సాక్షి, గుంటూరు: మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. నాపై దాడులు చేసి.. మళ్లీ నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు.
‘‘టీడీపీ కరపత్రంలా ఈనాడు మారింది. ఇప్పటికే ఎల్లో మీడియాకు నోటీసులు పంపాం. మదనపల్లె ఘటనపై విచారణ చేయమని మొదట్నుంచీ కోరుతున్నాం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్.. నిజాలు నిగ్గు తేలేవరకు తాను పార్లమెంట్‌లో పోరాడతా’’ అని మిథున్‌రెడ్డి తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందన్నారు. గడిచిన కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మదనపల్లి ఘటనలో నిజానిజాలు తేలాలని ఇప్పటికే మూడుదఫాలు మీడియా ముందు చెప్పామని… ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈనాడులో తమపై వరుసగా వస్తున్న తప్పుడు కథనాలన్నీ ఒక పద్దతిప్రకారం జరుగుతున్నాయన్నారు. ఈ తప్పుడు వార్తలపై పరువునష్టం దావా కోసం నోటీసులు కూడా ఇచ్చామని.. అయినా ఇంకా వరుసగా తప్పుడు కథనాలు రాస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై ఆధారాలు చూపమంటే స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రచారం చేసినా తాము ఎన్నికల్లో విజయం సాధించామని.. దీంతో ఓర్వలేక అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు.
దేశంలో అతిపెద్ద కుంభకోణమైన మార్గదర్శిపై తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారంలో తప్పుపడుతూ కోర్టుకెళ్లిందన్నారు. అడిగేవాళ్లు లేరని అవాస్తవాలు ప్రచురించి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్న ఈనాడు సంస్ధలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ తో సహా వీళ్ల అక్రమాలన్నీ బయట పెడతామన్నారు. తమను మానసికంగానూ, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈనాడు ఈ కథనాలు రాస్తోందని.. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈనాడు యాజమాన్యం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారిపోయి.. టీడీపీ నేతలు ఎవరిని నిర్ణయిస్తే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన కథనాలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తరహా రాతలు రాస్తున్నారని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న దాడులతో టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారని.. తమపై దాడి చేసి కేసులు కూడా తిరిగి తమపై పెడుతున్నారని మిథున్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment