నల్లా ఇరుక్కు!  | International Water Day on 22nd March 2024 | Sakshi
Sakshi News home page

 నల్లా ఇరుక్కు! 

Published Fri, Mar 22 2024 4:14 AM | Last Updated on Fri, Mar 22 2024 4:14 AM

International Water Day on 22nd March 2024 - Sakshi

మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్‌లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్‌లనే వాడుతుంటారు.  ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్‌ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్‌–10 వివరాలివీ.. 

ఫిన్లాండ్‌ 
ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్‌లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. 

ఐస్‌ల్యాండ్‌ 
ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. 

స్విట్జర్లాండ్‌ 
కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. 

ఆస్ట్రియా 
ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. 

నార్వే 
హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. 

నెదర్లాండ్స్‌ 
మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. 

మాల్టా 
ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్‌ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. 

ఐర్లాండ్‌ 
ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్‌–10 దేశాల్లో నిలిచింది. 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 
కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు.   - సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement