విద్యుత్ చార్జీల పెంపు లేనట్లే!
- డిస్కంల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఆర్సీ
- డిస్కంల ఏఆర్‌ఆర్‌పై త్వరలో బహిరంగ విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన టారీఫ్ ప్రతి పాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) పరిగణనలోకి తీసుకుని విచారణకు స్వీకరించింది. టారీఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో డిస్కంలు జాప్యం చేయడంతో చార్జీల పెంపుపై తామే(సుమోటో)గా నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సుమోటో ఉత్తర్వులు జారీ తర్వాత ఈఆర్సీ విద్యుత్ టారీఫ్‌పై రాష్ట్ర స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించింది. గత నవంబర్‌లోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)తో పాటు కొత్త టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉండగా, గడువులోగా ఏఆర్‌ఆర్‌లు మాత్రమే సమర్పించాయి. 4 నెల.ల జాప్యం తర్వాత గురువారం టారీఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. 2016–17లోని చార్జీలనే 2017–18లో కొనసాగించాలని కోరాయి. ఈ నేపథ్యం లో డిస్కంల కోరిక మేరకు గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కేటగిరీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న చార్జీలను ఈ ఏడాదీ కొనసాగించాలని నిర్ణయించింది. డిస్కంలే చార్జీల పెంపు ప్రతిపాదించని నేపథ్యంలో చార్జీల పెంపునకు ఆదేశించమని ఈఆర్సీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
త్వరలో తుది ఉత్తర్వులు..: డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్, టారీఫ్ ప్రతిపాదనలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సలహాల స్వీకరణకు త్వరలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. అనంతరం డిస్కంల ఆదాయ లోటును ఖరారు చేయడంతో పాటు ఈ ఆర్థిక లోటు భర్తీకి కావాల్సిన ప్రభుత్వ సబ్సిడీలను నిర్ణయిస్తూ ఆ తర్వాత ఈఆర్సీ తుది టారీఫ్ ఉత్తర్వులు జారీ చేయనుంది.