సాక్షి,న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సురక్షితం కాదని పంపు నీళ్లే మేలని నిపుణులు సూచిస్తుంటే ఇప్పుడో షాకింగ్ న్యూస్ వెల్లడైంది. దేశ రాజధానిలోని ట్యాప్ వాటర్‌లో 80 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాలతో విషపూరితమైనదని తాజా పరిశోధన బాంబు పేల్చింది. న్యూయార్క్, వాషింగ్టన్, బీరుట్ తర్వాత ఇక్కడే అతిపెద్ద నీటి కాలుష్యం చోటుచేసుకుందని ఈ అథ్యయనం హెచ్చరించింది. ఐదు ఖండాల నుంచి సేకరించిన 150 పంపునీళ్ల శ్యాంపిల్స్‌ను పరిశీలించిన మీదట అథ్యయనం ఈ అంశాలను వెల్లడించడంతో పంపు నీళ్లంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఢిల్లీలో సంపన్న వర్గాలు పంపు నీళ్లను వాడకపోయినా కోట్లాది సామాన్య ప్రజలు మంచినీళ్ల కోసం ట్యాప్‌ల పైనే ఆధారపడతారు. దీంతో దేశ రాజధానివాసులకు రక్షిత మంచినీరు కరువైంది. అమెరికాలో ట్యాప్ వాటర్ 94 శాతం కలుషితమైంది. శాంపిల్స్‌ను చెక్ చేయగా ప్లాస్టిక్ ఫైబర్‌లు కంటపడ్డాయి. ఏకంగా కాంగ్రెస్ బిల్డింగ్స్, న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లోనూ కలుషిత నీరే అందుబాటులో ఉంది. ఇక లెబనాన్‌లోని బీరట్‌లో ట్యాప్ వాటర్ 93 శాతం విషపూరితం కాగా, భారత్‌లో ట్యాప్ వాటర్ 82 శాతం మేర ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిఉందని తేలింది.
ఇక బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లో 72 శాతం కలుషిత నీరు సరఫరా జరుగుతోందని అథ్యయనంలో వెల్లడైంది. తాజా అథ‍్యయనంతో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కలుషిత మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయని తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంపై పెను ప్రభావం చూపుతాయని మరోసారి వెల్లడైందని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment