నిరసనలు.. నిలదీతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతు సాధికారత పేరుతో ప్రభుత్వం చేపట్టిన సదస్సులతో అన్నదాతలకు ఒనగూరిందేమీ లేదని తేలిపోయింది. రైతుల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ప్రభుత్వం వారి వద్ద మంచి మార్కులు వేయించుకోవాలనే ఉద్దేశంతోనే ‘రైతు సాధికారత సదస్సు’ కార్యక్రమాన్ని రూపొందించింది. జిల్లాలో ఆరు రోజులుగా జరిగిన ఈ రైతు సాధికారత సదస్సుల కార్యక్రమం నిరసనలు.. నిలదీతలతో ముగిసిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ర్టప్రభుత్వం ఈనెల 11 నుంచి 16వ తేదీ వరకు రైతు సాధికారత సదస్సు లు నిర్వహించింది. ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీ పథకాన్ని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని సాక్షాత్తు టీడీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.
రుణమాఫీ పథకం పేరుతో రైతులను మాయ చేస్తున్నారని తేలిపోయింది. అందుకు మూడు విడతలుగా విడుదల చేసిన అర్హుల జాబితానే నిదర్శనం. ఆధార్ నంబర్లు లేవని జిల్లాలో వేలాదిమంది రైతులను అనర్హులుగా తేల్చారు. అదేవిధంగా వెబ్‌సైట్‌లో రుణమాఫీకి అర్హుడని చెబితే.. జాబితాలో అనర్హుడుగా చూపుతుండటంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన జాబితా వెనుక రైతులను మభ్యపెట్టే కుట్ర దాగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
5 లక్షల మందికిపైగా రైతులు బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్లకు పైగా రుణాలు పొందారని బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు జాబితా పంపితే.. ప్రభుత్వం రకరకాల కొర్రీలు పెట్టి వేలాది మందిని అనర్హులుగా తేల్చింది. అందులో మొదటి విడతలో 1.84 లక్షల మందిని తేల్చారు. వారు తీసుకున్న రూ.678 కోట్ల రుణాలకు 20 శాతం చొప్పున రూ.206 కోట్లు మాత్రం మాఫీ చేసినట్లు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 940 గ్రామాల్లో రైతు సాధికారత సదస్సులు నిర్వహించారు. మొత్తం 1,06,346 మంది రైతులు హాజరుకాగా, వీరిలో 59,786 మందికి మాత్రమే రుణవిముక్తి పత్రాలు అందజేశారు.
చివరి రోజూ
కొనసాగిన ఆందోళనలు
రైతు సాధికారత సదస్సులు ప్రారంభం నుంచి చివరిరోజు వరకు ఆందోళనల మధ్య సాగాయి. సదస్సుల వద్ద అధికారులను రైతులు నిలదీయడం, బ్యాంకుల వద్ద ఆందోళనలు కనిపించాయి. చివరి రోజైనా మంగళవారం మనుబోలు మండలం తహశీల్దార్ కార్యాలయానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. అర్హులను అనర్హులుగా తేల్చటంపై మండిపడ్డారు. అదేవిధంగా మైపాడులో ఎంపీడీఓను మహిళలు నిలదీశారు.
అనంతసాగరం మండలం రేవూరులో జరిగిన సదస్సులో పాశం అప్పయ్య, వీరారెడ్డి, హరికృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరుల రైతుల పేర్లు లేవని అధికారులను నిలదీశారు. బాలాయపల్లి మండలం కొంబేడు గ్రామంలో సదస్సును అడ్డుకున్నారు. ఆధార్ కార్డులు పలుమార్లు ఇచ్చినా.. జాబితాలో పేర్లు లేకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ టీడీపీ మండల యువత అధ్యక్షుడు రాంబాబురెడ్డి సైతం తమ పార్టీ తీరుపై నిరసన తెలియజేశారు. నమ్మి ఓట్లేసినందుకు రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు.
కలువాయిలో నిర్వహించిన సదస్సును రైతులు అడ్డుకున్నారు. రెండవ జాబితా అంతా తప్పుల తడకగా ఉందంటూ మండిపడ్డారు. అధికారులు అడిగిన ఆధారాలన్నీ ఇచ్చినా.. జాబితాలో పేర్లు లేకపోవటంతో గ్రామానికి చెందిన రైతులు ఏ ఒక్కరూ రుణమాఫీ పత్రాలు తీసుకోలేదు. దీంతో సదస్సును వాయిదా వేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా చివరి రోజు ఆందోళనల మధ్య రైతు సాధికారత సదస్సు కార్యక్రమం ముగిసింది. ఆరు రోజుల పాటు జరిగిన సాధికారత సదస్సులకు రైతుల నుంచి స్పందన కరువైంది. అనేక చోట్ల అధికారులు మొక్కుబడిగా సదస్సులు నిర్వహించి ‘మమ’ అనిపించారు.