పోలింగ్ ముగిసినా కొనసాగిస్తున్న ఎల్లోబ్యాచ్
బీటెక్ రవితో రహస్య ఒప్పందాలంటూ వండి వార్చిన ఎల్లోమీడియా
వైఎస్సార్‌సీపీ నేతల మధ్య కలతలు..విభేదాలు సృష్టించే ఎత్తుగడ
కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం తథ్యం
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి తగ్గనున్న ఓట్లు
సాక్షి ప్రతినిధి, కడప: పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉంది. జనం తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కౌంటింగ్ చేపట్టడమే తరువాయి. అయినా ఇప్పటికీ ఎల్లోబ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను వీడడం లేదు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. కాబట్టే పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో రహస్య ఒప్పందాలు చేపట్టారని తోకపత్రిక వండివార్చింది. హవ్వా..నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహారం ఉండిపోయింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డిని ఎంపిక చేసి బలిపీఠం ఎక్కించారు. భూపేష్ విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోగా, ఎదుటిపార్టీపై బురద చల్లి అంతర్గత కలతలు, విభేదాలు సృష్టించే ఎత్తుగడను ఎంచుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్‌చార్జిగా భూపేష్‌రెడ్డి జనం మధ్యకు వెళ్లారు. నిత్యం జనంతోనే ఉంటూ తన పరపతి పెంచుకున్నారు. టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆదినారాయణరెడ్డి తెరపైకి వచ్చి, ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించేలా చక్రం తిప్పారు. భూపేష్ ఆశలు అడియాశలయ్యాయి. జమ్మలమడుగులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆ నిర్ణయం ఆదినారాయణరెడ్డి నోట్లో వెలక్కాయపడ్డట్లయింది. భూపేష్ మద్దతు లేకపోతే, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా రాజకీయ మనుగడ సాధించలేననే నిర్ణయానికి వచ్చారు. జిల్లా నేతల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పార్లమెంట్ అభ్యరి్థత్వం ఖరారయ్యే వరకు జమ్మలమడుగు గడ్డపై అడుగు పెట్టలేదు. ఈపరిణామం మొత్తం జిల్లా వాసులకు ఎరుకే.
లోపాయికారి ఒప్పందం టీడీపీదే....
కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు అధికంగా వస్తున్న నియోజకవర్గాల్లో మొదటిది పులివెందులే. బీటెక్ రవికి పడిన ప్రతి ఓటు అక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు పడాలి. ఎందుకంటే అవన్నీ టీడీపీ సంప్రదాయ ఓట్లు కాబట్టి. స్వయంగా బీటెక్ రవికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో ఉన్న రహస్య ఒప్పందం మేరకు ఎంపీ అభ్యర్థి భూపేష్‌కు అక్కడ గండికొట్టారు. క్రాస్ ఓటింగ్ చేయించారు. కాంగ్రెస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న టీడీపీ నేతలే, ఎదుటివాళ్లపై బురద వేసేందుకు ఎల్లోబ్యాచ్‌తో తప్పుడు రాతలు రాయించే పనిలో నిమగ్నమయ్యారని పలువురు వివరిస్తున్నారు.
హవ్వా...ఓటమి భయమా..?!
కడప ఎంపీగా ఇప్పటికీ రెండు పర్యాయాలు వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, రెండో మారు 3.80లక్షల ఓట్ల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో పర్యాయం తలపడ్డారు. ఈ సారి కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీ సాధించే వారిలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఓటమి భయం పట్టుకున్నట్లు ఎల్లోమీడియా చెప్పుకు రావడం విశేషం. తగ్గట్లుగా కథనం వండివార్చి బీటెక్ రవితో రహస్య ఒప్పందమంటూ వైఎస్సార్‌సీపీలో అంతర్గత కలతలు రేపేందుకు సిద్ధమయ్యారని పలువురు వివరిస్తుండడం గమనార్హం.
తెరపైకి వచ్చిన తెలుగుకాంగ్రెస్...
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షరాలు షర్మిల తెరపైకి వచ్చారు. ప్రచారం ఆరంభం నుంచి షర్మిలతో టీడీపీ నేతలు జతకట్టారు. పరస్పర అవగాహనకు వచ్చారు. టీడీపీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థి భూపేష్‌కు ఓటు అడడగం పూర్తిగా మానుకున్నారు.
కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు మినహా తక్కిన టీడీపీ అభ్యర్థులు డమ్మీ బ్యాలెట్ కూడా చూపలేదు. వాస్తవంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో స్వతహా అనుబంధం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీ అభ్యర్థికి ఓట్లు సమానంగా వచ్చినా, తక్కిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చే ఓట్ల కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
టీడీపీ నేతల శల్య సారథ్యం వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ పడ్డట్లు తెలుస్తోంది. తెలుగు కాంగ్రెస్ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు భారీగా ఓట్లు ఖాతాలోకి రానున్నాయి. 2019లో ఆ పార్టీ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములుకు 8,341 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదేవిధంగా 2019 టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడికి 4,02,773 ఓట్లు లభించాయి. ఆ ఓట్లు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి రావడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment