సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.
ఇప్పటివరకు జరిపిన చెల్లింపులు పోగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)కు రూ. 2,575.58 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)కు రూ. 538.51 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెండు డిస్కంలు నీటిపారుదల శాఖకు తాజాగా లేఖలు రాశాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మసాగర్లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం రూ.866.21 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రూ. 327 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీటి తరలింపునకు రూ. 25.71 కోట్ల మేర విద్యుత్ చార్జీల వ్యయమైంది. అలాగే ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 21,810 ఖర్చయింది.
భవిష్యత్‌లో మరింత భారం...
కాళేశ్వరం ఎత్తిపోతల కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటర్ల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అంటే కనీసం 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని భావించింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు రూ. 6.30 ల చొప్పున (పెరిగిన విద్యుత్ చార్జీలు కాకుండా) మొత్తం సంవత్సరానికి రూ. 8,541.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
మొత్తం 20 లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో 8 చోట్ల వినియోగించిన మోటారు పంపులకు మూడేళ్లలోనే రూ. 3,060 కోట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక పూర్తిస్థాయిలో అన్ని పంపుస్టేషన్‌లలో మోటారు పంపులను వినియోగిస్తే మరింత విద్యుత్ భారం పెరుగుతుందని ఇరిగేషన్, విద్యుత్తు శాఖల అధికారులు చెబుతున్నారు.
పెరిగిన విద్యుత్ వ్యయం...
ఈ ప్రాజెక్టుకు మొదట విద్యుత్ చార్జీలు యూనిట్‌కు వ్యయం రూ. 5.80 ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్‌డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ. 165 ఉంటే దానిని రూ. 275కి పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో 99 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా 1906.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది.
దీనికి గాను ఒక యూనిట్‌కు రూ.5.80 చొప్పున 1105.82 కోట్ల ఖర్చయింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా 1,697.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పెరిగిన చార్జీల ప్రకారం రూ. 984.77 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు మూడేళ్లలో ఎత్తిపోసిన మొత్తం 140 టీఎంసీలకు రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం జరగ్గా రూ. 2,575.58 కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు ఎన్‌పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment