Telangana Budget 2023-24
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
Live Updates.. ►తెలంగాణ శాసన సభ సమావేశాలు ముగిశాయి. సీఎం ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. మొత్తం 56.25 గంటల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. ►ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సభ ఆమోదం తెలిపింది. ►మొత్తం 192 దేశాల్లో మన దేశం ర్యాంక్ 139 అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని.. మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని తెలిపారు. పార్లమెంట్లో ప్రధాని స్పీచ్ అధ్వానంగా ఉందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా అదానీపై మోదీ ఒక్కమాట మాట్లాడలేదని, దీనిపై పార్లమెంట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్లాడిందని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంటని ప్రశ్నించారు. ► అసెంబ్లీలో అక్బరుద్దీన్ కాగ్ నివేదికను ఎందుకు సభలో ప్రవేశపెట్టలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను అరికట్టడంలో నార్కోటిక్స్ విఫలమైందని అన్నారు. ► శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండా ప్రకాష్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్‌కు బండా ప్రకాష్ కృతజ్ఞతలు చెప్పారు. కాగా, బండా ప్రకాష్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ► ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బండా ప్రకాష్ డిప్యూటీ ఛైర్మన్ కావడం అందరికీ గర్వకారణం. సామాన్య జీవితం నుంచి బండా ప్రకాష్ ఎదిగారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారు. ► ఇక, బండా ప్రకాష్.. 1981లో మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2017లో టీఆర్ఎస్కు ప్రధాన కార్యదర్శిగా నియామకం. ► శాసనమండలిలో కేటీఆర్ మాట్లాడుతూ.. 21 రోజుల్లో బిల్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నాము. టీఎస్ బీపాస్ వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదు. అనుమతులు లేని లేఅవుట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత చిన్న భూమిని కూడా మ్యాప్ చేశాము. ఉస్మాన్సాగర్ను ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వం. ► హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మేర ఉంది. రహేజా ఐటీ పార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంది. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. తర్వలో లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో మూడో దశ ప్రాజెక్ట్. పాతబస్తీ మెట్రోకు బడ్జెట్లో నిధులు కేటాయించాం. తెలంగాణపై కేంద్రం కనీస కనికరం చూపించడం లేదు. ముంబై, తమిళనాడు, గుజరాత్ మెట్రోలకు కేంద్రం నిధులు ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోకు పైసా కూడా ఇవ్వలేదు. మెట్రో ఛార్జీల పెంపు ఉండదు. ఆర్టీసీ తరహాలోనే ఛార్జీలు అందుబాటులో ఉండాలని చెప్పాం. ► అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రులకు బస్తీ దవాఖానాల వద్ద తాకిడి తగ్గింది. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖానాల సేవలు పొందారు. త్వరలో బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్ సేవలు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈనెలలో 1500 ఆశా పోస్టులు. ఏప్రిల్‌లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తాము. మేడ్చల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ► హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ► కేసీఆర్ మాట్లాడుతూ.. మనం తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతీ నియోజకవర్గంలో అధునాతన కూరగాయాల మార్కెట్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో మరిన్ని సౌకర్యాలు తీసుకుంటాము. గతంలో మోండా మార్కెట్‌ను సైంటిఫిక్‌గా కట్టారు. కలెక్టర్లందరికీ మోండా మార్కెట్‌ను చూపించాము. కల్తీ విత్తనాల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాము. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ పెడతాం. ► తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించాము. ► ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. తొమ్మిదో రోజు బడ్జెట్ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి హారీష్ రావు కీలక ప్రకటనలు చేశారు. -
తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. -
రాష్ట్రంపై ‘శత్రు’ వైఖరి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్‌పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు. అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్‌ఎన్‌డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం. హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం. మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్‌హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్‌ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం. చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం. ఎస్ఎన్డీపీ ఏ నగరంలోనూ లేదు హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)) చేపట్టాం. జీహెచ్ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు! సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు. తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు. ప్రతిపాదనలన్నీ వెనక్కే.. కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు. వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది. – మంత్రి కేటీఆర్ -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
అసెంబ్లీ సమావేశాలకు నేటితో తెర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన ఎనిమిదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సాధారణ పాలన, వాణిజ్య పన్నుల నిర్వహణ, వైద్య, ఆరోగ్యం, పశు, మత్స్య పరిశ్రమ, హోం, జైళ్లు, వ్యవసాయ, సహకార, పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలకు సంబంధించిన పద్దులను శాసనసభ ఆమోదించింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ నేరుగా ప్రశ్నోత్తరాలను చేపట్టింది. ‘2023 ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లుతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించింది. విరామం అనంతరం తిరిగి సమావేశమైన శాసన సభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కాగా ఆదివారం వార్షిక బడ్జెట్ 2023–24 ద్రవ్య వినిమయ బిల్లు ఉభయసభల్లో చర్చకు రానున్నది. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఆదివారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత శాసనమండలికి పంపుతారు. శాసనమండలిలోనూ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడుతుంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన అసెంబ్లీ అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. సుమారు 14 గంటల పాటు సమావేశం జరగ్గా శనివారం సాయంత్రం ఐదున్నర వరకు పద్దులపై సభ్యులు ప్రసంగించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తమ శాఖలపై జరిగిన చర్చకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజలకు అవసరమైన ముఖ్య పద్దులపై చర్చ జరుగుతున్నా మూడు రోజులుగా బీజేపీ సభ్యులు గైర్హాజరు కావడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పద్దులపై ఇచ్చిన కోత తీర్మానాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటింగ్ నిర్వహించారు. పద్దులను ఆమోదించినట్లు ప్రకటిస్తూ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs భట్టి విక్రమార్క
Updates.. ►తెలంగాణ శాసన మండలిలో విప్‌లను నియమించారు. మండలిలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్ నియామకమయ్యారు. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు నియమించారు. ►తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీష్ రావు కౌంటర్ మధ్య శనివారం వాడీవేడి వాదనలు జరిగాయి. ముందు భట్టి మాట్లడుతూ.. కాళేశ్వరానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని అన్నారు. 18 లక్షల ఎకరాలకు బ్యారేజి కట్టారు కానీ.. నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పంపులు మునిగిపోయాయని చుద్దామంటే పోనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో తమ మైకులు కట్ చేసి వాళ్లకు మాత్రే ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మమ్మల్ని కట్టేసి వాళ్లకు కొరడా ఇచ్చి కొట్టమన్నట్టుగా ఉందన్నారు. ►సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొరడాతో తాము కొట్టడం లేదని, మీకు మీరే కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. కాళేశ్వరం వద్దకు రేపు వెళ్తామంటే చెప్పండి.. దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారు. వరద వచ్చినప్పుడు వెళ్తే జారిపడతారని భట్టిని పంపలేదన్నారు. కాళేశ్వరం మునిగిందని కాంగ్రెస్ నేతలు సంబర పడుతున్నారని.. కానీ ప్రకృతి విపత్తు వచ్చిందన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఎజెన్సీ నుంచే రిపేర్ చేయించామని తెలిపారు. ► తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగం ప్రయత్నం. మెట్లు సాయికుమార్ సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ క్రమంలో వారు మత్య్సకారులకు రూ. 10లక్షల జీవిత బీమా, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ► శాసనసభ ఆవరణలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌కు బండ ప్రకాష్ నామినేషన్ దాఖలు. ► నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ► భట్టికి కేటీఆర్ కౌంటర్ కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత మాదే. మెట్రో రైలుకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోంది. కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఇష్టారాజ్యంగా మెట్రో ఛార్జీలు పెంచొద్దని స్పష్టం చేశాం. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే మెట్రోరైల్ నడుస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీనే మెట్రోను తీసుకువచ్చింది. మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మెట్రో లిమిటెడ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. మెట్రో యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది. -
టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ
Updates.. ► సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణిని కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ►బయ్యారం విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పింది. బయ్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ప్రారంభించాం. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్టల్ వారితో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించాం. కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు.. ► అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మధ్య మాటల హీట్ చోటుచేసుకుంది. ధరణి పోర్టల్‌పై ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ మాట్లాడుతూ.. ధరణి రైతులకు శాపంగా మారుతోంది. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులు గందరగోళంలో ఉన్నారు. ధరణిని రద్దు చేయాలన్నదే మా నినాదం. ► శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ధరణిపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలి. లోపాలు ఉంటే సరి చేస్తాం కానీ.. ధరణిని మొత్తం తొలగించం. ► శాసన మండలి సోమవారానికి వాయిదా.. ► ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కనీసం 8,9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు. కరెంట్ కోసం రైతులు సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కరెంట్ కోతలపై శాసన మండలిలో చర్చ జరగాలి. ► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇచ్చే కరెంట్ కూడా ఏ సమయంలో ఇస్తున్నారో చెప్పడం లేదు. ఈ విషయాన్ని సభలో సభాపతికి విన్నవించినప్పటికీ.. మా వైపు చూడటం లేదు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకురాని పరిస్థితి ఉంది. అందుకే సభ నుంచి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాము. ► ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించకపోవడం దురదృష్టకరం. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ కోతలపై చర్చించి పరిష్కరించాలి ► శాసనమండలిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు వద్దు అనుకునే వారే బడ్జెట్‌ను విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి యుద్దాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడ్జెట్ సమావేశాలంటే ఖాళీ కుంటలు, ఎండిన పంటలు, కరెంట్ ధర్నాలు ఉండేవి. నేడు మండు వేసవిలో నిండైన చెరువులు దర్శన మిస్తున్నాయి. ► దేశానికి తెలంగాణ మార్గదర్శి, దిక్సుచి అయ్యింది. ప్రజలకు హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం రాజకీయ పార్టీల నైజం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలా కాదు. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా పెంచారు. ప్రజలకు సేవ చేయడం ఇతర రాష్టాల్లో ఓ రాజకీయ క్రీడ. కానీ, తెలంగాణ ప్రభుత్వానికి అదో టాస్క్. రాష్ట్రంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు జరిగాయి. రోజుకు 18 గంటలు ప్రజల గురించే ఆలోచించి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రజల కోసం మనస్సు పెట్టి, ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తి కేసీఆర్. ► మతాల పేరుతో ఓట్ల రాజకీయాలు కేసీఆర్ ఎప్పుడు చేయలేదు.. చేయరు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతాము. సచివాలయం ఎందుకు కడుతున్నారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సచివాలయం వద్దన్నారు. ఇప్పుడేమో ప్రారంభ తేదీ మేము చెప్తే, ప్రారంభ తేదీ కూడా మేమే చెప్తాం అని అంటున్నారు. ప్రగతి భవన్ కడితే కూడా వద్దన్నారు. ► కొందరు నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యాదాద్రిని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?. ► మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఎన్ని పోరాటాలు చేసి అయినా ప్రైవేటీకరణను అడ్డుకుంటాము. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారణకు కేంద్రం సహకరించడం లేదు. ఢిఫెన్స్ ఏరియాలో భూసేకరణకు కేంద్రం ముందుకు రావడం లేదు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలు, ప్రార్థనామందిరాలను తొలగిస్తాము. ఇందు కోసం చట్టాన్ని కూడా తీసుకొస్తాము. ఏ దేవుడు ధుమ్ము, ధూళిలో ఉండాలనుకోరు.. భక్తులు కూడా కోరుకోరు. మళ్లీ వాటిని వేరే చోట నిర్మిస్తాము. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదు. ఆర్మీ జోన్ భూములు నైజాం భూములు. కావాలంటే కేంద్రంలో పంచాయితీ పెట్టొచ్చు. బయ్యారంపై పలుమార్లు కేంద్రం మాట తప్పింది. ► సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. -
దేశ సందపను దోపిడీ చేస్తున్నారు: అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాగా, సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత భట్లి విక్రమార్క.. కేసీఆర్ సర్కార్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ప్రకటించలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అదానీ కంపెనీ ఏం చేసిందో బయటపడింది. హిండెన్‌బర్గ్ అన్నీ బయటపెట్టింది. దేశ సంపద దోపిడీకి గురవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. రూ. 4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి?. సామాన్యులపైనే భారం పెరుగుతోంది. తలసారి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది. పేదలు ఇళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్లో లక్షలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండాలి అని సూచనలు చేశారు. -
జీహెచ్ఎంసీకి పైసా పరేషాన్.. గండం గట్టెక్కేనా?
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నప్పటికీ, చెల్లింపులు మాత్రం గోరంతలు కూడా ఉండటం లేదు. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచీ వివిధ ప్రభుత్వ భవనాల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను, వాటిపై బకాయిలు దాదాపు రూ.6000 కోట్లు పేరుకుపోయాయి. వీటిల్లో పాత సచివాలయ భవనాలకు సంబంధించి దాదాపు రూ. 400 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆ సచివాలయం అంతర్ధానమై, కొత్త సచివాలయం త్వరలో ప్రారంభం కానున్నప్పటికీ జీహెచ్ఎంసీ బకాయిల చిట్టాలో మాత్రం అలాగే ఉంది. దాంతోపాటు వైద్యారోగ్య, విద్యాశాఖ, ఎక్సైజ్, ట్రాన్స్‌కో, జలమండలి తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన భవనాల నుంచి దశాబ్దానికిపైగా ఆస్తిపన్ను బకాయిలు పెనాల్టీలతో కలిపి కొండల్లా పేరుకుపోయాయి. బడ్జెట్లో పద్దు ఉన్నా.. ఆస్తిపన్ను బకాయిలు ఏటికేడు పెరిగిపోతున్నా, జీహెచ్ఎంసీ ఆయా ప్రభుత్వ విభాగాలకు చెల్లించాల్సిందిగా లేఖలు రాస్తున్నా నయాపైసా కూడా విదిల్చడం లేదు. వీటి చెల్లింపుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఓ పద్దు కూడా ఉంది. కానీ.. చెల్లింపులే ఉండటం లేదు. ఆరేడేళ్ల క్రితం ఏటా కనీసం రూ. 50 కోట్లయినా బడ్జెట్లో కేటాయించి విడుదల చేసేవారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇది కేవలం రూ.10 కోట్లు మించడం లేదు. తాజా రాష్ట్ర బడ్జెట్లోనూ రూ. 10 కోట్లే విదిల్చారు. జీహెచ్ఎంసీకి తప్పని తిప్పలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపట్టిన, పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు కుంటుపడే ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు సదరు ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడం, మరోవైపు జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంబంధిత ఉన్నతాధికారులు నిధుల లేమి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా.. లేదా..? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేయడంతో వాటి వడ్డీలు, ఇతరత్రా ఖర్చులు భరించలేక సిబ్బంది జీతాలకే పలు అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోకపోతే జీహెచ్ఎంసీ గడ్డు పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ఓటీఎస్‌ను వినియోగించుకోని వైనం.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా పేరుకుపోయిన వారు పెనాల్టీల భారాన్ని మోయలేకే చెల్లించడం లేదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద ఆస్తిపన్ను పెనాల్టీలపై 90 శాతం రాయితీనిచ్చింది. ప్రభుత్వ భవనాలకు ఆ స్కీమ్‌ను సైతం వినియోగించుకోలేదు. దాన్ని వినియోగించుకొని చెల్లించినా, జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం సమకూరేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో పెనాలీ్టలే అసలును మించి భారీ బకాయిల గుట్టలుగా మారాయి. ఎన్నెన్నో భవనాలు.. ఆస్తిపన్ను బకాయిలు భారీగా ఉన్న భవనాల్లో అసెంబ్లీ, రవీంద్రభారతి, హెచ్ఎండీఏ, ఆస్పత్రులు, విద్యాలయాలకు చెందినవే కాకుండా పెట్రోలు బంకులు, క్యాంటీన్ల వంటివి సైతం ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీకి రావాల్సింది జీహెచ్ఎంసీకి రావాల్సిన మొత్తం సచివాలయ పాతభవనం : రూ.400 కోట్లు వైద్యారోగ్యశాఖ భవనాలు : రూ.1190 కోట్లు ఎక్సైజ్ శాఖ భవనాలు: రూ. 900 కోట్లు విద్యాశాఖ భవనాలు: రూ.400 కోట్లు జలమండలి భవనాలు : రూ.70 కోట్లు -
‘రాష్ట్ర బడ్జెట్ అన్నిటికంటే భారీ కుంభకోణం’
హిమాయత్‌నగర్: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి కుంభకోణం అయితే.. ధరణి పోర్టల్ రెండో కుంభకోణమని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపించారు. ఈ రెండింటిని మించిన అత్యంత భారీ కుంభకోణం తెలంగాణ బడ్జెట్ అని మాజీ ఎంపీలు వివేక్‌వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ భరోసా యాత్రకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం నారాయణగూడలోని వెంకటేశ్వరకాలనీలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు ప్రతి గ్రామలో కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. వీటిలో తమ పార్టీకి చెందిన 800 మంది ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, రాష్ట్ర నాయకులు గడ్డం రామన్‌గౌడ్ పాల్గొన్నారు. -
కొత్త సీసాలో... పాత సారా
చిల్పూరు/ఐనవోలు: ఆర్థికమంత్రి హరీశ్‌రావు కొత్త సంవత్సరం బడ్జెట్ కదా అని కొత్త సీసాను మామ కేసీఆర్ ఉంటున్న ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తే.. అందులో పాత సారా పోసి పంపినట్లు ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నా రు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం జనగా మ, హనుమకొండ జిల్లాలో సాగింది. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చేరుకోవడంతో షర్మిల యాత్ర 3,600 కిలోమీటర్ల మార్క్‌కు చేరు కుంది. అంతకుముందు జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి నైట్ పాయింట్ వద్ద ఉదయం విలేకరులతో, ఆయాచోట్ల పాదయాత్రలో ఆమె మాట్లాడారు. గత బడ్జెట్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు, దళితబంధుకు రూ.17 వేల కోట్లు కేటాయించారని, ఈసారి బడ్జెట్లో గత బడ్జెట్‌ను కాపీ పేస్ట్ చేశారన్నారు. హామీలు నెరవేర్చని కేసీఆర్ 420 అని విమర్శించారు. అంతకుముందు ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరించారు. -
‘సంక్షేమం’ కాస్త మెరుగు !
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలకు 2023–24 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు మెరుగుపడ్డాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు కాస్త పెరిగాయి. నూతన నియామకాలు, ఇతరత్రా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. అయితే పెరిగిన కేటాయింపులతో మాత్రం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలకు పెద్దగా ప్రయోజనం లేదు. గత బడ్జెట్లో సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు జరిగినట్లుగానే ఈదఫా అటుఇటుగా కేటాయింపులు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)కు గత బడ్జెట్ కంటే దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈసారి కూడా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం కింద 2022–23లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఆ నిధులనే ఈసారి క్యారీఫార్వర్డ్ చేశారు. బీసీలకు అంతంతే...! బడ్జెట్ వెనుకబడిన తరగతుల్లో పెద్దగా ఉత్సాహం నింపలేదు. ఈసారి బీసీ సంక్షేమ శాఖకు రూ.6,229 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.531 కోట్లు పెరిగాయి. తాజాగా బీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. గత బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.100 కోట్లు తగ్గింది. 2022–23లో ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలేవీ అమలు కాలేదు. దీంతో గత కేటాయింపులే ఈసారీ జరిపినట్లు చెప్పొచ్చు. ఇక రజక, నాయూ బ్రాహ్మణ ఫెడరేషన్లకు గత బడ్జెట్ మాదిరిగానే ఈసారీ రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల ఫెడరేషన్‌కు కూడా గతంలో మాదిరిగానే రూ.30 కోట్లు కేటాయించగా... మిగతా ఫెడరేషన్లకు నామమాత్రపు నిధులే కేటాయించడంతో ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లైంది. బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో 2023–24 సంవత్సరంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుత సంస్థల అప్‌గ్రెడేషన్, తరగతుల పెరుగుదల, కొత్తగా ఉద్యోగుల నియామకాలు తదితరాలకు నిధుల ఆవశ్యకత పెరగడంతో కేటాయింపుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా క్రిస్టియన్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్లకు ఆర్థిక చేకూర్పు పథకాల కింద 270 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమ శాఖకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలకు కూడా కేటాయింపులు కాస్త మెరుగుపడ్డట్లు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ శాఖల పరిధిలో కొత్త పథకాల ఊసులేదు. -
పల్లెకు పట్టాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో పల్లెకు పట్టాభిషేకం చేశారు. అత్యధిక కేటాయింపులు చేసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్లో పీఆర్‌శాఖకు రూ.31,426 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్లో ఇచ్చిన రూ.29.586 కోట్ల కేటా యింపుల కంటే రూ.1,840 కోట్లు అధికం. ఐతే పీఆర్ శాఖతోపాటు మిషన్ భగీరథకు ఇచ్చిన రూ. 600 కోట్లు కూడా కలిపితే ఉమ్మడిగా (పీఆర్, ఆర్డీ, మిషన్‌భగీరథ శాఖకు కలిపి) రూ.32,026 కోట్లు కేటాయించినట్టు అవుతుంది. వివిధ పథకాలు, కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు కోరుతూ ఈ శాఖ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ చాలామటుకు ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. కొత్తగా వేసే గ్రామీణ రోడ్లతోపాటు గతంలో వేసిన రోడ్ల నిర్వహణకు కలిపి రూ.2,587 కోట్లు, మిషన్ భగీరథ మెయింటెనెన్స్, మిషన్‌భగీ రథ ఇతర ఖర్చుల కోసం రూ.1,600 కోట్లు, జూని యర్ పంచాయతీ సెక్రెటరీల సర్వీసుల క్రమబద్ధీక రణ, దానికి తగ్గట్టుగా వేతనాల పెంపు నిమిత్తం రూ.315 కోట్లు, వడ్డీలేని రుణాల కోసం రూ.849 కోట్లు, గ్రామీణ దారిద్య్ర నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పేస్కేళ్ల సవరణ నిమిత్తం కేటాయింపులు చేశారు. కాగా, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు పైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులు ఫైనాన్స్ ట్రెజరీల ఆమోదం కోసం వేచిచూడ కుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
డబుల్ రోడ్లకు రూ.2,007 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా మందగించిన డబుల్ రోడ్ల నిర్మాణాన్ని మళ్లీ పట్టా లెక్కించేందుకు ప్రభుత్వం రూ.2,007 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.7 కోట్లు తక్కువ. గత బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవటంతో పనులు బాగా మందగించాయి. ఈసారి ప్రతిపాదించిన నిధులు ఎంతమేర విడుదలవుతాయో వేచిచూడాలి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి డబుల్ రోడ్లను గతంలోనే ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదిలో చాలావేగంగా పనులు జరిగినప్పటికీ, రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో అందక పడకేశాయి. గత రెండేళ్లుగా భారీ వర్షాలతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కానీ, వరద ప్రభావిత రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు లేక పనులు జరగలేదు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. ఇటీవలే సీఎం ఆ పనులపై సమీక్షించి రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. వరదతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న రోడ్ల రెన్యూవల్ పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు బడ్జెట్లో నాన్‌ప్లాన్ కింద ఆ పనులకు రూ.2,434 కోట్లు, భవనాల కోసం రూ.1,515 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త సచివాలయ భవనం పూర్తికి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డు భూసేకరణకు సంబంధించి ఉత్తర భాగంలో రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. దానికిగాను రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1,600 కోట్లు కేటాయించారు. -
ఆ రెండు పద్దులు.. రూ.62 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లు ఇవ్వడం లేదని గత మూడు బడ్జెట్ల గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. పన్నుల్లో వాటా కింద ప్రతిపాదించిన నిధులు కూడా కేంద్రం ఇవ్వడం లేదని రాష్ట్రం ఆరోపిస్తోంది... కానీ, కేంద్రంపై ఆధారపడి ఉన్న రెండు పద్దుల కింద మాత్రం తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను చూపెట్టింది. వచ్చే ఏడాదికైనా కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతుందా అనే ఆశతో పెట్టిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ. 62,730.01 కోట్ల మేర రాబడులను ఈసారి బడ్జెట్లో చూపెట్టడం గమనార్హం. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.41,259.17 కోట్లు చూపెట్టగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.21,470.84 కోట్లు చూపారు. అయితే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద గత ఏడాది (2021–22) వచ్చింది కేవలం రూ.8,619 కోట్లు మాత్రమే. 2022–23 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ. 41,001.73 కోట్లు వస్తుందని ప్రతిపాదించినా డిసెంబర్ నాటికి వచ్చింది రూ.7,770.92 కోట్లే. మిగిలిన మూడు నెలల్లో ఎంత వస్తుందనే అంచనా మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద ఏకంగా రూ.30,250 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2022–23 సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది (2023–24)కి గాను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30వేల కోట్లకు మరో రూ.11వేల కోట్లు అదనంగా ‘గ్రాంట్స్’రూపంలో రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి గ్రాంట్స్ పద్దు కింద రాష్ట్రం ఆశిస్తున్న మొత్తానికి, కేంద్రం ఇస్తున్న నిధులకు చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కష్టకాలంలో 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో మినహా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు కాదు కదా అందులో సగం కూడా ఎప్పుడూ కేంద్రం ఇవ్వలేదు. పన్నుల్లో వాటా... పరవాలేదా? ఇక, కేంద్ర పన్నుల్లో వాటా విషయంలో ప్రతిపాదనలు, మంజూరు గణాంకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నా కేటాయించిన మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2021–22లో రూ.18,720.54 కోట్లు కేంద్రం నుంచి రాగా, 2022–23 సవరించిన అంచనాల మేరకు రూ.19.668.15 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, తాజా బడ్జెట్లో ఈ పద్దును రూ.21,470.84 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా విభేదాలున్నప్పటికీ కేంద్రంపై నమ్మకంతో తాజా బడ్జెట్లో ఈ రెండు పద్దుల కింద రూ.62 వేల కోట్ల (దాదాపు 20 శాతం) రాబడులు చూపారు. ఇదే విషయమై ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల్లో వాటా కింద రావాల్సిన నిధులను అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం తెలంగాణకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దు కింద కొన్నేళ్లుగా తక్కువగానే వస్తున్నా కేంద్రంపై ఆశలు పెట్టుకునే ప్రతిపాదనలు చేశామని చెప్పారు. -
సొంత పన్నులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పన్నుల రాబడిలో స్వయం సమృద్ధి సాధిస్తోంది. ఏటేటా పెరుగుతున్న సొంత ఆదాయ వనరులే ధీమాగా ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌కు రూపకల్పన చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే 2022–23 (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం)లో రాష్ట్ర పన్నుల కింద రూ.1.10 లక్షల కోట్లకు పైగా సమకూరగా, 2023–24కు ఇవి రూ.1.31 లక్షల కోట్లకు పెరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పద్దు కిందనే రూ.40వేల కోట్ల వరకు సమకూరనుండగా, ఎక్సైజ్ పద్దు కింద రూ.19,884 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18,500 కోట్ల ఆదాయం రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీనికితోడు రాష్ట్రంలో జరిగే వ్యాపారం, అమ్మకాల ద్వారా రూ.39,500 కోట్లు, వాహనాలపై పన్నుల ద్వారా రూ.7,512 కోట్లు సమకూరనున్నాయి. ఇతర ఆదాయాలతో కలిపితే మొత్తం రూ.1.31 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అప్పుల రూపంలో రూ. 46 వేల కోట్లు రెవెన్యూ రాబడుల కింద పరిగణించే అప్పుల రూపంలో రూ.46వేల కోట్లకు పైగా ప్రతిపాదించింది. ఇందులో బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాలు రూ.40,615 కోట్లు కాగా, కేంద్రం, ఇతర సంస్థల నుంచి మరో రూ.6 వేల కోట్లు తీసుకోనున్నట్టు ప్రతిపాదించింది. కాగా, అంతర్రాష్ట్ర సెటిల్మెంట్ల కింద ఈసారి బడ్జెట్ రాబడులను రూ. 17,828 కోట్ల కింద చూపెట్టారు. ఈ నిధులు ఏపీ నుంచి రావాల్సి ఉందని, డిస్కంల కింద తమకు ఏపీ చెల్లించాల్సింది ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తే ఏపీ ఇచ్చినప్పుడు తిరిగి చెల్లిస్తామని ఇటీవల కేంద్రానికి రాసిన లేఖ మేరకు నిధులు వస్తాయనే అంచనాతో ఈ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంటున్నాయి. ఇదే పద్దు కింద 2022–23లో నిధులు చూపకపోయినా సవరించిన అంచనాల్లో అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం కింద రూ.7,500 కోట్లు సమకూరినట్టు చూపడం గమనార్హం. మూడేళ్ల క్రితం లక్ష కోట్లు సంవత్సరాలవారీగా లెక్కిస్తే రెవెన్యూ రాబడుల్లో గణనీయ వృద్ధి కనిపిస్తోందని బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం అంటే 2020–21లో అన్ని రకాల పన్నులు, ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడుల కింద ఖజానాకు రూ.లక్ష కోట్లు సమకూరితే 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి రూ.2.16 లక్షల కోట్లకు చేరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రూ.1.27 లక్షల కోట్లు రాగా, 2022–23 సవరించిన అంచనాల ప్రకారం రూ.1.75 లక్షల కోట్లు రానుండటం గమనార్హం. -
పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి. ఐటీ రంగానికి రూ.366 కోట్లు ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది. -
మూలధన వ్యయం రూ. 37 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద రూ. 37,524.70 కోట్లు వెచ్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్ పరిమాణంలో ఇది దాదాపు 13 శాతం. 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన రూ. 29,728.44 కోట్ల మూలధన వ్యయ కేటాయింపులతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ. 8 వేల కోట్లు అధికం. అదే సవరించిన బడ్జెట్ 2022–23 అంచనాల (రూ. 26,934.02 కోట్లు) ప్రకారం అయితే సుమారు రూ. 11 వేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మూలధన వ్యయ కేటాయింపులు భారీగా పెంచడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది కేంద్రం తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన వడ్డీలేని రుణాలని పేర్కొంటున్నారు. రాష్ట్రాలకు రూ. 5 లక్షల కోట్ల వరకు వడ్డీలేని రుణాలిస్తామని, కానీ వాటిని మూలధన వ్యయం కిందనే వెచ్చించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో మూలధన వ్యయ కేటాయింపులను పెంచిందని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ పరిమాణం ఈసారి దాదాపు రూ. 34 వేల కోట్లు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు మూలధన వ్యయాన్ని ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు. -
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
మార్కులు కొంచెం మెరుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో ఈసారి చదివింపులు పెరిగాయి. అక్షరాలా రూ.19,093 కోట్లు కేటాయించారు. గతేడాది (2022–23) రూ.16,043 కోట్లు ఉండగా, ఈ ఏడా ది రూ.3,050 కోట్ల మేర పెరిగాయి. పాఠశాల విద్యకు రూ.16,092 కోట్లు ఇవ్వగా, ఉన్నతవిద్యకు రూ.3,001 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో చాలావరకూ ఉద్యోగుల వేతనాలు, సంస్థల నిర్వాహణకే సరిపోతుంది. ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ప్రమోషన్లు పొందే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలు, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలు కలుపుకుని పాఠశాలవిద్యలో దాదాపు 18 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన నిధుల అంశాన్ని బడ్జెట్లో ఎక్కడా పేర్కొనలేదు. ఉన్నతవిద్యకు అత్తెసరుగానే నిధులు కేటాయించారు. సాంకేతిక, కళాశాల విద్యకు నిధులు తగ్గాయి. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు, గతేడాది ప్రకటించిన మహిళావర్సిటీకి కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. గతేడాది మహిళావర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించినా, అవి ఖర్చవ్వలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు–మనబడి’పథకానికి ప్రణాళికేతర పద్దుల్లో నిధులు ఖర్చుచేయాలని నిర్ణయించారు. కొన్ని ముఖ్యాంశాలు ఆంగ్ల మాధ్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణకు నిధులు పెంచారు. పాఠశాల విద్యలో గతంలో రూ.32.07 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ. 73.07 కోట్లకు పెంచారు. ►కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో నిర్వహించే సమగ్ర శిక్షా అభియాన్‌కు రాష్ట్రవాటాను రూ.799.91 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచారు. ►అసంపూర్తిగా ఉన్న మోడల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి నిధులను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. ►ప్రధానమంత్రి పోషక్ (మధ్యాహ్న భోజనం) పథకానికి రాష్ట్రవాటాను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. ►కళాశాల విద్యలో భవన నిర్మాణాల నిర్వహణకు గతేడాది రూ.62.27 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.42.34 కోట్లకు తగ్గించారు. ►ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల ముద్రణకు గతంలో మాదిరిగానే రూ. 1.59 కోట్లే కేటాయించారు. అదనపు నిధుల ప్రతిపాదనకు మోక్షం దక్కలేదు. ►ఇంటర్‌విద్య కేటాయింపులు గతేడాదితో పోలిస్తే రూ.34.60 నుంచి 13.13 కోట్లకు తగ్గాయి. పురోగతికి విఘాతమే.. విద్యా రంగానికి 6.75% నిధులే కేటాయించడం పురోగతికి విఘాతమే. ఉమ్మడి ఏపీ 11%, ఢిల్లీ 23%, బిహార్ 18%, రాజస్తాన్ 17% నిధులు కేటాయించాయి. – చావా రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.3210 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘కల్యాణ’ కానుకకు 2023– 24 బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. క్షేత్రస్థాయి నుంచి సాయం అందుకునే వారి సంఖ్య పెరుగు తుండడంతో కేటాయింపులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లకు రూ.3210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.2750 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.460 కోట్లు పెంచింది. తాజా కేటాయింపులతో 3.20లక్షల మందికి కల్యాణ కానుక అందనుంది. -
‘సాగు’ నిధుల్లో సగానికిపైగా అప్పులకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చూపినా.. నిధుల్లో సింహభాగం రుణ కిస్తీలు, వడ్డీల చెల్లింపునకే ఖర్చవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 2023–24లో నీటి పారుదలశాఖకు నిర్వహణ పద్దు కింద రూ.17,504.1 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.8942.86 కోట్లు కలిపి మొత్తం రూ.26,446 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో చేసిన రూ.22,675 కోట్ల కేటాయింపులతో పోల్చితే ఇది రూ.3,771 అదనం. తాజా కేటాయింపుల్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.7,715.89 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.335.58 కోట్లు, చిన్న ప్రాజెక్టులకు రూ.1,301.58 కోట్లు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు రూ.256.56 కోట్లను చూపారు. నిర్వహణ పద్దు అప్పులకే.. తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద చూపిన రూ.17,504 కోట్లలో ఏకంగా రూ.15,700 కోట్లు రుణ వాయిదాలు, వడ్డీల చెల్లింపులకే పోనున్నాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది బడ్జెట్లో రూ.11,745 కోట్లను కేటాయించారు. ఈ ఏడాది మరో రూ.3,955 కోట్లు పెరిగాయి. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ కొత్త రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉందని అధికార వర్గాలే చెప్తున్నాయి. -
ఎన్నికల స్టంట్‌ను తలపిస్తోంది..
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల అని, ఇది ఎలక్షన్ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బడ్జెట్‌ను ‘శుష్క వాగ్దానాలు–శూన్య హస్తా లుగా అభివర్ణించారు. ‘ఆత్మస్తుతి – పరనింద’ మాదిరి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం.. కేంద్రాన్ని తిట్టడం తప్ప ఏమీ లేదని ధ్వజ మెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండిచేయి చూపారని పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధు లకు పొంతనే లేదని ఎత్తిచూపారు. ‘రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపింది. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్ప కపోవడం సిగ్గుచేటు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకం, అప్పులు, ప్రజలపై భారం మోపి సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోంది.సర్కార్ డొల్ల బడ్జెట్‌ను ప్రజల్లో ఎండగడతాం’ అని ప్రకటించారు. ప్రజలపై మరింత భారం మోపేలా... ‘విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులున్నాయి. ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం సంపాదనలో విద్య, వైద్యానికి 50 శాతానికిపైగా ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో విద్యకు 7 శాతం, వైద్యానికి 4 శాతంలోపు మాత్రమే నిధులు కేటాయించడాన్ని చూస్తుంటే పేద, మధ్య తర గతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులున్నాయి’ అని విమర్శించారు. ‘తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదని విమర్శిస్తున్న కేసీఆర్ కేంద్రం నిధులతో నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠధా మాలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులు, వీధిదీ పా ల ఏర్పాట్లన్నీ తామే చేస్తున్న ట్లుగా నీచ రాజ కీయాలకు అద్దం పడుతోంది. దళితబంధుపై ప్రజలను దగా చేశారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం సమయం కూడా సరిపోదు. ఎస్టీ శాఖకు కేటాయించిన నిధులు గిరిజనబంధుకు చాలని పరిస్థితి. రాష్ట్రంలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులే కేటాయించడం బాధాకరం’ అని విమర్శించారు. -
తెలంగాణ బడ్జెట్‌పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బడ్జెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో చెప్పేదానికి వాస్తవానికి పొంతన లేదు. విద్యా, వైద్య రంగానికి సరైన కేటాయింపులు లేవు. విద్యావాలంటీర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది. మన ఊరు-మన బడి రంగుల కల. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించలేమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులను ఆసుపత్రులకు ప్రభుత్వం ఇవ్వడంలేదు. కాంట్రాక్టర్లకు రెండు, మూడేళ్లైనా డబ్బులు రావడంలేదు. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 10వేల కోట్ల నుంచి 45వేల కోట్లకు పెరిగింది’ అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణ ఆచరిస్తోంది.. కేంద్రం అనుసరిస్తోంది: మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు 2023-24 ఏడాదికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మంత్రి హరీశ్ నాలుగోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. ఈ ఏడాదికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను రూ.2,90,396 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 2,11,685, మూలధన వ్యయం రూ. 37,525 కోట్లుగా కాగా.. తెలంగాణలో 2023-24కు తలసరి ఆదాయం రూ. 3లక్షల 17వేల 175గా ఉంది. అనంతరం, మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. ఇక, బడ్జెట్ ప్రసంగం సందర్బంగా మంత్రి హరీశ్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. కేంద్రం సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోంది. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన హామీలను కూడా పరిష్కరించలేదు. ట్రిబ్యునల్స్ పేరిట కేంద్రం దాటవేత ధోరణి పాటిస్తోంది. కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. కేటాయింపులు ఇవే.. - నీటి పారుదల రంగానికి రూ. 26,885 కోట్లు - విద్యుత్‌రంగానికి రూ. 12,727 కోట్లు - ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు - ఆయిల్ ఫామ్‌కు రూ. 100 కోట్లు - దళితబంధు పథకానికి రూ. 17,700 కోట్లు - ఆసరా పెన్షన్‌కు రూ. 12వేల కోట్లు - గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు - బీసీ సంక్షేమానికి రూ. 6,229కోట్లు - వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు - కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు. - పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు - రోడ్లు, భవనాల శాఖకు రూ. 2500 కోట్లు - పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లు - హోంశాఖకు రూ. 9599 కోట్లు - మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2131 కోట్లు - మైనార్టీ సంక్షేమానికి రూ.2200 కోట్లు - రైతుబంధు పథకానికి రూ.1575కోట్లు - రైతుబీమా పథకానికి రూ. 1589కోట్లు - కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200కోట్లు - పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4834 కోట్లు - విద్యారంగానికి రూ.19,093 కోట్లు - హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.500కోట్లు - పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీ రూ. 500కోట్లు - రైతు వేదికలకు రూ. 26,835 కోట్లు - మహిళా వర్సిటీకి రూ. 100కోట్లు - మూసీనది అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు. - డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి రూ.12వేల కోట్లు - ఆరోగ్యశ్రీకి రూ.1463 కోట్లు - షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు - పంచాయతీరాజ్‌కు రూ. 31,426 కోట్లు