Tap water
-
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్‌లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్‌ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!
బీజింగ్ : సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్ డెయిలీ తన ట్విటర్లో షేర్ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు. చైనాకు చెందిన వెన్ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్ తెలిపింది. కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు.. ఇక్కడున్న దాదాపు వంద ఇళ్లలో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం అని పేర్కొంది. కాగా వీడియోపై అక్కడి జలవనరులశాఖ అధికారులు స్పందించారు. 'వాస్తవానికి గ్రామాన్ని మొత్తం అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కనెక్టివిటీ చేశాం. ఆ సందర్భంలో ఒక దగ్గర నేచురల్ గ్యాస్‌కు సంబంధించిన పైప్‌లైన్ పగిలి కొద్దిపాటి గ్యాస్ లీకై అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కలిసిపోయింది. దీంతో ఇలా తరచుగా నీళ్లకు మంటలు అంటుకుంటున్నాయని అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రస్తుతం నీళ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి మరమత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Videos of flammable tap water in Panjin, NE China's Liaoning have gone viral. The odd scene is caused by natural gas infiltration due to temporary underground water supply system error, which is now shut down. Normal supply has resumed. Further probe will be conducted: local govt pic.twitter.com/a5EOA5SATU — People's Daily, China (@PDChina) November 24, 2020 -
కోవిడ్ అలర్ట్.. 'క్లీన్' వాటర్
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో గ్రేటర్లో నల్లా నీటి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల మేరకు నిర్వహించేందుకు జలమండలి ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. నీటిశుద్ధి ప్రక్రియలో ఆలం వినియోగాన్ని పెంచడం, మహానగరం పరిధిలోని సుమారు 300 భారీ స్టోరేజి రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్, బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, రిజర్వాయర్ల పరిసరాల్లో అపరిశుభ్రతకు తావులేకుండా బ్లీచింగ్ పౌడర్ వేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. నీటి శుద్ధి ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మాస్క్‌లు, చేతి గ్లౌజులు, శానిటైజర్ అందజేయడంతోపాటు ఇతర ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. గ్రేటర్ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే దాహార్తిని తీర్చే వరదాయినుగా మారాయి. జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి కేవలం 15 ఎంజీడీల నీటినే సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానగరం తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలపైనే ఆధారపడింది. ఆయా జలాశయాల నుంచి రోజువారీగా 468 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి నగర తాగునీటి అవసరాలకు సేకరించి శుద్ధి చేస్తోంది. ఈ నీటిని సుమారు 10 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. నీటి నాణ్యత పక్కాగా.. ప్రధానంగా జలమండలి సరఫరా చేస్తున్న నీటి రంగు, కరిగిన ఘన పదార్థాలు, వాసన, గాఢత, విద్యుత్ వాహక, లవణీయత, అమోనియా, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రేట్లు, క్లోరైడ్లు, ఫ్లోరైడ్స్, సల్ఫేట్లు, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇలా 13 రకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పరీక్ష ఫలితాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల్లో నల్లా నీటి నాణ్యత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ (ఐఎస్ఓ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. బూస్టర్ క్లోరినేషన్తో.. వేసవి వచ్చిందంటే చాలు గ్రేటర్లో ఒకప్పుడు గరళ జలాలతో పలు బస్తీలు.. కాలనీలు గడగడలాడే దుస్థితి. భోలక్‌పూర్‌లో 2009లో కలుషిత జలాలు తాగిన ఘటనలో ఏకంగా పదిమంది మృత్యువాతపడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గత నాలుగేళ్లుగా ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు జలమండలి నడుం బిగించింది. ఫిల్టర్ బెడ్స్ వద్ద ఆలం అనే రసాయనంతో పాటు నీటిని నిల్వచేసే స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను నిర్విరామంగా చేపడుతుండడంతో నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. నీటి రంగు, రుచి, వాసనే కాదు.. రసాయన, భౌతిక ధర్మాలు సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు నమోదవుతుండడం విశేషం. ప్రతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద బూస్టర్ క్లోరినేషన్ రూమ్‌లతోపాటు ప్రత్యేకంగా క్లోరిన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతుండడంతో గరళ జలాల నుంచి సిటీజన్లకు విముక్తి లభించింది. మంచినీరు, మురుగు నీటి పైపులైన్లు పక్కపక్కనే ఉన్న చోట తాగునీరు కలుషితమైన పక్షంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండడంతో పరిస్థితి మెరుగైంది. సమస్యలను పరిష్కరించిన తర్వాత వినియోగదారుల ప్రతిస్పందన తీసుకోవడం, నీటి నాణ్యతపై థర్డ్‌పార్టీ ఏజెన్సీలతో వరుస తనిఖీలు చేస్తుండడంతో ఒకప్పుడు నిత్యం వందల్లో అందే కలుషిత ఫిర్యాదులు ఇప్పుడు పదులసంఖ్యకు చేరుకోవడం విశేషం. నిత్యం ఐదువేల నీటి నమూనాలకు పరీక్షలు నీటి నాణ్యతను పరీక్షించేందుకు నిత్యం గ్రేటర్ నలుమూలల నుంచి ఐదువేల నల్లా నీటి నమూనాలను సేకరించి జలమండలి నాణ్యతా విభాగంతోపాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టం, స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో పరీక్షింపజేస్తున్నాం. గ్రేటర్లో ప్రతి స్టోరేజి రిజర్వాయర్ వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను నిర్వహించడంతో పాటు సీజన్లవారీగా రిజర్వాయర్ల శుద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. అవసరమైన క్లోరిన్ సిలిండర్లను ఎక్కడికక్కడే అందుబాటులో ఉంచుతున్నాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
కుళాయి వద్ద ఘర్షణ.. మహిళ మృతి
గుక్క పట్టి ఏడుస్తున్న రెండు నెలల బిడ్డను వదిలి..గుక్కెడు మంచినీళ్ల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు కదిలింది..మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా కుళాయి వద్ద నిరీక్షించింది.. ఆమె వంతు వచ్చే సరికి గొడవ ప్రారంభమైంది..మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తోపులాటలో ఆమె కింద పడి ఈ లోకాన్ని వీడింది. ఈ విషాద ఘటన కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నీటి సమస్య ఓ నిండు ప్రాణాన్ని తీయడం స్థానికులను కలచి వేసింది. కర్నూలు: కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో వీధికుళాయి దగ్గర వంతుల వారీగా నీళ్లు పట్టుకునే విషయంలో గొడవ చోటు చేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోపులాటలో మౌలాబీ (23) అనే మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న షేక్షావలి, షేకున్బీ రెండో కూతురైన మౌలాబీకి డోన్‌కు చెందిన మహమ్మద్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈమె రెండు నెలల క్రితం పుట్టినింటికి ప్రసవానికి వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఇంటి పక్కన ఉన్న వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సమీపంలో నివాసం ఉంటున్న రామచంద్రమ్మతో వివాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. రామచంద్రమ్మ కుటుంబ సభ్యులంతా కలిసి మౌలాబీని కిందకు తోసేయడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఇరుగుపొరుగువారిని విచారించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మతో పాటు భర్త రత్నమయ్య, కూతురు మనీషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఆదివారం స్నానానికి సెలవు
ఆదివారం.. హాయిగా సేద తీరుదామనుకున్న నగరవాసులుఉదయం లేచింది మొదలు.. ఉరుకులు పరుగులు పెట్టారు.ఎక్కడైనా చుక్కనీరు దొరుకుతుందా అని ఎదురు చూశారు.లేచింది మొదలు.. ట్యాప్ కనెక్షన్ వైపు చూస్తూ గడిపారు. చివరికిస్నానానికి కాదు.. కనీసం తాగడానికి నీరు దొరికితే చాలన్నపరిస్థితికి వచ్చేశారు. సండే రోజున చాలా మంది స్నానానికి కూడాసెలవిచ్చేశారంటే తాగునీటి ఇబ్బందులు నగర ప్రజలు ఎలాఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏలేరుకాలువకు పడిన గండి కారణంగా నగరంలో ఈ పరిస్థితిదాపురించిందని, సోమవారం మధ్యాహ్నానికి పరిస్థితి చక్కబడేఅవకాశముందని అధికారులు భావిస్తున్నారు. విశాఖసిటీ: మహా నగరం నీటి చుక్క దొరక్క విలవిలలాడింది. ఇళ్లల్లో నీటి ఎద్దడి కారణంగా ఆదివారం సెలవు సందడి కనిపించకుండా పోయింది . ఇంట్లో ఉన్న కొద్దిపాటి నీరు ఎక్కడ అయిపోతుందోనని సగానికి పైగా నగరవాసులు స్నానానికి సెలవిచ్చేశారు. నగర వ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు దొరక్కపోతే.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఉదయం లేచింది మొదలు.. నీటి సరఫరా ఆదివారం లేదని తెలుసుకున్న మరుక్షణమే నగర వాసుల గుండె గుభేలంది. అసలే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మోటర్ల ద్వారా నీరు తోడుకుందామంటే చుక్క నీరు రాకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఓవైపు మోటర్ల ద్వారా నీరు రాక.. మరోవైపు.. జీవీఎంసీ నీటి సరఫరా లేకపోవడంతో బిందెడు నీరైనా సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే ఆదివారమంతా గడిపేశారు. మరికొందరు చుట్టు పక్కల ఉన్న బోర్లపై ఆధారపడ్డారు. ఇంకొందరు.. సమీప ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లడం గమనార్హం. మంచినీటి దోపిడీ ఓ వైపు నీటి కొరతతో నగర జనం విలవిల్లాడుతుంటే.. ఇంకోవైపు ఆ నీటిని అమ్ముకుంటూ అడ్డంగా దోచేశారు. ఆర్వో ప్లాంట్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముతున్న వ్యాపారులు ధరల్ని అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30 ఉండే 20 లీటర్ల వాటర్ క్యాన్ ఇవాళ రూ.70కి, రూ.50 ధర గల క్యాన్ రూ.100కి పైనే అమ్మకాలు చేశారు. 2 వేల లీటర్ల ట్యాంకర్ రూ.250 ఉండగా.. ఆదివారం డిమాండ్ పెరగడంతో రూ.500 నుంచి రూ.700 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. 5వేల లీటర్ల ట్యాంకర్ రూ.450కి విక్రయించాల్సి ఉండగా.. రూ.1000 నుంచి రూ.1500 వరకూ అడ్డగోలుగా అమ్మకాలు జరిపారు. అవసరం ఎంత ధరకైనా కొనేలా చేస్తుందనడానికి నిదర్శనంగా.. నీటి విక్రయదారులు చెప్పిన ధరకే కొనుగోలు చేసిన ప్రజలు ఉసూరుమన్నారు. నీటి విలువ తెలిసిందా చిన్నా... సోమవారం మధ్యాహ్నం వరకూ.. ఏలేరు కాలువ గండి కారణంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలోని 80 శాతం వరకు మంచినీటి సరఫరా బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువ గండిని పూడ్చి వేసినా ఏలేశ్వరం నుంచి నీటి ప్రవాహం నగరానికి చేరుకోవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ కారణంగా ఆదివారం సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తొలి రోజున గండికి మళ్లీ ఏదైనా ప్రమాదం సంభవిస్తుందోనన్న ఉద్దేశంతో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఆదివారం మరో 150 పెంచి 250 క్యూసెక్కుల నీటిని ఏలేశ్వరం నుంచి విడుదల చేశామని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు గురువారం వరకు సమ యం పట్టే అవకాశముందన్నారు. మరోవైపు తక్కువ స్థాయిలో నీరు వస్తుండటంతో పంపింగ్ చేసేందుకు సమయం పడుతుండటంతో సోమవారం మధ్యాహ్నానికి కొంత మేర సమస్య పరిష్కారమవుతుందని.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఈఈ వివరించారు. నరకం చూశాం కుళాయినీరు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. నీరు లేక అవసప్ధలు పడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం చూసినా రాకపోవడంతో స్నానం చేయలేని పరిస్థితి, అధికారులు స్పందించి కుళాయినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి– శైలజ, నక్కవానిపాలెం మంచినీటి సమస్య పరిష్కరించండి ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నగరంలో నీటి కొరత ఉన్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కుళాయి నీరు రాక రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కాలం ప్రతిరోజు కుళాయి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.శ్యామలదేవి, సీతమ్మధార -
నల్లా నీళ్లే బెస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారిలో సుమారు 85 శాతం మంది జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీటినే నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. మరో 15 శాతం మంది ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లు, ఇళ్లలో రివర్స్ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్ రేడియేషన్ కిరణాలతో నీటిని శుద్ధి చేసే మినీ ఫిల్టర్ల నీటిని తాగుతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ సౌజన్యంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రశాంత మహాపాత్ర నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇటీవలి కాలంలో వాటర్‌బోర్డు నగరంలోని 256 భారీ స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో తాగునీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. దీంతో వినియోగదారులు నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తుండడం విశేషం. గతంలో సిటీలో నల్లా నీటిని నేరుగా తాగేవారి శాతం 55 శాతానికి మించకపోవడం గమనార్హం. సర్వే సాగిందిలా.. గ్రేటర్ పరిధిలో జలమండలి నల్లా నీరు సరఫరా అవుతున్న 18 నిర్వహణ డివిజన్ల పరిధిలో సుమారు 1200 నివాస సముదాయాల వారిని నేరుగా కలవగా వారిలో 85 శాతం మంది నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నామని తెలిపారు. మరో 15 శాతం మందిని ఫిల్టర్‌నీటిని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. ఇక నల్లా నీటి నాణ్యతపై 47 శాతం మంది చాలా బాగుందని కితాబునిచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. ఇక కలుషిత జలాలు, అరకొరనీటిసరఫరా, తక్కువ వత్తిడితో నీటిసరఫరా, ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగు సమస్యలపై ఫిర్యాదులు, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, అధిక నీటిబిల్లులమోత తదితర సమస్యలపై తాము జలమండలి కస్టమర్ కేర్ 155313కి ఫోన్‌చేసిన వెంటనే 70 శాతం సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారని వినియోగదారులు తెలిపినట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక మరో 30 శాతం మంది తమ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారట. అత్యధిక ఫిర్యాదులు ఈ ప్రాంతాల నుంచే.. నగరంలో ప్రధానంగా... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, ప్రకాశ్‌నగర్, మారేడ్‌పల్లి, ఆస్మాన్‌ఘడ్, టోలిచౌకి ప్రాంతాల నుంచి గత నెలరోజులుగా 34,468 ఫిర్యాదులందాయని వీటిని విశ్లేషించగా..70 శాతం సమస్యలను ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పరిష్కరించగా..మరో 30 శాతం సమస్యలను రెండురోజుల్లో పరిష్కరించినట్లు సర్వేలో తేలింది. శివార్లకు జలసిరులే... గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లపరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో 2500 కి.మీ మార్గంలో తాగునీటి పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటుచేయడంతోపాటు మరో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను జలమండలి నిర్మించింది. ఇందులో ఇప్పటికే 40 రిజర్వాయర్లను ప్రారంభించారు. మరో 16 రిజర్వాయర్లను త్వరలో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుతో గ్రేటర్ పరిధిలో వెయ్యి కాలనీలు, బస్తీలకు దాహార్తి దూరమైంది. శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల మందికి కన్నీటి కష్టాలు దూరమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేని ఫిల్టర్‌ప్లాంట్ల నుంచి తాగునీటి కొనుగోలు చేసే అవస్థలు శివారువాసులకు తప్పడం విశేషం. 2020 వరకు తాగునీటికి ఢోకాలేదు ఇటీవలి భారీ వర్షాలకు గ్రేటర్దాహార్తిని తీరుస్తోన్న ఎల్లంపల్లి(గోదావరి), నాగార్జునసాగర్(కృష్ణా)జలాశయాల్లో నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో మహానగర తాగునీటికి మరో 2020 నాటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలోని 9.65 లక్షల నల్లాలకు నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని కొరతలేకుండా సరఫరా చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల మేరకు తాగునీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియను చేపడుతున్నాం. జలమండలి తాగునీటి నాణ్యతకు ఇటీవలే ఐఎస్ఓ ధ్రువీకరణ కూడా లభించింది. ఇదే స్ఫూర్తితో ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామపంచాయతీలు, 7 నగరపాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.700 కోట్లతో చేపట్టిన ఓఆర్ఆర్ తాగునీటి పథకం పనులను ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తిచేసి శివార్లకు దాహార్తిని దూరం చేస్తాం. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ -
జలమా..విషమా?
శివమొగ్గ: దాహం తీర్చాల్సిన నీరే ప్రాణాలను బలిగొంది. గ్రామంలో కొళాయిలద్వారా సరఫరా అయిన తాగునీరు వారి పాలిట విషంలా మారింది. కలుషిత నీటిని తాగడంతో ముగ్గురు మృతి చెందడంతో పాటు మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలో ఉన్న మైదూళ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఇద్దరు మృతి చెందిగా సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతులను పంచాక్షరి (75), శివప్ప(75) అతని కుమారుడు హనుమంత (35) గా గుర్తించారు. ఆరోగ్య శాఖ అధికారి హనుమంతప్ప మీడియాతో మాట్లాడుతూ మైదూళు గ్రామంలో మసీదు వెనుక బాగంలో ఉన్న తాగునీటి ట్యాంక్ నుంచి గ్రామవాసులకు తాగునీటి సరఫరా అవుతోంది. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ఇక్కడి ప్రజలకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయని, సుమారు 40 మందికి ఇలా అయ్యాయి, సుమారు 30 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు, అందులో ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఏమిటి కారణం? మిగతావారిలో 8 మందికి శివమొగ్గ మెగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తుండగా, మరో 15 మంది పలు ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో సోమవారం ఉదయమే గ్రామంలో ఉన్న నీటిని ఎవరూ కూడా తాగవద్దని అధికారులు చాటింపు వేయించారు. జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు, ఆ నీటిని కూడా వేడి చేసుకుని తాగాలని స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే పలు చోట్ల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తున్నారు. తాగునీటి ట్యాంకు అపరిశుభ్రత దీనికి కారణమై ఉండవచ్చని, నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందో తెలుస్తుందని అధికారులు అన్నారు. -
ఆ నీరు తాగారో అంతే...
సాక్షి,న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదని పంపు నీళ్లే మేలని నిపుణులు సూచిస్తుంటే ఇప్పుడో షాకింగ్ న్యూస్ వెల్లడైంది. దేశ రాజధానిలోని ట్యాప్ వాటర్‌లో 80 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలతో విషపూరితమైనదని తాజా పరిశోధన బాంబు పేల్చింది. న్యూయార్క్, వాషింగ్టన్, బీరుట్ తర్వాత ఇక్కడే అతిపెద్ద నీటి కాలుష్యం చోటుచేసుకుందని ఈ అథ్యయనం హెచ్చరించింది. ఐదు ఖండాల నుంచి సేకరించిన 150 పంపునీళ్ల శ్యాంపిల్స్‌ను పరిశీలించిన మీదట అథ్యయనం ఈ అంశాలను వెల్లడించడంతో పంపు నీళ్లంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో సంపన్న వర్గాలు పంపు నీళ్లను వాడకపోయినా కోట్లాది సామాన్య ప్రజలు మంచినీళ్ల కోసం ట్యాప్‌ల పైనే ఆధారపడతారు. దీంతో దేశ రాజధానివాసులకు రక్షిత మంచినీరు కరువైంది. అమెరికాలో ట్యాప్ వాటర్ 94 శాతం కలుషితమైంది. శాంపిల్స్‌ను చెక్ చేయగా ప్లాస్టిక్ ఫైబర్లు కంటపడ్డాయి. ఏకంగా కాంగ్రెస్ బిల్డింగ్స్, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్లోనూ కలుషిత నీరే అందుబాటులో ఉంది. ఇక లెబనాన్‌లోని బీరట్‌లో ట్యాప్ వాటర్ 93 శాతం విషపూరితం కాగా, భారత్‌లో ట్యాప్ వాటర్ 82 శాతం మేర ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిఉందని తేలింది. ఇక బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లో 72 శాతం కలుషిత నీరు సరఫరా జరుగుతోందని అథ్యయనంలో వెల్లడైంది. తాజా అథ్యయనంతో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కలుషిత మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయని తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంపై పెను ప్రభావం చూపుతాయని మరోసారి వెల్లడైందని నిపుణులు పేర్కొన్నారు. -
లీకేజీల జోరు..
తాగునీరు డ్రెయినేజీ పాలు మరమ్మతులకు లక్షలు వృథా అయినా ఆగని పైపులైన్ పగుళ్లు రోజు 2 ఎంఎల్డీలు వృథా కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో ఓ వైపు తాగునీటి కరువు ఉంటే..మరో వైపు ఎక్కడపడితే అక్కడ పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ప్రతీ రోజు దాదాపు 2 ఎంఎల్డీల నీరు లీకేజీలతో వృథా అవుతుందని అంచనా. ఇంత నీరు డ్రెయినేజీ పాలవుతున్న కార్పొరేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు. లీకులను అడ్డుకునే చర్యలు తీసుకోవడం లేదు. నగరానికి ప్రతి రోజు 30 ఎంఎల్డీల నీరు సరఫరా అవుతోంది. హైలెవల్, లోవెల్ విభాగాల్లో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. వీధికొక లీకేజీతో నీటి ప్రెషర్ తగ్గి చివరన ఉన్న నల్లాలకు సరిగ్గా సరఫరా కావడం లేదు. భగత్‌నగర్ ట్యాంకులోకి నీటిని నింపకుండానే బైపాస్ ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లీకులతో నీరు కూడా కలుషితమవుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. డ్రెయినేజీలో కలుస్తున్న తాగునీరు పైపులైన్ లీకేజీలు అరికట్టేందుకు ప్రతి నెల రూ.లక్షల్లో ఖర్చుచేస్తున్నారు. అయినా సత్ఫలితాలివ్వడం లేదు. నగరానికి సరఫరా అయ్యే 30 ఎంఎల్డీల్లో 2 ఎంఎల్డీల నీరు వృథాగానే పోతుందని సిబ్బంది అంచనా. ఈ వృథా నీటితో కనీసం ఒక డివిజన్‌కు నీటి సరఫరా చేయవచ్చు. నీటి సరఫరా సమయంలో సామర్థ్యం కంటే వాల్వ్‌లు ఎక్కువగా తిప్పడంతో ఉధృతి పెరిగి పైపులైన్లు పగులుతున్నాయని తెలుస్తోంది. మరమ్మతులు విఫలమవడానికి అధికారులు ఈ సూత్రాన్నే పాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే లీకేజీలు.. నగరంలోని హైలెవల్, లోలెవల్ సంప్‌లకు నీటి సరఫరా అందించే ఫిల్టర్‌బెడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ఉన్న ప్రధాన పైపులైన్‌కు ప్రతిరోజు ఎక్కడో ఒక లీకేజీ ఏర్పడుతూనే ఉంది. భగత్‌నగర్, రాంచంద్రాపూర్‌కాలనీ, సప్తగిరికాలనీ, రాంనగర్, బ్యాంక్‌కాలనీ, సుభాష్‌నగర్, అశోక్‌నగర్, కాపువాడ, కోతిరాంపూర్, శర్మనగర్, కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతాల్లో లెక్కకు మించి లీకులు కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రతిరోజు ఆయా డివిజన్లలో తవ్వకాలు చేపడుతున్నారు. పాతపైపులైన్లు కావడంతోనే ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపులు కావడంతో ప్రెషర్ తట్టుకోవడం లేదు. పాత పైపులైన్లు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరమ్మతులు వస్తున్నాయని, వీటి స్థానంలో కొత్త పైపులైన్లు వేయాలనే డిమాండ్ ఉంది. హడావిడిగా మరమ్మతులు చేపడుతుండడంతో లీకేజీలు మళ్లీ ఏర్పడుతున్నాయని నగరవాసులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
సంక్రాంతి కల్లా ఇంటింటికీ నల్లా నీరు
నర్సాపూర్ రూరల్ : వచ్చే సంక్రాంతి నాటికల్లా ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అన్నారు. బుధవారం నర్సాపూర్ 19వ వార్డులోకి వచ్చే తుక్కారాం గిరిజన తండాలో రక్షిత మంచినీటి ట్యాంక్‌ను ప్రారంభించి, గిరిజనుల ఇండ్ల వద్ద నల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్‌లైన్ పూర్తయితే తాగునీటి సమస్య ఉండదన్నారు. తండా సమీపంలో నూతనంగా నిర్మించిన ట్యాంక్ వద్ద ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బోగశేఖర్, నర్సాపూర్ సర్పంచ్ రమణారావు పాల్గొన్నారు. -
శుద్ధికి నీళ్లొదిలారు!
కుళాయి నీళ్లు గరళం.. ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాతో ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి! మరి ఫిల్టర్ నీళ్లు..?! రూ.20, రూ.30కే క్యాన్ నిండా ఫిల్టర్ నీళ్లంటూ భాగ్యనగరంలో గల్లీకొకటి చొప్పున పదివేలకు పైగా వెలసిన వాటర్ ప్లాంట్లు విక్రయిస్తున్న జలం సురక్షితమేనా? కానేకాదు.. అందులోనూ విష కారకాలున్నట్టు స్పష్టమైంది. ఎలాంటి గుర్తింపుల్లేకుండా ఈ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. ఈ నీటిని తాగినవారు టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వాటర్‌ప్లాంట్ నీళ్లలో గాఢత కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో నీరు ఆమ్లత్వం సంతరించుకుంటోంది. ఫలితంగా ఈ నీటిని తీసుకునేవారు గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రేటర్లో ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నాణ్యతను ‘సాక్షి’.. ల్యాబ్‌లో పరీక్షించింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహదూర్‌పురా, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు ఇవ్వగా.. ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. - హైదరాబాద్, సాక్షి * వాటర్ ప్లాంట్ల నీటిలోనూ కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా * జనం ప్రాణాలతో ప్లాంట్ల నిర్వాహకుల చెలగాటం కోట్లలో నీళ్ల వ్యాపారం గ్రేటర్లో జలమండలి సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై నమ్మకం లేక వినియోగదారులు ఫిల్టర్ ప్లాంట్ల నీటిని కొంటున్నారు. మహానగరంలో నెలకు వంద కోట్లకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోందని అంచనా. నగరంలో బీఐఎస్ జారీ చేసిన ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణ సర్టిఫికెట్ ఉన్న ప్లాంట్లు 500 మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా వెలిసినవి 10 వేలకు పైనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు సుమారు 20 లక్షలనీటి క్యాన్లు (20 లీటర్లవి) అమ్ముడవుతున్నాయి. వీటిలో 12 లక్షల క్యాన్లు అనధికారిక ప్లాంట్లవే కావడం గమనార్హం. ఇక ప్రముఖ బ్రాండ్లకు చెందినవి 5 లక్షలు, ఐఎస్ఐ గుర్తింపు పొందిన ప్లాంట్లలో తయారవుతున్నవి మరో 3 లక్షల క్యాన్లు ఉన్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్యాంటీన్లు, హోటళ్లలో విక్రయిస్తున్న మంచినీటి బాటిళ్ల సంఖ్య (లీటరువి) సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్ఐ గుర్తింపు ఉంది. నిద్రమత్తులో యంత్రాంగం.. బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలను వాటర్ ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా తుంగలోకి తొక్కుతున్నారు. ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై ఆహార కల్తీ నిరోధక చట్టం(ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్)-2006 కింద చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ.. ఆ బాధ్యతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కు కట్టబెట్టి తప్పించుకుంది. ఐపీఎం అయినా కొరడా ఝలిపిస్తోందా అంటే అదీ లేదు. కల్తీ నీళ్ల బాటిల్, లేబుల్, తయారీ సంస్థ పక్కా చిరునామా అందించి, స్వయంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఐపీఎం చెబుతోంది. ఇక బీఎస్ఐ.. ఐఎస్ఐ ధ్రువీకరణ ఉన్న ప్లాంట్లనే తనిఖీ చేస్తామని, మిగతా ప్లాంట్లతో తమకు సంబంధం లేదని గిరి గీసుకుని కూర్చుంది. ఈ నీళ్లు తాగడానికి పనికిరావు ప్రయోగశాలలో పరీక్షించిన ఫిల్టర్ ప్లాంట్ల నీళ్లు తాగడానికి పనికిరావు. భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేవు. ఫిల్టర్ నీళ్లలో గాఢత బాగా పడిపోయింది. - మాధవి, వాటర్ క్వాలిటీ మేనేజర్ రోగాలు తథ్యం తాగే నీటిలో కోలిఫాం, ఈ-కొలి తదితర బ్యాక్టీరియా ఆనవాళ్లుంటే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధుల బారిన పడతారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి నీటి ద్వారానే ఎక్కువగా శరీరంలోకి చేరుతాయి. మనిషికి ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల మెగ్నీషియం అవసరం. గర్భిణులకైతే మరింత ఎక్కువ కావాలి. ఇది ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా తీసుకోవడం చాలా అవసరం. శుద్ధి క్రమంలో ఆవశ్యక మూలకాలు తొలగిస్తున్న ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు.. ఆ ప్రక్రియ అనంతరం ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను కలపాలి. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, సన్షైన్ఆస్పత్రి పరీక్షల్లో ఏం తేలిందంటే..? * ఫిల్టర్ నీళ్ల గాఢత అత్యంత తక్కువగా ఉంది. సాధారణంగా తాగునీటి గాఢత 6.50-8.50 పీహెచ్ మధ్య ఉండాలి. కానీ ఈ నీటి గాఢత 5.50 పీహెచ్ లోపే ఉంది. ఈ నీటిని తాగినవారు పొడి దగ్గు, గొంతునొప్పి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. * ప్యాకేజీ వాటర్‌లో ప్రతి వంద మిల్లీలీటర్ల నీటిలో బ్యాక్టీరియా కౌంట్ 100 కాలనీ ఫామింగ్ యూనిట్స్(సీఎఫ్‌యూ) మించరాదు. కానీ పలుచోట్ల కోలిఫాం బ్యాక్టీరియా 200 సీఎఫ్‌యూ ఉంది. వీటిని తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. * భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లెక్కల ప్రకారం.. ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధిచేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు ప్రతి లీటరు నీటికి 100-150 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 50-76 మిల్లీ గ్రాములు మాత్రమే ఉంది. * ప్రతి లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి. కానీ కొన్నిచోట్ల ఒక మిల్లీగ్రాము, మరికొన్ని చోట్ల అసలు క్యాల్షియం ఆనవాళ్లే లేవు. * ప్రతి లీటరు నీటిలో మెగ్నీషియం మోతాదు 30 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 0.96 మిల్లీగ్రాములు ఉంది. కొన్నిచోట్ల అదీ లేదు. * లీటరు నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాములు మించరాదు. చాలా చోట్ల 1.5 మిల్లీగ్రాములుంది. * లీటరు నీటిలో ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములుండాలి. చాలాచోట్ల 0.02 మిల్లీ గ్రాములుంది. కొన్నిచోట్ల అదీ లేదు. వాటర్ ప్లాంట్లలో ఏం జరుగుతోంది? * భూగర్భ జలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిల్ట్రేషన్, ఏరేషన్, కార్బన్ ఫిల్ట్రేషన్.. ఇలా 12 రకాల శుద్ధి ప్రక్రియలు జరగాలి. కానీ అవన్నీ తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. = శుద్ధి చేసిన 48 గంటల తర్వాతే బాటిళ్లలో మంచినీటిని నింపాలి. కానీ వెంటనే నింపేస్తున్నారు. దీంతో నీటి గాఢత పడిపోతుంది. * చాలా ప్లాంట్లు మురికివాడలు, పారిశ్రామిక వాడలు, ఇరుకు గదుల్లోనే వెలిశాయి. వాటి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. * అనధికారిక ప్లాంట్లలో ప్రతి 20 లీటర్ల నీటి శుద్ధికి నిర్వాహకులు రూ.4 ఖర్చు చేసి, జనం నుంచి మాత్రం రూ.20 నుంచి రూ.30 వరకు దోచుకుంటున్నారు. * బీఐఎస్ ప్రమాణాల ప్రకారం.. నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌తో తయారైన వాటిని వినియోగించాలి. వీటి ధర రూ.280 నుంచి రూ.400 (20 లీటర్ల డబ్బా) వరకు ఉంటుంది. కానీ ధర ఎక్కువన్న కారణంతో ప్లాంట్లలో నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి రూ.120 లోపే ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది. ఇలా చేయండి.. * కుళాయి నీరు అయినా ఫిల్టర్ నీళ్లయినా బాగా మరిగించి, చల్లార్చి తాగితే మేలని నిపుణులు సూచిస్తున్నారు. * ఇంట్లోకి నీటి ఫిల్టర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఎస్ఐ నాణ్యతతో ఉన్నవి తీసుకోవాలి. * ప్యాకేజీ, ఫిల్టర్ నీళ్లను విక్రయిస్తున్న వారికి భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) జారీ చేసిన ఐఎస్ఐ గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. * హైదరాబాద్‌లో మినరల్ వాటర్ విక్రయిస్తున్న సంస్థలు 10 లోపే ఉన్నాయి. ఈ సంస్థలు నీటిని ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయడంతోపాటు దేహానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాల(మినరల్స్)ను కలుపుతాయి. * ఫిల్టర్ ప్లాంట్లు నీటిని శుద్ధి చేస్తాయి. మినరల్ వాటర్ కంపెనీలు నీటిని శుద్ధి చేసి మినరల్స్ కలుపుతాయి.