స్థానిక సంస్థలకు నిధులలేమి
నిధులిచ్చి ఆదుకోవాలని
ఆర్థిక సంఘ సభ్యులకు
జెడ్పీ చైర్మన్ వినతి
ఆదాయ మార్గాలున్నా
ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వెల్లడి
కర్నూలు సిటీ: స్థానిక సంస్థలు నిధులేమితో అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రభుత్వం నిధులు కేటాయించి ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, అధికారులు రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు విన్నవించారు. శనివారం స్థానిక జెడ్పీ సీఈఓ చాంబర్‌లో ఆయా ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, మెంబర్ సెక్రటరీ సీవీ రావు, జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, చీఫ్ ఆకౌంట్ ఆఫీసర్ తఖీవుద్ధీన్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నామని,దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమపర్పిస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉంటే అందులో నుంచి ఎలా బయటపడాలో అధికారులును అడిగి వారి సలహాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంలో పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు జెడ్పీకి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు, మండల పరిషత్‌లకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. అదే విధంగా జనాభా లెక్కల ప్రకారం జిల్లాకు రావాల్సిన మేరకు తలసరి గ్రాంట్ రావడం లేదని, అలాగే గత రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు అమలు కావడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, చేతి పంపుల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘానికి విన్నవించారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలు సర్వశిక్ష అభియాన్ ద్వారా కాకుండా పంచాయతీరాజ్ ఇంజినీర్ల ద్వారా చేయించి, నిర్ణీత ఫీజుల్లో వాటా ఇవ్వాలని జెడ్పీ అధికారులు కోరారు.
అనంతరం ఆర్థిక సంఘం సభ్యులు కంప్యూటర్ సెక్షన్‌ను తనీఖీ చేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ జయరామిరెడ్డి, జెడ్పీ ఏఓ భాస్కర్ నాయుడు, డీపీఓ శోభ స్వరూపరాణి, పీఆర్ ఎస్‌ఈ సురేంద్రనాథ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పి.భాను వీర ప్రసాద్, ఎంపీడీఓలు అమృతరాజ్, ప్రతాప్ రెడ్డి, ఎంపీపీలు డి.రాజావర్దన్ రెడ్డి, ప్రసాద్ రె డ్డి, కొత్తపల్లి, పత్తికొండ జెడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, సుకన్య, ఈఓఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.