State Electricity Regulatory Board
-
కరెంటు బిల్లులపై ‘ట్రూఅప్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి ‘ట్రూఅప్’ చార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. 2006–07 నుంచి 2020–21 మధ్య చేసిన విద్యుత్ సరఫరా, వసూలైన బిల్లుల్లో తేడాలకు సంబంధించి రూ.4,092 కోట్ల లోటు ఉందని.. ఈ మేరకు ట్రూఅప్ చార్జీల వసూలుకు ఓకే చెప్పాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి. వచ్చే నెల 8 దాకా అభ్యంతరాలకు గడువు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్ రూ.3,259 కోట్ల మేర ట్రూఅప్ చార్జీల వసూలుకు అనుమతి కోరగా.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ మరో రూ.833.23 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూలు కోసం ప్రతిపాదన సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీలోగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తెలపాలని రెండు డిస్కంలు గురువారం బహిరంగ ప్రకటన విడుదల చేశాయి. ఆయా అభ్యంతరాలకు రాతపూర్వకంగా వివరణ ఇస్తాయి. తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి మరోసారి అభిప్రాయ సేకరణ చేస్తుంది. అనంతరం ప్రతిపాదిత ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలను నిర్ణయిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ మేరకు డిస్కంలు చార్జీలను వసూలు చేసుకుంటాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే? విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా.. వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయ్ అమలు కాకపోవడంతో.. డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఈ పథకం కింద డిస్కంలకు సంబంధించిన రూ.8,200 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. ఉదయ్ అమలుతో 2017–18, 2018–19లలో డిస్కంలకు రూ.2,233 కోట్లు ఆదా అవుతాయని ఈఆర్సీ అంచనా వేసింది. కానీ ఉదయ్ పథకం ఫలితాలు అందకపోవడంతో.. ఈ భారం ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే పడనుంది. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీలు కూడా.. ఈఆర్సీ ముందుగా ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, వాస్తవంగా జరిగిన వ్యయం మధ్య వ్యత్యాసాన్ని.. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. గత 8 ఏళ్ల రిటైల్ సప్లై ఆదాయ లోటు రూ.38 వేల కోట్ల వరకు ఉంటుందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల వసూలు కోసం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే మరింత భారమనే అంచనాలు ఉన్నాయి. -
విద్యుత్ పీఆర్సీ ఏడాది వాయిదా !
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వాయిదా ఖాయమైంది. ఏప్రిల్ నుంచే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, నష్టాల నేపథ్యంలో ఏడాది వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. వేతన సవరణ వ్యయభారాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సైతం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించడంతో.. పీఆర్సీ వాయిదాపై స్పష్టత వచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ.5,596 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ఇటీవల ఈఆర్సీ అనుమతించిన సంగతి తెలిసిందే. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయం, ఇతర ఖర్చులతోపాటు సిబ్బంది ప్రస్తుత జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త చార్జీలను ఖరారు చేశారు. కొత్త పీఆర్సీ అమలుతో పడే అదనపు భారాన్ని డిస్కంలు కూడా తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో ప్రతిపాదించలేదు. మరోవైపు, ప్రస్తుత పీఆర్సీ గడువు గత నెలతో ముగిసినా.. విద్యుత్ సంస్థలు ఇప్పటివరకు కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఉన్న వేతనాలు చెల్లించడానికి సతమతమవుతున్న పరిస్థితుల్లో పీఆర్సీ అమలు పట్ల యాజమాన్యాలు విముఖతతో ఉన్నాయి. 8 ఏళ్లలో 147% పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేస్తుండగా.. విద్యుత్ ఉద్యోగులకు మాత్రం నాలుగేళ్లకోసారే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే.. విద్యుత్ సిబ్బంది వేతనాలు ఎక్కువే. విద్యుత్ ఉద్యోగుల జీతాలు తమకన్నా ఎక్కువగా ఉన్నాయని పలువురు ఐఏఎస్ అధికారులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. గత రెండు పీఆర్సీలు, డీఏలను కలుపుకొంటే ఎనిమిదేళ్లలో ఏకంగా 147 శాతం వరకు విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు పెరిగిపోయాయి. భారీ ఫిట్మెంట్తో భారం 2018లో చివరి పీఆర్సీ కమిటీ 27 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, సీఎం కేసీఆర్ దానిని ఏకంగా 35 శాతానికి పెంచారు. తెలంగాణ వచ్చాక విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలలో 25 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు, 25 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. జీతాలు, పెన్షన్లకు విద్యుత్ సంస్థలు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ సమయంలో భారీ ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వడంతో విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం బాగా పెరిగింది. వ్యయంతో పోల్చితే ఆదాయం తగ్గి నష్టాలు పేరుకుపోతుండటంతో.. ప్రస్తుతం పీఆర్సీ అమలు సాధ్యం కాదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. -
జల మండలికి విద్యుత్‌తో.. రూ.999 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జల మండలికి రాయితీ విద్యుత్ సరఫరా వల్ల గత నాలుగేళ్లలో ఏకంగా రూ.999.53 కోట్లు నష్టాలను మూటగట్టుకున్నట్టు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లు వెల్లడించాయి. టారిఫ్ సబ్సిడీల రూపంలో ఈ నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపాయి. తమ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకు ని ఈ మేరకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. జలమండలి కోసం రేటు తగ్గించి.. జలమండలి గతంలో విద్యుత్ చార్జీల కింద యూనిట్‌కు.. పరిశ్రమల కేటగిరీ (హెచ్‌టీ–1ఏ) పరిధిలో 11 కేవీ సరఫరాకు రూ.6.65.. 33కేవీ సరఫరాకు రూ.6.15.. సీపీడబ్ల్యూఎస్ (హెచ్‌టీ–4బీ) కేటగిరీ పరిధిలో అన్నివోల్టేజీ స్థాయిలకు రూ.5.10 చొప్పున చెల్లించేది. అయితే హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ కోసం చేస్తున్న ఖర్చులతో పోల్చితే... ప్రజల నుంచి వసూలు చేస్తున్న నీటిచార్జీలు తక్కువగా ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని, విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గించాలని జలమండలి గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2018–19లో రూ.299.95 కోట్లు, 2019–20లో రూ.577.49 కోట్లు, 2020–21లో రూ.543.84 కోట్లు కలిపి మొత్తం రూ.1,421.28 కోట్లు నష్టాలు వచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. జలమండలికి సరఫరా చేసే విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.3.95కు తగ్గిస్తూ 2020 జూలైలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన చార్జీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు తిరిగి చెల్లించాలని కోరింది. 2018–19 నాటి బిల్లుల నుంచి ఇప్పటిదాకా ఈ తగ్గింపును వర్తింపజేసింది. ఈ మేరకు డిస్కంలు జలమండలికి విద్యుత్ టారిఫ్‌ను తగ్గించినా.. బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ విడుదల కాలేదు. దీనివల్ల ఈ నాలుగేళ్లలో రూ.999.53 కోట్లు నష్టపోయినట్టు డిస్కంలు ఈఆర్సీకి నివేదించాయి. సబ్సిడీ కొనసాగించాలన్న విజ్ఞప్తితో.. సబ్సిడీ టారిఫ్‌ను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని జలమండలి చేసిన విజ్ఞప్తిని తాజాగా ఈఆర్సీ తోసిపుచ్చింది. ‘వార్షిక టారిఫ్ ఉత్తర్వులు 2021–22’జారీచేసే వరకు జలమండలి సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుత విద్యుత్ చార్జీలే యథాతథంగా అమల్లో ఉంటాయని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. 2021–22 టా రిఫ్ ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చే సమయంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. -
విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే!
- డిస్కంల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఆర్సీ - డిస్కంల ఏఆర్ఆర్పై త్వరలో బహిరంగ విచారణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన టారీఫ్ ప్రతి పాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) పరిగణనలోకి తీసుకుని విచారణకు స్వీకరించింది. టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో డిస్కంలు జాప్యం చేయడంతో చార్జీల పెంపుపై తామే(సుమోటో)గా నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుమోటో ఉత్తర్వులు జారీ తర్వాత ఈఆర్సీ విద్యుత్ టారీఫ్‌పై రాష్ట్ర స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించింది. గత నవంబర్‌లోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)తో పాటు కొత్త టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉండగా, గడువులోగా ఏఆర్‌ఆర్‌లు మాత్రమే సమర్పించాయి. 4 నెల.ల జాప్యం తర్వాత గురువారం టారీఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. 2016–17లోని చార్జీలనే 2017–18లో కొనసాగించాలని కోరాయి. ఈ నేపథ్యం లో డిస్కంల కోరిక మేరకు గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కేటగిరీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న చార్జీలను ఈ ఏడాదీ కొనసాగించాలని నిర్ణయించింది. డిస్కంలే చార్జీల పెంపు ప్రతిపాదించని నేపథ్యంలో చార్జీల పెంపునకు ఆదేశించమని ఈఆర్సీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో తుది ఉత్తర్వులు..: డిస్కంలు సమర్పించిన ఏఆర్ఆర్, టారీఫ్ ప్రతిపాదనలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సలహాల స్వీకరణకు త్వరలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. అనంతరం డిస్కంల ఆదాయ లోటును ఖరారు చేయడంతో పాటు ఈ ఆర్థిక లోటు భర్తీకి కావాల్సిన ప్రభుత్వ సబ్సిడీలను నిర్ణయిస్తూ ఆ తర్వాత ఈఆర్సీ తుది టారీఫ్ ఉత్తర్వులు జారీ చేయనుంది.