- రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాలు
- 15న 350 కేంద్రాల ప్రారంభం
- గ్రామీణ మహిళలకు వాషింగ్ మెషిన్లు, హెయిర్ డ్రయర్లు
- 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా కర్ణాటక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కోసం ప్రత్యేక శాఖను ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు వెల్లడించారు. తన శాఖ పద్దులపై మూడు రోజుల పాటు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిస్తూ ఆగస్టు 15 లేదా అక్టోబరు 2న కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక జల మండలిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలనే నిర్ణయనికి వచ్చామని చెప్పారు.
రాష్ట్రంలోని 5,223 జన నివాస ప్రదేశాల్లో ఒక బకెట్ కంటే తక్కువగా తాగు నీటిని అందిస్తున్నామనే కఠోర సత్యాన్ని ఆయన సభకు తెలిపారు. ఈ సమస్యను సవాలుగా స్వీకరించి అందరికీ సరిపడా తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీటిని సేవించడం వల్ల నిముషానికి ముగ్గురు పిల్లలు చనిపోతున్నారని, 60 శాతం మంది వివిధ రోగాల బారిన పడుతున్నారని వివరించారు. దీనిని నివారించడానికి రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని , ఈ నెల 15న 350 కేంద్రాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. ప్రధాని, శ్రీమంతులు తాగే నీటిని తమకూ సరఫరా చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెబుతూ, వారి కోరిక సహేతుకమేనని అంగీకరించారు.
గ్రామాల్లో వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు
గ్రామాల్లో మహిళలకు ఇకమీదట వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లను సరఫరా చేస్తామని, వృద్ధులకు పాశ్చాత్య శైలిలో మరుగు దొడ్లను సమకూరుస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది వెయ్యి కాంప్లెక్స్‌లను నిర్మించి, అందులో పాశ్చాత్య మరుగు దొడ్లు, స్నానాల గదులు, బట్టలు ఉతికే గదులు, అధునాతన వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రతి శాసన సభ నియోజక వర్గానికి రెండు నుంచి మూడు చొప్పున కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.
27 వేల మంది నియామకానికి అనుమతి
గ్రామ పంచాయతీల స్వావలంబనకు 27 వేల మంది సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ఆగస్టు ఒకటో తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించామని ఆదేశించామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ద్వారా 5,629 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆగస్టు ఆఖరు లోగా ఈ నియామకాలు కూడా పూర్తవుతాయన్నారు. ఈ నియామకాలతో గ్రామ పంచాయతీల్లో 32 వేల మందికి పైగా సిబ్బంది అందుబాటులోకి వస్తారని, మరో మూడు, నాలుగు వేల మందిని కూడా దశలవారీ నియమిస్తామని వివరించారు. 2015 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు.