శుద్ధికి నీళ్లొదిలారు! | Lives of people With water Plants Administrators | Sakshi
Sakshi News home page

శుద్ధికి నీళ్లొదిలారు!

Published Fri, Oct 16 2015 3:46 AM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

శుద్ధికి నీళ్లొదిలారు! - Sakshi

శుద్ధికి నీళ్లొదిలారు!

కుళాయి నీళ్లు గరళం.. ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాతో ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి! మరి ఫిల్టర్ నీళ్లు..?! రూ.20, రూ.30కే క్యాన్ నిండా ఫిల్టర్ నీళ్లంటూ భాగ్యనగరంలో గల్లీకొకటి చొప్పున పదివేలకు పైగా వెలసిన వాటర్ ప్లాంట్లు విక్రయిస్తున్న జలం సురక్షితమేనా? కానేకాదు.. అందులోనూ విష కారకాలున్నట్టు స్పష్టమైంది. ఎలాంటి గుర్తింపుల్లేకుండా ఈ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. ఈ నీటిని తాగినవారు టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు వాటర్‌ప్లాంట్ నీళ్లలో గాఢత కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో నీరు ఆమ్లత్వం సంతరించుకుంటోంది. ఫలితంగా ఈ నీటిని తీసుకునేవారు గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రేటర్‌లో ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నాణ్యతను ‘సాక్షి’.. ల్యాబ్‌లో పరీక్షించింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహదూర్‌పురా, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు ఇవ్వగా.. ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి.
- హైదరాబాద్, సాక్షి

 
* వాటర్ ప్లాంట్ల నీటిలోనూ కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా
* జనం ప్రాణాలతో ప్లాంట్ల నిర్వాహకుల చెలగాటం
 
కోట్లలో నీళ్ల వ్యాపారం
గ్రేటర్‌లో జలమండలి సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై నమ్మకం లేక వినియోగదారులు ఫిల్టర్ ప్లాంట్ల నీటిని కొంటున్నారు. మహానగరంలో నెలకు వంద కోట్లకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోందని అంచనా. నగరంలో బీఐఎస్ జారీ చేసిన ఐఎస్‌ఐ నాణ్యతా ప్రమాణ సర్టిఫికెట్ ఉన్న ప్లాంట్లు 500 మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా వెలిసినవి 10 వేలకు పైనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు సుమారు 20 లక్షలనీటి క్యాన్లు (20 లీటర్లవి) అమ్ముడవుతున్నాయి.

వీటిలో 12 లక్షల క్యాన్లు అనధికారిక ప్లాంట్లవే కావడం గమనార్హం. ఇక ప్రముఖ బ్రాండ్లకు చెందినవి 5 లక్షలు, ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన ప్లాంట్లలో తయారవుతున్నవి మరో 3 లక్షల క్యాన్లు ఉన్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్యాంటీన్లు, హోటళ్లలో విక్రయిస్తున్న మంచినీటి బాటిళ్ల సంఖ్య (లీటరువి) సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్‌ఐ గుర్తింపు ఉంది.
 
నిద్రమత్తులో యంత్రాంగం..
బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలను వాటర్ ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా తుంగలోకి తొక్కుతున్నారు. ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై ఆహార కల్తీ నిరోధక చట్టం(ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్)-2006 కింద చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ.. ఆ బాధ్యతను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కు కట్టబెట్టి తప్పించుకుంది. ఐపీఎం అయినా కొరడా ఝలిపిస్తోందా అంటే అదీ లేదు. కల్తీ నీళ్ల బాటిల్, లేబుల్, తయారీ సంస్థ పక్కా చిరునామా అందించి, స్వయంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఐపీఎం చెబుతోంది. ఇక బీఎస్‌ఐ.. ఐఎస్‌ఐ ధ్రువీకరణ ఉన్న ప్లాంట్లనే తనిఖీ చేస్తామని, మిగతా ప్లాంట్లతో తమకు సంబంధం లేదని గిరి గీసుకుని కూర్చుంది.
 
ఈ నీళ్లు తాగడానికి పనికిరావు
 ప్రయోగశాలలో పరీక్షించిన ఫిల్టర్ ప్లాంట్ల నీళ్లు తాగడానికి పనికిరావు. భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేవు. ఫిల్టర్ నీళ్లలో గాఢత బాగా పడిపోయింది.
- మాధవి, వాటర్ క్వాలిటీ మేనేజర్
 
రోగాలు తథ్యం
తాగే నీటిలో కోలిఫాం, ఈ-కొలి తదితర బ్యాక్టీరియా ఆనవాళ్లుంటే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధుల బారిన పడతారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి నీటి ద్వారానే ఎక్కువగా శరీరంలోకి చేరుతాయి. మనిషికి ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల మెగ్నీషియం అవసరం. గర్భిణులకైతే మరింత ఎక్కువ కావాలి. ఇది ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా తీసుకోవడం చాలా అవసరం. శుద్ధి క్రమంలో ఆవశ్యక మూలకాలు తొలగిస్తున్న ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు.. ఆ ప్రక్రియ అనంతరం ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను కలపాలి. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, సన్‌షైన్‌ఆస్పత్రి
 
పరీక్షల్లో ఏం తేలిందంటే..?
* ఫిల్టర్ నీళ్ల గాఢత అత్యంత తక్కువగా ఉంది. సాధారణంగా తాగునీటి  గాఢత 6.50-8.50 పీహెచ్ మధ్య ఉండాలి. కానీ ఈ నీటి గాఢత 5.50 పీహెచ్ లోపే ఉంది. ఈ నీటిని తాగినవారు పొడి దగ్గు, గొంతునొప్పి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.
* ప్యాకేజీ వాటర్‌లో ప్రతి వంద మిల్లీలీటర్ల నీటిలో బ్యాక్టీరియా కౌంట్ 100 కాలనీ ఫామింగ్ యూనిట్స్(సీఎఫ్‌యూ) మించరాదు. కానీ పలుచోట్ల కోలిఫాం బ్యాక్టీరియా 200 సీఎఫ్‌యూ ఉంది. వీటిని తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
* భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లెక్కల ప్రకారం.. ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధిచేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు ప్రతి లీటరు నీటికి 100-150 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 50-76 మిల్లీ గ్రాములు మాత్రమే ఉంది.
* ప్రతి లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి. కానీ కొన్నిచోట్ల ఒక మిల్లీగ్రాము, మరికొన్ని చోట్ల అసలు క్యాల్షియం ఆనవాళ్లే లేవు.
* ప్రతి లీటరు నీటిలో మెగ్నీషియం మోతాదు 30 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 0.96 మిల్లీగ్రాములు ఉంది. కొన్నిచోట్ల అదీ లేదు.
* లీటరు నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాములు మించరాదు. చాలా చోట్ల 1.5 మిల్లీగ్రాములుంది.
* లీటరు నీటిలో ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములుండాలి. చాలాచోట్ల 0.02 మిల్లీ గ్రాములుంది. కొన్నిచోట్ల అదీ లేదు.
 
వాటర్ ప్లాంట్లలో ఏం జరుగుతోంది?
* భూగర్భ జలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిల్ట్రేషన్, ఏరేషన్, కార్బన్ ఫిల్ట్రేషన్.. ఇలా 12 రకాల శుద్ధి ప్రక్రియలు జరగాలి. కానీ అవన్నీ తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. = శుద్ధి చేసిన 48 గంటల తర్వాతే బాటిళ్లలో మంచినీటిని నింపాలి. కానీ వెంటనే నింపేస్తున్నారు. దీంతో నీటి గాఢత పడిపోతుంది.
* చాలా ప్లాంట్లు మురికివాడలు, పారిశ్రామిక వాడలు, ఇరుకు గదుల్లోనే వెలిశాయి. వాటి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది.
* అనధికారిక ప్లాంట్లలో ప్రతి 20 లీటర్ల నీటి శుద్ధికి నిర్వాహకులు రూ.4 ఖర్చు చేసి, జనం నుంచి మాత్రం రూ.20 నుంచి రూ.30 వరకు దోచుకుంటున్నారు.
* బీఐఎస్ ప్రమాణాల ప్రకారం.. నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌తో తయారైన వాటిని వినియోగించాలి. వీటి ధర రూ.280 నుంచి రూ.400 (20 లీటర్ల డబ్బా) వరకు ఉంటుంది. కానీ ధర ఎక్కువన్న కారణంతో ప్లాంట్లలో నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి రూ.120 లోపే ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది.
 
ఇలా చేయండి..
* కుళాయి నీరు అయినా ఫిల్టర్ నీళ్లయినా బాగా మరిగించి, చల్లార్చి తాగితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఇంట్లోకి నీటి ఫిల్టర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఎస్‌ఐ నాణ్యతతో ఉన్నవి తీసుకోవాలి.
* ప్యాకేజీ, ఫిల్టర్ నీళ్లను విక్రయిస్తున్న వారికి భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) జారీ చేసిన ఐఎస్‌ఐ గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి.
* హైదరాబాద్‌లో మినరల్ వాటర్ విక్రయిస్తున్న సంస్థలు 10 లోపే ఉన్నాయి. ఈ సంస్థలు నీటిని ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయడంతోపాటు దేహానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాల(మినరల్స్)ను కలుపుతాయి.
* ఫిల్టర్ ప్లాంట్లు నీటిని శుద్ధి చేస్తాయి. మినరల్ వాటర్ కంపెనీలు నీటిని శుద్ధి చేసి మినరల్స్ కలుపుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement