తాగునీటి ట్యాంకులో లభ్యమైన విషపు బాటిల్, ఎలుకల మందు ప్యాకెట్టు
తిరువొత్తియూరు: పెను ప్రమాదం నుంచి 40 మంది విద్యార్థులను ఆ పాఠశాల ఉద్యోగిని రక్షించింది. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాలు.. వేదారణ్యం, మరుదూర్ నార్త్ వళియాన్ శెట్టి కట్టలై ప్రాంతంలో పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 40 మందిపైగా విద్యార్థులు చదువుతున్నారు. తాగునీటి కోసం పాఠశాలలో వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చిన నాగమ్మాళ్ కుళాయిని తెరిచింది.
దుర్వాసనతో రంగుమారిన స్థితిలో నీరు వచ్చింది. సందేహంతో నాగమ్మాల్ ట్యాంకుపైకి ఎక్కి చూడగా క్రిమిసంహారక మందు బాటిల్, ఎలుక మందు ప్యాకెట్లు నీటిలో పడి ఉన్నాయి. వెంటనే నాగమ్మాల్ పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపింది. ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. వెంటనే వైద్యుల బృందాన్ని అక్కడికి రప్పించారు. పరిశీలించిన వైద్యులు తాగునీటిలో విషం కలిసిందని తెలిపారు. పెను ప్రమాదాన్ని తప్పించిన నాగమ్మాల్‌కు పాఠశాల, గ్రామ ప్రజల తరఫున రూ.500 నగదు బహుమతి అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment