అభివృద్ధికే మొదటి ప్రాధాన్యం
మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ : అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పంచాయతీరాజ్ నిధుల ద్వారా *4.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల విస్తరణపై ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఆదివారం ఉదయం కొల్లాపూర్ పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు. రాజవీధిలోని జమ్మిచెట్టు వద్ద, అంబేద్కర్ కాలనీల్లో చేపట్టే సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. అనంతరం కేఎల్‌ఐ అతిథిగృహంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ కాలనీ నుంచి రంగదాసు వీధి వరకు 30 ఫీట్ల మేరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని, మిగతాప్రాంతాల్లో 40 ఫీట్ల వెడల్పుతో పనులు చేయిస్తామన్నారు. రోడ్ల విస్తరణలో రాజీ పడేది లేదని, నిర్ణీత వెడల్పు రోడ్ల నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
త్వరలో బైపాస్ పనులు
కొల్లాపూర్ నుంచి సోమశిల వరకు *10 కోట్లతో డబుల్‌లేన్ రహదారి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొల్లాపూర్ నుంచి వెల్గొండ పెబ్బేర్, కేతేపల్లి - వనపర్తి, కోడేరు -నాగర్‌కర్నూల్, నాగులపల్లి -గోపాల్‌పేట్ మీదుగా వనపర్తి వరకు 106 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రహదారి పనులు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కొల్లాపూర్ పట్టణ సమీపంలో బైపాస్ రహదారి నిర్మించేందుకు భూసేకరణ పనులు జరుగుతున్నాయని, పుష్కరాల్లోగా రూ.19 కోట్లతో ఈ పనులు పూర్తి చేయిస్తామన్నారు.