మృతి చెందిన శివప్ప హనుమంత( పైల్‌ఫొటో)
శివమొగ్గ: దాహం తీర్చాల్సిన నీరే ప్రాణాలను బలిగొంది. గ్రామంలో కొళాయిలద్వారా సరఫరా అయిన తాగునీరు వారి పాలిట విషంలా మారింది. కలుషిత నీటిని తాగడంతో ముగ్గురు మృతి చెందడంతో పాటు మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలో ఉన్న మైదూళ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఇద్దరు మృతి చెందిగా సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతులను పంచాక్షరి (75), శివప్ప(75) అతని కుమారుడు హనుమంత (35) గా గుర్తించారు. ఆరోగ్య శాఖ అధికారి హనుమంతప్ప మీడియాతో మాట్లాడుతూ మైదూళు గ్రామంలో మసీదు వెనుక బాగంలో ఉన్న తాగునీటి ట్యాంక్ నుంచి గ్రామవాసులకు తాగునీటి సరఫరా అవుతోంది. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా ఇక్కడి ప్రజలకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయని, సుమారు 40 మందికి ఇలా అయ్యాయి, సుమారు 30 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు, అందులో ముగ్గురు చనిపోయారని చెప్పారు.
ఏమిటి కారణం?
మిగతావారిలో 8 మందికి శివమొగ్గ మెగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తుండగా, మరో 15 మంది పలు ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో సోమవారం ఉదయమే గ్రామంలో ఉన్న నీటిని ఎవరూ కూడా తాగవద్దని అధికారులు చాటింపు వేయించారు. జిల్లా అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు, ఆ నీటిని కూడా వేడి చేసుకుని తాగాలని స్థానిక ప్రజలకు సూచిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే పలు చోట్ల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యసేవలందిస్తున్నారు. తాగునీటి ట్యాంకు అపరిశుభ్రత దీనికి కారణమై ఉండవచ్చని, నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందో తెలుస్తుందని అధికారులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment