నల్లా నీళ్లే బెస్ట్‌! | Tap Water best For Driniking in Hyderabad | Sakshi
Sakshi News home page

నల్లా నీళ్లే బెస్ట్‌!

Published Mon, Sep 10 2018 9:37 AM | Last Updated on Sat, Sep 15 2018 11:01 AM

Tap Water best For Driniking in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో నల్లా కనెక్షన్లు ఉన్నవారిలో సుమారు 85 శాతం మంది జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీటినే నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది. మరో 15 శాతం మంది ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లు, ఇళ్లలో రివర్స్‌ ఆస్మోసిస్, అల్ట్రా వయోలెట్‌ రేడియేషన్‌ కిరణాలతో నీటిని శుద్ధి చేసే మినీ ఫిల్టర్ల నీటిని తాగుతున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ సౌజన్యంతో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రశాంత మహాపాత్ర నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇటీవలి కాలంలో వాటర్‌బోర్డు నగరంలోని 256 భారీ స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో తాగునీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. దీంతో వినియోగదారులు నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తుండడం విశేషం. గతంలో సిటీలో నల్లా నీటిని నేరుగా తాగేవారి శాతం 55 శాతానికి మించకపోవడం గమనార్హం.

సర్వే సాగిందిలా..
గ్రేటర్‌ పరిధిలో జలమండలి నల్లా నీరు సరఫరా అవుతున్న 18 నిర్వహణ డివిజన్ల పరిధిలో సుమారు 1200 నివాస సముదాయాల వారిని నేరుగా కలవగా వారిలో 85 శాతం మంది నల్లా నీటిని నేరుగా తాగేందుకు వినియోగిస్తున్నామని తెలిపారు. మరో 15 శాతం మందిని ఫిల్టర్‌నీటిని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. ఇక నల్లా నీటి నాణ్యతపై 47 శాతం మంది చాలా బాగుందని కితాబునిచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. ఇక కలుషిత జలాలు, అరకొరనీటిసరఫరా, తక్కువ వత్తిడితో నీటిసరఫరా, ఉప్పొంగే మ్యాన్‌హోళ్లు, మురుగు సమస్యలపై ఫిర్యాదులు, మూతలు లేని మ్యాన్‌హోళ్లు, అధిక నీటిబిల్లులమోత తదితర సమస్యలపై తాము జలమండలి కస్టమర్‌ కేర్‌ 155313కి ఫోన్‌చేసిన వెంటనే 70 శాతం సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారని వినియోగదారులు తెలిపినట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక మరో 30 శాతం మంది తమ సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తున్నట్లు తెలిపారట.

అత్యధిక ఫిర్యాదులు ఈ ప్రాంతాల నుంచే..
నగరంలో ప్రధానంగా... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్‌.ఆర్‌.నగర్, ఎర్రగడ్డ, ప్రకాశ్‌నగర్, మారేడ్‌పల్లి, ఆస్మాన్‌ఘడ్, టోలిచౌకి ప్రాంతాల నుంచి గత నెలరోజులుగా 34,468 ఫిర్యాదులందాయని వీటిని విశ్లేషించగా..70 శాతం సమస్యలను ఫిర్యాదు అందిన కొన్ని గంటల్లోనే పరిష్కరించగా..మరో 30 శాతం సమస్యలను రెండురోజుల్లో పరిష్కరించినట్లు సర్వేలో తేలింది.

శివార్లకు జలసిరులే...
గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్లపరిధిలో రూ.1900 కోట్ల హడ్కో నిధులతో 2500 కి.మీ మార్గంలో తాగునీటి పైప్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటుచేయడంతోపాటు మరో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను జలమండలి నిర్మించింది. ఇందులో ఇప్పటికే 40 రిజర్వాయర్లను ప్రారంభించారు. మరో 16 రిజర్వాయర్లను త్వరలో ప్రారంభించనున్నారు. వీటి ఏర్పాటుతో గ్రేటర్‌ పరిధిలో వెయ్యి కాలనీలు, బస్తీలకు దాహార్తి దూరమైంది. శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల మందికి కన్నీటి కష్టాలు దూరమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అనుమతి లేని ఫిల్టర్‌ప్లాంట్ల నుంచి తాగునీటి కొనుగోలు చేసే అవస్థలు శివారువాసులకు తప్పడం విశేషం.

2020 వరకు తాగునీటికి ఢోకాలేదు
ఇటీవలి భారీ వర్షాలకు గ్రేటర్‌దాహార్తిని తీరుస్తోన్న ఎల్లంపల్లి(గోదావరి), నాగార్జునసాగర్‌(కృష్ణా)జలాశయాల్లో నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో మహానగర తాగునీటికి మరో 2020 నాటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలోని 9.65 లక్షల నల్లాలకు నిత్యం 465 మిలియన్‌ గ్యాలన్ల నీటిని కొరతలేకుండా సరఫరా చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల మేరకు తాగునీటి నాణ్యతను మెరుగుపరిచేందుకు బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను చేపడుతున్నాం. జలమండలి తాగునీటి నాణ్యతకు ఇటీవలే ఐఎస్‌ఓ ధ్రువీకరణ కూడా లభించింది. ఇదే స్ఫూర్తితో ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న 190 గ్రామపంచాయతీలు, 7 నగరపాలక సంస్థల దాహార్తిని తీర్చేందుకు రూ.700 కోట్లతో చేపట్టిన ఓఆర్‌ఆర్‌ తాగునీటి పథకం పనులను ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తిచేసి శివార్లకు దాహార్తిని దూరం చేస్తాం.
– ఎం.దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement