్ ఎండీ రేఖారాణి పాల్గొన్నారు. ఏసీబీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని పై అంతస్తులో ప్రారంభించారు. ఏసీబీ డీజీ మాలకొండయ్యను ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన ఆర్టీసీ బస్‌భవన్‌కు హైదరాబాద్ నుంచి ఉద్యోగులు సోమవారం తరలివచ్చారు. గుంటూరులో.... గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఇంటర్మీడియట్ రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాపరిషత్ సమీపంలోని ఎస్పీ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి రావెల కిషోర్ బాబు ప్రారంభించారు. మంగళగిరిలో రాష్ట్ర గంథ్రాలయ సంస్థ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. -
రిటైరయ్యే వరకు ఎంపీడీఓనేనా..?
జిల్లాలో 38 మండల పరిషత్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 35 మంది ఎంపీడీఓలు విధులు నిర్వహిస్తున్నారు. 2001లో ఎంపీడీఓలుగా చేరిన వారు ఇంకా అదే స్థాయిలో ఉన్నారు. 2007, 2009 గ్రూప్ 1 పాసై ఎంపీడీఓలుగా ఉద్యోగాల్లో చేరిన వారూ అక్కడే ఉన్నారు. పదోన్నతుల విషయంలో ఎంపీడీఓలపై చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. ‘ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీసు పూర్తయ్యేలోపు రెండు పదోన్నతులు కల్పిస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించడానికి టీడీపీ అధికారంలోకి రాగానే జీఓ ఇస్తాం’ అంటూ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినా ఫలితం లేకపోయింది. శ్రీకాకుళం టౌన్ : పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో మండల అభివృద్ధి అధికారిగా ఉద్యోగంలో చేరితే సర్వీసు పూర్తయ్యే వరకు అదే సీట్లో ఉండాల్సి వస్తోంది. సర్వీసు కమిషన్ ద్వారా ఉద్యోగంలో చేరినప్పడు మండల స్థాయి అధికారి పోస్టుగదా అని ఎంపీడీఓగా చేరితే ఇక అంతే. తన కంటే కిందిస్థాయిలో ఉన్న వారు పదోన్నతులు పొందుతూ పైకి ఎదిగిపోతుంటే... వీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. నిత్యం రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నా దానికి తగ్గ ఫలాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. కీలక బాధ్యతలు... జాబ్ చార్టు ఆధారంగా 29 ముఖ్య విధులునిర్వహించే ఎంపీడీఓలకు ప్రభు త్వం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ కీలక భాగస్వామ్యం ఉంటుంది. ఏ పార్టీ వారు అధికారంలో ఉన్నా వీరిపై ఒత్తిళ్లు సహజం. మండల స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో కూడా వీరే కీలకం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు, నవనిర్మాణ యాత్రలు, ఇతర ప్రచార కార్యక్రమా లూ నిర్వహించారు. పైసా రాల్చకుండా ఈ పనులన్నీ ఎంపీడీఓల చేత చేయిం చుకుంటున్న ప్రభుత్వం వారి పదోన్నుతులు మాత్రం పట్టించుకోవడం లేదు. వాహనమూ కరువే... మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న వారికి కనీస వసతులు కూ డా లేవు, జిల్లాలో వారి కంటే దిగువ స్థా యి ఉద్యోగులకు సైతం వాహన యో గం ఉంది. ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీఓలకు వాహన సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించింది. వెలుగులో కాం ట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏపీడీలకు సైతం వాహన సౌకర్యం కల్పించింది. కానీ ఎంపీడీఓలకు మాత్రం వాహనం ఇవ్వడం లేదు. ఎంపీడీలకు పదోన్నతులు కల్పించాలంటే జెడ్పీలో డిప్యూటీ సీఈఓ, ఎంఓ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, డుమా, డీఆర్డీఏ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులుగా నియమించే అవకాశాలున్నాయి. అలాగే ఏడీ స్థాయిలో నియామకాలు కల్పించే అవకాశం ఉంటుందని వీరు ఆశ పడుతున్నారు. అభ్యర్థించినా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీడీఓల పదోన్నతులు కోరుతూ లిఖితపూర్వకంగా అభ్యర్థించాం. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే పోస్టుల వెసుల బాటు ఆధారంగా పదోన్నతులు ఇచ్చేందుకు జీఓ జారీ చేసింది. అదే తరహాలో ఏపీలో జీఓ జారీ చేసి పదోన్నతులు ఇవ్వాలి. -కె హేమసుందర్, జిల్లా ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు సీనియారిటీ జాబితా ప్రకటించండి... పదోన్నతులు కల్పించడానికి ముందుగా సీనియారిటీల జాబితా ప్రకటించాలి. అలాగే పదోన్నతులకు అవసరమైన సర్వీసు రూల్స్ ఫ్రేం చేయాలి. ఆ తర్వాత సింగిల్ సిటింగ్ పదోన్నతులు ఇవ్వాలి. ప్రభుత్వం ఎంపీడీఓల విషయంలో నిర్ధిష్టమైన జీఓ విడుదల చేయలి. - కిరణ్‌కుమార్, ఎంపీడీఓ, లావేరు -
బది‘లీల‘లెన్నో!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో సుమారు 27 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి తహసీల్దారు వరకూ 585 మంది, గ్రామ రెవెన్యూ అధికారుల క్యాడరులో 540 మంది ఉన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్లు కలిపి 4,500 మంది ఉండగా...పంచాయతీరాజ్‌లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక జిల్లాలో మిగతా ప్రభుత్వ శాఖల్లో పదుల సంఖ్యలోనే ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో సంఖ్యాపరంగా దాదాపు 12 వేల మంది ఉన్న ఉపాధ్యాయులదే అగ్రభాగం. వీరి కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఉపాధ్యాయుల బదిలీలు మాత్రం ఈ సంవత్సరానికి ఉండకపోవచ్చని ఆ సంఘాల నాయకులు చెబుతున్నారు. షెడ్యూల్ విడుదల ఆలస్యం సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మే నెలలో నిర్వహిస్తుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ విషయంలో అలక్ష్యం వహిస్తోంది. ఈసారి కూడా అదే వైఖరి కనబరచింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో ఇది మూడో బదిలీ ప్రక్రియ. కానీ గత రెండు ప్రక్రియలూ విద్యాసంవత్సరం మధ్యలోనే జరిగాయి. ఈసారి కూడా జూన్ ఆఖరు వరకూ షెడ్యూల్ ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తికావడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందని భయపడుతున్నారు. సిఫారసుల కోసం అగచాట్లు! గత రెండుసార్లు చేపట్టిన బదిలీల్లో అధిక శాతం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేల సిఫారసులతోనే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీ వరకూ వెళ్లింది. తమ చెప్పుచేతల్లో ఉండే అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండటంతో ఉద్యోగులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు పలువిధాలుగా ప్రయత్నిస్తున్నారు. వారి సిఫారసు లేఖలతో ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను కలుస్తున్నారు. కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో తమకు నచ్చిన వారిని నియమించుకునేందుకు నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల వల్ల తమ పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని కొంతమంది ఉద్యోగులు భయపడుతున్నారు. దీంతో తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, లేదంటే తమకు అనుకూలమైన స్థానంలో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావుతో పక్క జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రు డు, గంటా శ్రీనివాసరావులను ఆశ్రయిస్తున్నారు. అలాంటివారు ప్రధానంగా నీటిపారుదల, రవాణా, రెవెన్యూ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఇబ్బందులెన్నో... బదిలీల ప్రక్రియను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే 14వ తేదీ నుంచి ప్రారంభమైతే కేవలం ఏడు రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడమంటే కత్తిమీద సామే. బదిలీపై అప్పీళ్లు, పొరపాట్లు సరిచేయడం వంటివన్నీ పూర్తి చేయడం కష్టమే. అధికార పార్టీ నాయకుల సిఫారసులు, కొంతమంది ఉద్యోగుల పైరవీలకు పెద్దపీట వేయడానికే ఇంత తక్కువ సమయం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవోలో 20 శాతం వరకూ బదిలీలు చేసే అవకాశం ఇచ్చినప్పటికీ గత రెండు పర్యాయాల్లో బదిలీల్లో ఎక్కువ మందిని బదిలీ చేయడం వల్ల ఈసారి 10 శాతం మించి బదిలీలు జరగపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బదిలీలపై కామన్ జీవోను విడుదల చేసిన ప్రభుత్వం శాఖాపరంగా మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీనివల్ల ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవడంపై కూడా గందరగోళం నెలకొంది. -
అంబరాన్నంటిన ఆవిర్భావ సంబరాలు
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. కలెక్టరేట్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణంలోని ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల ప్రదర్శనలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మలను, బోనాలను ఎత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెడ్పీలో.. జెడ్పీ ఆవరణలో జెడ్పీ చైర్ పర్సన్ గడిపెల్లి కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మారుపాక నాగేశ్, పీఆర్ ఈఈ ఐ.రమేష్, డిప్యూటి సీఈవో రాజేశ్వరి, ఏఓ భారతి, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటపతిరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. రవీంద్రపసాద్,తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో... ♦ డీపీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో మారుపాక నాగేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ రామయ్య పాల్గొన్నారు. ♦ ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ కార్యాలయంలో ఎస్ఈ సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. వాటర్‌గ్రిడ్ ఎస్ఈ శ్రీని వాసరావు, శ్యామ్‌రావు, భానుప్రసాద్ పాల్గొన్నారు. ♦ పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ♦ తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలోజెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటపతిరాజు, రవి,రాజేశ్వరరావు, వాణిశ్రీ, కిశోర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డి,చింపలరాజు,రంగారావు పాల్గొన్నారు. ♦ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు.అఖిల్, హసన్, రామారావు, రంగయ్య పాల్గొన్నారు. ♦ జిల్లా సివిల్సప్లై కార్యాలయంలో డీఎం సత్యవాణి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ♦తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె. లింగయ్య జెండాను ఆవిష్కరించారు. నగర అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు, నాయకులు రమేష్, వెంకటేశ్వరరావు,బిక్కు పాల్గొన్నారు. ♦ సమాచారశాఖ కార్యాలయంలో ఏడీ ముర్తుజా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్వోలు యాకుబ్‌పాషా, శ్రీనివాసరావు, డివిజనల్ పీఆర్వో దశరథం,ఉద్యోగులు వి. శ్రీనివాసరావు, శ్రీనివాస్,నారాయణరావులు పాల్గొన్నారు. ♦ తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.రంగరాజు జెండాను ఆవిష్కరించారు. కార్యదర్శి రామయ్య, నగర అధ్యక్షప్రధానకార్యదర్శులు వల్లోజు శ్రీనివాస్,సాగర్,రమణయాదవ్ పాల్గొన్నారు. ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో.... డిసీసీబీ కార్యాలయంలో బ్యాంక్ చెర్మైన్ మువ్వా విజయ్ బాబు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. బ్యాంక్ పాలక వర్గ సభ్యులు పి.రాంబ్రహ్మం, కె.రంగరాజు, బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు తదితరులు పాల్గొన్నారు. జేడీఏ కార్యాలయంలో... జేడీఏ కార్యాలయంలో జేడీఏ పి.మణిమాల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడీఏ స్వరూపారాణి, రవికుమార్, నాగరాజు, కిషన్ నాయక్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉద్యాన శాఖలో..... ఉద్యాన శాఖ కార్యాలయాల్లో డీడీ ఆర్.శ్రీనివాసర్ రావు, ఏడీహెచ్ కె.సూర్యనారాయణలు జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఉద్యాన అధికారి శ్రావణ్, పాషా, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో... ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కార్యదర్శి ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టి. కిరణ్‌కుమార్, కార్యదర్శి రాజేంద్రప్రసాద్ వి. నాగేశ్వరి, నరేష్, వజీర్ బాలాజీ, పద్మ, నిర్మల పాల్గొన్నారు. ఏడీఎం కార్యాలయంలో... జిల్లా మార్కెటింగ్ కార్యాలయంలో మార్కెటింగ్ ఏడీఏ ఎస్.వినోద్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉద్యోగులు నరేందర్, సుమన్, రామకృష్ణ పాల్గొన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో... ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ విగ్రహాలకు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావులు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బోనకల్ రోడ్లో ఉన్న మానసిక వికలాంగులకు స్వీట్లు పంచారు. జి. శ్రీనివాసరావు, చింతల రామ లింగేశ్వరరావు, టి. లక్ష్మీనర్సింహారావు,కె . ప్రవీణ్‌కుమార్, ఎన్.కోదండరాములు, ఎం.రామారావు, ఎం.కృష్ణ, పి, శ్రీనివాసరావు,బి. శ్రీనివాసరావు,బి. రమణా రెడ్డి, పి. రమేష్, లక్ష్మీకాంతరావు,బి.రాజేశ్వరరావు, రాంమూర్తి, పి. నాగేశ్వరరావు పాల్గొన్నారు. కార్మిక విభాగం ఆధ్వర్యంలో....కార్మిక సంఘం కార్యాలయం వద్ద జిల్లా నాయకులు ఎన్.మాధవరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోఎన్.సత్యనారాయణ,టి.వీరభద్రం, నాయకులు ఎస్.రామయ్య, ఎ. రాంరెడ్డి, కె.సైదిరెడ్డి, ఎ.శ్రీను. ఎ. వెంకన్న, వి.వెంకటనారాయణ, వెంకటప్పయ్య, మరాఠి యాదయ్య, ప్రకాష్, బిక్షం, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. దడువాయిల సంఘం ఆధ్వర్యంలో..... ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దడువాయిల సంఘం ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మీనారాయణ, ఎన్.రాజేష్, ఎం. నర్సింహారావు, నర్సయ్య, కె.యాదయ్య, ఎ.సత్యనారాయణ, ఎం.నర్సిరెడ్డి, ఎస్.కోటేశ్వరరావు, చలమల నర్సింహారావు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో .. ఖమ్మం మామిళ్లగూడెం:బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అద్యక్షుడు బెరైడ్డి ప్రభాకర్‌రెడ్డి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విద్యాసాగర్ ,వెంకటేశ్వరావు,సత్యనారాయణ,శ్రీనివాస్,డి.సత్యనారాయణ, రుద్రప్రదీప్, శ్రీదేవి, పుల్లేశ్వరావు, అశోక్, ప్రభాకర్,కోటేశ్వరావు, అప్పారావు ,కొమరయ్య పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో.. ఖమ్మం అర్బన్:టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కె. వెంకటేశ్వర్లు, కె. శివయ్య, ఎ. శ్రీనివాసరావు, ఎం. వెంకటేశ్వర్లు, కె. సత్యనారాయణ, ఎస్. రంగారావు, కె.సత్యనారాయణ, ఎన్.రంజిత్, ఎం.రామారావు, షేక్ మీరా పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో.. ఖమ్మం సిటీ : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంత రావు ఎగుర వేశారు. డ్వామా ఆధ్వర్యంలో ... డ్వామా జిల్లా కార్యాలయంలో డ్వామా పీడీ జగత్కూమార్రెడ్డి జెండా అవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు మరింత కష్ట పడి పని చేయాలని కోరారు. సెట్ కాంలో... తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని సెట్కాం ఆధ్వర్యంలోసెట్కాం సీఈవో పరంధమరెడ్డి జెండా అవిష్కరించి, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. డీఆర్డీఏలో .... తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని డీఆర్డీఏ ఆధ్వర్యంలో డీఆర్డీఏ పీడీ మురళీధర్‌రావు జెండా అవిష్కరించి, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ పీడీ శీలం మోహన్,సోషల్ వేల్ఫేర్ డీడీ సంచితానంద గుప్తా పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో.. ఖమ్మం వైరారోడ్ : టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్బీ.బేగ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అజయ్‌కుమార్, నాయకులు పి.నాగేశ్వరరావు, ఎన్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ బి. మురళి, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు కె.మురళి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో... డీఎంహెచ్ఓ కొండల్రావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో అధికారులు కళావతిబాయి, మాలతి, అన్నప్రసన్న, నిర్మల్‌కుమార్, బి.వెంకటేశ్వరరావు, డెమో వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ అనందవాణి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరిండెంట్ టి. లక్ష్మణ్‌రావు, ఆర్ఎంఓ శోభారాణి, డాక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కృపాఉషశ్రీ, మోహన్‌రావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, నర్సింగ్ సూపరిండెంట్ సుగుణ, ఆర్వీఎస్ సాగర్, స్వాతికుమార్ పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్ ఈఈ ఇంట్లో సోదాలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పంచాయతీ రాజ్ ఈఈ నివాసం, కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈఈ దుర్గాప్రసాద్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు మూడు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. శనివారం విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఐదు బృందాలు విశాఖ, రాజమండ్రిలో దుర్గా ప్రసాద్‌కు చెందిన నివాసాలతో పాటు పనిచేస్తున్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఐదు ఖరీదైన స్థలాలు, రెండు డూప్లెక్స్ ఇళ్లు, పావు కిలో బంగారం, మూడు కిలోల వెండి వస్తువులు, రూ. 5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.లక్ష నగదు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. -
పైసలిస్తేనే పని!
► పంచాయతీరాజ్‌లో మామూళ్ల దందా ► ‘దారి’తప్పుతున్న అధికారులు ► ప్రతి స్థాయిలో తప్పని చెల్లింపులు ► నాణ్యత సర్టిఫికెట్తో మరో శాతం అదనం ► ఇంజనీర్ల తీరుతో అధ్వానంగా పనులు సాక్షి ప్రతినిధి, వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యాలకు విఘాతం కలుగుతోంది. పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగేందుకు అందులోని ఇంజనీర్లే కారణమని గ్రామాల్లోని పనులను పరిశీలిస్తే తెలుస్తోంది. పనులు చేసే వారిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నార నే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి పనికైనా పర్సెంటేజీలు చెల్లిస్తేనే అధికారులు బిల్లులు, రికార్డులను పూర్తి చేస్తున్నారు. పనులు ప్రారంభమైనరోజు నుంచే అధికారుల మామూళ్ల దందా మొదలవుతోంది. ఇది బిల్లుల చెల్లింపు వరకు సాగుతోంది. కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు లెక్కప్రకారం పర్సెంటేజీలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రప్రభుత్వం పీఆర్ ఇంజనీరింగ్ విభాగానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా నిధులు కేటాయించింది. అభివృద్ధి పనులు చేపట్టేం దుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. అన్ని పనులకు సగటున 15 శాతం వరకు తక్కువ(లెస్) టెం డర్లు దక్కించుకుంటున్నారు. పనులు ప్రారంభిం చేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుం ది. ఇక్కడే అధికారుల మామూళ్ల పని మొదలవుతోంది. ఒప్పందాల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్లకు మొదట తమ కమీషన్ గురించి చెబుతూ పనులు ఎలా చేస్తే ఎంత మిగులుతుందనేది వివరిస్తున్నారు. డబ్బు ఇవ్వనిదే అగ్రిమెంట్ చేయ డం లేదు. ఇప్పటికే పనులను 15 శాతం తక్కువ మొత్తానికి తీసుకున్నామని, ఇంకా స్థానిక నేతలతో ఇబ్బంది ఉంటుందని ఎవరైనా కాంట్రాక్టర్ చెబితే అగ్రిమెంట్లు జరగకుండా అధికారులు నెలల పాటు జాప్యం చేస్తున్నారు. పైగా.. పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికుల నుంచి ఒత్తిడి వస్తోందంటూ కాంట్రాక్టర్లను తమ ‘దారి’లోకి తెచ్చుకుంటున్నారు. గత్యంతరం లేక కాంట్రాక్టర్లు అధికారుల ప్రతిపాదలను అంగీకరించి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మామూళ్లతో నాణ్యతకు పాతర... అభివృధ్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు, అధికారులకు మామూళ్ల సంబంధాలు కొనసాగుతుండడం తో పనుల్లో నాణ్యత ఉండడం లేదు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టే పనుల మొత్తాన్ని బట్టి... ఒప్పందానికి ఒక శాతం, ఏఈకి 5 శాతం, డీఈఈకి మూడు శాతం, అకౌంట్ సెక్షన్‌కు 2 శాతం, నాణ్యత ధ్రువీకరణకు ఒక శాతం ఇవ్వాల్సి వస్తోందని కాం ట్రాక్టర్లు చెబుతున్నారు. డివిజన్ స్థాయి పనులైతే కమీషను మొత్తం మరో రెండు శాతం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇవన్నీపోగా అదనపు ఖర్చు లు, కార్యాలయ ఖర్చుల కోసం మరో రెండు శాతం ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. మామూళ్ల ప్రక్రియలో ఏ తేడా వచ్చినా బిల్లుల చెల్లింపులో అన్ని స్థాయి అధికారులు సవాలక్ష అడ్డంకులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మామూళ్ల ప్రక్రియతో అభివృద్ధి పనుల్లో ఇంజనీర్ల పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో నాణ్యత మచ్చుకైనా కనిపిం చడం లేదు. పని పూర్తయిన కొన్ని రోజులకే పూర్వ పు స్థితి వస్తోంది. దీన్ని నివారించేందుకు నాణ్యత ధ్రువీకరణ పత్రం ఇచ్చాకే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన నా ణ్యత ధ్రువీకరణ(క్యూసీ) విభాగం అధికారులకు వరంగా మారింది. పనికి కేటాయించిన నిధులలో ఒక శాతం ఇస్తేనే నాణ్యత ధ్రువీకరణ పత్రం జారీ చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నా రు. అవినీతి నియంత్రణపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకు న్నా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పరి స్థితులు మారడం లేదు. ఈ విభాగం చేపట్టే పనుల్లో సామాజిక తనిఖీ ప్రక్రియ మొదలైనా మామూళ్ల కారణంగా నాణ్యతలోపాలు కొనసాగుతూనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి
కొల్లాపూర్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సీఎం కేటాయించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కే సీఆర్‌కు కృత జ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. -
విజయనగరం జెడ్పీకి కేంద్ర పురస్కారం
ఈ నెల 24న జంషెడ్‌పూర్‌లో అందజేయనున్న ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా పరిషత్‌తోపాటు నాలుగు మండలాలు, ఆరు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2014-15 ఏడాదికి గాను దేశంలో జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు ప్రకటించిన పురస్కారాల్లో భాగంగా ఏపీలో పలు స్థానిక సంస్థలకు ఈ గౌరవం దక్కింది. పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్(పీఎస్పీ), రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ (ఆర్జీజీఎస్పీ) అవార్డులను ఈ నెల 24న పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా జంషెడ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వీకరించనున్నారు. -
‘లోకల్’గా పంచాయతీరాజ్ టీచర్లు
కేంద్రాన్ని కోరుతూ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పంచాయతీరాజ్ (పీఆర్) టీచర్లకు శుభవార్త. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పీఆర్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా గుర్తించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రూపొందించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఫైలును త్వరలోనే కేంద్రానికి పంపించేం దుకు చర్యలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ ఫైలును పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో (371డి) పీఆర్ టీచర్ పోస్టులను చేర్చేందుకు రాష్ట్రపతికి పంపించాల్సి ఉంది. రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో 16 ఏళ్లుగా నలుగుతున్న ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ, పీఆర్ టీచర్లకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి వస్తాయి. ఫలితంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను ప్రభుత్వ, పీఆర్ టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా విద్యా శాఖ భర్తీ చేస్తుంది. మరోవైపు ఫైలుపై సీఎం సంతకం చేయడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ-టీఎస్, టీపీటీఎఫ్, పీఆర్టీయూ-తెలంగాణ, టీటీయూ, టీటీఎఫ్ సంఘాల నేతలు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, కొండల్‌రెడ్డి, మనోహర్‌రాజు, హర్షవర్దన్‌రెడ్డి, చెన్నయ్య, మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి, రఘునందన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
బదిలీలు..బేరాలు
► ఏప్రిల్ 15 నుంచి బదిలీలపై నిషేధం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ► కోరుకున్న చోట పోస్టింగ్ కోసం పైరవీ బాటలో అధికారులు ► మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల లేఖల కోసం ప్రయత్నాలు ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉండటంతో కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యత దక్కే అవకాశముంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖల కోసం తిరుగుతున్నారు. (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏప్రిల్ 15 నుంచి 30 దాకా నిషేధాన్ని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వముంది. ఈ సమయంలో జిల్లా, జోనల్‌స్థాయి ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మే ఒకటికి ఉద్యోగంలో చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వాళ్లకు మినహాయింపు ఇస్తూ ఐదేళ్లు పూర్తయిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. దీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎమ్మెల్యే లెటర్లే పోస్టింగ్‌కు కీలకం ఆశించిన చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతల ఆశీస్సులు పొందేపనిలో ఉద్యోగులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు ‘అనంత’కు రానున్నారు. అప్పుడు లెటర్లు తీసుకోవచ్చని కొందరు భావిస్తుంటే, ఇంకొందరు ముందే తొందరపడుతూ రాజధాని బాటపట్టారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. నాకు లెటర్ ఇవ్వండి సార్’ అంటూ విన్నవిస్తున్నారు. కొందరు అధికారులు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో కొందరు ఎమ్మెల్యేలు ‘అనంత’కు రాగా పలువురు అధికాారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. లేఖలు ఇచ్చేందుకు కొందరు నేతలు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంత డబ్బు ఇవ్వలేమని కొందరు వెనకడుగు వేస్తుంటే, మరికొందరు పోస్టింగ్‌లో చేరిన వెంటనే ముట్టజెబుతామంటూ ముందడుగు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇసుక తవ్వకాలతో భారీగా దండుకున్న అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు బదిలీ తంతును కూడా ‘క్యాష్’ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్, ఎంపీడీవోలతో పాటు హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర కీలకశాఖలకు సంబంధించిన పోస్టులను తాము సిఫారసు చేసినవారికే ఇవ్వాలని, ముందుగా నిర్ణయం తీసుకోవద్దని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఎంపీడీవోల నియామకంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్పర్సన్ సిఫారసు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీ చైర్మన్అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బదిలీ చేయాలని ఇప్పటికే పలువురు మండలస్థాయి నేతలు జెడ్పీ చైర్పర్సన్ చమన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల వద్ద సన్నిహితంగా ఉండే టీడీపీ కార్యకర్తలు అధికారులతో పోస్టింగ్‌కు బేరం మొదలెట్టారు. ఏప్రిల్‌లో వందల సంఖ్యలో బదిలీలు జరగనున్నాయి. దీంతో టీడీపీ నేతల జేబుల్లోకి అధికారుల సొమ్ము భారీగా చేరనుంది. -
పంచాయతీరాజ్‌కు నిధుల్లో కోత!
బడ్జెట్లో రూ. 4,686.16 కోట్ల కేటాయింపులతో సరి ⇒ ఈ శాఖకు గతేడాది కేటాయింపులు రూ. 6,927.48 కోట్లు ⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు ⇒ గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈసారి ⇒ రూ. 6,344.55 కోట్ల కేటాయింపు ⇒ మిషన్ భగీరథకు కేటాయింపులు శూన్యం సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్న ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు మాత్రం చేయలేదు. 2015-16 ఆర్థిక బడ్జెట్లో వివిధ పథకాల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలకు రూ.13,184 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ. 11,031 కోట్లతో సరిపెట్టింది. ఇందులోనూ తగ్గింపు వసూళ్లు రూ. 300 కోట్లు చూపి నికర కేటాయింపులను రూ. 10,731 కోట్లుగా పేర్కొన్నారు. ఆసరా పథకం మినహా మిషన్ భగీరథ, గ్రామీణ రహదారుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల మొత్తంలో పంచాయతీరాజ్‌కు గతేడాదికన్నా నిధులను బాగా తగ్గించగా గ్రామీణాభివృద్ధికి మాత్రం స్వల్పంగా కేటాయింపులు పెంచారు. అయితే పెరిగిన కేటాయింపులు కూడా కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు సంబంధించినవే కావడం గమనార్హం. పంచాయతీరాజ్ విభాగానికి గతేడాది మొత్తం రూ. 6,927.48 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ. 4,686.16 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక గ్రామీణాభివృద్ధి విభాగానికి గత బడ్జెట్లో రూ. 6,256.68 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేటాయింపులను స్వల్పంగా పెంచుతూ రూ. 6,344.55 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ విభాగానికి కేటాయించిన నిధుల్లో రూ. 2,102.96 కోట్లను ప్రణాళికేతర వ్యయంగానూ రూ. 2,583.20 కోట్లు ప్రణాళికా వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రణాళికా వ్యయం కింద రూ. 6,336.30 కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 8.25 కోట్లను మాత్రమే చూపారు. పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా.. పంచాయతీరాజ్ విభాగంలో ముఖ్య కేటాయింపులను పరిశీలిస్తే సచివాలయశాఖ ఆర్థిక సేవలకు రూ. 3.50 కోట్లు, జిల్లా పరిషత్‌లకు ఆర్థిక సాయంగా రూ. 58.65 కోట్లు, మండల పరిషత్‌లకు రూ. 240.08 కోట్లు, గ్రామ పంచాయతీలకు రూ. 819.50 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద మొత్తం రూ. 1,468.56 కోట్లు కేటాయించారు. ప్రణాళిక కింద ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ. 94.02 కోట్లు, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల నిమిత్తం రూ. 45.16 కోట్లు, గ్రామ పంచాయతీల బలోపేతానికి రూ. 45.16 కోట్లు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద రూ. 45.16 కోట్లు కేటాయించారు. ఆస్తుల రూపకల్పన, ఉపాధి హామీ పనుల అప్‌గ్రెడేషన్ కోసం మొత్తం రూ. 1,078 కోట్లు కేటాయించారు. మండల పరిషత్ భవనాల కోసం రూ. 45 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద కేంద్రం నుంచి రూ. 407 కోట్లు రావచ్చని చూపారు. గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ. 164 కోట్లు కేటాయించారు. నిర్మల భారత్ అభియాన్, ఎన్ఆర్డీడబ్ల్యూఎంపీ ప్రోగ్రామ్‌ల కింద కేంద్రం నుంచి మరో రూ. 1,040 కోట్లు వస్తాయని బడ్జెట్ కేటాయింపుల్లో చూపారు. గ్రామీణాభివృద్ధికి ఇలా.. గ్రామీణాభివృద్ధిశాఖకు బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద మొత్తం రూ. 6,344.55 కోట్లు చూపగా ఇందులో వివిధ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ. 3,260 కోట్లు కే టాయించారు. ఈ శాఖ పరిధిలో చేపట్టనున్న ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2,712.55 కోట్లు, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు రూ. 3.74 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. వడ్డీలేని రుణాలకు గతేడాదికన్నా కేటాయింపులు పెంచారు. గతంలో రూ. 84.61 కోట్లు కేటాయించగా తాజాగా రూ. 148.43 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి బ్యాంకుకు ప్రత్యేక గ్రాంటును రూ. 11 కోట్లకు పెంచారు. గ్రామీణ జీవనోపాధికి రూ. 57.36 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు రూ. 133 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 2,450 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు రూ. 84 కోట్లు కేటాయించారు. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ. 11.81 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 8.24 కోట్లకు కుదించారు. ఇందులో ప్రత్యేక కార్యక్రమాలకు రూ. 2.16 కోట్లు, టీసీపార్డ్కు గతేడాది రూ. 7.96 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 4.85 కోట్లకు కుదించారు. ‘మిషన్ భగీరథ’కు అప్పులే ఆధారం! ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి వివిధ ఆర్థిక సంస్థలిచ్చే అప్పులే ఆధారం కానున్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపు ఊసేలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ మిషన్ భగీరథకు హడ్కో, నాబార్డు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మొదలైన సంస్థల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుమారు రూ. 40 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ ్లలో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల చెప్పారు. 2016 చివరికి 6,100 గ్రామాలు, 12 పట్టణాలకు సురక్షిత తాగునీరందిస్తామని సర్కారు ప్రకటించింది. గ్రామజ్యోతికి నిధులు కరువు ప్రభుత్వం గత ఆగస్టులో ప్రారంభించిన గ్రామజ్యోతికి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల సూచనల ప్రకారం గ్రామాభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడమే గ్రామజ్యోతి ముఖ్య ఉద్దేశమని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
అభివృద్ధికే మొదటి ప్రాధాన్యం
మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీరాజ్ నిధుల ద్వారా *4.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల విస్తరణపై ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఆదివారం ఉదయం కొల్లాపూర్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు. రాజవీధిలోని జమ్మిచెట్టు వద్ద, అంబేద్కర్ కాలనీల్లో చేపట్టే సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. అనంతరం కేఎల్ఐ అతిథిగృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ కాలనీ నుంచి రంగదాసు వీధి వరకు 30 ఫీట్ల మేరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని, మిగతాప్రాంతాల్లో 40 ఫీట్ల వెడల్పుతో పనులు చేయిస్తామన్నారు. రోడ్ల విస్తరణలో రాజీ పడేది లేదని, నిర్ణీత వెడల్పు రోడ్ల నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. త్వరలో బైపాస్ పనులు కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు *10 కోట్లతో డబుల్‌లేన్ రహదారి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొల్లాపూర్ నుంచి వెల్గొండ పెబ్బేర్, కేతేపల్లి - వనపర్తి, కోడేరు -నాగర్‌కర్నూల్, నాగులపల్లి -గోపాల్పేట్ మీదుగా వనపర్తి వరకు 106 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రహదారి పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొల్లాపూర్ పట్టణ సమీపంలో బైపాస్ రహదారి నిర్మించేందుకు భూసేకరణ పనులు జరుగుతున్నాయని, పుష్కరాల్లోగా రూ.19 కోట్లతో ఈ పనులు పూర్తి చేయిస్తామన్నారు. -
స్థానిక సంస్థలకు నిధులలేమి
నిధులిచ్చి ఆదుకోవాలని ఆర్థిక సంఘ సభ్యులకు జెడ్పీ చైర్మన్ వినతి ఆదాయ మార్గాలున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వెల్లడి కర్నూలు సిటీ: స్థానిక సంస్థలు నిధులేమితో అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రభుత్వం నిధులు కేటాయించి ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, అధికారులు రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు విన్నవించారు. శనివారం స్థానిక జెడ్పీ సీఈఓ చాంబర్లో ఆయా ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, మెంబర్ సెక్రటరీ సీవీ రావు, జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, చీఫ్ ఆకౌంట్ ఆఫీసర్ తఖీవుద్ధీన్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నామని,దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమపర్పిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే అందులో నుంచి ఎలా బయటపడాలో అధికారులును అడిగి వారి సలహాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంలో పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు జెడ్పీకి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు, మండల పరిషత్‌లకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. అదే విధంగా జనాభా లెక్కల ప్రకారం జిల్లాకు రావాల్సిన మేరకు తలసరి గ్రాంట్ రావడం లేదని, అలాగే గత రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు అమలు కావడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, చేతి పంపుల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘానికి విన్నవించారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలు సర్వశిక్ష అభియాన్ ద్వారా కాకుండా పంచాయతీరాజ్ ఇంజినీర్ల ద్వారా చేయించి, నిర్ణీత ఫీజుల్లో వాటా ఇవ్వాలని జెడ్పీ అధికారులు కోరారు. అనంతరం ఆర్థిక సంఘం సభ్యులు కంప్యూటర్ సెక్షన్‌ను తనీఖీ చేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ జయరామిరెడ్డి, జెడ్పీ ఏఓ భాస్కర్ నాయుడు, డీపీఓ శోభ స్వరూపరాణి, పీఆర్ ఎస్ఈ సురేంద్రనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి.భాను వీర ప్రసాద్, ఎంపీడీఓలు అమృతరాజ్, ప్రతాప్ రెడ్డి, ఎంపీపీలు డి.రాజావర్దన్ రెడ్డి, ప్రసాద్ రె డ్డి, కొత్తపల్లి, పత్తికొండ జెడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, సుకన్య, ఈఓఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. -
మొద్దునిద్ర!
నత్తనడకన పీఎంజీఎస్‌వై పనులు ♦ రెండున్నరేళ్లుగా సాగుతున్న రోడ్ల నిర్మాణాలు ♦ 10 రహదారుల్లో పూర్తయింది ఒక్కటే..! ♦ పీఆర్ రహదారుల విభాగం నిర్లక్ష్యం ♦ నిధులు అందుబాటులో ఉన్నా నిరుపయోగం ♦ అధ్వానపు రోడ్లతో జనం ఇక్కట్లు ⇔ పథకం: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ⇔ మంజూరైన పనులు/సంవత్సరం: 10/201314 ⇔ నిర్మించాల్సిన రహదారుల విస్తీర్ణం: 79.87 కి.మీ. ⇔ కేటాయించిన నిధులు: రూ.55.06 కోట్లు ⇔ ఇప్పటివరకు చేసిన ఖర్చు: రూ.7.38 కోట్లు ⇔ పూర్తయిన రోడ్ల విస్తీర్ణం: 5.85 కి.మీ. జిల్లాలో పంచాయతీరాజ్ విభాగం నిద్దరోతోంది. రెండున్నరేళ్ల క్రితం మంజూరైన రోడ్లను సైతం ఇప్పటికీ పూర్తిచేయకుండా కాలయాపన చేస్తోంది. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే క్రమంలో తలపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 2013లో జిల్లాకు 10 రోడ్లు మంజూరయ్యాయి. కొత్తగా నిర్మించే ఈ 10 రోడ్లకుగాను కేంద్ర ప్రభుత్వం రూ.55.06 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 79.87 కిలోమీటర్ల మేర నూతన రహదారులను నిర్మించాల్సి ఉండగా.. 2014లో చర్యలకు ఉపక్రమించిన అధికారులు ఇప్పటివరకు 5.85 కిలోమీటర్ల రోడ్డును మాత్రమే పూర్తిచే యడాన్ని చూస్తే.. జిల్లా పంచాయతీరాజ్ రహదారుల విభాగం పనితీరు ఎలాఉందో స్పష్టమవుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అసుసంధానం చేస్తూ పీఎంజీఎస్‌వై కింద జిల్లాకు 2013-14 వార్షికంలో 10 రోడ్లు మంజూరయ్యాయి. బషీరాబాద్, చేవెళ్ల, ధారూరు, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, శంషాబాద్, యాచారం మండలాల్లో 10 రోడ్లను 79.87 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించేందుకు రూ. 55.06 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి నిర్మాణానికి కాంట్రాక్టర్లను ఎంపిక చేసిన పంచాయతీరాజ్ విభాగం పనుల పురోగతిపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో రెండున్నరేళ్లుగా ఈ రోడ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనులకుగాను ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ఇప్పటివరకు రూ.7.38కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఇటీవల జరిగిన నిఘా, పర్యవేక్షణ సమావే శంలో గణాంకాలు వెల్లడించారు. మహేశ్వరం -మన్సాన్పల్లి రోడ్డునుంచి కేబీ తండా, ఉప్పుగడ్డ తండా గ్రామాలకు కొత్త రోడ్డు 5.85 కిలోమీటర్ల మేర పనిని పూర్తిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. పనుల వారీగా పురోగతి పరిశీలిస్తే.. ♦ బషీరాబాద్ మండలంలో టి01 పీడబ్ల్యూడీ రోడ్ నుంచి పర్వత్‌పల్లి, మర్పల్లి, జలాల్పూర్ గ్రామాలను అనుసంధానం చేసే 11.23 కిలోమీటర్ల రహదారి ఇప్పటికీ సగంలోనే ఉంది. ♦చేవెళ్ల- షాబాద్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వెంకటాపూర్, కందవాడ, నక్కలపల్లి గ్రామాలను కలిపే 11.14 కిలోమీటర్ల రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ♦ధారూరు మండలం మున్నూరుసోమారం, గడ్డమీదిగంగారంలను కలిపే 8.63 కిలోమీటర్ల బుగ్గ- కోట్‌పల్లి రోడ్డు పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి ♦కందుకూరు మండలం కటికపల్లి, బండమీదిగూడూరులను కలిపే రాచులూరు -గూడూరు రోడ్డు అభివృద్ధి పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ♦ కులక్కచర్ల- నవాబ్‌పేట్ రోడ్డులో మేగ్యానాయక్తండాకు వెళ్లే 7.80 కిలోమీటర్ల రోడ్డు పనులు బీటీ స్థాయికి చేరుకున్నాయి. ♦ కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ- మియాపూర్ 5.53 కిలోమీటర్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ♦ శామీర్‌పేట్ మండలం అద్రాస్పల్లి -నారాయణపూర్ రోడ్డు పనులు 10.06 కిలోమీటర్ల మేర పనులు ఇంకా టెండరు ప్రక్రియకే పరిమితమయ్యాయి ♦ శంషాబాద్-కోళ్లపడకల్ పీడబ్ల్యూడీ రోడ్ నుంచి సంగిగూడ, చిన్నగోల్కొండ వెళ్లే రోడ్డు పనులు ఇంకా కాంట్రాక్టర్‌కు అప్పగించలేదు. ♦ యాచారం మండలం మాల్ నుంచి దాద్పల్లికి వెళ్లే 9.12 కిలోమీటర్ల రోడ్డు పనులు సగభాగమే పూర్తయ్యాయి. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి- కలెక్టర్ నీతూప్రసాద్
కరీంనగర్ : గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ భవన నిర్మాణాలు, రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, వ్యవసాయం, పశుసంవర్ధకశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రా మాల్లో చేపడుతున్న పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూ ర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, స్త్రీశక్తి భవనాలు, అంగన్వాడీ భవనాల పనులు పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేస్తే రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటటామని సూచించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో అర్హులకు ప్రభు త్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పశు సంవర్ధకశాఖ ద్వారా గొర్రెలు,పశువుల యూనిట్లను పెద్దఎత్తున జిల్లాలో మంజూరు చేయాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఏ.నాగేంద్ర, పంచాయతీరాజ్ ఎస్ఈ దశరథం, డీపీవో సూరజ్‌కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుచరిత పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులకు నగదు బహుమతులు ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలకు మించి అమలుచేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రోగ్రాం ఆఫీసర్స్(ఎంపీడీవో), ఏపీవోలు, ఫీల్డ్అసిస్టెంట్లకు మూడు కేటగిరీల్లో నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి 20వేలు, మూడో బహుమతి కింద రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని జూన్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో అందజేస్తామని తెలిపారు. గరిష్టంగా ఎక్కువమంది కూలీలకు పనులు కల్పించుట, మండలంలోని అందరూ ఉపాధి కూలీల బ్యాంక్ ఖాతాలకు వంద శాతం ఆధార్‌తో అనుసంధానం చేయించుట, వేగవంతంగా బిల్లులు చెల్లించుట, హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుట, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్ యాడ్స్, శ్మశాన వాటికలు, పశుగ్రాసం పెంపకం, పశువుల తాగునీటి తొట్ల నిర్మాణం, పంట మార్పు కల్లాలు, చెరువులలో పూడికతీత వంటి ప్రాధాన్యత గల పనులను వందశాతం పూర్తి చేసిన వారిని బహుమతులకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీతత్వంతో నగదు బహుమతులు గెలుచుకునేందుకు అధికారులు కృషిచేయూలని సూచించారు. భూమి కొనుగోలు పథకానికి సహకరించండి భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం ద్వారా భూసేకరణకు రైతులు సహకరించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేటు సమావేశ మందిరంలో జమ్మికుంట, బోయినపల్లి, కోనరావుపేట, కాటారం మండలాల్లో భూమి అమ్మేందుకు ముందుకొచ్చిన వారితో చర్చలు జరిపారు. రైతుల సమ్మతి అనంతరం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదనపు జేసీ నాగేంద్ర, కరీంనగర్, మంథని ఆర్డీవోలు చంద్రశేఖర్, శ్రీనివాస్, భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు హరికుమార్, తహశీల్దార్లు పాల్గొన్నారు. -
సిమెంట్ రోడ్ల ముసుగులో ఇసుక అక్రమ రవాణా
అథారిటీ అధికారి అనుమతి లేకుండా తరలింపు పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులు రామసముద్రం: మండల పరిధిలోని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల భాగస్వామ్యంతో వేస్తున్న సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు అనుమతి లేకుండానే ఇసుక తరలిపోతుంది. పంచాయతీరాజ్ అధికారులు ఇచ్చిన అంచనా పత్రాన్ని చూపిస్తూ ఒక ట్రాక్టర్ ఇసుకను సిమెంట్ రోడ్లకు తోలి, నాలుగు లోడ్లు పట్టణాలకు, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రూ.1.24కోట్లకు సిమెంట్ రోడ్లు మంజూరు.. మండలంలోని 18 పంచాయతీల్లో రూ.1.24కోట్లతో 3.176కిలోమీటర్ల దూరం సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి గాను 50పనులు మంజూరయ్యాయి. వీటిలో 50 శాతం పంచాయతీ, 50శాతం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఉంటాయి. ఇప్పటి వరకు 17పనులు పూర్తి చేశారు. రూ.18లక్షలు బిల్లులు కూడా అయిపోయాయి. ఈ పనులకు 600 ట్రాక్టర్ లోడ్లు ఇసుక, 1,200 లోడ్ల 20(ఎంఎం)కంకర, 15వేల బస్తాల సిమెంట్ అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అంచనాకు మించి ఇసుక రవాణా.. మండలంలో మంజూరైన పనులకు 600లోడ్లు ఇసుక అవసరముండగా సగం పనులు పూర్తికాకనే రెట్టింపు తరలిపోయింది. పీఆర్ అధికారుల అనుమతి లేని నకిలీ ట్రాక్టర్లు, ఇసుక అక్రమ వ్యాపారులు కూడా ఇసుకను తరలిస్తున్నారు. ప్రశ్నిస్తే సిమెంట్ రోడ్డుకని చెప్పి తప్పించుకుని ట్రాక్టర్ రూ.1500 నుంచి రూ.2వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెంబకూరు, మూగవాడి, ఎలవానెల్లూరు, అక్కగార్లకుంట, అరికెల, రాగిమాకులపల్లె, నారిగానిపల్లె తదితర ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, వంకలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ, పట్టా భూముల్లో నుంచి జోరుగా రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తోడుతున్నారు. పుంగనూరు, మదనపల్లె, కర్ణాటక రాష్ట్రం బేడపల్లె, సోమయాజులపల్లె తదితర ప్రాంతాలకు వందల లోడ్లు తరలించి డంపింగ్‌లు చేసి అక్కడి నుంచి లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పలుచోట్ల ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఇటీవల మదనపల్లె తహశీల్దార్ వద్ద అనుమతి పొంది ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తుండటంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, ఇసుక రవాణాదారుల మధ్య పెద్దయెత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. ఇసుక అనుమతి పొందాల్సింది ఇలా.. గ్రామాల్లో వేస్తున్న సిమెంట్ రోడ్లకు ఇసుక సరఫరాకు ఎంపీడీవో అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఏ ప్రదేశం నుంచి ఎక్కడకు తోలుతున్నారు.. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ నంబరు... డ్రైవర్ పేరు.. ఏ పనులకు తోలుతున్నారు...ఎన్ని లోడ్లు అవసరం ఉంది.. ఎన్ని రోజుల్లో ఇసుక తోలాలి అనేది ఎంపీడీవో నిర్ధేశించి అనుమతి పత్రాన్ని ఇవ్వాలి. ఇప్పటివరకు ఒక్కరు కూడా అనుమతి పొందిన దాఖలాలు లేవు. దీనిపై ఏంపీడీవో దయానందంను వివరణ కోరగా ఇప్పటివరకు తన వద్దకు అనుమతి కోసం ఒక్కరు కూడా రాలేదన్నారు. -
పంచాయతీల్లో మహిళలకు 50%!
రిజర్వేషన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు * వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సవరణలు * ‘వితంతు పింఛన్’ వయసు తగ్గింపునకు యోచన * కేంద్ర మంత్రి బీరేందర్ వెల్లడి న్యూఢిల్లీ: పంచాయతీల్లో మహిళల కోటాను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన సవరణలను వచ్చే బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గురువారమిక్కడ ‘పెసా (పంచాయతీలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే) చట్టం అమల్లో సమస్యలు, పురోగతి’ అంశంపై ప్రారంభమైన రెండ్రోజుల సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ సవరణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రస్తుతం ఒక వార్డును మహిళలకు ఐదేళ్లపాటు రిజర్వేషన్ కింద కేటాయిస్తున్నారని, దీన్ని రెండు విడతలకు (పదేళ్లు) పెంచే ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై ఏ పార్టీ కూడా విముఖత చూపకపోవచ్చని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వేషన్ కింద కేటాయించారు. అలాగే ప్రస్తుతం వితంతు పింఛన్‌కు అర్హత వయసు 40 ఏళ్లు ఉండగా, ఈ వయసును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దేశంలో గిరిజనులు తమ సంస్కృతికి, విలువలకు కట్టుబడి ఉన్నారని, అందువల్లనే సామ్రాజ్యవాద శక్తులు ఇతర దేశాల్లో మాదిరి వారిని నిర్మూలించలేకపోతున్నాయన్నారు. 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి! గిరిజన పరిశోధన సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. పీహెచ్డీ పట్టాలను ఇచ్చేందుకు వీలుపడడమేకాక అత్యున్నతస్థాయి పరిశోధనలకోసం నిపుణులను నియమించుకోవడానికి అవకాశముంటుందని భావిస్తోంది. గిరిజన పరిశోధన సంస్థలకు ఆర్థిక, విద్యాసంబంధ విషయాల్లో మరింత స్వయంప్రతిపత్తి కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. కోర్టు వెలుపలి పరిష్కారాలకు చట్టం! కోర్టు వెలుపలి పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా కొత్త చట్టం రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ మధ్యవర్తిత్వ విధానం వైవాహిక సమస్యల పరిష్కారానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని, కొత్త చట్టం అమల్లోకి వస్తే పారిశ్రామిక వివాదాలు, భూ యజమానులు-కౌలు రైతుల వివాదాలు కూడా ఈ విధానం ద్వారా పరిష్కారమవుతాయని భావిస్తోంది. -
పట్టాలెక్కని ఫైబర్ కనెక్టివిటీ!
♦ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మధ్య కొరవడిన సమన్వయం ♦ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే పైప్లైన్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు‘మిషన్ భగీరథ(వాటర్‌గ్రిడ్)’ప్రాజెక్ట్ పైప్లైన్ల పనులు కొన్ని జిల్లాల్లో శరవేగంగా జరుగుతోంటే.. పైప్లైన్లతోపాటు వేయాల్సిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీ ప్రక్రియ మాత్రం ఇంకా మొదలుకాలేదు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటర్‌గ్రిడ్ పైపుల నిర్మాణంతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చడం ద్వారా లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా తగ్గనుందని, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటుకయ్యే వ్యయం భారీగా తగ్గుతున్నందున ఇంటర్నెట్ సదుపాయాన్ని అతితక్కువ ధరకు అందించేందుకు వీలుకానుందని కొన్నినెలలుగా ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పలు వేదికలపై ప్రస్తావిస్తున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ ప్రక టనకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. సమన్వయంగా పనిచేయాల్సిన రెండు శాఖల(పంచాయతీరాజ్, ఐటీ) అధికారులు ఎవరికి తోచినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని పలు సెగ్మెంట్లలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయకుండానే సుమారు 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన ్ల ఏర్పాటు చేశారు. త్వరలోనే రెండోదశ పైప్లైన్లతోపాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ ఇలా.. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులకు ఉచిత వైఫై సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని భావించింది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవలను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు సుమారు 78 వేల కిలోమీటర్ల మేర భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున లైన్ల తవ్వకం చేపట్టినందున ఆ లైన్లలోనే కేబుల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో 78 వేల కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు(తవ్వకానికి)కయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు మిగలనుంది. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే వీలవుతుందని ఐటీ విభాగం అధికారులు అంచనా వేశారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వేసుకున్నట్లైతే ‘భారత్‌నెట్’ ప్రోగ్రామ్ ద్వారా నిధులను కేంద్రం రీయింబర్స్ చేయనుంది. -
పనులు చేసుడే లేదు!
► రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ► పనులు దక్కించు కోవడంపైనే దృష్టి ► పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ► ఇంకా ప్రారంభించని 12 మంది ► చర్యలపై అధికారుల ఉదాసీనత సాక్షిప్రతినిధి, వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల పట్టింపులేమి జిల్లాలో రోడ్ల పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవడంలో చూపినంత శ్రద్ధ వాటిని పూర్తి చేసే విషయంలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంజూరైన పంచాయతీరాజ్ రోడ్లలో ఏ ఒక్కటీ వంద శాతం పూర్తి కాలేదు. జిల్లాలోని అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యానికి ఈ పరిస్థితి నిదర్శనంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్) చేసేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం రూ.416 కోట్లు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీటర్ల బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అలాగే 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను కొత్తగా బీటీ వేసి అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు మంజూరు చేసింది. రోడ్ల పునరుద్ధరణ కోసం 463 పనులను, కొత్త రోడ్ల నిర్మాణం కోసం 152 పనులను గుర్తించారు. మొ త్తం 615 పనులకు టెండర్లు నిర్వహించగా 45 మంది కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అరుుతే, టెండర్ల ప్రక్రియ ముగిసి ఏడాది కావస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. 12 మంది కాంట్రాక్టర్లు అసలు పను లే మొదలుపెట్టలేదు. అయినా వీరి విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేయకపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొదలే కాలేదు... రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు దక్కించుకుని మొదలుపెట్టని కాం ట్రాక్టర్లు, సంస్థల తీరుతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్.నారాయణరెడ్డి అండ్ సన్స్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లవెల్లి కన్స్ట్రక్షన్, ఎస్ఎల్వీ బిల్డర్స్, జి.నవీన్, వి.పృథ్వీధర్‌రావు, పీబీఆర్ సెలెక్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, వి.వీరారెడ్డి, తట్టెకుంట వడ్డెర సానిటరీ సివిల్ వర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం, పి.శ్రీనివాస్‌రెడ్డి అండ్ కంపెనీ, తౌటిరెడ్డి రఘోత్తంరెడ్డి, జీ.వీ.రెడ్డి, డి.శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికీ పనులను మొదలు పెట్టలేదు. ఈ 12 కాంట్రాక్టరు, సంస్థలు కలిపి జిల్లాలో 28.28 కోట్ల పనులు దక్కించుకున్నాయి. మొదలుకాని పనులలో ఎక్కువగా కొత్త రోడ్ల నిర్మాణ పనులే ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పనులు దక్కించుకుని ఏడాది దగ్గరపడుతున్నా రోడ్ల నిర్మాణం, పునరుద్ధణను పట్టించుకోని ఈ సంస్థల పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను మొదలుపెట్టాలనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు 24వేల దరఖాస్తులు నయీంనగర్ : స్వయం ఉపాధి పథకాల కోసం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 24 వేలకు పైగా దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.సురేష్ తెలిపారు. మండల, అర్బన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను విభజించి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు స్వయం ఉపాధి రుణాలు పొందడానికి బ్యాంకు కాన్సెంట్ అవసరం లేదని, స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణా లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఒంటరి స్త్రీలు, గుడుంబా బాధిత కుటుంబాలు, లొంగిపోయిన నక్సలైట్లు, వయో పరిమితి మించిపోతు న్న వారు, సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈడీ వివరించారు. కాగా, మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా ఎంపీడీఓ, సభ్యులుగా డీఆర్డీఏ ఎంపీఎం, సర్వీస్ ఏరియా బ్యాంకు మేనేజర్, అర్బన్‌లో చైర్మన్‌గా మునిసిపల్ కమిషనర్, సభ్యులుగా మెప్మా పీడీ, బ్యాంకు మేనేజర్ ఉంటారని తెలిపారు. -
సీఎం దృష్టికి పంచాయతీల సమస్యలు
పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీరాజ్ వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మరింత బలహీన పరుస్తోందని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి.అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోందన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 2న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంచాయతీ సమస్యలపై పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1324 స్థానిక సంస్థలకు తక్షణమే ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు బాధ్యతలను పంచాయతీల నుంచి తప్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరనున్నామని చెప్పారు. పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అలజంగి.భాస్కరరావు, పిట్టా రాంబాబు, ఫృథ్వి తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ సరి చేయడానికే వచ్చాను
దివాన్‌చెరువు (రాజానగరం) : ‘పాలకవర్గం అనుమతి లేకుండా పనులు చేయడానికి లేదు. అలాగని పాలకవర్గం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించనూ కూడదు. ఈ వ్యత్యాసాలన్నింటినీ సరిచేయడానికే వచ్చాను’ అని పంచాయతీరాజ్ శాఖ అదనపు కమిషనర్ ఎం.సుధాకర్ అన్నారు. దివాన్‌చెరువు పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు నిబంధనల మేరకు జరగడం లేదనే ఆరోపణలపై ఆయన బుధవారం విచారణ నిర్వహించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని, విచారణ వివరాలు బహిర్గతం చేయరాదని విలేకరులతో అన్నారు. పాలకవర్గం వచ్చిన నాటి నుంచి ఉన్న రికార్డులను, అందుబాటులో ఉన్న మరికొన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు అధ్యక్షతన జరిగిన పంచాయతీ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. సర్పంచ్‌కి గాని, పాలకవర్గానికి గాని సంబంధం లేకుండా పనులు చేస్తున్నారని ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్ ఫిర్యాదు చేశారు. అలా చేయకూడదని చట్టం ప్రకారమే విధులు నిర్వహించాలని సుధాకర్ పేర్కొన్నారు. సమావేశాలకు ఎన్నికైన సభ్యులే హాజరుకావాలని, ప్రత్యామ్నాయంగా వేరొకరు హాజరుకావడానికి వీలులేదని స్పష్టం చేశారు. చట్టానికి లోబడి పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అనుసరించి పం చాయతీ కార్యదర్శి కూడా విధులు నిర్వర్తించవలసి ఉంటుందన్నారు. ‘ఈ విషయంలో మీకు సైరె న అవగాహన లేనట్టుంద’ంటూ సామర్లకోటలో ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేస్తామని, హాజరు కా వాలని సభ్యులకు సూచించారు. కమిషనర్ వెళ్లిన తరువాత గ్రామ రాజకీయాలు నాయకుల మధ్య ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎవరికి వారే కేకలు అరుపులతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వేడెక్కించారు. డీఎల్పీఓ ప్రసాదరావు, ఈఓపీఆర్డీ జాన్మిల్టన్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కొవ్వాడ చంద్రరావు, ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వంక మల్లికార్జుస్వామి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
డీపీఓ ఇళ్లలో ఏసీబీ సోదాలు
-
డీపీఓ ఇళ్లలో ఏసీబీ సోదాలు
రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయితి శాఖలో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి అనే అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపధ్యంలో సోమవారం ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 10 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేశారు. విజయవాడలో శ్రీధర్ కు చెందిన నివాసంతో పాటు హైదరాబాద్, తణుకు, ఏలూరు, వైఎస్ఆర్ జిల్లాలోనూ దాడులు కొనసాగుతున్నాయి. -
ఆర్‌అండ్‌బీకి పంచాయతీరాజ్ రోడ్లు
- అప్పగించేందుకు ప్రభుత్వ అంగీకారం - తొలుత 33 రోడ్ల అప్పగింత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన రహదారుల పనులు చేపట్టిన రోడ్లు భవనాల శాఖ తాజాగా పంచాయతీరాజ్ రోడ్లపై కన్నేసింది. హైవేలతో సరైన అనుసంధానం లేని మండల కేంద్రాలకు సంబంధించిన రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ శాఖ అధీనంలో ఉన్న ఇలాంటి రోడ్ల ను ఇకనుంచి తానే నిర్వహిస్తానని ముందుకొచ్చింది. అందుకు ప్రభుత్వమూ అంగీకరించింది. ఈ క్రమంలో తొలుత 33 రోడ్లను ఆ శాఖకు అప్పగించనుంది. సోమవారం జరిగే ఓ సమావేశంలో దీనికి సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న మండల కేంద్రాలను సమీపంలోని హైవేలకు రెండు వరసల రోడ్లతో అనుసంధానించనుంది. ఈ తరహా రోడ్ల నిర్మాణానికి నిధుల అవసరం ఎక్కువగా ఉండటం, ప్రత్యేక నిర్మాణ పద్ధతులను అవలంభించాల్సి ఉన్నందున అది పంచాయతీరాజ్ శాఖకు కష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలాంటి అన్ని రోడ్లను దశలవారీగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించబోతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధాని నగరానికి రెండు వరసలతో అనుసంధాన రోడ్ల నిర్మాణంతోపాటు దాదాపు 370 వంతెనల నిర్మాణ పనులతో బిజీగా ఉన్న రోడ్లు భవనాల శాఖ ఈ కొత్త రోడ్ల బాధ్యత ఎలా నిర్వహిస్తుందన్నది సందేహంగా మారింది. గతంలో పంచాయతీరాజ్ రోడ్లను తీసుకుని వాటి పనులను పూర్తి చేసేందుకు సంవత్సరాల కొద్ది సమయం తీసుకుంది. తమ పరిధిలో ఉండిఉంటే వాటిని ఓ స్థాయికి తెచ్చేవారమని, ఆర్అండ్బీ తీసుకున్నతర్వాత మామూలు నిర్వహణను కూడా చేయలేదని అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే రోడ్ల విషయంలో ఆర్అండ్బీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు. -
పంచాయతీలకు విద్యుత్ షాక్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను రాబట్టుకునేందుకు పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.942 కోట్ల పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని డిస్కంలు ఇటీవల సర్కారుకు నివేదిక అందజేశాయి. దీంతో బకాయిలపై దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి వాటిని చెల్లించాలని తాజాగా సర్క్యులర్ జారీచేసింది. అంతేకాకుండా నిధుల్లో 80 శాతం విద్యుత్ బకాయిలకే వెచ్చించాలని కూడా అందులో పేర్కొంది. ఈ నిర్ణయంపై సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత బకాయిల మొత్తం ఇప్పటికిప్పుడు పంచాయతీలే భరించాలనడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటున్నారు. గతంలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులన్నింటినీ ప్రభుత్వమే చెల్లించేదని, ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి బకాయిలు రూ.279 కోట్లు రాగా, ఏప్రిల్, మే నెలల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.580 కోట్లు అందాయి. ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే వెచ్చిస్తే.. గ్రామ పంచాయితీల నిర్వహ ణ ప్రశ్నార్థకమవుతుందని సర్పంచ్‌లు వాపోతున్నారు. బిల్లులన్నీ అశాస్త్రీయమైనవే! గ్రామ పంచాయతీల్లో బిల్లులన్నీ అశాస్త్రీయమైనవేనని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, అవసరమైన చోట్ల మీటర్లు బిగించడం విద్యుత్ శాఖ బాధ్యత అని... కానీ దానిని గ్రామ పంచాయతీలపై వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సరఫరా లైన్ల ద్వారా జరిగే నష్టాన్ని కూడా తామెలా భరిస్తామని మండిపడుతున్నారు. గ్రామ పంచాయితీల్లో ఆర్థిక సంఘం నిధులున్నాయి కదాని.. వాటిని కాజేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలువురు సర్పంచ్‌లు విద్యుత్ బకాయిల విషయాన్ని ప్రస్తావించారు. విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని, లేకుంటే ఆందోళన చేయకతప్పదని సర్పంచ్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
నాగలాపురం(చిత్తూరు): చిత్తూరు జిల్లా నాగలాపురం పంచాయుతీరాజ్ ఏఈ ఈశ్వర్‌బాబు బుధవారం సాయుంత్రం రూ.25 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగలో హర్షవర్దన్‌ప్రసాద్ రూ.3.60 లక్షల విలువ చేసే చెక్‌డ్యాం పనులు చేశాడు. ఇందుకు సంబంధించి రూ.2.2 లక్షల బిల్లు పొందాడు. మిగిలిన బిల్లును రెండో విడతగా పొందాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ ఏఈ ఈశ్వరబాబు రూ.30 వేలు డివూండ్ చేయగా హర్షవర్ధన్‌ప్రసాద్ రూ.25 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంతన్ బుధవారం సాయంత్రం దాడులు చేశారు. ఎంపీడీవో కార్యాలయంలోని ఏఈ గదిలో ఉన్న నగదును స్వాధీనం చేసుకుని కెమికల్ టెస్టులు, వేలిముద్రలను సేకరించారు. ఎంపీడీవో సురేంద్రనాథ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. పట్టబడ్డ ఏఈ ఈశ్వర్‌బాబును నెల్లూరు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
పంచాయతీరాజ్ ఏఈపై టీడీపీ నేతల దాడి
బద్వేల్ అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించి ఓ పంచాయతీరాజ్ ఏఈపై దాడికి తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన తాము చెప్పినట్లు వినకుండా నియమాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగిని తీవ్రంగా కొట్టారు. బద్వేలు పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న ప్రసాద్‌పై స్థానిక ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దాడి చేశారు. ఏఈ కార్యాలయంలో కంప్యూటర్ను పగులగొట్టారు. -
స్మార్ట్ సిటీ స్థాయికి ఏలూరు
ఏలూరు (టూటౌన్) : ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఏలూరు నగర మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఏలూరును స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. నగరం మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అభివృద్ధిపై తీసుకోవలసిన చర్యలపై అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధుల, అధికారుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అంతర్జాతీయ స్థారుు కన్సల్టెన్సీ సేవలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేసేందుకు సీఎం అంగీకరించారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం కన్నా తక్కువగా ఏలూరులో అభివృద్ధి ఉందన్నారు. సీఆర్డీఏ పరిధికి దగ్గరగా ఉండడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరం అభివృద్ధితో పాటు, దానిని విస్తరింపచేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ కేవలం 11.58 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏలూరు నగరం ఉందన్నారు. ఈ పరిధిని మరింత విస్తరించి విశాల నగరంగా రూపొందించేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేస్తున్నామన్నారు. దీనికి గతంలో నాలుగైదేళ్లు పట్టేదని, సాంకేతికత అభివృద్ధితో ఏడాదిలోపే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించవచ్చన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ అవసరమైన టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు 4 వేల ఎకరాలను గుర్తించామన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కమిషనర్ వై.సాయిశ్రీకాంత్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకు శిక్షణ భవనం ఏలూరు(ఆర్ఆర్ పేట) : ప్రతి జిల్లాలో పంచాయతీ శిక్షణ భవనం నిర్మిస్తున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్థానిక గ్జేవియర్ నగర్లో జిల్లా పంచాయతీ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రూ. 2 కోట్ల వ్యయంతో ఈ భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ వివిధ మతాలకు సంబంధించిన శ్మశాన వాటికల ఏర్పాటుపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ఎంపీ మాగంటి బాబు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, వి.శివరామరాజు, కేఎస్ జవహర్, మేయర్ నూర్జహాన్, జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, డీపీవో డీ.శ్రీధర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు, కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పుష్కరాలు ముగిశాయ్.. సమస్యలు మిగిలాయ్
నరసాపురం అర్బన్:పుష్కర సంరంభం ముగిసింది. అధికారులు, ఉద్యోగులు 20 రోజులపాటు పుష్కర విధుల్లో తలమునకలు కావడంతో అన్ని శాఖల్లో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కీలక శాఖల్లో ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగమంతా పుష్కర విధులకే సమయం కేటాయించింది. దీంతో పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని అన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, ఫిషరీస్, ఎక్సైజ్, మునిసిపల్, వ్యవసాయ శాఖతోపాటు దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు పుష్కర విధుల్లో ఉండిపోయాయి. దీంతో ఆయా శాఖల్లో పనులు కుంటుపడ్డాయి. పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లో అయితే దాదాపు మూడు నెలల నుంచీ అన్ని ప్రభుత్వ శాఖలు పుష్కర జపం తప్ప మరోపని పెట్టుకోలేదు. దీంతో సమస్యలు పేరుకుపోయాయి. మహాపర్వం ముగిసిన అనంతరం అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సోమ, మంగళ వారాలు సెలవు ఇచ్చింది. బుధవారం నుంచి వారంతా విధులకు హాజరు కానున్నారు. విధుల్లోకి వచ్చాక సమస్యలు, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి యంత్రాంగమంతా మరికొన్ని రోజులపాటు పుష్కరాల్లో మాదిరిగానే ఊపిరి సలపకుండా పని చేయాల్సి ఉంది. మరి వీరంతా వాటిపై ఏ మేరకు దృష్టిపెడతారనేదే ప్రశ్నార్థకంగా ఉంది. అయోమయంలో రైతులు జిల్లాలోని రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఖరీఫ్ సాగు ఈ ఏడాది ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ తలపోసినప్పటికీ అన్నుకున్నంత స్థాయిలో సాగలేదు. జూలై నాటికి నాట్లు పూర్తవ్వాలి. కాలువలు ఆలస్యంగా వదలడం, శివారు ప్రాంతాలకు నీరందకపోవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లో ఇంకా చాలాచోట్ల దుక్కులు దున్నడం కూడా పూర్తవ్వలేదు. అంటే సాగు దాదాపు నెల రోజులుపైనే ఆలస్యమైంది. వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. రెవెన్యూకు సంబంధించి అన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కలెక్టర్ సైతం పుష్కరాల పనులు, ఏర్పాట్లపై నెల రోజులపాటు ప్రధానంగా దృష్టిపెట్టారు. దీంతో రెవెన్యూ పాలన కుంటుపడింది. నరసాపురం, కొవ్వూరు డివిజన్లలో మూడు వారాలుగా ‘మీ కోసం కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు. అత్యవసర పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్న వారు, అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నరసాపురం, కొవ్వూరు మునిసిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ నుంచి అన్ని పనులు నిలిచిపోయాయి. ఈ రెండు మునిసిపాలిటీల్లో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) మందకొడిగా సాగాయి. మిగిలిన మునిసిపాలిటీల అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్‌పై పుష్కర విధులకు రావడంతో అన్ని మునిసిపాలిటీల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. పెండింగ్ పనుల సంగతేంటి! నరసాపురం, కొవ్వూరు పట్టణాల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. అలాంటివన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పుష్కరాలు సమీపించేసరికి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఘాట్లకు సమీపంలో చేపట్టిన పనులను పూర్తిచేసి, మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం వంటి కీలక పనులు ఈ జాబితాలో ఉన్నాయి. నరసాపురంలో రూ.15 కోట్లు, కొవ్వూరులో రూ.12 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. ఖర్చు చేయని పుష్కర నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నిధులు వెనక్కి వెళ్లవని భరోసా ఇస్తున్నప్పటికీ.. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి నిధులు వెనక్కి మళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదనే ఆందోళన కూడా ఉంది. పుష్కర విధుల్లో అలసిపోయిన అధికారులు వెంటనే పుష్కర పెండింగ్ పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
సర్కారు సొమ్మేగా.. ఖతం చేద్దాం !
పరిపాలన సౌలభ్యంలో భాగంగా రేగోడ్‌కు ఐదు నెలల క్రితం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం మంజూరైంది. దీనిని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఖాళీగా ఉన్న మహిళా సమాఖ్య భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా భవన ఆవరణలో అడ్డుగా ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను తొలగించి ఓ పక్కకు వేశారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం ఆ వెంటనే కార్యాలయాన్ని జోగిపేటకు తరలించడం జరిగిపోయింది. ఈ క్రమంలో మహిళా సమాఖ్య భవన ఆవరణలో ఉన్న ఖరీదైన బండరాళ్లపై కొందరి కళ్లు పడ్డాయి. ఇంకేముంది ఓ బడా రాజకీయ నాయకుడు, అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా బండ రాళ్లను కొట్టించి అల్లాదుర్గం మండలంలోని వట్‌పల్లికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలపడంతోనే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. బండ రాళ్లను వేళం వేసి.. వచ్చిన డ బ్బును ప్రజా అవసరాలకు వెచ్చిస్తే బాగుండేదని, జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన ఓ సీనీయర్ నేత వద్ద ఆదివారం బండరాళ్ల విషయం ప్రస్తావించగా రాళ్లు కొడుతున్న విషయం తనకు తెలియదని.. తెలుసుకుంటాని పేర్కొన్నారు. నా దృష్టికి రాలేదు మహిళా సమాఖ్య కార్యాలయ ఆవరణలో ఉన్న బండ రాళ్లను ముక్కలుగా(కొడుతున్న) చేస్తున్న విషయం నాకు తెలియదు. బహుశా రెండు రోజుల నుంచి కొడుతున్నారేమో. రాళ్లను కొట్టడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ -
నత్తలా.. ఎన్నాళ్లిలా
కొవ్వూరు : గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తోంది. మహాపర్వం ప్రారంభం కావడానికి 47 రోజులు మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ కొన్ని శాఖల్లో పుష్కర పనులు ప్రహసనంగా మారాయి. ఇప్పటివరకు ఏ ఒక్క శాఖలోనూ 50శాతం పనులైనా పూర్తికాలే దు. జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 1,117 పనులు చేపట్టేందుకు రూ.478.40 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు కేవలం 262 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. మరో 262 పనులు నేటికీ ప్రారంభం కాలేదు. జాప్యానికి అసలు కారణాలేమిటనే విషయాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నీటిపారుదల, పురపాలక శాఖలు పుష్కర పనులకు ఇంజినీరింగ్ సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించుకోవడంతో ఆ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలు అదనపు సిబ్బంది నియామకం విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆ శాఖల్లో పనుల పురోగతి అంతమాత్రంగానే ఉంది. చాలా శాఖల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఒకే కాంట్రాక్టర్ వివిధ పనులు చేపట్టడం.. నేటికీ కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోడం.. ఇప్పటికప్పుడు కొత్తగా పనులు మంజూరు చేయడం.. వేసవి ప్రభావం తదితర కారణాల వల్ల ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. వర్షాలొస్తే అంతేసంగతులు జిల్లాకు మంజూరైన 1,117 పనుల్లో 1,054 పనులకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. 747 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రుతుపవనాలు ఈనెలాఖరు నాటికి రాష్ట్రాన్ని చేరుకునే అవకాశం ఉందంటున్నారు. జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే పుష్కర పనులకు ఆటంకం ఏర్పడుతుంది. 24 గంటలూ పనులు చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పంచాయతీరాజ్‌లో అంతంతే పంచాయతీరాజ్ శాఖ ద్వారా మొదటివిడతగా రూ.20.08 కోట్ల విలువైన 30 పనులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటికి వరకు 4 మాత్రమే పూర్తిచేశారు. మిగతా 26 పనులు పురోగతిలో ఉన్నాయి. రెండోవిడతలో 248 పనులు మంజూరు కాగా, 37 పూర్తయ్యాయి. 143 పనులు పురోగతిలో ఉండగా, మరో 40 పనుల టెండర్లు ఒప్పంద స్థాయిలో, 18 పనులు టెండర్లు పూర్తయిన దశలో ఉన్నాయి. మరో 4 పనులకు తిరిగి టెండర్లు పిలిచారు. మూడుచోట్ల ప్రత్యామ్నాయ పనులకు సిఫార్సు చేయగా, మరో 3 పనులు ప్రారంభం కావాల్సి ఉంది. టెండర్ల దశలోనే.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 152 పనులు మంజూరయ్యాయి. వీటిలో 137 పనులు ప్రారంభించారు. 46 పూర్తికాగా, 62 పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. రెండు పనుల టెండర్లు ఈఎన్సీ పరిధిలో ఉండగా, 14 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. 12 పనుల టెండర్ల స్వీకరణకు 23వ తేదీతో, రెండు పనులకు 27వ తేదీతో గడువు పూర్తయ్యింది. ఈ పనులు ప్రారంభించడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పురోగతిలో స్నానఘట్టాల నిర్మాణం జిల్లాకు 96 స్నానఘట్టాలు మంజూరు కాగా, 94 పనులు ప్రారంభమయ్యాయి. 45 స్నానఘట్టాలు పూర్తయ్యాయి. మరో 20 పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మిగతా పనులను జూన్ 15నాటికి పూర్తి చేస్తామంటున్నారు. అవసరం లేని 6 పనులను రద్దు చేశారు. ఇటీవల మంజూరైన చిడిపి, ఔరంగబాద్, బ్రిడ్జిపేట స్నానఘట్టాల పనులకు ఈనెల 21న టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. గోదావరిలో గ్రోయిన్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. మందకొడిగా దేవాదాయ శాఖ పనులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 211 పనులకు గాను ఇప్పటివరకు 33 పూర్తిచేశారు. ఈ పనులు 3 విడతలుగా మంజూరయ్యాయి. మొదటివిడత పనుల పురోగతి బాగానే ఉంది. రెండు, మూడువిడతల్లో మంజూరైన పనుల్లో ఎక్కువ శాతం ఆలయాలకు రంగు వేయడం, ఫ్లోరింగ్, చిన్నపాటి మరమ్మతు పనులు ఉన్నాయి. తాళ్లపూడిలో మదనగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తికాలేదు. మునిసిపాలిటీల్లో సా..గుతున్నాయ్ కొవ్వూరు పురపాలక సంఘంలో 138 పనులకు గాను ఈనెల 24నాటికి 41 పనులు పూర్తిచేశారు. నిడదవోలులో 15 పనులకు గాను 3 పూర్తయ్యాయి. పాలకొల్లులో 38 పనులకు గాను ఒకటి మాత్రమే పూర్తయ్యింది. 22 పురోగతిలో ఉన్నాయి. నరసాపురంలో 179 పనులకు గాను 52 పూర్తి చేశారు. మరో 110 పురోగతిలో ఉన్నాయి. పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామని, కొవ్వూరులో వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయిస్తామని ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
పథకాలపై విస్తృత ప్రచారం అవసరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ వాటికి సంబంధించి మాకే పూర్తిస్థాయి అవగాహన లేదు.. ఇక ప్రజలకు ఎలా తెలుస్తాయి.. ఈ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరాలంటే తప్పనిసరిగా అన్ని వర్గాలకు అవగాహన ఉండాలి. ఇందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, గ్రామ సభలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి’ అని నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ సమావేశ మందిరంలో ఎంపీ కొండా అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను కమిటీ పర్యవేక్షించింది. అవగాహనలేమే అసలు సమస్య.. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే ఉత్తమ ఫలితాలు రావడంలేదని చైర్మన్ కొండా అభిప్రాయపడ్డారు. అవగాహన కల్పించడంలో అధికారయంత్రాంగం విఫలమవుతోందని, ప్రణాళికబద్ధంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పథకాలను ప్రజలకు చేరవేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పథకాలతో ఎక్కువ మందికి లబ్ధి జరిగాలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. జాతీయ జీవనోపాధుల పథకం ద్వారా నిరుపేద కుటుంబానికి ఏడాదిలో రూ.50వేల అదనపు లబ్ధి చేకూర్చాలని, జిల్లాకు రూ.10కోట్లు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం వంద మరుగుదొడ్లు నిర్మించేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఐఏవై పెండింగ్ గృహాలు త్వరలో పూర్తి : కలెక్టర్ ఇందిర ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరితంగా పూర్తి చేస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. వాటర్‌షెడ్ పథకాలను త్వరితంగా పూర్తిచేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. భుగర్భజలాలను పెంపొందించేందుకు ఐదెకరాల పొలం ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సంజీవరావు, జేసీ రజత్‌కుమార్, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ రైతు సదస్సులకు జిల్లా యంత్రాంగం కితాబు పొలంలోనే చెరువును ఏర్పాటు చేసుకుని కరువును అధిగమించేందుకుగాను ‘సాక్షి’ తలపెట్టిన రైతు అవగాహన సదస్సులకు జిల్లా యంత్రాంగం కితాబిచ్చింది. బుధవారం జరిగిన జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు టీఆర్ఆర్ తదితరులు మాట్లాడుతూ ఈ సదస్సులు రైతుల ఆలోచనావిధానాన్ని మార్చివేస్తున్నాయన్నారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా కందకాలు తవ్వించేలా ప్రణాళిక తయారుచేస్తే బాగుంటుందని వారు సూచించగా.. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రకాంత్‌రెడ్డి వివరించారు. -
ఉద్యోగులకు గృహ రుణాలు డబుల్
పీఆర్సీ సిఫారసులకు సర్కారు ఆమోదం రుణ మొత్తాలు, వడ్డీ రేట్ల వివరాలతో ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి నిర్మాణ రుణాలను దాదాపు రెండింతలకు పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో పెరిగిన రుణ మొత్తాల వివరాలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించాల్సిన వ్యవధి తదితర వివరాలను కూడా వెల్లడించింది. కొత్త ఇంటి నిర్మాణం, ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించి రూ.26,600 వరకు మూల వేతనమున్న ఉద్యోగులకు రూ.10 లక్షలు, రూ.26,600 నుంచి రూ.42,490 మధ్య వేతనమున్న వారికి రూ.12.30 లక్షలు, రూ.42,490 నుంచి రూ.61,450 మధ్య వేతనమున్న ఉద్యోగులకు రూ.15 లక్షలు, రూ.61,450 కన్నా ఎక్కువగా వేతనం అందుకునే వారికి రూ.20 లక్షల వరకు రుణం పొందే అవకాశముంది. మూల వేతనంపై 72 రెట్లు లేదా ఈ నిర్దేశిత మొత్తంలో ఏది తక్కువగా ఉంటే అంతమేరకు రుణంగా అందిస్తారు. అదే రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులకు రూ.20 లక్షలు లేదా మూల వేతనానికి 50 రెట్లు.. ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం రుణం తీసుకునే వీలుంటుంది. గృహ రుణాలకు సంబంధించి నాలుగో తరగతి ఉద్యోగులకు 5 శాతం, ఇతర ఉద్యోగులకు 5.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులు 300 నెలసరి వాయిదాల్లో వడ్డీ సహా రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఇళ్లకే కాకుండా ప్రస్తుతమున్న ఇళ్ల మరమ్మతులు లేదా విస్తరణకు, ఇంటి స్థలం కొనుగోలుకు సైతం ఉద్యోగులు అడ్వాన్సులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగులు బేసిక్‌పై 20 రెట్లు లేదా రూ. 4 లక్షలు.. ఏది తక్కువైతే అంతమొత్తం అడ్వాన్సుగా పొందే వీలుంటుంది. 90 నెలసరి వాయిదాల్లో ఈ అడ్వాన్సును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇంటి స్థలం కొనుగోలుకు రూ.2 లక్షలు లేదా బేసిక్‌పై పది రెట్లు.. ఏది తక్కువైతే అంత మొత్తం రుణంగా ఇస్తారు. దీనిని 72 నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించినా, అసలు వినియోగించకపోయినా వడ్డీ రేటును రెండింతలు వసూలు చేస్తారు. రుణ వినియోగానికి సంబంధించి నిబంధనలను పాటించకపోతే ఒకటిన్నర రెట్లు వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులతో పాటు అఖిల భారత సర్వీసుల అధికారులకు ఇళ్ల రుణాలు మంజూరీకి అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఈసారి కూడా పంచాయతీరాజ్ పరిధిలో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ సదుపాయాన్ని కల్పించలేదు. -
బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 250 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 173 వంతెనల నిర్మాణానికి గాను 250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంతెనల నిర్మాణానికి నాబార్డు సాయం 200 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా యాభై కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి అవసరమైన చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని పంచాయతీరాజ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
నిర్వహణా.. నిర్మాణమా!?
కొన్నేళ్ల నిధుల కరువు తీరింది. ఒక్కసారిగా నిధులు వచ్చి పడ్డాయి. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే.. అంటే మార్చి 31లోగా ఖర్చు చేయాలి. లేనిపక్షంలో వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. అయితే వీటి వినియోగంలో కొంత వివాదం నెలకొంది. నిర్వహణ పనులకే ఈ నిధులు వెచ్చించాలని మార్గదర్శకాల్లో ఉండటంతో నిర్మాణాలు చేపట్టే విషయంలో గ్రామాల్లో వాగ్వాదాలు, వివాదాలు.. పరస్పర ఫిర్యాదులు వంటి ఘటనలతో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. ఎచ్చెర్ల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఎన్నికలు జరగడంతో ఆ నిధులన్నీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఐదు విడతల్లో మంజూరయ్యాయి. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు మంజూరైన ఈ నిధులను సత్వరమే వినియోగించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల.. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14వ ప్రణాళిక కాలం ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పుడు మంజూరైన నిధులన్నింటినీ ఈ నెలలోనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలి. వాటితో పనులు ప్రారంభం కావాలి. అయితే దీనికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు మాత్రమే చేపట్టాలని నిబంధనల్లో ఉంది. సిమెంటు కట్టడాలు చేపట్టవచ్చని ఎక్కడా పేర్కొనలేదు. దాంతో ఒక్కసారి వచ్చిపడిన లక్షల నిధులను పారిశుద్ధ్య నిర్వహణకే ఎలా వినియోగిస్తారన్నది చర్చనీయాంశంగా మా రింది. మురుగు కాలువలు, సిమెంట్ కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణం కూడా పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగమేనని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అంటుండగా.. అధికారులు కూడా అదే చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలు నిర్వహణ కిందకు ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా వివాదాలు రేగుతున్నాయి. ఫరీదుపేటే ఉదాహరణ ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఏర్పడిన వివాదమే ఈ పరిస్థితికి నిదర్శనం. ఈ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పేర్కొంటూ సిమెంట్ కాలువలు నిర్మిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకే తప్ప నిర్మాణాలకు అవకాశం లేదని వాదిస్తూ.. దీనిపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ అంశం రెండు వర్గాల మధ్య వివాదంగా మారినప్పటికీ అధికారులు మాత్రం ‘పాము చావదు.. కర్ర విరగదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కాలువల నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణలో భాగమేనని ఒకపక్క చెబుతూ.. మరోపక్క జిల్లా అధికారులను అడిగి నిర్ణయం తీసుకుంటామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ పంచాయతీకి రూ.9.12 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో రూ. 2 లక్షలు విద్యుత్ సామగ్రికి, రూ.62 వేలు కల్వర్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. రూ. 6.02 లక్షలతో ప్రస్తుతం మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. నాలుగు నివాస కమిటీలకు అప్పగించిన ఈ పనులు ప్రస్తుతం వివాదంలో పడ్డాయి. నిబంధనలు ఇలా.. జిల్లాలోని పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,09,17,600 మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జీవో విడుదలైంది. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు పరిశీలిస్తే.. సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ స్కీములు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, వృథా నీరు, పంచాయతీ కార్యాలయం, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగ న్వాడీ కేంద్రాల నిర్వహణకు నిధులు వినియోగించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి కీలకమైన మురుగు కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. అయినా ప్రస్తుతం పెద్ద మొత్తంలో మంజూరైన నిధులతో జిల్లాలో 80 శాతం సిమెంటు కాలువల నిర్మాణాలే చేపడుతున్నారు. దీనిపై పలు గ్రామాల్లో వివాదాలు రేగి ఫిర్యాదుల వరకు వెళుతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది. -
పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణే..
రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగరపాలక సంస్థలో 21 పరిసర గ్రామాల విలీనం విషయం కోర్టు పరిధిలో ఉన్నందున గ్రామ పంచాయితీల రికార్డుల స్వాధీనం కోర్టు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటి సెక్రటరీ ఆర్.మోహన్ జయరామ్ నాయక్ ఈనెల 10నే రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్‌కు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఉత్తర్వులు ఇచ్చారని విలీనాన్ని వ్యతిరేకిస్తున్న వారి తరఫు న్యాయవాది వెదుళ్ల శ్రీనివాస్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను వెంటనే పంచాయతీలకు అప్పగించాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొనట్టు వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్ ఈనెల 13వనుంచి రెండు రోజులపాటు 21 పంచాయతీలలో రికార్డుల స్వాధీనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 21 పంచాయతీలకు 11 పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకోగా, మిగిలిన చోట్ల ప్రజలను నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం విలీన సమస్య కోర్టు పరిధిలో ఉందని, పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణ అవుతుందని మాజీ ప్రజాప్రతినిధులు కోర్టు ఉత్తర్వులు చూపించినా జిల్లా పంచాయతీ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదంతా కేవలం ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి వ ల్లే చేసినట్టు ఆయన కార్యాలయ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా స్వాధీనం చేసుకున్న 11 పంచాయతీల రికార్డులను వెంటనే అప్పగించాలని మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు డిమాండ్ చేశారు. -
కాంట్రాక్టర్ల టెండ‘రింగ్’
గద్వాల న్యూటౌన్ : కాంట్రాక్టర్లు ఒక్కటై ముందే ఒప్పందాలు కుదుర్చుకుని అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టును పం చుకున్నారు. గురువారం 21 పనులకు అంచనా ధరలు వేసి టెండ‘రింగ్’ చేశారు. అలంపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలలోని అడ్డాకుల, భూత్పూర్, చిన్నచింతకుంట, దేవరకద్ర, కొత్తకోట, ఆత్మకూర్, మాగనూరు, మక్తల్, నర్వ, ఉట్కూరు, అలంపూర్, అయిజ, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లిలో రూ.3.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 53 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాల కోసం టెండర్లు ఆహ్వానించారు. గద్వాల పంచాయతీ రాజ్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో పనికి రూ.6.50 లక్షలుగా నిర్ణయించారు. షెడ్యూలు ధరలు రూ.1200గా నిర్ణయించారు. మొత్తం 287 షెడ్యూళ్లు అమ్ముడుపోగా... 286 షెడ్యూళ్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అయితే పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. మధ్యదళారులు కొంతమంది చేరి కాంట్రాక్టర్ల మధ్య రాజీ కుదుర్చారు. పనులను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. కార్యాలయం వెలుపలా, ఆవరణలో ఉదయం నుంచి మంతనాలు సాగించారు. మొత్తం 53 పనుల్లో 21 పనులకు అంచనా ధరలు వేశారు. మరో 32 పనులు మాత్రం లెస్‌కు దాఖలయ్యాయి. కార్యాలయం వెలుపలా కాంట్రాక్టర్లు కుమ్మక్కైన విషయం తమ పరిధిలోకి రాదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
లెక్కల ‘పంచాయితీ’
వీరఘట్టం: గ్రామ పంచాయతీల జమాఖర్చుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం(2013-14) జమాఖర్చుల నమోదే ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని 1099 పంచాయతీల్లో ఇప్పటి వరకు 412 గ్రామాల వివరాలు మాత్రమే నమోదయ్యాయని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక ఏజెన్సీ సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పటికీ పంచాయతీరాజ్ సిబ్బంది నిరాసక్తత కారణంగా ఈ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. స్థానిక సంస్థలకు మంజూరు చేస్తున్న నిధులు వినియోగం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ విధానం అమలుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్, సాప్ట్వేర్ సిస్టమ్(ప్రియా సాప్ట్వేర్ సిస్టమ్) రూపొందించారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించే బాధ్యతను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ సాఫ్ట్వేర్ వినియోగంపై గ్రామపంచాయతీ కార్యదర్శులకు సామర్లకోటలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో సొంతంగా కంప్యూటర్లు అందుబాటులో లేనందున వివరాలు నమోదు చేయడానికి ప్రైవేటు నెట్ సర్వీసులను వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు అయ్యే ఖర్చులను పంచాయతీ నిధుల నుంచి తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో రెండేసి కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఇద్దరు ఆపరేటర్లను నియమించారు. వారానికోసారైనా ఆ మండలంలోని పంచాయతీల జమాఖర్చులు నమోదు చేయించాలని ఆదేశించారు. తర్వాత ప్రతి పంచాయతీకి ఒక ఆపరేటర్‌ను నియమించారు. అయినా పరిస్థితి మారలేదు. జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ కంప్యూటర్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి సమాచారం ఆన్లైన్లో పొందిపరిస్తే ఢిల్లీలోని ఉన్నతాధికారులతో పాటు సదరు పంచాయతీ ప్రజలు కూడా ఆ వివరాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. తద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటుంది. మళ్లీ నిధుల విడుదలకు మార్గం సుగమమవుతుంది. 40 శాతమే పూర్తి అయితే పంచాయతీ సిబ్బంది మాత్రం దీనిపై నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో 1099 పంచాయతీలు ఉండగా కేవలం 40 శాతం.. అంటే 412 పంచాయతీలు మాత్రమే గత ఆర్థిక సంవత్సరం జమా ఖర్చుల వివరాలు నమోదు చేశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే ఏ మండలంలోనూ నూరు శాతం నమోదు పూర్తి కాలేదు. గత ఏడాది లెక్కల నమోదు పూర్తి అయితేనే ఈ ఆర్థిక సంవత్సరం వివరాల నమోదుకు అనుమతిస్తారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించాం జమాఖర్చుల నమోదుపై జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి బి.ఎం.సెల్వియాను వివరణ కోరగా పంచాయతీ లెక్కల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కార్యదర్శులను గతంలోనే ఆదేశించామన్నారు. ఈ విషయంలో వెనుకబడిన మాట వాస్తవమేనని, మళ్లీ మరోసారి సమావేశం నిర్వహించి పెండింగ్ వివరాలు వెంటనే నమోదు చేయాలని ఆదేశిస్తామని చెప్పారు. -
17న డీపీసీ ఎన్నిక
సాక్షి, సంగారెడ్డి: జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ) ఎన్నిక ఈనెల 17న జరగనుంది. ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్‌శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయటంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ ఎన్నిక ముగియగానే జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు ఇతరాత్ర సమస్యల వల్ల ప్రణాళిక కమిటీ ఎన్నికల నిర్వహణలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం సర్కార్ జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను అనుసరించి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ల పేర్లతో ఓటరు జాబితాను సైతం జెడ్పీ అధికారులు వెలువరించారు. ఈ ఓటరు జాబితాపై బుధవారం అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది ఓటరు జాబితాను గురువారం ప్రకటిస్తారు. ఎన్నికలు...ఆ వెంటనే ఫలితాలు 12వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీలోని 4 అర్బన్, 20 గ్రామీణ సభ్యుల స్థానాల ఎన్నికకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 17వ తేదీన జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెలువరిస్తారు. జిల్లా ప్రణాళిక కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక కమిటీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రణాళిక కమిటీ ఎన్నికల విషయమై రెండు పార్టీల జెడ్పీటీసీలు త్వరలో సమావేశమై ప్రణాళిక కమిటీ సభ్యుల స్థానాలకు ఎవరిని బరిలో దించాలో నిర్ణయించే అవకాశం ఉంది. కాగా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ డీపీసీ ఎన్నికల్లో సైతం పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. డీపీసీ సభ్యుల ఎన్నిక ఇలా... జిల్లా ప్రణాళిక కమిటీలో జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు మరో 28 మంది సభ్యులు ఉంటారు. జెడ్పీ చైర్పర్సన్ డీపీసీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్ సెక్రటరీగా కలెక్టర్ ఉంటారు. 28 మంది సభ్యుల్లో నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగితా 24 మంది సభ్యుల్లో నలుగురు అర్బన్, 20 మంది రూరల్ సభ్యులు ఉంటారు. నలుగురు అర్బన్ సభ్యులుగా మున్సిపల్ కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. 20 మంది రూరల్ సభ్యులను జెడ్పీటీసీలను ఎన్నుకుంటారు. జిల్లాలో ప్రస్తుతం సంగారె డ్డి, మెదక్, జహీరాబాద్, సదాశివపేట, గజ్వేల్, అందోలు మున్సిపాలిటీల్లో మొత్తం 145 మంది కౌన్సిలర్లు ఉన్నారు. డీపీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుసరించి కౌన్సిలర్లు పోటీ చేయవచ్చు. ఒక్కో కౌన్సిలర్లు ఎన్నికల్లో నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రూరల్ సభ్యుల రిజర్వేషన్ ప్రకారం జెడ్పీటీసీలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒక్కో జెడ్పీటీసీ 20 ఓట్లు వేయాల్సి ఉంటుంది. 17న సంగారెడ్డిలో జరగనున్న డీపీసీ ఎన్నికలకు కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. టీఆర్ఎస్కే ఎక్కువ అవ కాశాలు డీపీసీ ఎన్నికల్లో 24 మంది సభ్యుల ఎన్నికల కీలకం కానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ, జెడ్పీలోనూ అధికారపార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో డీపీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలో 46 స్థానాలకుగాను 21 మంది టీఆర్ఎస్ సభ్యులు ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన మరో ఐదుగురు సభ్యులు టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారు. అలాగే టీ డీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు సైతం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో టీఆర్ఎస్ సహకరించారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక తరహాలోనే డీపీసీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా డీపీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘ఉపాధి’.. ఇక పకడ్బందీ..
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణకు ఉత్తర్వులు జారీ * పారదర్శకంగా పనులు, నిధుల ఖర్చు మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనుల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపు ప్రక్రియ, పనుల కేటాయింపు బాధ్యతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంపీడీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం జీవో 15 జారీ చేసింది. ఇన్నాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులే ఉపాధి పనుల ఎంపిక, వాటి నిర్వహణ బాధ్యతలు చూడడం, కొలతలను బట్టి కూలీలకు వేతనాలు అందించడం వంటి పనులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ మండలానికి ఒక ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ప్రతీ ఏడాది సామాజిక తనిఖీ బృందం చేసిన పనులు, చెల్లించిన వేతనాలపై తనిఖీ చేపట్టగా.. రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతో చేసిన పనులతో అంతగా ప్రయోజనం లేకుండా పోయినట్లు గుర్తించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో ‘ఉపాధి’ కాంట్రాక్టు సిబ్బంది ఇక నుంచి ఎంపీడీవోల ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుంది. దుర్వినియోగం తగ్గేనా..? జిల్లాలో 31,618 శ్రమశక్తి సంఘాల్లో 5,80,577 మంది కూలీలు ఉన్నారు. వీరిలో ఏడాదికి కనీసం 4 లక్షల మంది ఉపాధి పని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు కాలంలో పనులు తక్కువగా ఉండడంతో ఇతర పనులకు వెళ్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత ఉపాధి పనులు చేస్తేనే పూట గడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది పనుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చేసిన పనులు మళ్లీ చేయడం, చేయకున్నా కూలీల మస్టర్లు వేసి వేతనాలు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఎనిమిదేళ్లుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో రూ.12.17 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. వీటిలో ఇంకా సుమారు రూ.9కోట్లకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేలోపు వారు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. వారి నుంచి నిధులు రికవరీ చేయడం, చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని దృష్ట్యా పనుల్లో పారదర్శకత, నిధుల ఖర్చులో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీరిక లేకుండా ఉంటున్న మండల పరిషత్ సిబ్బంది.. ఉపాధి పనుల పర్యవేక్షణ, ఎంతమేరకు నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తారో వేచి చూడాల్సిందే. బాధ్యతల అప్పగింత.. పనుల పర్యవేక్షణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా మండలాల ఎంపీడీవోలకు అప్పగించారు. ఎంపీడీవోలు జాబ్‌కార్డుల జారీ నుంచి పనుల ఎంపిక, కూలీల బడ్జెట్ తయారీ, గ్రామపంచాయతీల్లో పనుల ప్రణాళిక తయారీ, చేసిన పనులకు సరైన వేతనాలు అందించే ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. పనుల నివేదికలను ఎప్పటికప్పుడు డ్వామా పీడీ, అడిషనల్ పీడీలకు అందించి, పథకం అమలు విషయంలో జవాబుదారీగా ఉండాలి. ప్రతీ పనిని పంచాయతీ కార్యదర్శి, సర్పంచుల ఆమోదం, గ్రామసభలో ప్రజలు సూచించిన పనుల ప్రణాళిక తయారీ, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్యవేక్షించడం, గ్రామాల్లో జరిగే పనుల తనిఖీ, కూలీలకు వేతనాలు అందేలా చూడడం వంటి పనులు చేపట్టనున్నారు. ఈవోపీఆర్డీలు మండల ప్రణాళిక తయారీ, మస్టర్లు, పనుల తనిఖీ చేపడుతారు. పంచాయతీ రాజ్ ఏఈలు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంపీడీవోలకు తెలియజేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్లు ఉపాధి పనుల ఖాతాల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపుల రిజిష్టర్, ఆపరేటర్లు తయారు చేసే వేతనాలు పరిశీలిస్తారు. మండల పరిషత్ కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెల్లింపుల రికార్టులను స్వాధీనం చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. వీరి పర్యవేక్షణలో అక్రమాలకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. -
మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండొద్దు: కేసీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులెవరూ హైదరాబాద్ లో ఉండడానికి వీల్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పంచాయతీరాజ్, రహదారుల శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రహదారుల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ పరిధిలో రూ. 5 వేల కోట్లతో రోడ్లను మెరుగుపరచాలని, ఆర్ అండ్ బీ పరిధిలో 2400 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. -
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు
గీసుకొండ : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గంగదేవిపల్లి గ్రామం దేశానికి మకుటాయమానంగా నిలుస్తోందని పంచాయతీరాజ్ కమిషనర్ చొల్లేటి ప్రభాకర్ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లిలో ‘స్వచ్ఛతా పంచాయతీ సప్తాహ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో గంగదేవిపల్లిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి సందర్శించి తనకు ఎంతో గొప్పగా చెప్పారని, అప్పుడే ఈ గ్రామాన్ని చూడాలని అనిపించిందన్నారు. పరి శుభ్రతను పాటించడంలో అన్నీ ఉత్తమ వార్డులే ఉండడం గంగదేవిపల్లికే సాధ్యమైందన్నారు. అందరి కోసం అందరూ పనిచేయాలన్న సూత్రాన్ని గంగదేవిపల్లి సాకారం చేసిందన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న అపార్డు శిక్షణ కేంద్రానికి మరో నెల రోజుల్లో నిధులు మం జూరు చేయిస్తానన్నారు. గంగదేవిపల్లి చరిత్ర ప్రపంచవ్యాప్తమవుతోంది : కలెక్టర్ కాకతీయుల చరిత్ర లాగానే గంగదేవిపల్లి చరి త్ర కూడా ప్రపంచ ప్రజలకు తెలిసిపోతోందని కలెక్టర్ కిషన్ అన్నారు. ఇప్పటికే గ్రామాన్ని 76 దేశాల వారు సందర్శించారని, ఎన్నో అవార్డు లు వచ్చాయని కితాబిచ్చారు. తాను ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజాప్రతినిధులతో మాట్లాడినా గంగదేవిపల్లి ప్రజలు సాధించిన విజయాల గురించే చెబుతున్నానని తెలిపారు. స్వఛ్చ భారత్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని గంగదేవిపల్లి చాలా ముందుగానే సాధించిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇట్ల శాంతి, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, డీఎల్పీవో రాజేందర్, ఎంపీడీవో పారిజాతం, తహసిల్దార్ మార్గం కుమారస్వామి, ఈఓపీఆర్డీ భీంరెడ్ది రవీంద్రారెడ్డి, ఆర్ఐ గట్టికొప్పుల రాంబాబు, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు. స్వచ్ఛత పంచాయతీ సప్తాహ్ సందర్భంగా కమిషనర్, కలెక్టర్‌తోపాటు గ్రామస్తులు, అధికారులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. 11న న్యూఢిల్లీకి సర్పంచ్.. గంగదేవిపల్లిపై ఇటీవల నేషనల్ ఫిల్మ్ సొసైటీ రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 11న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చూస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సర్పంచ్ ఇట్ల శాంతిని ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ తెలిపారు. గంగదేవిపల్లి గురించి వివరించడానికి తనతోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ పర్యటనకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ వివరించారు. కనెక్షన్ ఇచ్చే వరకూ ఇక్కడే ఉంటా.. తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయాన్ని ఉపసర్పంచ్ కూసం రాజమౌళి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పం దించిన ఆయన ‘పది రోజుల క్రితమే ఎస్ఈకి చె ప్పిన.. ఇంకా కనెక్షన్ ఇవ్వలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఇప్పుడు గంగదేవిపల్లిలోనే ఉన్నానని చెప్పు.. కరెంటు ఇవ్వకుండా కదలనని చెప్పు...’ అంటూ కలెక్టర్ తన పీఏతో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మోహన్‌రావుకు ఫోన్ చేయించారు. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు అప్పటికప్పుడు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. కరెంటు మీటర్లు ఉన్న వాటికి ఈ ఏడాది నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని వాటికి చెల్లించవద్దని, సరఫరాను నిలిపివేస్తే తనకు ఎస్ఎంఎస్ చేయాలని కలెక్టర్ సూచించారు. -
వెబ్సైట్లో ఈపీఎఫ్ సమాచారం
జెడ్పీ ఉద్యోగులారా..! మీ భవిష్యనిధిలో నెలనెలా చెల్లించే మొత్తాలు జమ అవుతున్నాయా..లేదా.. ఒకవేళ జమ అయితే ఎంత..? తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉంది కదూ..!అయితే 119.226.159.178:8080/్డఞఞజుఠటౌౌ అనే వెబ్సైట్లోకి వెళ్లి మీ సర్వీసు నెంబర్ ఎంటర్ చేయండి.. భవిష్యనిధి సమాచారం తెలుసుకోండి. జిల్లా ప్రజాపరిషత్ సీఈవో జయరామిరెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన భవిష్యనిధి వెబ్‌సైట్‌ను గాంధీ జయంతి సందర్భంగా గురువారం ఉదయం కలెక్టర్ విజయమోహన్ ప్రారంభించనున్నారు. వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే ముందు మరింత సమాచారం మీకోసం.. కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలను జిల్లా ప్రజాపరిషత్ నిర్వహిస్తోంది. దాదాపు 8,434 మంది ఉద్యోగుల భవిష్యనిధి చందాదారులు జిల్లా ప్రజాపరిషత్ భవిష్యనిధిలో చందాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సాధారణ భవిష్యనిధికి వర్తించే నిబంధనలే జెడ్పీ భవిష్యనిధికి కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం 8,434 మంది చందాదారుల భవిష్యనిధి ఖాతాల వివరాలను 2005-06 సంవత్సరం నుంచి 2013-14వ సంవత్సరం వరకు 74,870 రికార్డులను 119.226.159.178:8080/్డఞఞజుఠటౌౌ అనే వెబ్సైట్లో ఉంచారు. చందాదారులకు మంజూరు చేసిన రుణాలను వెబ్సైట్ ద్వారా గత సంవత్సరం నుంచి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. రుణ ఉత్తర్వులను కూడా ఇప్ప టి నుంచి వెబ్సైట్లో నిక్షిప్తం చేయడం వల్ల, సదరు ఉత్తర్వులను చందాదారులు వెంటనే పొందే అవ కాశం కల్పించారు. దీనివల్ల భవిష్యనిధి ఖాతాదారులు తమ తమ ఖాతాలకు సంబంధించిన చందా వివరాలను వెంటనే తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. భవిష్యనిధి చందా మొత్తం రూ.189కోట్లు జిల్లా ప్రజాపరిషత్‌లోని భవిష్యనిధి చందాదారుల మొత్తం నిల్వ రూ.189కోట్లుగా ఉంది. దాంతో పాటు 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2010-11 సంవత్సరం ప్రభుత్వం నుంచి భవిష్యనిధి మొత్తాలకు వడ్డీ రూ. 35,88,72,010 ఆడిట్ వారిచే ధ్రువీకరించిన మొత్తం జమకావాల్సి ఉంది. భూస్టర్ స్కీమ్ కింద 2006-07 సంవత్సరం నుంచి 2010-11 సంవత్సరానికి రూ.23,24,482 ప్రభుత్వం నుంచి రావాలి. ఈ స్కీమ్ కింద సర్వీసులో ఉంటూ మరణించిన చందాదారుని వారసులకు, చందాదారు జమచేయాల్సిన చందా మొత్తాన్ని బట్టి రూ.20వేలు మించకుండా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యనిధి ఖాతాదారుల నెలసరి చందా మొత్తం ఒక నెలకు ప్రస్తుతం దాదాపు రూ.3 కోట్లను 8338-00-104-00-01 పద్దుకు జమచేశారు. చందాదారులకు మంజూరు చేసిన రుణ మొత్తాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన అంతిమ మొత్తాలు కలిపి నెలకు దాదాపు రూ.1,50,00,000 వరకు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. సంవత్సరాల వారీగా ఖాతాదారుల సంఖ్య సంవత్సరం ఖాతాదారుల సంఖ్య 2005-2006 8361 2006-2007 8402 2007-2008 8532 2008-2009 8333 2009-2010 8225 2010-2011 8266 2011-2012 8406 2012-2013 8434 2013-2014 7911 మొత్తం 74,870 -
ఎత్తుకు పైఎత్తులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పూర్వపు ఈఈ, ప్రస్తుత డీఈఈ శ్రీనివాస్‌కుమార్ లక్ష్యంగా చేసుకుని జెడ్పీ చైర్పర్సన్ ఎత్తులు వేస్తుంటే, అందుకు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు పైఎత్తులు వేస్తున్నారు. గత పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన ఇన్చార్జి ఈఈ శ్రీనివాస్‌కుమార్ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేల అండతో పంచాయతీరాజ్‌లో ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారని, తమకు తెలి యకుండా వ్యవహారాలు నడుపుతున్నారన్న అనుమానంతో ఆయన్ని ఎలాగైనా సాగనంపాలని జెడ్పీ పెద్దలు పథక రచన చేశారు. అందుకు తగ్గట్టుగానే ఆయన కున్న ఇన్చార్జి ఈఈ బాధ్యతలను తొలగించి, డీఈఈగా వెనక్కి పంపించేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. ఈఈ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినతరువాత ఎమ్మెల్యేలు సూచించిన వారిని పాత తేదీతో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లగా నియమించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి మృణాళిని తీవ్రంగా స్పందించారు. టెక్నికల్ అసిస్టెంట్ల నియామకాలను నిలిపేసి, డీఈఈ శ్రీనివాస్‌ను సరెండర్ చేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈకి మంత్రి తరఫున ఓఎస్డీ నుంచి ఒక లేఖ వచ్చింది. రహస్యంగా పంపించిన మంత్రి ఓఎస్డీ లేఖను వ్యూహాత్మకంగా చైర్పర్సన్ వర్గీయులు లీక్ చేశారని, జెడ్పీలో అంతా పథకం ప్రకారం జరుగుతోందని రాష్ట్ర మంత్రి వర్గీయులు అనుమానానికొచ్చినట్టు తెలిసింది. ఇదే అదనుగా శ్రీనివాస్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు కూడా మంత్రితో మాట్లాడినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే లంతా కలిసికట్టుగా, వ్యూహాత్మకంగా పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడ్ని కలిసి తమను నమ్ముకున్న డీఈఈ శ్రీనివాస్‌కు మార్కు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడమే కాకుండా, పీఏ టూ ఎస్ఈగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినట్టు తెలిసింది. దీంతో చైర్పర్సన్ వర్గీయులు కంగుతిన్నారు. ఆ ఉత్తర్వులు బయటపెట్టొద్దని, పంచాయతీరాజ్ మంత్రి, సీఈతో మా ట్లాడుతానని జిల్లా ఎస్ఈకి చైర్పర్సన్ వర్గీయులు లోపాయికారీగా చెప్పినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అ టు చైర్పర్సన్, ఇటు డీఈఈ వర్గీయులు ప్రతిష్టకు పోయి, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు. డీఈఈ శ్రీనివాస్ మాత్రం ఎక్కడ పోగుట్టుకున్నానో అక్కడే వెదుక్కోవాలన్న ఆలోచనతో పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో, ఎంతవర కు వెళ్తుందో చూడాలి. -
విజయనగరానికి పొంచి ఉన్న నీటి గండం!
నెల్లిమర్ల: విజయనగరం మున్సిపాలిటీకి చెందిన ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు నెల్లిమర్లలోని చంపావతి నదిలో రామతీర్ధం మంచినీటి పథకాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. దీని కోసం నదిలో ఊటబావులను స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోను న్న మాస్టర్ పంప్‌హౌస్ నుంచి స్థానిక ఆర్వోబీ కింద నుంచి మిమ్స్ మీదుగా పట్టణానికి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ పంప్‌హౌస్ ద్వారా విజయనగరం పట్టణంలో సుమారు లక్ష మందికి ప్రతిరోజూ 15 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. పైపులైను వెళ్లే స్థలమంతా ప్రభుత్వానిదే. అయితే నెల్లిమర్ల రెవెన్యూ అధికారులు అనాలోచితంగా వ్య వహరించారు. పైపులైను వెళుతున్న ప్రభుత్వ స్థలాన్ని... ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేశారు. ఇక్కడి ఆర్వోబీకి సమీపంలోనున్న ఈ స్థలంలో కొంతభాగాన్ని రెండేళ్ల క్రితం కొం డవెలగాడకు చెందిన వెయిట్లిఫ్టర్లకు కేటాయించారు. మిగి లిన స్థలాన్ని కూడా ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నారు. ఇటీవల పలు గ్రామాలకు చెందిన వారికి ఇదే స్థలంలో పది పట్టాలు పంపిణీ చేశారు. ఆ స్థలంలో ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా..మరికొంతమంది పునాదులు వేస్తున్నారు. అలాగే ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న మరికొంత స్థలాన్ని ఇస్కాన్ అనే ఆధ్యాత్మిక సంస్థకు అధికారులు మూడేళ్ల క్రితం అప్పగించారు. ఇక్కడ కూడా ప్రస్తుతం భవనాల నిర్మాణం జరుగుతోంది. రెండింటికీ మధ్యనున్న స్థలంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎస్ఈ కార్యాలయ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఎనిమిదడుగుల లోతులో అప్పట్లో పైపులైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భవనాలకు ఐదడుగుల వర కూ పునాదులు తవ్వుతారు, పెద్ద భవ ంతులకు ఆరు నుంచి ఎనిమిది అడుగుల వరకూ తవ్వే అవకాశం ఉంది. పునాదులు తవ్వే సమయంలో కూడా పైపులైన్ పగిలిపోయే అవకాశం ఉం ది. నిర్మాణాలన్నీ పూర్తయితే తాగునీ టి పైపులైనుకు ఇబ్బంది తప్పదు. ఎప్పుడైనా పైపులైను పాడైతే ..ఇదే స్థలంలో తవ్వి రిపేరు చేయాలి. పైపులైను వెళ్లే స్థలమంతా ఇళ్ల నిర్మాణాలతో నిండిపోతే మరమ్మతులు చేపట్టేందుకు అవకాశమే ఉండదు. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరా ప్రశ్నార్ధకంగా మారుతుంది. పూర్తయిన ఇళ్ల మాట అటుంచితే, ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి పైపులైను స్థలంలో చేపడుతున్న భవనాలు, ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగరపంచాయతీ అధికారులు ఇప్పుడైనా స్పంది స్తారో లేదో వేచి చూడాల్సిందే. -
కలెక్టర్ మాటకు పక్షం రోజులు
సిద్దిపేట టౌన్ : సర్కార్ బడుల తీరును ప్రజలు పరిశీలించడానికి తద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పాఠశాలలోని సమస్యలను పరిష్కరించడానికి వీలుగా అన్ని పాఠశాలల ముందు రెండు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుకు ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ వీడియో కాన్ఫరెన్సులో 15 రోజుల క్రితం విద్యాధికారులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ వీటి నిర్మాణానికి నిధులు ఎలా వస్తాయో చెప్పలేదు. విద్యాధికారులు నిధుల విషయమై ఆర్ అండ్‌బీ, పంచాయతీ రాజ్ అధికారులను సంప్రదిస్తే తమకు ఎలాంటి ఉత్తర్వులు లేవని చేతులెత్తేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణ నిధులు కూడా విడుదల కానీ స్కూల్స్ స్పీడ్ బ్రేకర్లను, సైన్ బోర్డులను ఎలా ఏర్పాటు చేయాలో తెలియక ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నాయి. రూ. ఐదు కోట్ల నిధులు అనివార్యం.. సిద్దిపేట డివిజన్లో 162 హైస్కూల్స్, సుమారు 500 ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లో అన్ని పాఠశాలల ముందు వీటిని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ. 5 కోట్ల నిధులు అనివార్యం. కానీ నిధులు ఎలా వస్తాయో తెలియక అటూ ప్రధానోపాధ్యాయులు, ఇటూ విద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలని స్కూల్ గ్రాంట్స్‌తో కనీస అవసరాలనే తీర్చలేకపోతున్నామని ఈ క్రమంలో వీటిని ఎలా నిర్మిస్తామని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. -
సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండాలి
సర్వేకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు రేమండ్ పీటర్ ఆదేశాలు రాంనగర్ : కుటుంబ వివరాలపై ఈనెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సమగ్ర సర్వేకు సర్వం సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవా రం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చి కుటుంబ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి ఆయా జిల్లాల్లో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేకు ప్రజలందరూ సహకరించేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం కంటే ఎక్కు వ కుటుంబాలు నివసిస్తున్నట్లయితే వారికి ఆయా ఇంటి నెంబర్ల కోసం తాత్కాలిక సంఖ్య ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులను చేరుకునేందుకు వాహన సదుపా యం కల్పించాలన్నారు. ఎన్నికల విధులకు రూట్ మ్యాప్‌లు ఉపయోగించిన విధంగానే కుటుంబ సర్వేకు కూడా రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. సర్వే అనంతరం వివరాలు నమోదు చేయడానికి అవసరమైన కంప్యూటర్లు, ఆపరేటర్లను సిద్ధం చేసుకోవాలని తెలి పారు. కంప్యూటర్లలో వివరాల నమోదును ఒక ప్రదేశం నుంచే కాకుండా అనుకూలంగా ఉన్న కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లు, కళాశాలలు, పాఠశాలల నుంచి నేరుగా ఎంట్రీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎన్యుమరేటర్ల గుర్తింపు పూర్తి కుటుంబ సామాజిక వివరాలపై సమగ్ర సర్వే చేయడానికి ఎన్యుమరేటర్లను గుర్తించి వారికి శిక్షణ పూర్తి చేసినట్లు రేమండ్ పీటర్‌కు జిల్లా కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. ఆలేరుకు విచ్చేసిన కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్ల చొప్పున కేటాయించామన్నారు. పింఛన్ పొందు తున్న వారి వివరాలు, ఇళ్ల మంజూరు వివరాలు, ల్యాండ్ రికార్డులు, సదరన్ క్యాంప్ లబ్ధిదారుల వివరాలు మొదలగునవి సరి చూసుకుని సర్వే చేసినట్లయితే అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయని అధికారులకు వివరించినట్లు కలెక్టర్ చెప్పారు. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకొని నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, డీఆర్డీఏ పీడీ సుధాకర్, ఆలేరు నుంచి వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ రాంమ్మూర్తి, ప్రత్యేక అధికారి యాదగిరి, ఏడీఏ వెంకటేషం, ఇన్చార్జ ఎంపీడీఓ వెంక టరమణ తదితరులు పాల్గొన్నారు. -
బతికి రా... కన్నా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఒకటి కాదు రెండు వరుసగా ఆరు సంఘటనలు చోటు చేసుకున్నా ఎవరిలోనూ కించిత్తయినా అప్రమత్తత లేదు. ఏడో సంఘటనలో తిమ్మన్న హట్టి అనే ఆరేళ్ల బాలుడు బాధితుడు. అయితే ఈసారి అతను సాక్షాత్తు తండ్రి వేయించిన, విఫలమైన బోరును బంధువులకు చూపించడానికి పోయి అందులో పడిపోయాడు. అతను ప్రాణాలతో తిరిగి వస్తాడా... తిరుమల తిమ్మప్ప ఈ తిమ్మన్నను కాపాడుతాడా...అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం. ఆ బాలుని ప్రాణాలతో బయట పడేయ్ స్వామీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాల వారు తమ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవుళ్లు వీరి మొరను ఆలకిస్తారా....లేదా అనేది మరి కొన్ని గంటలు గడిస్తే కానీ తేలకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3,400 బోర్లు ఇంకా నోర్లు తెరుచుకునే ఉన్నాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలే చెబుతున్నాయి. తిమ్మన్న 160 అడుగుల లోతులో పడిపోగా...ఆ బోరుకు సమాంతరంగా ఇప్పటి వరకు ఎనభై అడుగుల లోతు వరకు మాత్రమే జేసీబీల సాయంతో గుంతను తవ్వగలిగారు. మరో వైపు బాలునిపై పూర్తిగా మట్టి కప్పుకు పోయిందని బోరులోకి పంపిన కెమెరా ద్వారా లభించిన దృశ్యాలు చెబుతున్నాయి. -
నల్లగొండలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం: కేటీఆర్
మోత్కూరు: నల్లగొండలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం మోత్కూరు మండలం కొండగడపలో రూ. 9లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం, రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మరోమంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్‌ను నిర్మూలించడానికి గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సీఈ స్థాయి అధికారితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఐదేళ్లలో నల్లగొండను ఫ్లోరిన్హ్రిత జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలన్నారు. -
చెత్త బుట్టలో వేయండి
ప్రణాళిక చెత్తగా ఉంది.. అధికారుల సంతోషానికో.. అవసరాలు తీర్చేందుకో.. ఈ ప్రణాళిక తయారు చేయవద్దు. మీ ఇష్టానుసారంగా ప్రణాళిక తయారు చేస్తే ప్రజల అవసరాలు ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఆదేశాలు పునరాలోచించుకోవాలి. ప్రజల సంక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల అవసరాలు తీర్చేవిధంగా, పకడ్బందీగా జిల్లా ప్రణాళిక రూపొందించాలి. ఇప్పటికే గ్రామ, మండల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జిల్లా స్థాయి అధికారులు అనుభవంతో ఉంటారు. కాని మీరు తయారు చేసిన ప్రణాళిక చెత్త బుట్టలో పడేసే విధంగా ఉంది. ఒక్క ప్రణాళిక కూడా సంక్షేమానికి ముడిపడి లేదు అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. నిజామాబాద్ నాగారం : రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాత్రి 10 గంటలకు అధికారులతో మని జిల్లా ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరి సంక్షేమం కోసం ప్రణాళిక తయారు చేయాలన్నారు. అయితే పంచాయతీరాజ్ విషయంలో కేవలం భవనాల నిర్మాణానికే, మండలంలోని మండల కాంప్లెక్స్‌లకు రూ. 3 కోట్లు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని కలెక్టరేట్లోనే పెద్ద ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకు రూ. 10 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లా పరిషత్ భవనాల కోసం ప్రణాళిక తయారు చేయవద్దని, జిల్లా అధికారులు ప్రణాళిక తయారు చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు ముఖ్యంగా రోడ్లు, కల్వర్టు, బ్రిడ్జిలు, తదితర పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వీటి నిర్మాణం కోసం ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించడం సరికాదన్నారు. పక్కగా ప్రాక్టికల్‌గా నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయించే విధంగా ఉండాలన్నారు. పశుసంవర్దకశాఖకు, వ్యవసాయశాఖలకు సంబంధించి మండల భవనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. చెరువుల మరమ్మతులకు సైతం ఒక్కో చెరువుకు రూ. 50 లక్షలు కేటాయించడం సరికాదన్నారు. కేవలం రూ. 10 లక్షలలోపే మరమ్మతులు పూర్తవుతాయన్నారు. భవిష్యత్ గురుకులానిదే.. జిల్లాలోని ప్రతి మండలంలో 4,5 గురుకుల పాఠశాలలను వసతితో పాటు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటు కులభేదాలు ఉండవని, అన్ని వర్గాల విద్యార్థులు చదువుకొని వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ విద్యార్థులకు రూ. 5,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. మన విద్యార్థులందరు బాలబాలికలు ఒకేదగ్గర చదువుకొని మన సంప్రదాయాన్ని ఒట్టిపడే విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా చదువులు ఉంటాయన్నారు. అందువల్ల చిన్న చిన్న హాస్టళ్లకు ప్రాముఖ్యత ఇవ్వరాదన్నారు. అధికారులందరూ మళ్లీ ఒక్కసారి ప్రణాళికను ప్రాక్టికల్‌గా తయారు చేసి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, ఐకెపీ పీడీ వెంకటేశం, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర పండుగ
మూడు చోట్ల గోదావరి పుష్కరాలు తొలిసారిగా మల్లూరులో ఘాట్ రామన్నగూడెంలో మరో స్నానఘట్టం గోదావరి తీరంలోని ఆలయూల సుందరీకరణ రూ.8 కోట్లతో ప్రణాళిక రూపకల్పన నేడు ప్రభుత్వానికి నివేదిక హన్మకొండ : గోదావరి తీరంలో పెద్ద పండుగ జరగనుంది. మేడారం మహా జాతరను తలపించేలా... ఏజెన్సీ ప్రాంతం మరోసారి భక్తులతో కిటకిటలాడనుంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాలో మూడు ప్రాంతాల్లో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మైనర్, మేజర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పుష్కర పండుగకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కసరత్తు మొదలుపెట్టారు. పుష్కర ప్రాంతాల్లో స్నానఘట్టాల నిర్మాణాలకు దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్లాన్ వేశారు. ఈసారి మొత్తం రూ. 8 కోట్ల వ్యయంతో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రధాన ఆలయాలతోపాటు గోదావరి తీరం వెంట ఉన్న శివాలయాలన్నింటినీ విద్యుత్ కాంతుల్లో సుందరంగా అలంకరించనున్నారు. ప్రధానంగా గోదావరి తీరం వెంట ఉన్న ఏటూరునాగారం, మల్లూరు ప్రాంతాల్లోని దేవాలయాలకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యూరు. మల్లూరులో తొలిసారి మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద పుష్కరాలను తొలిసారిగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మల్లూరుకు రెండు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లే గోదావరి తీరం వెంట సుమారు 700 మీటర్ల పరిధిలో స్నానఘట్టాల నిర్మాణం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. రామన్నగూడెంలో మరో స్నానఘట్టం గోదావరి పుష్కరాల్లో భాగంగా 12 ఏళ్ల క్రితం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద ఒక స్నానఘట్టాన్ని నిర్మించారు. వచ్చే ఏడు రామన్నగూడెం వద్ద మరొక స్నానఘటాన్ని నిర్మించాలని అధికారులు ప్రతిపాదనల్లో పొందుపరిచారు. రామన్నగూడెం వద్ద గోదావరి తీరానికి కొంత దూరంలో 600 మీటర్ల మేర స్నానఘట్టం నిర్మించనున్నారు. ఏటూరునాగారం సంగంపాయ వద్ద... గోదావరి వరద ఏటూరునాగారం శివారు సంగంపాయ మీదుగా ప్రవహిస్తోంది. ఇక్కడ కూడా తొలిసారిగా పుష్కర పండుగను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు సంగంపాయ వద్ద స్నానఘట్టంతోపాటు ఏటూరునాగారంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం, సంగంపాయ వద్ద ఉన్న మల్లిఖార్జున స్వామి ఆలయాల్లో పుష్కర పూజలు నిర్వహించే విధంగా ప్రణాళికకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడు నిర్వహించే గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రెండు ఆలయాలను ముస్తాబు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేడు ప్రభుత్వానికి ప్రతిపాదనల అందజేత గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లపై ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీంతో దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం అధికారులతోపాటు నీటిపారుదల, పంచాయతీ రాజ్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పుష్కర స్నానాలకు సంబంధించి స్నానఘట్టాల నిర్మాణం... దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల ముస్తాబు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు జరగనున్నారుు. మొత్తం రూ. 8 కోట్లతో జిల్లాలో గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు ప్రాథమిక ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నారు. దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం నుంచి ప్రతిపాదనలను శుక్రవారం ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు. -
సమయానికి రారు..పనిచేయరు
మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయంలో ముగ్గురే హాజరు ఇదీ పీఆర్ ఈఈ కార్యాలయ పనితీరు చిత్తూరు(టౌన్): చిత్తూరు పంచాయతీరాజ్ ఈఈ (పాజెక్ట్స్ విభాగం) కార్యాలయ సిబ్బంది పనితీరు విమర్శలకు దారితీసోంది. ఇక్కడి సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు హాజరుకావడం లేదు. గురువారం ఈ కార్యాల యాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంపై నిఘా ఉంచింది. 10.30 గంటలకు ముందే ఈఈ అమరనాథరెడ్డి తన చాంబరులో ఉన్నారు. ముగ్గురు అటెండర్లు తమ విధుల్లో కనిపించారు. డీఏవో(డివిజినల్ అకౌం ట్స్ ఆఫీసర్) క్యాబిన్ ఖాళీగా కనిపిం చింది. ఎనిమిది సీట్లకు గాను ఆరు సీట్లలో సిబ్బంది కనిపించలేదు. 11.30 గంటలపుడు ఒకరు వచ్చారు. మిగిలిన ఐదుగురు మధ్యాహ్నం వరకు కనిపించలేదు. డీఏవో కూడా కనిపించలేదు. విచారించగా తిరుపతి నుంచి రావాల్సి ఉందని సమాధానమిచ్చారు. సూపరిం టెండెంట్తోపాటు ఇద్దరు సెలవులో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన ఐదుగురు విధులకు డుమ్మా కొట్టిన విషయం వెలుగుచూసింది. పక్కనే జెడ్పీ సీఈవో, మరోవైపు జెడ్పీ చైర్పర్సన్, కాస్త దూరంలో ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్) కార్యాలయాలు ఉన్నా ఏమాత్రమూ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బయటి ప్రాంతాల్లో కాపురం.. పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు, సిబ్బం ది బయటి ప్రాంతాల్లో కాపురముంటూ నిత్యం బస్సుల్లో వచ్చి వెళుతున్నారు. పనిచేసే చోటే కాపురముండాలన్న ప్ర భుత్వ నిబంధనను ఏ ఒక్కరూ పట్టిం చుకోవడం లేదు. తిరుపతి, కార్వేటినగరం, పుత్తూరు, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం బసుల్లో ప్ర యాణిస్తూ విధులకు హాజరవుతున్నా రు. తిరుపతి నుంచి వచ్చే వారయితే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్తూరుకు ఏ సమయానికి చేరుకుంటే ఆ సమయం లో విధులకు హాజరవుతున్నారు. కొంద రు ప్యాసింజర్ రైలులో వస్తున్నారు. వీటిలో ప్రయాణించే వారు మధ్యాహ్నం 12 గంటల లోగా ఏ రోజూ చేరుకోలేకపోతున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రోజు ఇద్దరు ముగ్గురు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు. జీతాలు కట్ చేస్తాం ఈ విషయాన్ని పంచాయతీరాజ్ ఈఈ అమరనాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే పలుమార్లు సమయ పాలన పాటిం చాలని ఆదేశించానన్నారు. గురువారం కార్యాలయం బోసిపోయిన విషయాన్ని ఆయన అంగీకరించారు. డీఏవో తిరుప తి నుంచి రావడం వల్ల ఆలస్యమవుతు న్న విషయం వాస్తవమేనన్నారు. ఇకపై ఇదేవిధంగా వ్యవహరిస్తే ఒకటి రెండుసార్లు అటెండెన్స్ రిజిస్టరులో సీఎల్ మా ర్కు చేస్తానని, అప్పటికీ మార్పు రాకపో తే జీతాలు కట్ చేస్తానని పేర్కొన్నారు. -
‘మాస్టర్ ’కు మళ్లీ మార్పులు
ఐటీఐఆర్ కోసం హెచ్ఎండీఏ కసరత్తు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు తాజా ప్రతిపాదన కేంద్ర నిధుల కోసం సర్కార్ ఆరాటం సాక్షి, సిటీబ్యూరో : హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతానికి ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ త్వరలో కొత్త రూపు సంతరించుకోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టుకనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు మాస్టర్ ప్లాన్‌లో మళ్లీ మార్పులు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునేందుకు వీలుగా ఐటీఐఆర్‌కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఆ మేరకు కసరత్తు మొదలైంది. నగర పరిధిలో ఇప్పటికే ఉన్న ఏడు మాస్టర్ ప్లాన్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ హెచ్ఎండీఏ రూపొందించిన బృహత్ ప్రణాళికను ఏడాది క్రితం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా మరోమారు మార్పులకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి హెచ్ఎండీఏ యాక్టు ప్రకారం... మహా నగరంలో మరో అథార్టీ ఉండకూడదు. ఇప్పటికే హెచ్ఎండీఏ రూపొందించి అమలు చేస్తున్న విస్తరిత ప్రాంత మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్‌కు ప్రత్యేకంగా భూముల కేటాయింపు జరగలేదు. అదే ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారింది. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ‘మహా’ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని యోచిస్తోన్న ప్రభుత్వానికి మాస్టర్‌ప్లాన్ సవరణ ఇప్పుడు ఓ సవాల్‌గా మారింది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202 చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో మాస్టర్ ప్లాన్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. ఫంక్షనల్ యూనిట్.. ఐటీఐఆర్ కు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలంటే సాంకేతికంగా ఇబ్బందులతో కూడుకున్న అంశం. అయితే ఇది జరగాలంటే ప్రత్యేకంగా ఓ ఫంక్షనల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి దానికింద ఐటీఐఆర్‌ను పెట్టవచ్చని హెచ్ ఎండీఏ అధికారుల పరిశీలనలో తేలింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంచాలని నిర్ణయించారు. ఈ కమిటీకి హెచ్ఎండీఏ కమిషనర్ చైర్మన్‌గా, ఐటీ సెక్రటరీ కన్వీనర్‌గా, ఫైనాన్స్, ఎంఏ అండ్ యూడీ, టీఎస్ఐఐసీ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, పీసీబీ, జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల ఉన్నతాధికారులను సభ్యులుగా ప్రతిపాదిస్తూ హెచ్ఎండీఏ ఇటీవల ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ కమిటీ రంగంలోకి దిగి ఐటీఐఆర్ కింద ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తాయి ? వాటి సరిహద్దులు, సర్వే నంబర్లు వంటివాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఆమేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగాలంటే ఫంక్షనల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని అధికారులు పేర్కొంటున్నారు. మార్పులు అనివార్యం.. హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఐటీఐఆర్ కోసం ప్రత్యేకంగా భూ వినియోగాన్ని ప్రతిపాదించక పోవడం వల్లే ఇప్పుడు మార్పులు, సవరణలు అనివార్యమయ్యాయి. నివాస, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, మల్టీపుల్ జోన్లలో ఐటీఐఆర్‌కు అనుమతి ఉంది. నిజానికి ఇవి కాలుష్యరహితమైన సంస్థలు కాబట్టి అన్నింట్లో అనుమతిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అయితే... ఐటీఐఆర్‌కు అనుగుణంగా భూ వినియోగం ఉండాలి గనుక ప్రభుత్వ అనుమతితో ప్రణాళికలో మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అవసరమైన మార్పులు చేయడం పెద్ద సమస్యేమీ కాదని, ప్రభుత్వ నుంచి అనుమతి వస్తే వెంటనే పని ప్రారంభించి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేందుకు పక్కా గా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. -
జిల్లాలో రూ.300 కోట్ల పనులకు బ్రేక్
చిత్తూరు(టౌన్): రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో జిల్లాలో మం జూరైన రూ. 300 కోట్ల పనులకు బ్రేక్ వేసింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బి, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపట్టిన రూ.200 కోట్ల పనులతో పాటు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పీలేరులో ఆయన మంజూరు చేసిన పనుల్లో రూ. 100 కోట్ల పనులను నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మంజూరైన పనుల్లో ఇప్పటివరకు అగ్రిమెంట్ కాని పనులను పూర్తిగా నిలిపేయూలని, అగ్రిమెంట్ అయివున్నా చేపట్టని పనులను గుర్తించి నాట్ స్టార్టెడ్ పేరుతో వెంటనే ఆపేయూలని పంచాయతీరాజ్ ప్రిన్సిపుల్ సెక్రెటరీ జవహర్‌రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. పంచాయతీరాజ్‌లోనే రూ.100 కోట్లకు పైగా ఆగిన పనులు పంచాయతీరాజ్ పరిధిలోనే సుమా రు వంద కోట్లకు పైగా పనులు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్‌లో ప్రాజెక్టులు (పీఆర్‌యూ), లోకల్ బాడీస్ (పీఆర్ఐ) అని రెండు విభాగాలున్నాయి. పీఆర్యూలో వివిధ పథకాల కింద సుమారు 120కోట్లకు పైగా పనులు మంజూరయ్యాయి. పీఆర్‌ఐలో వంద కోట్ల రూపాయలకు పైగా పనులు గత ఏడాది మంజూరయ్యాయి. వీటిలో కొన్ని ఇంతవరకు అగ్రిమెంట్ దశకు చేరుకోలేదు. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తయ్యాయి. అయితే పీఆర్యూలో రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు పనులు నిలిచిపోగా పీఆర్‌ఐలో రూ. 45 నుంచి రూ. 50 కోట్ల వరకు మంజూరైన పనులు ఆగిపోయాయి. ఆర్‌అండ్‌బీకి అనఫిషియల్ హాలిడే జిల్లాలోని ఆర్అండ్బీ రోడ్లకు మెయింటెనెన్స్ కింద కోట్లాది రూపాయల పనులు మంజూరు చేశారు. అంతేకాకుండా రూ.150 కోట్లతో కొత్తగా కొన్ని తారురోడ్లను మంజూరు చేశారు. వీటిలో కొన్ని అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తైపనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోంది. ఏ పనులు చేయొద్దనడంతో ఈ శాఖకు ప్రభుత్వం అనధికారికంగా హాలిడేను ప్రకటించినట్టయింది. పీలేరులో రూ.100 కోట్ల పనులు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహించిన పీలేరుపై ప్రతేక శ్రద్ధ కనబరిచి ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద ఆరేడు నెలల క్రితం వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో వివిధ భవనాలు, కల్వర్టులు, రోడ్డు పనులను మంజూరు చేశారు. అయితే దీనిపై ఈ నెల 16న కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ జిల్లాలో ఎస్డీఎఫ్ కింద చేపట్టిన పనులను నిలుపుదల చేయాలంటూ కోరారు. పీలేరులో తప్ప మరెక్కడా ఈ నిధులతో పనులు మంజూరు కాలేదు. -
తాగునీటి సరఫరాకు ప్రత్యేక శాఖ
రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాలు 15న 350 కేంద్రాల ప్రారంభం గ్రామీణ మహిళలకు వాషింగ్ మెషిన్లు, హెయిర్ డ్రయర్లు 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా కర్ణాటక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కోసం ప్రత్యేక శాఖను ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు వెల్లడించారు. తన శాఖ పద్దులపై మూడు రోజుల పాటు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిస్తూ ఆగస్టు 15 లేదా అక్టోబరు 2న కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక జల మండలిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలనే నిర్ణయనికి వచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 5,223 జన నివాస ప్రదేశాల్లో ఒక బకెట్ కంటే తక్కువగా తాగు నీటిని అందిస్తున్నామనే కఠోర సత్యాన్ని ఆయన సభకు తెలిపారు. ఈ సమస్యను సవాలుగా స్వీకరించి అందరికీ సరిపడా తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీటిని సేవించడం వల్ల నిముషానికి ముగ్గురు పిల్లలు చనిపోతున్నారని, 60 శాతం మంది వివిధ రోగాల బారిన పడుతున్నారని వివరించారు. దీనిని నివారించడానికి రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని , ఈ నెల 15న 350 కేంద్రాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. ప్రధాని, శ్రీమంతులు తాగే నీటిని తమకూ సరఫరా చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెబుతూ, వారి కోరిక సహేతుకమేనని అంగీకరించారు. గ్రామాల్లో వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు గ్రామాల్లో మహిళలకు ఇకమీదట వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లను సరఫరా చేస్తామని, వృద్ధులకు పాశ్చాత్య శైలిలో మరుగు దొడ్లను సమకూరుస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది వెయ్యి కాంప్లెక్స్‌లను నిర్మించి, అందులో పాశ్చాత్య మరుగు దొడ్లు, స్నానాల గదులు, బట్టలు ఉతికే గదులు, అధునాతన వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రతి శాసన సభ నియోజక వర్గానికి రెండు నుంచి మూడు చొప్పున కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. 27 వేల మంది నియామకానికి అనుమతి గ్రామ పంచాయతీల స్వావలంబనకు 27 వేల మంది సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ఆగస్టు ఒకటో తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించామని ఆదేశించామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ద్వారా 5,629 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆగస్టు ఆఖరు లోగా ఈ నియామకాలు కూడా పూర్తవుతాయన్నారు. ఈ నియామకాలతో గ్రామ పంచాయతీల్లో 32 వేల మందికి పైగా సిబ్బంది అందుబాటులోకి వస్తారని, మరో మూడు, నాలుగు వేల మందిని కూడా దశలవారీ నియమిస్తామని వివరించారు. 2015 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. -
ఫిరాయిస్తే అనర్హత వేటే
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్న అధికారపక్షం అనర్హత వేటుతో పాటు ప్రతిష్టకోల్పోతామని భయపడుతున్న నేతలు విశాఖ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీనుంచి ఎన్నికై... వేరే పార్టీవైపు చూస్తున్నారా...? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికైన పార్టీ ఆదేశాలను, విప్‌లను ధిక్కరించే వారిపై తక్షణమే అనర్హత వేటు పడుతుంది. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 2003లో పంచాయతీరాజ్ చట్టంలో చేసిన సవరణల వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎన్నికైన పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే ఆ మరుక్షణమే వారిపై అనర్హత వేటు ఖాయమని చట్టాలు చెబుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలు పెట్టే చర్యలు తెరవెనుక సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం, ఫిరాయింపు నిరోధక చట్టాలను నిపుణులు ఉటంకిస్తున్నారు. పార్టీ మారే వారికి చట్టంలోని పగడ్బందీ నిబంధనలు షాక్ కొట్టించకమానవని స్పష్టంచేస్తున్నారు. అనర్హత వేటు వల్ల అప్రతిష్టపాలవ్వడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతో అక్కడితోనే రాజకీయ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదమూ తప్పదంటున్నారు. గతంలో ఇలా పార్టీలు మారిన వారు రాజకీయంగా తెరమరుగైన సందర్భాలు అనేకమున్నాయని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికసంస్థల్లో పార్టీల సిద్ధాంతాలను అనుసరించి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకున్న వారే ఆ తరువాత కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లగలిగారు. స్వల్ప కాలిక ప్రయోజనాలకోసం పార్టీలు మారితే ఆ తరువాత దీర్ఘకాలంగా రాజకీయంగా చాలా నష్టపోకతప్పదు. ఇలాంటి తరుణంలో జెడ్పీ స్థానాలను కైవసం చే సుకోవడానికి అధికార పార్టీనేతలు స్థానిక సంస్థల ప్రతినిధులను అనేకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నా నేతలు మాత్రం పునరాలోచనలో పడుతున్నారు. ప్రజల తీర్పును, పార్టీ నిర్ణయాన్ని భవిష్యత్తును పణంగా పెట్టడం పలువురు నేతలకు రుచించడం లేదు. పార్టీని ధిక్కరిస్తే వెంటనే వేటు పడడం, ఆపై ప్రజలు నిరాదరించడం ఇవన్నీ ఎందుకు? బంగారు భవిష్యత్తును వదులుకోవడమెందుకు? అన్న ఆలోచనలో పడుతున్నారు. అయినా కొన్ని చోట్ల కొంతమంది ఆమాయకులను ఆసరా చేసుకొని అధికారపక్షం వారు చట్టాన్ని వక్రీకరిస్తున్నారు. వారెన్ని చెప్పినా చట్టం పగడ్బందీగా ఉన్నందున అనర్హత వేటు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఆ పార్టీ జారీ చేసే విప్‌కు అనుకూలంగా ఓటు వేయాలే తప్ప, ధిక్కరిస్తే అనర్హత వేటుకు గురవుతారని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రత్యేకంగా నోటఫికేషన్ కూడా జారీ చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఏముందంటే... రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 1985 కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అటు తరువాత 2003లో అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ చట్టానికి కొన్ని సవరణలు జరిగాయి. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యుడు ఎవరైనా కూడా తన పార్టీ స్వభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతనికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి, ఆ పార్టీకి రాజీనామా సమర్పించడానికి తేడా ఉందని, ఈ రెండూ పదాలు కూడా సమనార్ధాకాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేయనప్పటికీ, స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవచ్చునని తెలిపింది. అదే విధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు అందులో పాల్గొని ఓటు వేయడం, లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం చేసినప్పుడు కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఒకవేళ సదరు రాజకీయ పార్టీ తమ సభ్యుడి ధిక్కారాన్ని 15 రోజుల్లోపు ఖండించని పక్షంలో అతనికి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంతేకాక ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే ఓ సభ్యుడు గెలిచారో, ఆ వ్యక్తి ప్రతిపక్ష నేతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను రాతపూర్వకంగా కోరే ఆ వ్యక్తి తన పార్టీ సభ్వత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2003లో తీసుకువచ్చిన చట్ట సవరణ ప్రకారం పార్టీలోని మూడింట రెండు వంతుల మంది సభ్యులు వేరే పార్టీకి వెళ్లిన సందర్భాన్ని ఫిరాయింపుగా పరిగణించడానికి వీల్లేదు. చట్ట సభలకు ఎన్నికైన వెంటనే ఎవరైనా స్వతంత్ర అభ్యర్థి ఇతర రాజకీయ పార్టీలో చేరితే అతనికీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. -
తెరపైకి మళ్లీ భూ భారతి
త్వరలోనే హైదరాబాద్‌లో సమగ్ర భూముల సర్వే సింగిల్ విండో సిస్టం కోసం ప్రత్యేక పాలసీ ఇండియా ప్రాపర్టీ. కామ్ స్థిరాస్తి ప్రదర్శనలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం రాష్ట్రంలో భూ భారతి కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలు, సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూముల్లో కొన్నింట్లో టైటిల్స్ క్లియర్‌గా లేకపోవడం, శిఖం భూముల కావటంతో అనేక రకాల పొరపాట్లు జరిగాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడటమే కాకుండా భూములు దుర్వినియోగమవుతున్నాయన్నారు. అందుకే త్వరలోనే హైదరాబాద్‌లోని అన్ని భూములపై శాటిలైట్ ద్వారా సమగ్ర సర్వే జరిపిస్తామని చెప్పారు. దీంతో ఎంత మేర ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో తెలుస్తాయని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఇండియా ప్రాపర్టీ. కామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి స్థిరాస్తి ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 కల్లా హైదరాబాద్ జనాభా 3 కోట్లకు పైగా చేరుకుంటుందని, అప్పటి మౌలిక వసతులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర నగరాభివృద్ధిని రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు, అకాడమీలతో చర్చించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు, ఐటీ, ఫార్మా, బయో, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, స్పోర్ట్స్ సిటీ, ఆటమైదానాలు, ఎడ్యుకేషన్ హబ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌ను అనుసంధానం చేస్తూ షాద్‌నగర్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, చెవెళ్ల ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తామన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతం వాటా స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్, పలువురు బిల్డర్లు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అలక్ష్యం వద్దు
అధికారులతో సమీక్షలో మంత్రి అయ్యనపాత్రుడు విశాఖపట్నం : ఏజెన్సీలో మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయితీరాజ్ , గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా అధికారులు, ఏజెన్సీ వైద్యాధికారులుతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల నుంచి అంటువ్యాధులు ప్రబలే వాతావరణం ప్రారంభం కానున్నందున అధికారులు ముందుగానే రంగంలోకి దిగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ఏజెన్సీలో వైద్యులు కొరత, సిబ్బంది కొరత ఉన్నందున ఈ సీజన్ పూర్తయ్యే వరకూ మైదాన ప్రాంతాల్లో ఉన్న వైద్యులను వీలైనంత వరకూ ఏజెన్సీకి డెప్యుటేషన్ మీద పంపాలన్నారు. పాడేరు ఏజెన్సీలో బోర్లు, వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పని చేస్తున్నాయి. అనే సమాచారాన్ని 24 గంటల్లో తనకు అందచేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) శాంతానాథ్ను మంత్రి అయ్యన్న ఆదేశించారు. బోర్ల మరమ్మతులకు ప్రత్యేక టీంలను నియమించాలని సూచించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ ఏజెన్సీలో వైద్యుల కొరత సమస్యను సత్వరం పరిష్కరించాలని మంత్రి నికోరారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కొయ్యూరు మండలం యు.చీడిపాలెంలో ఏర్పాటు చేసిన పిహెచ్సీ ప్రజలకు అందుబాటులో లేనందున దాన్ని పలకజీడికి తరలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మలేరియా, సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏజెన్సీలో వైద్యసేవల గురించి పాడేరు ఐటీడీఏ పీఓ వినయ్ చంద్ మంత్రికి వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ నర్శింహారావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని డాక్టర్ ఆర్.శ్యామల, వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ సోమయాజులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్దికి నిధులు కావాలి రాష్ట్రాభివృద్ధికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖమంత్రి సిహెచ్.అయ్యన్న పాత్రుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ అతిథిగృహంలో భూగర్భజల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి చట్టపరిధిలోకి లోబడి అనుమతులు మంజూరు చేయాలన్నారు. తద్వారా రాష్ట్రాభివృద్దికి నిధులు సమకూరుతాయన్నారు. చెరువుల్లో మట్టి తవ్వకాలను ఆపొద్దని చెరువుల్లో మట్టిని తీయడం వల్ల నీటి నిల్వల సామర్ద్యం పెరుగుతుందన్నారు. గత ఐదేళ్ల సీనరీ మొత్తం వివరాలు నివేదిక రూపంలో అందిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, భూగర్భ గనుల శాఖ ఉపసంచాలకులు వై.భగవత్‌రెడ్డి, సహాయ సంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు, జి.శివాజి, ఎస్.వి.రమణారావు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు
తీవ్రంగా వ్యతిరేకించిన బంధువులు ఎంతో ఖర్చు చేశామంటూ నిరసన గంపలగూడెం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నింధనలకు విరుద్ధంగా జరుగుతున్న అయిదు బాల్య వివాహాలను శనివారం అధికారులు అడ్డుకున్నారు. గంపలగూడెం మండలంలోని అమ్మిరెడ్డిగూడెం పంచాయతీలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారి మూడు బ్యా వివాహాలను నిలిపివేశారు. చిన్నకొమెర, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల్లోని ముగ్గురు బాలికలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. ఇంకొద్ది సమయంలో వివాహాలు జరుగుతాయనగా... సమాచారమందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఐకేపీ అధికారులు గ్రామానికి చేరుకొని ముగ్గురు బాలికల తల్లి ్లదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అమ్మిరెడ్డిగూడెంకు చెందిన బత్తుల కోటయ్య, కుమారి కుమారుడు సుబ్బారావుకు అదే గ్రామానికి చెందిన బాలిక(13)కు, గంపలగూడెంకు చెందిన తమ్మిశెట్టి వెంకటస్వామి, సీతమ్మ కుమారుడు నాగరాజుకు చిన్నకొమిరకు చెందిన బాలిక(12)కు, మైలవరం మండలం వెల్వడంకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు కుమారుడు వీరరాఘవులను చిన్నకొమిరకు చెందిన బాలిక(14)కు ఇచ్చి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ముగ్గురు పెండ్లి కుమారులను, కుమార్తెలను అంగన్వాడీ కేంద్రానికి తీసుకొచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని తాళికట్టే సమయానికి అధికారులు వివాహాలను నిలిపివేయటంతో కుటుంబీకులు, బంధువులు, పలువురు గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాము ఎన్నో రోజుల క్రితం సంబంధాలు కుదుర్చుకుని, ఎంతో ఖర్చుచేసి ఏర్పాట్లు చేసుకొంటుంటే ఏమీ మాట్లాడని అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఇప్పడు ముహూర్త సమయానికి వచ్చి నిబంధనల పేరిట అడ్డుకోవడం సహించబోమని ఎదురుతిరిగారు. అయితే ఆడపిల్లకు 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండనిదే వివాహం జరిపితే చట్ట ప్రకారం నేరమని అధికారులు వారికి వివరించారు. దీనికి విరుద్ధంగా వ్యవ హరిస్తే అరెస్టు చేయాల్సి వస్తుందనిదిన హెచ్చరించారు. దీంతో సంబంధిత కుటుంబాలకు చెందిన వారు వివాహాలు జరపబోమని అధికారులకు హామీ ఇచ్చారు. మేజర్లు అయ్యే వరకు వివాహం జరిపించమని లిఖితపూర్వకంగా హామీ పత్రం రాయించుకుని వారిని వదిలివేశారు. సీడీపీవో అంకమాంబ, తహశీల్దార్ రామచందర్, ఎంపీడీవో వీ లలితకుమారి, తాత్కాలిక విధ్యాశాఖాధికారి వీ శేషిరెడ్డి, ఐకేపీ ఏపీఎం జమలయ్య, జండర్ ప్రతినిధి వెదురు లింగమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు నాగమణి, తారాభీ,ఝాన్సీ, ఆర్ఐ నాగమల్లేశ్వరరావు, వీఆర్వో రత్నబాబు, సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో.. జగ్గయ్యపేట అర్బన్: నందిగామకు చెందిన ఓ బాలిక వివాహం పేట పట్టణంలో బంధువుల ఇంట్లో జరుగుతుండగా స్థానిక ఐసీడీయస్ అధికారులు అడ్డుకున్నారు. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన బాలికకు నందిగామ పట్టణానికి చెందిన ఆవుల నరసింహారావుతో వివాహం నిశ్చయమైంది. కాగా 6వవార్డు ఆర్టీసీ కాలనీలో ఆమె బంధువుల ఇంట్లో వివాహం జరుగుతుండగా అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని పోలీసుల సహాయంతో పెండ్లిని నిలుపుదల చేశారు. నందిగామ అంగన్వాడీ సూపర్వైజర్లు శ్రీదేవి, భారతి, పేట సూపర్వైజర్ వెంకట్రావమ్మ మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, పెండ్లి కుమార్తె మైనరని, ఆమె ప్రస్తుతం చింతలపాడు జెడ్పీ హైస్కూల్లో 9వతరగతి చదువుతుందన్నారు. ఈ విషయమై ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేత, వార్డు కౌన్సిలర్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) వార్డు పెద్దలు అధికారులతో చర్చించి వివాహాన్ని ఆపేందుకు ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. 6వవార్డు అంగన్వాడీ కార్యకర్తలు కృష్ణవేణి, ఎస్ పద్మ, ఆర్ మేరి తదితరులు పాల్గొన్నారు. వేదాద్రి తండాలో... వేదాద్రి(జగ్గయ్యపేట) : వేదాద్రిలోని తండాలో శనివారం తలపెట్టిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక(16)కు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం చేసేం దుకు రెండు కుటుంబాల వారు నిశ్చయిం చారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పెళ్లి జరగాల్సి ఉంది. బాల్య వివాహం జరుగుతోందంటూ చిల్లకల్లు ఐసీడీఎస్ ప్రా జెక్టు అధికారిణి ఉమాదేవికి సమాచారం అందింది. వివాహం నిలిపివేయవల సిం దిగా సూపర్వైజర్ రాజేశ్వరి, ఆ గ్రామ అంగన్వాడీ కార్యకర్తలను ఆమె ఆదేశిం చా రు. ఈ మేరకు వారు హుటాహుటిన తం డాకు వెళ్లారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. కాగా ఐసీడీఎస్ సిబ్బంది వెళ్లే సమయానికి భోజనాలు, కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు
మంత్రి హెచ్.కే పాటిల్ సాక్షి, బెంగళూరు : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం చేయడంతో పాటు పనుల్లోపారదర్శకత పెంచేలా పంచాయతీ రాజ్ చట్టానికి త్వరలో మార్పులు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తెలిపారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన చట్టం వల్ల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సభ్యులోనూ జవాబుదారీ తనం పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను వచ్చే అక్టోబర్‌లో జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన పరిశోధనల కోసం దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పబోతున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చైతన్య పథకం కింద ప్రతి గ్రామీణ పంచాయతీ పరిధిలో 40 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి వారి అర్థలకు గ్గ రంగంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటి వితరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. -
అబ్బో.. ఏం ప్రాధాన్యం!
శ్రీకాకుళం: మంత్రి పదవి విషయంలో పంతం నెగ్గించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు శాఖల కేటాయింపులో మాత్రం షాక్ తిన్నారు. ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టడంతో జిల్లాలోని ఆ వర్గంలో నిస్పృహ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ‘కళా’ వర్గం ఒత్తిళ్లు ఏమైనా పనిచేశాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయడు మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆయనకు పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బుధవారం జరిగిన శాఖల కేటాయింపులో అచ్చెన్నకు కార్మిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఇచ్చారు. ఫలితంగా మంత్రి పదవి దక్కిందన్న ఆనందాన్ని ప్రాధాన్యత లేని శాఖ కేటాయింపు మింగేసింది. ఇది చాలదన్నట్లు జిల్లాలో తమకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న కళావెంకట్రావు మరదలైన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడాన్ని కింజరాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జిల్లా నుంచి మంత్రి పదవి కోసం అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరిస్థాయిలో వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకున్నారు. మొదట్లో కళాకు మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చినా ప్రమాణం స్వీకారం నాటికి అచ్చెన్నాయుడు దాన్ని ఎగరేసుకుపోవడంతో కళా వర్గం చిన్నబోయింది. కింజరాపు వర్గానిదే పైచేయి అవుతోందని ఆందోళన చెందిన కళా వర్గం చంద్రబాబుపై తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని కింజరాపు వర్గంతోపాటు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా టీడీపీలో వర్గపోరును మళ్లీ తీవ్రతరం అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దివంగత వైఎస్ హయాంలో శ్రీకాాకుళం జిల్లా మంత్రలకు రెవెన్యూ, అటవీ, రవాణా వంటి కీలక శాఖలతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఆనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్యం, రోడ్లు, భవనాల శాఖలను కేటాయించడం ద్వారా జిల్లాను గౌరవించగా.. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడం కంటే ప్రాతినిధ్యం లేకుండా చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఏమి సేతురా లింగా...!!
ఉద్యోగులకు వరుస కష్టాలు ఇటు పరీక్షలు...అటు ఎన్నికలు కంటిమీద కునుకు కరువు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికలు ప్రభుత్వోద్యోగులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్, ప్రాదేశిక, సాధారణ ఎన్నికలు పోటెత్తి మోయలేని పనిభారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్యాలయాల ఉద్యోగులతో సహా పోలీస్, ఎక్సైజ్ శాఖ పాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు సొంత పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. సరదాల మాటెలా ఉన్నా.. శుభకార్యాలను కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవోలు మొదలుకొని కలెక్టరేట్, జెడ్పీ, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే ప్రతీ అధికారి, ఉద్యోగీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. నిముషం కూడా తీరికలేకుండా ఒకదాని తరువాత మరొకటిగా ఎన్నికలు రావడంతో వీరికి క్షణం తీరిక దొరకడం లేదు. రెవెన్యూపై ఒత్తిడి సాధారణ ఎన్నికలు వచ్చాయంటే రెవెన్యూ యంత్రాంగానికి నిమిషం కూడా తీరిక ఉండదు. కలెక్టర్ మొదలుకొని ఆర్డీవో, తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వో, వీఆర్ఏ దాకా అందరికీ ఎన్నికల విధులే. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, కోడ్ ఉల్లంఘన, ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఇలా ప్రతి అంశాన్ని వీరు నిశితంగా పరిశీలించాలి. అటువంటిది ఇప్పుడు మాత్రం సాధారణ ఎన్నికల కంటే ముందుగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా రెవెన్యూపైనే పడింది. ఇలా రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. ఫలితంగా సాధారణ పరిపాలన పై దృష్టి సారించలేని దుస్థితి నెలకొంది. ‘పోలీసు’ కష్టాలు ఇక అందరికన్నా ఎక్కువ కష్టపడేది పోలీసులే. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు నుంచి బందోబస్తు ఏర్పాటు వరకు వీరి పాత్ర కీలకం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీరు పడే కష్టం వర్ణనాతీతం. ఇప్పుడు వరుసగా వచ్చిన ఎన్నికలతో పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది మాదిరిగా కాకుండా ఈ మూడు ఎన్నికల్లోను వీరు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఒక్కో చోట తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్, తొలి దశ ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేశారు. రెండో దశ జడ్పీ, ఎంపీటీసీతో పాటు సాధారణ ఎన్నికలకు సైతం వీరే విధులు నిర్వర్తించాల్సి ఉంది. వీరితో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. -
అప్పుడే.. జఠిలం
గ్రామాల్లో మొదలైన తాగునీటి గోస నల్లగొండ, న్యూస్‌లైన్,ఎన్నికల బిజీలో నేతలు..అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు పల్లెల్లో తాగునీటి గోస మొదలైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కనిపిం చడంలేదు. బోరు బావుల్లో జలాలు అడుగంటిపోయాయి. మంచినీటి పథకాల ద్వారా రోజు విడిచి రోజు నీళ్లు వదలుతున్నారు. ఎండలు మరింత ముదిరితే మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారనుంది. నీటిఎద్దడిని ఎదుర్కొనేందుకు అధికారులు వేసవి ప్రణాళికను సిద్ధం చేసినా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో వారు మిన్నకుండిపోయారు. వేసవిలో మండుతున్న ఎండలతో పల్లె ప్రజల గొంతెండుతోంది. తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొదటి పేజీ తరువాయి 532 గ్రామాల్లో మంచి నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. దాదాపు వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎండలు మరింత ముదిరితే ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. నీటిని ఎద్దడి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారిం చాల్సిన అధికారులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారు. జిల్లా తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు ఎన్నికల విధుల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా 37 మండలాల పరిధిలోని 532 గ్రామాల్లో నీటిఎద్దడి అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వంద గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. మరో 457 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అడుగడుగునా సమస్యలే... ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో జిల్లాలో 19,384 బోరు బావులు ఉన్నాయి. వీటిలో 952 బోర్లు పనిచేయడం లేదు. మరో 136 బోరు బావుల్లో నీరు అట్టడుగుస్థాయిలోకి వెళ్లిపోయింది. 244 బోర్లను క్రషింగ్ చేయాల్సి ఉంది. అంటే నీరు అందుబాటులో ఉన్నా వివిధ రకాల సమస్యలతో బోర్లలోకి రాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక మంచినీటి పథకాల విషయానికొస్తే జిల్లాలో 15 మంచినీటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రోజు విడిచి రోజు 1151 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన మాదారం మంచినీటి పథకం ఎందుకు పనికిరాకుండా పోయింది. మోతె మండలంలో నిర్మించిన మంచినీటి పథకానికి నాణ్యత గల పైపులు వేయకపోవడంతో అన్ని గ్రామాలకు నీరు చేరడం లేదు. దీంతో పాటు విద్యుత్ సమస్య మంచినీటి పథకాలకు గుదిబండలా తయారైంది. గ్రామాల్లో గోస... పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి ఇలాకా అయిన అనుమల మండలంలో 32 హ్యాబిటేషన్లలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జిల్లాలో అత్యధికంగా సంస్థాన్నారాయణ్పూర్ మం డలంలో 73 హ్యాబిటేషన్లలో మంచి నీటి ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత వరుసగా చౌటుప్పుల్ మండల పరిధిలో 24, చందంపేట-14, ఆత్మకూరు (ఎస్ )-30, మోతె-20, చివ్వెంల-37, సూర్యాపేట-23, దామరచర్ల-27, వేములపల్లి-20, మునగా ల-20, పెన్‌పహాడ్-30 గ్రామాల్లో నీటి ఎద్దడి జఠిలంగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు రూ.2.85 కోట్లు... నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నివారణ కోసం ప్రభుత్వానికి జిల్లా యం త్రాంగం రూ.2.85 కోట్లు నిధులు మం జూరు చేయాలని ప్రతిపాదనలు పం పింది. ఈ నిధులతో వేసవి నీటిఎద్దడి తీవ్రతరం కానున్న 532 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, అద్దెబోర్లు, బోరు బావుల మరమ్మతుల కోసమని ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నయా పైసా విడుదల కాలేదు. అధికారుల వద్ద చిల్లగవ్వ లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే తప్ప ముందస్తు చర్యల్లో భాగంగా ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్లను సిద్ధం చేసుకునే వీలుంటుంది. కానీ నిధులు లేకపోవడంతో ఇప్పటి వరకు ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాని పరిస్థితి ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కరెంటుకు ఓకే..
పంచాయతీలు పరేషాన్ జిల్లాలో 700 పంచాయతీలకు అందిన ఆదేశాలు నాడు బిల్లులు కట్టొద్దని జీవో.. నేడు చెల్లించాలని ఉత్తర్వులు సాక్షి, మచిలీపట్నం/ ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ యంత్రాంగం తీరుతో పంచాయతీలు పరేషాన్ అవుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించక్కర్లేదని గతంలో జీవో ఇస్తే.. ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిందేనంటూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో వినియోగించే కరెంటుకు బిల్లులు కట్టక్కర్లేదని గతంలో వెసులుబాటు ఇవ్వటంతో ఆ డబ్బుతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని పంచాయతీ పాలకవర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. బిల్లుల బకాయిలపై పంచాయతీలు, ట్రాన్స్‌కో అధికారులకు సైతం పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీలకు విద్యుత్ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. జిల్లాలో రూ.45 కోట్ల బకాయిలు... జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు సుమారు రూ.45 కోట్ల మేర కరెంటు బిల్లులు ట్రాన్స్‌కోకు బకాయిలు పడ్డాయి. వాటిలో 150 మేజర్ పంచాయతీలు రూ.12.26 కోట్లు బకాయిలు కాగా, 820 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.32.43 కోట్ల బిల్లు మొత్తాలను చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలను ట్రాన్స్‌కోకు చెల్లించనక్కర్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం 2009 జనవరి 17న జీవో నంబరు 80ని జారీ చేసింది. దీంతో పంచాయతీల పాలకవర్గాలు కరెంటు బిల్లులు కట్టక్కర్లేకుండా ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భావించాయి. తాజాగా రెండు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కరెంటు బిల్లులు చెల్లించాలంటూ జిల్లా పంచాయతీ అధికారు(డీపీవో)లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పంచాయతీల సాధారణ నిధులు, 13వ ఆర్థిక సంఘం నిధులు, సర్‌చార్జ్, స్టాంపు డ్యూటీ నిధుల నుంచి విద్యుత్ బకాయిలను చెల్లించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించేలా పంచాయతీ నిధుల నుంచి తీసుకుని వెసులుబాటు కల్పించడంతో పంచాయతీల పాలకవర్గాలు ఆ దిశగా దృష్టి సారించాయి. దీంతో కరెంటు బిల్లుల వసూళ్లపై గ్రామ పంచాయతీలపై ట్రాన్స్‌కో ఒత్తిడి మొదలైంది. అన్ని పంచాయతీలకు సమాచారం : డీపీవో ఆనంద్ జిల్లాలోని అన్ని పంచాయతీలకు పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అందించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) కె.ఆనంద్ ‘సాక్షి’కి వివరించారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీల్లో ఏ పంచాయతీ ఎంత కరెంటు బిల్లు బకాయి ఉంది, వాటిని ఏ నిధుల నుంచి చెల్లించవచ్చు అనే పూర్తి సమాచారంతో ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి ఆయా నిధుల నుంచి పంచాయతీలు కరెంటు బకాయిలు తక్షణం చెల్లించాలని ఆయన సూచించారు. -
విభజన ఇబ్బంది
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను నిట్ట నిలువునా చీల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతిని నిరసిస్తూ బుధవారం చేపట్టిన సీమాంధ్ర బంద్‌ను పురస్కరించుకుని నగరం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు నిలిచిపోయాయి. బంద్ గురించి ముందే తెలిసినందున ప్రయాణికులు కూడా పెద్దగా బస్టాండ్లకు రాలేదు. వారాంతం కాకపోవడం వల్ల రద్దీ కనిపించలేదు. తిరుపతి, కడప మార్గాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి, హైదరాబాద్ వైపు రాత్రి ఏడు గంటల నుంచి అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రారెడ్డి తెలిపారు. -
నేటి నుంచి సమ్మె బాట
సమ్మెలోకి 20 వేల మంది ఉద్యోగులు అవసరమైతే మెరుపు సమ్మె : విద్యుత్ ఉద్యోగులు సాక్షి, విజయవాడ : మరోసారి సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సన్నద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవో సంఘం నేతలు కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులకు సమ్మె ఆవశ్యకతను వివరించారు. బుధవారం నుంచి రెవెన్యూ, నీటిపారుదల, రవాణా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయశాఖతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోనున్నాయి. రబీ పంట నడుస్తున్నందున నీటి పారుదల శాఖలో అధికారులు, రెగ్యులేటర్లను పర్యవేక్షించే కొంతమంది మాత్రమే విధుల్లో ఉండనున్నారు. రెవెన్యూ సిబ్బంది ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. ట్రెజరీ, వాణిజ్యపన్నులశాఖలో కొంతమంది ఉద్యోగులు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నారు. మెరుపు సమ్మెకు దిగేందుకు వెనుకాడేది లేదని విద్యుత్ జేఏసీ ప్రకటించింది. సమ్మెకు దూరంగా ఉంటూ ఆందోళనలకు సహకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెపై నిర్ణయం తీసుకోలేదు. గురు, శుక్రవారాల్లో విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. పీఆర్టీయూ సంఘీబావం సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తాము సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నట్లు సమైక్య పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నారాయణరావు తెలిపారు. పటమటలోని సమైక్య పి.ఆర్.టి.యు కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ పాఠశాల పనిగంటల తరువాత ఏపీఎన్జీవోలతో, సమైక్యాంధ్ర సాధన ఉద్యమ పార్టీలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రెడ్డెమ్మ పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ దూరం విజయవాడ సిటీ : సమ్మెకు దూరంగా ఉండాలని వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు తీర్మానించారు. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అసోయేషన్ విజయవాడ 1, 2 డివిజన్ల కార్యవర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో 66 రోజుల సమ్మెకాలంలో నష్టపోయామని, ఈ పరిస్థితిలో సమ్మెలో పాల్గొనలేమని తీర్మానం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపారు. -
239 లే అవుట్లపై చర్యకు నివేదిక
భద్రాచలం, న్యూస్‌లైన్: జిల్లాలో అనుమతుల్లేని లే అవుట్లను కొనుగోలు చేయవద్దని జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారి టీ లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. గురువారం భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం పదివేలలోపు జనాభా ఉన్న అన్ని గ్రామాల్లో 20సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఖమ్మం పట్టణానికి ఆనుకుని ఉన్న పిండిప్రోలు, జీళ్లచెరువు, మంచుకొండ, దెందుకూరు, తనికెళ్ల, శివాయిగూడెం, మద్దులపల్లి గ్రామాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లుగా చెప్పారు. డీటీసీపీఓ అనుమతిలేని లే అవుట్లపై కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా స్థలంపై యజమాని హక్కు పత్రాలు, ఉన్న స్థలంలో 25 నుంచి 30 శాతం మేర రోడ్లకు కేటాయింపు, మరో పది శాతం గ్రీన్‌బెల్టు ఏర్పాటు నిమిత్తం పంచాయ తీ వారికి అప్పగించినట్లు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఇంటి స్థలం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో 239 లే అవుట్లకు యజమానులు తగిన నిబంధనలు పాటించలేదని వారిపై తగు చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. తగిన ధ్రువీకరణ లేని స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇవ్వడానికి వీల్లేదన్నా రు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు లేఖ నివేదిస్తామన్నారు. ప్రతీ పంచాయతీలో 9 రకాల రికార్డులను నిర్వహించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్న తరుణంలో కొనుగోలుదారులను అప్రమత్తం చేసేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎంపీడీఓ స్థాయిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి లోబడే లే అవుట్ ఏర్పాటు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేసే లే అవుట్లను కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ స్థలాలపై హక్కు సంక్రమించే పరిస్థితి ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు కొనుగోలు దారులకు ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాతే లే అవుట్లు వేయాలన్నారు. -
కొలువుల జాతర
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొలువుల జాతరకు తెర తీసింది. ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం తాజాగా పంచాయతీ కార్యదర్శుల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2677 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు. దీని ప్రకారం శ్రీకాకుళం జిల్లా లో మొత్తం 209 కార్యదర్శుల పోస్టులు భర్తీ కానున్నాయి. డిగ్రీ పూర్తిచేసి.. 01.07.2013 నాటికి 18-36 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఠీఠీఠీ. www. apspsc.gov.inవెబ్సైట్ ద్వారా జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతి అభ్యర్థి రూ.100 తప్పనిసరిగా చెల్లించాలి. పరీక్ష ఫీజు కింద మరో రూ.80 చలానా తీసి దరఖాస్తుతో సబమిట్ చేయాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందినవారు, తెల్ల రేషన్ కార్డు దారులు పరీక్ష ఫీజు (రూ.80) చెల్లించనక్కర్లేదు. ఫీజుల చలానాలను జనవరి 20లోగా తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ర్యాంకింగ్ జాబితాను మార్చి 24న విడుదల చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుతోపాటు అన్ని రకాల ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుంది. పాత నోటిఫికేషన్ రద్దేనా...! గ్రేడ్-4 కార్యదర్శుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇంతకుముందు జారీ చేసిన నోటిఫికేషన్ సంగతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే స్థాయి కార్యదర్శుల పోస్టులను డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం గత నెల 4 వరకు రూ. 50 ఫీజుతో అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ మేరకు జిల్లాలో ఉన్న 160 పోస్టులకు 9వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఇదే ప్రక్రియ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ జరిగింది. తాజా నోటిఫికేషన్‌తో ఆ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నోటిఫికేషన్ జారీతో పాతది రద్దయినట్లేనని పంచాయతీరాజ్ అధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ చెప్పారు. అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు కేటగిరీ పురుషులు మహిళలు మొత్తం ఓసీ 61 33 94 బీసీ(ఎ) 10 05 15 బీసీ(బి) 12 08 20 బీసీ(సి) 02 00 02 బీసీ(డి) 10 04 14 బీసీ(ఇ) 06 02 08 ఎస్సీ 19 13 32 ఎస్టీ 08 05 13 పీహెచ్ 04 03 07 ఎక్స్ సర్వీస్‌మెన్ 02 02 04 -------------------------- ------ మొత్తం 134 75 209 -
నడక యాతన!
=కాలిబాటలు, పొలంగట్లే రహదారులు =నిధులున్నా రోడ్లు వేయని పంచాయతీరాజ్ =చాలా చోట్ల గుంతలుపడి దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్లు =ప్యాచ్‌లే తప్ప శాశ్వత పనులు నిల్ =జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను శాసించే అధినాయకులు మన జిల్లాలోనే ఉన్నారు. ఒకరు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. ఇంకొకరు మూడేళ్లకుపైగా సీఎం పదవిని పట్టుకుని ఊగిసలాడుతున్నారు. వీరిలో ఒక్కరూ తమ సొంత జిల్లాలోని రోడ్ల దుస్థితిపైన దృష్టి పెట్టలేదు. గుంతలు పడి.. రాళ్లుతేలి.. నడవడానికి వీలులేని స్థితికి చేరినా కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. అక్కడక్కడా నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో అవి మురిగిపోతున్నాయి. గ్రామీణ రోడ్ల దుస్థితిపై శుక్రవారం సమరసాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రోడ్లు నరకానికి నకళ్లుగా మారా యి. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. కుప్పం నియోజకవర్గంలో 465 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కృష్ణగిరి-కుప్పం రోడ్డు గుంతలమయంగా మారింది. వంద వసంతాల ఉత్సవాలు నిర్వహించిన నిధులతోనే మరమ్మతులు చేస్తున్నా రు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదు. పంచాయతీరాజ్ రోడ్లు గుంతలు పడి, కంకరతేలిపోయాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 25 గ్రామాలకు పూర్తిగా రోడ్డు సౌకర్యం లేదు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీరోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. బి.కొత్తకోట జాతీయ రహదారి అమరనారాయణపురం క్రాస్ నుంచి తుమ్మనంగుంట వరకు గుంతలు పడి పోయింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలో 481 కిలోమీటర్ల ఆర్అండ్బీ రాష్ట్ర రహదారులు, 60 కి.మీ మేర పీఆర్ రోడ్లు ఉన్నాయి. వీటిల్లో మూలతిమ్మేపల్లె నుంచి తప్పిడిపల్లె వరకు, ధర్మపురి నుంచి వెంకటాపురం, గంగవరం కేసీపెంట నుంచి అప్పిశెట్టిపల్లె, గాంధీనగర్, పెద్దపంజాణి మండలంలోని లింగమనాయునిపల్లె, నాగిరెడ్డిపల్లె, గుండ్లం వారిపల్లె, పలమనేరు మండలంలో జగమర్ల యానదికాలనీ రోడ్లు దుస్థితికి చేరాయి. 90 పంచాయతీల్లో 33 చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో చెరివి, పీవీ.పురం, గొల్లపాళెం, చమర్తకండ్రిగ, సత్యవేడు - మాదరపాకం రోడ్లు దెబ్బతిన్నాయి. చెరివి రోడ్డు ఆరు కిలోమీటర్ల మేర శ్రీసిటీ సెజ్‌లో ఉంది. ఈ రోడ్డు నిర్వహణను ఆర్అండ్బీ గాలికొదిలేసింది. పీవీ.పురం రోడ్డు క్వారీ వాహనాల తాకిడికి ధ్వంసమైంది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు రాకపోవడంతో గుంతలు పడినా పూడ్చే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 14 గ్రామాలకు రోడ్లు లేవు. చెరువుకట్టలు, బండ్లబాటల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు పొలంగట్లే రహదారులు. పంచాయతీ రాజ్రోడ్లకు నామమాత్రంగా గుంతలు పూడ్చడం మినహా, శాశ్వత పనులు చేయడం లేదు. బీఆర్జీఎఫ్ నిధులతోనైనా మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో అక్కెరి దళితవాడ, వేణుగోపాలపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రామచంద్ర ఎస్టీ కాలనీకి రోడ్డు సౌకర్యమే లేదు. చెరువు కట్టపై రాకపోకలు సాగిస్తున్నారు. నగరి మండలంలో దువ్వూరు సుబ్బారెడ్డి కండ్రిగకు రోడ్డే వేయలేదు. కాసావేడు ఎస్టీ కాలనీకీ అదే పరిస్థితి. కృష్ణారామాపురం వద్ద రోడ్డు గతులమయమైంది. చెరుకు లారీలు, ట్రాక్టర్లతో రోడ్డు ధ్వంసమైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లె రోడ్డు, అనుప్పల్లెకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చంద్రగిరి ఇందిరమ్మకాలనీ, మల్లయ్యగారిపల్లె, రాయలపురం గ్రామాలకు రోడ్లు అంతంతమాత్రమే. మదనపల్లె మండలంలోని 16 పంచాయతీల్లో 384 పల్లెలు ఉంటే, 150 గ్రామాలకు కేవలం కాలిబాటలే దిక్కు. ఐదేళ్లుగా పీఆర్ నిధులున్నా ఖర్చుచేయని పరిస్థితి. చిన్నాచితకా రోడ్ల ప్యాచ్పనులనూ పట్టించుకునేవారే లేకుండా పోయారు. 61 రోడ్లు ఉంటే వీటిల్లో జాతీయ రహదారులూ గుంతలు పడిపోయాయి. మేకలవారిపల్లె, మిట్టామర్రి, మేడిపల్లె, ఆవులపల్లె గ్రామస్తులు శ్రమదానంతో రోడ్లు నిర్మించుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో బాలగంగనపల్లె, పెనూమూరు మండలంలో సామిరెడ్డిపల్లె ఎగువ దళితవాడ, రామాపురం గ్రామాలకు రోడ్లు లేవు. సామిరెడ్డిపల్లె దళితవాడకు చెరువులో నుంచి వెళ్లాలి. వర్షాలుకు నీళ్లొస్తే ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయినట్టే. వెదురుకుప్పం మండలం మాంబేడుకు రోడ్డే లేదు. -
దప్పికైతే ఎక్కిళ్లే
=పనిచేయని రక్షిత మంచినీటి పథకాలు =పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లో తీవ్ర నీటి ఎద్దడి =బిందె నీళ్లు రూ.4 =మూడు నుంచి వారం రోజులకోసారి నీటి సరఫరా వణికించే చలికాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య నెలకొంది. పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు. జనం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ప్రజలు బిందె నీటిని నాలుగు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్య పట్టణాల్లో మూడు నుంచి వారం రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 1,365 పంచాయతీల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాల్లో 30 శాతానికి పైగా పనిచేయడం లేదు. కొన్నిచోట్ల బోర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. ఇంకొన్నిచోట్ల మోటార్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు పట్టణంలో బిందె నీటిని రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జనం నీటి కోసం 4, 5 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వందలకుపైగా గ్రామాల్లో ట్యాంకర్ నీళ్లే ఆధారమవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో రోజు మార్చి రోజు, రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. మదనపల్లె పట్టణంలో మూడురోజులకోసారి, శివారు ప్రాంతాల్లో వారానికోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కలుషితమైన నీరు సరఫరా అవుతోంది. కుప్పం నియోజకవర్గం 89 పంచాయతీల పరిధిలోని 170 గ్రామాల్లో తాగునీటి కొరత నెలకొంది. జనం వ్యసాయబోర్లను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. వెయ్యి అడుగులు బోరు వేస్తేగానీ నీళ్లు పడడం లేదు. పలు ప్రాంతాల్లో డబ్బులు పెట్టి నీటిని ట్యాంకర్లతో తోలించుకుంటున్నారు. గత నెలలో చంద్రబాబు పర్యటించిన వెళ్లిన తర్వాత కూడా నీటి సమస్య పరిష్కారం కాలేదు. పీలేరు నియోజకవర్గంలోని పీలేరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీరు బిందె రూ.4 చొప్పున జనం కొం టున్నారు. పట్టణం మొత్తం ట్యాంకర్లపైనే ఆధారపడి నీటి సరఫరా జరుగుతోంది. పలమనేరు నియోజకవర్గంలోని 614 రక్షిత మంచినీటి స్కీం బోర్లలో 110 పని చేయడం లేదు. మొత్తం 1,250 హ్యాండ్బోర్లలో 710 పనిచేయడం లేదు. అలాగే 18 వేల వ్యవసాయ బోర్లలో 1000 ఎండిపోయాయి. పల మనేరు మున్సిపాలిటీలో రోజుకు 5.11 మి లియన్ లీటర్లు అవసరం. అయితే 2.5 మిలియన్లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మూడురోజులకోసారి నీళ్లు వదులుతున్నారు. తంబళ్లపల్లె మండలంలోని ఎర్రివారిపల్లె, అనిగానిపల్లె తదితర గ్రామాల్లో 6 నెలలుగా మంచినీటి ఎద్దడి నెలకొని ఉంది. భూగర్భ జలాలు అడుగంటాయి. మోటార్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా పీటీఎం మండలంలో తాగునీటి ఎద్దడి ఉం ది. కొత్త బోర్లకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. మిగిలిన మండలాల్లో నీళ్లు ఉన్నాయి. అయితే మోటార్లు బిగించడంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. మదనపల్లె పట్టణంలో మూడు నుంచి నాలుగురోజులకోసారి నీళ్లు వదులుతున్నారు. ప ట్టణ శివారు ప్రాంతాల్లో వారానికి ఓ మా రు నీళ్లు ఇస్తున్నారు. ఎక్కువ మందికి వ్యవసాయబోర్లే ఆధారమవుతున్నాయి. మరికొన్ని చోట్ల ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ రవాణా వల్ల స్వర్ణముఖి నదిలో బావులు పూడిపోయా యి. పట్టణంలోని తుపాన్ సెంటర్, కుందేటివారి వీధి, చెంచులక్ష్మికాలనీ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. బోర్లకు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. ని యోజకవర్గంలోని 30 శాతం పంచాయతీల్లో నీటి సమస్య రాజ్యమేలుతోంది. తిరుపతి నగరంలో రోజు మార్చి రోజు నీళ్లు వదులుతున్నారు. కొర్లగుంట ప్రాంతంలో పైపులు దెబ్బతిన్నాయని మూడురోజులుగా నీళ్లు సరిగా వదలడం లేదు. మొదటి అర్ధగంట కలుషిత నీరు వస్తోంది. దాసరి మఠం, ఎస్టీవీనగర్, బైరాగిపట్టెడ ప్రాం తాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. నీటి విడుదలలో సమయపాలన పాటిం చడం లేదు. రోజుకు 41 మిలియన్ల లీటర్ల నీళ్లు అవసరం. అయితే 30 మిలియన్ లీ టర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని చెరువుల్లో నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నా యి. తెలుగుగంగ దిగువనున్న ఐదారు చెరువుల్లో మాత్రం జలకళ ఉంది. పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొంది. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని 15 గ్రామాల్లో బోర్లు వేిసినా నీళ్లు పడలేదు. దీంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే 184 గొల్లపల్లె పంచాయతీ పేరకూరు, మాధవరం పంచాయతీ కూడిగుట్ట ఎస్సీ కాలనీ, కోటివారిపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామాల్లో ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. -
కాంట్రాక్టర్లకు ధనజాతర
=మేడారం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు =అధికారులతో కాంట్రాక్టర్ల ‘ముందస్తు’ ఒప్పందం =లెస్తో పనులు దక్కించుకుంటున్న వైనం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పనులు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి. జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వారు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు లెస్(తక్కువ)తో టెండర్లు దాఖలు చేస్తూ ముందుకు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం ఆర్అండ్బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అర్డబ్ల్యూఎస్ విభాగాల ద్వారా సుమారు రూ.80కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే గత జాతరలో పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఈసారి సంబంధిత శాఖ అధికారులతో ‘ముందస్తు’ ఒప్పందం చేసుకుని పనుల మంజూరు కోసం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధులు మంజూరు చేయించే బాధ్యతను అధికారులే తీసుకోవడంతో కాంట్రాక్టర్లు సూచించిన మేరకే పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగానైనా చేపట్టనున్న పనులకు నిధులను తామే తెస్తున్నందున టెండర్లు కూడా తమకే దక్కుతాయని చెప్పి పలువురు కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియ పూర్తికాకున్నా పనులు ప్రారంభించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆర్అండ్బీ శాఖ ఈ-ప్రొక్యూర్మెంట్లో టెండర్లు నిర్వహించడం, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయడంతో కొన్ని పనులను ఆయా కాంట్రాక్ట ర్లు ప్రారంభించారు. అయితే ఇరిగేషన్ శాఖలో జరుగుతు న్న మాయాజాలం అంతా ఇంతా కాదు. గత రెండు జాతరల సందర్భంగా పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ ఆరునెలల క్రితమే తన పలుకుబడిని ఉపయోగించుకుని సీఎం పేషీ నుంచి మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. జాతరలో నిధులు మొత్తం తనకే కేటాయిస్తే పనులను విభ జించాల్సి వస్తుందని భావించి ఇప్పుడు మంజూరైన పను ల నుంచి సగం వాటినే ప్రస్తుతం చేపట్టే విధంగా జీఓను జారీ చేయించడంలో అతడు విజయం సాధించాడు. కా గా, మంజూరైన నిధులతో చేపట్టే పనులను విభజించే అధికారం ఇరిగేషన్ ఎస్ఈకి ఉంటుందని తెలి సింది. అయితే ఈ నిబంధనను తొక్కి పెట్టేందుకు కాంట్రాక్టర్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శితో టెండర్లను విభజించి కా కుండా ఒకే పనిగా టెండర్లు పిలవాలన్న ఆదేశాలు ఇప్పిం చడంతో ఆయన పలుకుబడి ఏమిటో అందరికీ అర్థమైంది. లెస్తో నాణ్యత ఎలా... పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15.08 కిలోమీటర్ల రహదారులను రూ.7.69కోట్ల వ్యయంతో మరమ్మతులు, అభివృ ద్ధి చేసేందుకు టెండర్లు నిర్వహించారు. ఇందులో మేడా రం గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి నార్లాపూర్ ఆర్అం డ్బీ రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.67లక్షలు కేటాయించారు. అయితే ఈ పనిని దక్కించుకునేందుకు కరీంనగర్‌కు చెంది న కాంట్రాక్టర్ ఏకంగా 32 శాతం లెస్ వేయడం, మరో పనికి 26 శాతం నుంచి 5 శాతం వరకు తక్కువగా టెం డర్లు దాఖలు కావడంతో శాఖలోని అధికారులు విస్మ యానికి గురయ్యారు. కాంట్రాక్టర్ చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుల కోసం శాఖాపరంగా మరో 12 శాతం వరకు ఖర్చులుంటాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో తక్కువ వేసిన 32 శాతం కలిస్తే వంద రూపాయల పనిని యాభై రూపాయలకే చేయాల్సి ఉంటుంది. ఈ పనిని పొందిన కాంట్రాక్టర్ మరీ తక్కువగా వేయడంతో, తక్కువ వేసిన మొత్తానికి నిబంధనల ప్రకారం ఏఎస్డీ(అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పని రద్దు చేయాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి భావించారు. సదరు కాంట్రాక్టర్ ఏఎస్డీ రూ.7.43లక్షలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడంతో శాఖలోని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. టెండర్లలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోకపోయినప్పటికీ పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లతో చక్రం తిప్పుతున్న కాంట్రాక్టర్లు... ఇంజినీరింగ్ అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల వల్లనే ఎంత లెస్(తక్కువ శాతం)కైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజం కాదనకుండా ఉండలేం. ఏ మేరకు రోడ్లు వేస్తున్నారు...ఎంత వరకు బిల్లులు చెల్లిస్తున్నారో జాతర తర్వాత పట్టించుకున్న అధికారి ఇప్పటి వరకు లేరు. జాతర ముగిసిన వెంటనే అధికారులు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడమే ఇందుకు కారణం. ఈ వెసులుబాటుతోనే కాంట్రాక్టర్లు ఎస్టిమేట్లు ప్రత్యేకంగా తయారు చేసుకుంటూ పనులను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు పనులను పట్టించుకోకపోవడంతో గతంలో ఓసారి జాతర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మళ్లీ వచ్చే జాతరకు పో టీపడడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
గ్రామాలకు శుద్ధి నీరు
= రాష్ట్రంలో రెండు వేల నీటి శుద్ధీకరణ కేంద్రాలు = పంచాయతీకో కేంద్రం : మంత్రి పాటిల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలనే లక్ష్యంలో భాగంగా పంచాయతీకి ఒకటి చొప్పున వెయ్యి నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించామని, ఇప్పుడా సంఖ్యను రెండు వేలకు పెంచాలని యోచిస్తున్నామని పంచాయతీ రాజ్, గ్రామీణాృవద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ వెల్లడించారు. ్రృకతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో నీరు, పరిశుభ్రతలపై పడే దుష్పరిణామాల గురించి ఇక్కడి వికాస సౌధలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. ఫ్లోరైడ్, ఇతర కారణాల వల్ల నీరు కలుషితమవుతోందని, దీనిని నివారించడానికి పంచాయతీకో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోందని వెల్లడించారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ్రృకతి వైపరీత్యాల వల్ల నీటి కొరత ఏర్పడడంతో పాటు ఉన్న నీరూ కలుషితమవుతోందన్నారు. పౌష్టికాహార లోపానికి కలుషిత నీరు కూడా కారణమన్నారు. మరుగు దొడ్లతో పాటు స్నానపు గదులను కూడా నిర్మించడంపై తమ ప్రభుత్వందృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. -
ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది
=అమీన్‌పేట మాజీ సర్పంచ్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం =పంచాయతీరాజ్ శాఖలో కలకలం జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న పోతన సదానందం శనివారం రాత్రి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన ఆ శాఖలో కలకలం రేపింది. బాధితుడి కథనం ప్రకారం.. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చెన్నారావుపేట మండలం ఆమీన్పేటకు 2011లో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.10.28 లక్షలు మంజూరయ్యాయి. అప్పటి సర్పంచ్ చిలుపూరి యాకయ్య భవన నిర్మాణ పనులు చేపట్టాడు. బిల్డింగ్ బేస్మెట్ లెవల్ పూర్తిచేసి బిల్లు చేయాలని కోరగా ఏఈ ముందుగా డబ్బులు ఇవ్వాలని అడగడంతో అప్పు చేసి పర్సంటేజీ ఇచ్చాడు. అతడికి రూ.1.50 లక్షలు రావాల్సి ఉండగా కేవలం రూ.87 వేలు మాత్రమే అధికారులు బిల్లు చేశారు. మిగతా డబ్బుల కోసం అడగగా భవనం పూర్తి చేస్తే మొత్తం బిల్లు చేస్తానని ఏఈ చెప్పడంతో అప్పు చేసి మరి యూకయ్య ఎనిమిది నెలల క్రితం భవన నిర్మాణం పూర్తి చేశాడు. అనంతరం బిల్లు మంజూరు చేయూలని ఏఈ సదానందంను కోరగా 5 శాతం పర్సంటేజీ ఇస్తేనే ఎంబీ రికార్డు చేస్తానని ఖరాకండిగా తేల్చిచెప్పాడు. బిల్లు వచ్చాక అందులో నుంచి పర్సెంటేజీ ఇస్తానని చెప్పి బతిమిలాడినా వినకుండా ఏఈ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు పత్తి అమ్మి డబ్బులు తీసుకొస్తాను.. ఎంబీ రికార్డు చేసి సిద్ధంగా ఉంచాలని కోరగా ముందుగా ఇస్తే తప్పా బిల్లులు చేయనని పుస్తకాలను విసిరికొట్టాడు. రూ.20 వేలు ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో రూ.15 వేలు ముందుగా ఇస్తానని బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లు కోసం తిరిగి విసిగివేసారిన యాకయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం సాయంత్రం హన్మకొండకు వచ్చి ఏఈ సదానందానికి ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ఏఈ ప్రశ్నించగా తాను కాళోజీ సెంటర్లో ఉన్నానని చెప్పడంతో జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోకి రావాలని యాకయ్యకు ఏఈ సూచించారు. ఇద్దరు జెడ్పీ కార్యాలయం ఎదుట మాట్లాడుకున్నారు. ఎదురుగా ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎవరన్నా ఉన్నారో చూసి రావాలని యాకయ్యకు సూచించగా ఎవరు లేరని చెప్పడంతో ఇద్దరు కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ యాకయ్య ఏఈ సదానందానికి రూ.15 వేలు ముట్టజెప్పాడు. మాటల్లో పెట్టి.. అధికారులకు సిగ్నల్ ఇచ్చి.. ఎంబీ బుక్కులు ఇవ్వాలని కోరగా సోమవారం ఇస్తానని చెప్పాడు. డబ్బులు ఇవ్వగానే ఎంబీ ఇస్తానని చెప్పి.. ఇప్పుడు ఇలా ఎందుకు చెబుతున్నావని ఏఈపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా అతడి ని మాటల్లో పెట్టిన యూకయ్య ఏసీబీ అధికారులకు సిగ్నల్ ఇచ్చాడు. అప్పటికే జెడ్పీ కార్యాలయం అవరణలో ఉన్న ఏసీబీ అధికారులు నలువైపుల నుంచి వచ్చి సదానందంను ఆదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాశిబుగ్గకు చెందిన సదానందం చెన్నారావుపేట ఏఈగా విధులు నిర్వర్తిస్తూ హన్మకొండ టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తు తేలిందని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. సదానందంను ఆరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ ఏసీబీ సీఐలు రాఘవేందర్రావు, సాంబయ్య, బాపురెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.