100 మంది పోలీసులతో ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ నేతలు
ఇంటిని చుట్టుముట్టడంతో గుండెపోటుకు గురైన తల్లి
గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు. పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు.
గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు. టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు.
టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
వాటర్ ప్లాంట్‌ను కూల్చిన టీడీపీ శ్రేణులు
గుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు వలివర్తిపాడు క్రాస్‌లోని వాటర్ ప్లాంట్‌ను టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులు గురువారం రాత్రి దౌర్జన్యంగా కూల్చివేశారు. గుంపుగా వచ్చి షట్టర్లు పగులగొట్టి ప్లాంట్ నడుపుతున్న వ్యక్తిపై దాడి చేయడంతో అతడి చెయ్యి విరిగింది. అతని భార్యను బయటకు నెట్టేసి భయానక వాతావరణం సృష్టించారు. వాటర్ ప్లాంట్‌లోని పరికరాలు, మోటార్, పైపులను ధ్వంసం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇప్పటికైనా స్పందించి గొడవలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment