తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రకటన
అత్యవసర పనుల కోసం రూ.వందకోట్లు విడుదల
కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మరో పది
మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి కాస్త ఎక్కువే
67 మున్సిపాలిటీల్లో వంద ఎల్‌పీడీ కంటే తక్కువ నీటి సరఫరా
వీటిల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి
23,839 గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది.
ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన
తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్‌ఎండీ(మిలియన్స్‌లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్‌ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్‌ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఖమ్మం, కరీంనగర్‌లో ప్రత్యామ్నాయ చర్యలు
ఖమ్మం, కరీంనగర్‌లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్‌డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్‌పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్‌పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్‌పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది.
అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు
మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్‌లతోపాటు, స్టాండ్‌బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్‌ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్‌కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి
గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment