బదిలీలు..బేరాలు | Government lifted the ban on transfers from the plan April 15 | Sakshi
Sakshi News home page

బదిలీలు..బేరాలు

Published Wed, Mar 30 2016 3:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

బదిలీలు..బేరాలు

బదిలీలు..బేరాలు

ఏప్రిల్ 15 నుంచి బదిలీలపై నిషేధం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం  
కోరుకున్న చోట పోస్టింగ్ కోసం  పైరవీ బాటలో అధికారులు
మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల లేఖల కోసం ప్రయత్నాలు

 
ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉండటంతో కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు  మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే పోస్టింగ్‌ల్లో ప్రాధాన్యత దక్కే అవకాశముంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖల కోసం తిరుగుతున్నారు.
 
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఏప్రిల్ 15 నుంచి 30 దాకా నిషేధాన్ని ఎత్తివేసే యోచనలో ప్రభుత్వముంది. ఈ సమయంలో  జిల్లా, జోనల్‌స్థాయి ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మే ఒకటికి ఉద్యోగంలో చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వాళ్లకు మినహాయింపు ఇస్తూ ఐదేళ్లు పూర్తయిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. దీర్ఘకాలం ఒకేచోట ఉన్నవారు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

 ఎమ్మెల్యే లెటర్లే పోస్టింగ్‌కు కీలకం
ఆశించిన చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతల ఆశీస్సులు పొందేపనిలో ఉద్యోగులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు ‘అనంత’కు రానున్నారు. అప్పుడు లెటర్లు తీసుకోవచ్చని కొందరు భావిస్తుంటే, ఇంకొందరు ముందే తొందరపడుతూ రాజధాని బాటపట్టారు. ‘మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాను. నాకు లెటర్ ఇవ్వండి సార్’ అంటూ విన్నవిస్తున్నారు. కొందరు అధికారులు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లెటరు కూడా తీసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో కొందరు ఎమ్మెల్యేలు ‘అనంత’కు రాగా పలువురు అధికాారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. లేఖలు ఇచ్చేందుకు కొందరు నేతలు పోస్టును బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంత డబ్బు ఇవ్వలేమని కొందరు వెనకడుగు వేస్తుంటే, మరికొందరు పోస్టింగ్‌లో చేరిన వెంటనే ముట్టజెబుతామంటూ ముందడుగు వేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇసుక తవ్వకాలతో భారీగా దండుకున్న అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు బదిలీ తంతును కూడా ‘క్యాష్’ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తహశీల్దార్, ఎంపీడీవోలతో పాటు హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర కీలకశాఖలకు సంబంధించిన పోస్టులను తాము సిఫారసు చేసినవారికే ఇవ్వాలని, ముందుగా నిర్ణయం తీసుకోవద్దని కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది.  


ఎంపీడీవోల నియామకంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ సిఫారసు తప్పనిసరి అవుతోంది. ఎమ్మెల్యే లేఖ ఇచ్చినా జెడ్పీ చైర్మన్‌అభిప్రాయం కూడా ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించని అధికారులను బదిలీ చేయాలని ఇప్పటికే పలువురు మండలస్థాయి నేతలు జెడ్పీ చైర్‌పర్సన్ చమన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల వద్ద సన్నిహితంగా ఉండే టీడీపీ కార్యకర్తలు అధికారులతో పోస్టింగ్‌కు బేరం మొదలెట్టారు. ఏప్రిల్‌లో వందల సంఖ్యలో బదిలీలు జరగనున్నాయి. దీంతో టీడీపీ నేతల జేబుల్లోకి అధికారుల సొమ్ము భారీగా చేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement