నల్లా కనెక్షన్‌ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్‌ అరెస్ట్‌ | ACB Officers Caught Water Board Manager Red Handedly While Taking Brib | Sakshi
Sakshi News home page

నల్లా కనెక్షన్‌ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్‌ అరెస్ట్‌

Published Wed, Aug 21 2024 7:25 AM | Last Updated on Wed, Aug 21 2024 9:11 AM

ACB Officers Caught Water Board Manager Red Handedly While Taking Brib

 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కూడా అరెస్టు

వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు

మణికొండ: మంచినీటి కనెక్షన్‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌ చేసి వసూలు చేసిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్‌–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. 

తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్‌ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. 

దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్‌లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్‌ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో  మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్‌ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement