ఆదివారం స్నానానికి సెలవు | Water Supply Stops in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆదివారం స్నానానికి సెలవు

Published Mon, Apr 22 2019 10:33 AM | Last Updated on Fri, Apr 26 2019 11:53 AM

Water Supply Stops in Visakhapatnam - Sakshi

ఆదివారం.. హాయిగా సేద తీరుదామనుకున్న నగరవాసులుఉదయం లేచింది మొదలు.. ఉరుకులు పరుగులు పెట్టారు.ఎక్కడైనా చుక్కనీరు దొరుకుతుందా అని ఎదురు చూశారు.లేచింది మొదలు.. ట్యాప్‌ కనెక్షన్‌ వైపు చూస్తూ గడిపారు. చివరికిస్నానానికి కాదు.. కనీసం తాగడానికి నీరు దొరికితే చాలన్నపరిస్థితికి వచ్చేశారు. సండే రోజున చాలా మంది స్నానానికి కూడాసెలవిచ్చేశారంటే తాగునీటి ఇబ్బందులు నగర ప్రజలు ఎలాఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏలేరుకాలువకు పడిన గండి కారణంగా నగరంలో ఈ పరిస్థితిదాపురించిందని, సోమవారం మధ్యాహ్నానికి పరిస్థితి చక్కబడేఅవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

విశాఖసిటీ:  మహా నగరం నీటి చుక్క దొరక్క విలవిలలాడింది. ఇళ్లల్లో నీటి ఎద్దడి కారణంగా ఆదివారం  సెలవు సందడి కనిపించకుండా పోయింది . ఇంట్లో ఉన్న కొద్దిపాటి నీరు ఎక్కడ అయిపోతుందోనని సగానికి పైగా నగరవాసులు స్నానానికి సెలవిచ్చేశారు. నగర వ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు దొరక్కపోతే.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు.

ఉదయం లేచింది మొదలు..
నీటి సరఫరా ఆదివారం లేదని తెలుసుకున్న మరుక్షణమే నగర వాసుల గుండె గుభేలంది. అసలే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మోటర్ల ద్వారా నీరు తోడుకుందామంటే చుక్క నీరు రాకపోవడంతో మానసికంగా  ఇబ్బంది పడ్డారు. ఓవైపు మోటర్ల ద్వారా నీరు రాక.. మరోవైపు.. జీవీఎంసీ నీటి సరఫరా లేకపోవడంతో బిందెడు నీరైనా సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే ఆదివారమంతా గడిపేశారు. మరికొందరు చుట్టు పక్కల ఉన్న బోర్లపై ఆధారపడ్డారు. ఇంకొందరు.. సమీప ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లడం గమనార్హం.

మంచినీటి దోపిడీ
ఓ వైపు నీటి కొరతతో నగర జనం విలవిల్లాడుతుంటే.. ఇంకోవైపు ఆ నీటిని అమ్ముకుంటూ అడ్డంగా దోచేశారు. ఆర్‌వో ప్లాంట్‌లు, ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముతున్న వ్యాపారులు ధరల్ని అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30 ఉండే 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌  ఇవాళ రూ.70కి, రూ.50 ధర గల క్యాన్‌ రూ.100కి పైనే అమ్మకాలు చేశారు. 2 వేల లీటర్ల ట్యాంకర్‌ రూ.250 ఉండగా.. ఆదివారం డిమాండ్‌ పెరగడంతో రూ.500 నుంచి రూ.700 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. 5వేల లీటర్ల ట్యాంకర్‌ రూ.450కి విక్రయించాల్సి ఉండగా.. రూ.1000 నుంచి రూ.1500 వరకూ అడ్డగోలుగా అమ్మకాలు జరిపారు. అవసరం  ఎంత ధరకైనా కొనేలా చేస్తుందనడానికి నిదర్శనంగా.. నీటి విక్రయదారులు చెప్పిన ధరకే కొనుగోలు చేసిన ప్రజలు ఉసూరుమన్నారు.

నీటి విలువ తెలిసిందా చిన్నా...
సోమవారం మధ్యాహ్నం వరకూ..
ఏలేరు కాలువ గండి కారణంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలోని 80 శాతం వరకు మంచినీటి సరఫరా బంద్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువ గండిని పూడ్చి వేసినా  ఏలేశ్వరం నుంచి నీటి ప్రవాహం నగరానికి చేరుకోవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ కారణంగా ఆదివారం సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తొలి రోజున గండికి మళ్లీ ఏదైనా ప్రమాదం సంభవిస్తుందోనన్న ఉద్దేశంతో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఆదివారం మరో 150 పెంచి 250 క్యూసెక్కుల నీటిని ఏలేశ్వరం నుంచి విడుదల చేశామని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు గురువారం వరకు సమ యం పట్టే అవకాశముందన్నారు. మరోవైపు  తక్కువ స్థాయిలో నీరు వస్తుండటంతో పంపింగ్‌ చేసేందుకు సమయం పడుతుండటంతో సోమవారం మధ్యాహ్నానికి కొంత మేర సమస్య పరిష్కారమవుతుందని.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఈఈ  వివరించారు.

నరకం చూశాం
కుళాయినీరు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. నీరు లేక అవసప్ధలు పడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం చూసినా రాకపోవడంతో   స్నానం చేయలేని పరిస్థితి, అధికారులు స్పందించి కుళాయినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి– శైలజ, నక్కవానిపాలెం

మంచినీటి సమస్య పరిష్కరించండి
ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నగరంలో నీటి కొరత ఉన్నప్పటికీ  అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కుళాయి నీరు రాక  రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కాలం ప్రతిరోజు కుళాయి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.శ్యామలదేవి, సీతమ్మధార

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement