
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్‌మెంట్‌లన్నీ బేల చూపులు చూస్తున్నాయి.
కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి.
కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి.
ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది.
1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క.
కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్‌లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది.
మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్‌బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు.
అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి.
నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి.
ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది.
నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది.