సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి ‘ట్రూఅప్’ చార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీఎస్‌ఎన్పీడీసీఎల్/ టీఎస్‌ఎస్పీడీసీఎల్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. 2006–07 నుంచి 2020–21 మధ్య చేసిన విద్యుత్ సరఫరా, వసూలైన బిల్లుల్లో తేడాలకు సంబంధించి రూ.4,092 కోట్ల లోటు ఉందని.. ఈ మేరకు ట్రూఅప్ చార్జీల వసూలుకు ఓకే చెప్పాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి.
వచ్చే నెల 8 దాకా అభ్యంతరాలకు గడువు
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్ రూ.3,259 కోట్ల మేర ట్రూఅప్ చార్జీల వసూలుకు అనుమతి కోరగా.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ మరో రూ.833.23 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూలు కోసం ప్రతిపాదన సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీలోగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తెలపాలని రెండు డిస్కంలు గురువారం బహిరంగ ప్రకటన విడుదల చేశాయి.
ఆయా అభ్యంతరాలకు రాతపూర్వకంగా వివరణ ఇస్తాయి. తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి మరోసారి అభిప్రాయ సేకరణ చేస్తుంది. అనంతరం ప్రతిపాదిత ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలను నిర్ణయిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ మేరకు డిస్కంలు చార్జీలను వసూలు చేసుకుంటాయి.
డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే?
విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా.. వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి.
ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ఉదయ్ అమలు కాకపోవడంతో..
డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఈ పథకం కింద డిస్కంలకు సంబంధించిన రూ.8,200 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. ఉదయ్ అమలుతో 2017–18, 2018–19లలో డిస్కంలకు రూ.2,233 కోట్లు ఆదా అవుతాయని ఈఆర్సీ అంచనా వేసింది. కానీ ఉదయ్ పథకం ఫలితాలు అందకపోవడంతో.. ఈ భారం ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే పడనుంది.
రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీలు కూడా..
ఈఆర్సీ ముందుగా ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, వాస్తవంగా జరిగిన వ్యయం మధ్య వ్యత్యాసాన్ని.. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. గత 8 ఏళ్ల రిటైల్ సప్లై ఆదాయ లోటు రూ.38 వేల కోట్ల వరకు ఉంటుందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల వసూలు కోసం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే మరింత భారమనే అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment