గొంతులో గరళం | Drinking Water Pipes Leaks And Spread Draingae Water In West Godavari | Sakshi
Sakshi News home page

గొంతులో గరళం

Published Fri, Jun 22 2018 10:28 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

Drinking Water Pipes Leaks And Spread Draingae Water In West Godavari - Sakshi

తూర్పు వీధిలో డ్రెయినేజీలోని మురుగులో ఉన్న మంచినీటి పైప్‌లు

ద్వారకాతిరుమల: గరళాన్ని తలపించే ఇక్కడి కుళాయి నీళ్లు తాగాలంటే ప్రజలు హడలిపోతున్నారు. తాగునీటి పైపుల లీకేజీలు, మ్యాన్‌ హోల్స్‌లోని వాల్వుల వద్ద చేరుతున్న మురుగు నీరు.. వెరసి గ్రామానికి కలుషితమైన నీరు సరఫరా అవుతోంది. అలాగే మంచినీటి పైప్‌లైన్లు డ్రెయినేజీల్లో ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పైపులకు ఉన్న లీకేజీల కారణంగా మురుగునీరు తాగునీటిలో కలసి సరఫరా అవుతోంది. దీంతో గ్రామంలోని ప్రజలకు ఈ కలుషిత నీరే దిక్కవుతోంది. అయినా పంచాయతీ అధికారులు, పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల పంచాయతీ పరిధిలో గ్రామస్తులకు కొంతకాలంగా దుర్వాసన వెదజల్లుతున్న డ్రెయినేజీ మురుగు నీరే కుళాయిల ద్వారా అందుతోంది.

దీనిపై స్థానికులు కొందరు గురువారం సైతం పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి పంచాయతీ సరఫరా చేసే నీటిని తాగడం మాట పక్కనబెడితే కనీసం వాడుకకు కూడా పనికిరావడం లేదు. డ్రెయినేజీల్లోని మురుగు నీరు, మలమూత్రాలు పైప్‌లైన్లలోకి చేరి కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా అవుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య తీరడం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్నాళ్లుగా గ్రామంలోని టీటీడీ సదనం కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న గృహాలకు, అలాగే మావులేటి సోమరాజు సదనం వెనుక వీధులకు, చెరువు వీధి పరిసర ప్రాంతాలకు అందుతున్న నీరు మరింత అధ్వానంగా ఉంది. ఈ నీటిని చేత్తో ముట్టుకోవడానికి కూడా అసహ్యం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల తాము రోగాల పాలవుతున్నామని, అలాగే చర్మ వ్యాధులు వస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ప్రతి దానికి పన్నులు వసూలు చేస్తున్న అధికారులు కనీసం స్వచ్ఛమైన నీటిని అందించలేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

వాడుకకూ మినరల్‌ వాటరే దిక్కా?
గ్రామంలో నీటి కాలుష్యం కారణంగా దాదాపు 75 శాతం మందికి పైగా ప్రజలు మినరల్‌ వాటర్‌నే తాగుతున్నారు. కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటిని వాడుకకు వినియోగిస్తుంటే చర్మరోగాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వాడుకకు కూడా నీరు కొనాలంటే ఎలా.. అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలికే పాలకులు ఈ నీటిని వినియోగిస్తే తెలుస్తుందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కలుషిత మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement