సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చూపినా.. నిధుల్లో సింహభాగం రుణ కిస్తీలు, వడ్డీల చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 2023–24లో నీటి పారుదలశాఖకు నిర్వహణ పద్దు కింద రూ.17,504.1 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.8942.86 కోట్లు కలిపి మొత్తం రూ.26,446 కోట్లను కేటాయించారు.
గత బడ్జెట్‌లో చేసిన రూ.22,675 కోట్ల కేటాయింపులతో పోల్చితే ఇది రూ.3,771 అదనం. తాజా కేటాయింపుల్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.7,715.89 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.335.58 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.1,301.58 కోట్లు, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.256.56 కోట్లను చూపారు.
నిర్వహణ పద్దు అప్పులకే..
తాజా బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద చూపిన రూ.17,504 కోట్లలో ఏకంగా రూ.15,700 కోట్లు రుణ వాయిదాలు, వడ్డీల చెల్లింపులకే పోనున్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది.
ఇందుకోసం గత ఏడాది బడ్జెట్‌లో రూ.11,745 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది మరో రూ.3,955 కోట్లు పెరిగాయి. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ కొత్త రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉందని అధికార వర్గాలే చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment