డమ్మీ నోటిఫికేషన్? | facke notification | Sakshi
Sakshi News home page

డమ్మీ నోటిఫికేషన్?

Published Mon, May 23 2016 4:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

డమ్మీ నోటిఫికేషన్?

డమ్మీ నోటిఫికేషన్?

వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు రూ.10 లక్షల ఖర్చు కొలువుల పేరిట దందా

 
ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది జిల్లా వైద్యశాఖ పనితీరు. ఆర్థిక శాఖ అనుమతి లేదు. ప్రభుత్వ జీఓ అసలే లేదు. అయినా జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో  భర్తీచేస్తామంటూ వైద్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించింది.  వీరిని ఉద్యోగాల్లో నియమించినప్పటికీ జీతాలు వచ్చే పరిస్థితే లేదు. మరోవైపు  వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు రూ.లక్ష ఇస్తే  ఏఎన్‌ఎం పోస్టు ఇప్పిస్తామంటూ బేరసారాలు సాగిస్తూ కొలువుల పేరిట దందా సాగిస్తున్నారు..
 
 
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని వైద్యశాఖలో కొన్నేళ్లుగా 145 ఏఎన్‌ఎం, 22 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పీహెచ్‌సీల్లో పని భా రం పెరిగింది. ఖాళీలను భర్తీ చేస్తామంటూ గత నెలాఖరున వైద్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 10వతేదీ నాటికి దరఖాస్తులను స్వీకరించేసింది.

 రూ. 10 లక్షల ఖర్చు
 ఈ పోస్టులకు రెండు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి  రూ.100 వంతు డీడీ రూపంలో  మొత్తం  రూ.2 లక్షలను వైద్యశాఖ వసూలు చేసింది. అంతేకాక విద్యార్హతలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, వాటి జెరాక్సులు కోసం మరో రూ.200 వం తున ఒక్కో అభ్యర్థి ఖర్చు చేశారు. ఇది చాలదన్నట్టు ఒక రోజు పని మానుకుని జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు నెల్లూరుకు వచ్చారు. రాను, పోను చార్జీలు, ఖర్చులు కలిపి మరో రూ.200 అయింది. తక్కువలో తక్కువ వేసుకున్నా అన్ని రకాల ఖర్చులు కలిపి ఒక్కో అభ్యర్థి కనీసం రూ.500 వంతున ఖర్చు చేశారు. అంటే రెండు వేల దరఖాస్తుదారులు కనీసం రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు.


జిల్లాకే పరిమితమైన నోటిఫికేషన్
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వైద్యశాఖలో ఖాళీలున్నా యి. అయినప్పటికీ నెల్లూ రు జిల్లాలో మా త్రమే పో స్టులను భర్తీ చేస్తామంటూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని ఎప్పటి లోగా భర్తీ చేస్తారో అధికారులు స్పష్టంగా చెప్పలేదు.

నిబంధనలు బేఖాతర్
ఒక నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడే నిబంధనలు రూపొం దిస్తారు. అభ్యంతరాలకు గడు వు,  మెరిట్ లిస్టు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధా నం ప్రకటిస్తారు. భర్తీ చేసే గడువును ప్రకటిస్తారు. ఇక్కడ మాత్రం ఇవేమీ ప్రకటించలేదు. కనీసం ఏ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపడతారో కూడా తెలుపలేదు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నోటీసు బోర్డులో సైతం వివరాలు ప్రక టించలేదు. వీటిని గురించి ప్రశ్నిస్తే అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది.


 రెండో ఏఎన్‌ఎంల ఆందోళన
ఎనిమిదేళ్ల క్రితం జిల్లాలో ఎన్‌ఆర్‌హెచ్ ఎం పథకం కింద రెండో ఏఎన్‌ఎం పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేశారు. అప్పట్లో మెరిట్, రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపట్టి భవిష్యత్తులో రెగ్యులర్ (పర్మినెంట్) చేస్తామని చెప్పారు.తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎన్నికల్లో వీరిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. వీరు రూ.4 వేల జీతంతో చేరి ఇప్పుడు రూ.11వేల  నెల జీతం పొందుతున్నారు. తాజా నోటిఫికేషన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన కొత్త గా భర్తీ చేసేవారికి నెల జీతం రూ.17 వేలు, ఇతర అలవెన్సులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

ఖాళీపోస్టుల్లో కొత్తవారిని కాం ట్రాక్టు పద్ధతిన నియమిస్తే ఇక జీవితంలో తాము రెగ్యులర్ అయ్యే ప్రసక్తే లేదని రెండో ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎని మిది, తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న తమకు రూ.11వేలు జీతం, కొత్త గా చేరే కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు రూ.17వేల జీతం ఏంటని వారు ఆందోళన బాట పట్టారు. ధర్నా లు చేశారు. కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేశారు.

రూ.లక్ష నుంచి బేరసారాలు
మరో వైపు ఎన్‌ఎంపోస్టులు భర్తీ అవుతున్నాయని, భవిష్యత్తులో రె గ్యులర్ చేస్తారంటూ వైద్యశాఖలోని కొంతమంది ఉద్యోగులు ప్రచారం మొదలు పెట్టారు, రూ.లక్ష నుంచి ఒకటిన్నర లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం మీదేనంటూ ఎరవేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.
 
 
జీతాలెలా వస్తాయి..?
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేని ఈ పోస్టుల భర్తీ చెల్లదు. ఒకవేళ  భర్తీ చేసినా జీతాలు ఎవరిస్తారు?. ట్రెజరీ కొర్రీ వేస్తుంది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడటం దారుణం. అన్ని అనుమతులు తెచ్చుకుని భర్తీ చేయాలి. అలా భర్తీ చేసేటప్పుడు కూడా రెండో ఏఎన్‌ఎంలను ముందుగా ఖాళీల్లో భర్తీ చేసి తరువాత మిగిలిన ఖాళీలను కొత్తవారితో భర్తీ చేయాలి.  - ఎన్.సతీష్, యునెటైడ్ మెడికల్ హెల్త్,ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు 3
 
 
కలెక్టర్ చెప్పడంతో నోటిఫికేషన్ ఇచ్చా
ప్రభుత్వం నుంచి జీవో, అనుమతులు లేని  విషయం వాస్తవమే. కలెక్టర్ చెప్పడంతో నోటిఫికేషన్ ఇచ్చాను. ప్రభుత్వం అనుమతి వస్తుందని భావిస్తున్నాం. - డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement