సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జల మండలికి రాయితీ విద్యుత్ సరఫరా వల్ల గత నాలుగేళ్లలో ఏకంగా రూ.999.53 కోట్లు నష్టాలను మూటగట్టుకున్నట్టు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లు వెల్లడించాయి. టారిఫ్ సబ్సిడీల రూపంలో ఈ నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపాయి. తమ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకు ని ఈ మేరకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి.
జలమండలి కోసం రేటు తగ్గించి..
జలమండలి గతంలో విద్యుత్ చార్జీల కింద యూనిట్‌కు.. పరిశ్రమల కేటగిరీ (హెచ్‌టీ–1ఏ) పరిధిలో 11 కేవీ సరఫరాకు రూ.6.65.. 33కేవీ సరఫరాకు రూ.6.15.. సీపీడబ్ల్యూఎస్ (హెచ్‌టీ–4బీ) కేటగిరీ పరిధిలో అన్నివోల్టేజీ స్థాయిలకు రూ.5.10 చొప్పున చెల్లించేది. అయితే హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చులతో పోల్చితే... ప్రజల నుంచి వసూలు చేస్తున్న నీటిచార్జీలు తక్కువగా ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని, విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గించాలని జలమండలి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2018–19లో రూ.299.95 కోట్లు, 2019–20లో రూ.577.49 కోట్లు, 2020–21లో రూ.543.84 కోట్లు కలిపి మొత్తం రూ.1,421.28 కోట్లు నష్టాలు వచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. జలమండలికి సరఫరా చేసే విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గిస్తూ 2020 జూలైలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన చార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు తిరిగి చెల్లించాలని కోరింది.
2018–19 నాటి బిల్లుల నుంచి ఇప్పటిదాకా ఈ తగ్గింపును వర్తింపజేసింది. ఈ మేరకు డిస్కంలు జలమండలికి విద్యుత్ టారిఫ్‌ను తగ్గించినా.. బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విడుదల కాలేదు. దీనివల్ల ఈ నాలుగేళ్లలో రూ.999.53 కోట్లు నష్టపోయినట్టు డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి.
సబ్సిడీ కొనసాగించాలన్న విజ్ఞప్తితో..
సబ్సిడీ టారిఫ్‌ను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తిని తాజాగా ఈఆర్సీ తోసిపుచ్చింది. ‘వార్షిక టారిఫ్ ఉత్తర్వులు 2021–22’జారీచేసే వరకు జలమండలి సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే యథాతథంగా అమల్లో ఉంటాయని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. 2021–22 టా రిఫ్ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చే సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment