
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2023–24లో విద్యుత్ చార్జీలు వడ్డించకుండా ప్రస్తుత రిటైల్ టారిఫ్‌ను యధాతథంగా కొనసాగించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల యాజమాన్యాలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఈ నెలాఖరులోగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్), విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పించేందుకు డిస్కంలు కసరత్తు నిర్వహిస్తున్నాయి.
ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్‌చార్జీలు పెంచి వినియోగదారులపై రూ.5,597 కోట్ల వార్షిక భారాన్ని డిస్కంలు వేశాయి. దీనికితోడు వచ్చే ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో 2023–24లో విద్యుత్ చార్జీలు పెంచొద్దని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రభుత్వ సబ్సిడీ పెంపు!
విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఏటా నవంబర్ చివరిలోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలతోపాటు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)ను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. వచ్చే ఏడాది రాష్ట్రానికి ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం? ఈ మేరకు విద్యుత్ సరఫరాకి కానున్న మొత్తం వ్యయం ఎంత? ప్రస్తుత విద్యుత్ చార్జీలతోనే బిల్లులు వసూలు చేస్తే వచ్చే నష్టం(ఆదాయ లోటు) ఎంత?
లోటును భర్తీ చేసుకోవడానికి ఏ కేటగిరీ వినియోగదారులపై ఎంత మేర చార్జీలు పెంచాలి? అనే అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏఆర్‌ఆర్ నివేదికలో ఉంటాయి. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలు లేనందున రాష్ట్ర ప్రభుత్వమే తమకు సబ్సిడీలు పెంచి ఆదాయలోటును భర్తీ చేయాలని డిస్కంలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. డిస్కంలు తీవ్ర ఆర్థికనష్టాల్లో ఉన్న నేపథ్యంలో సబ్సిడీల పెంపు తప్ప మరో మార్గంలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment