సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కింద రూ. 37,524.70 కోట్లు వెచ్చించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్ పరిమాణంలో ఇది దాదాపు 13 శాతం. 2022–23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 29,728.44 కోట్ల మూలధన వ్యయ కేటాయింపులతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ. 8 వేల కోట్లు అధికం.
అదే సవరించిన బడ్జెట్ 2022–23 అంచనాల (రూ. 26,934.02 కోట్లు) ప్రకారం అయితే సుమారు రూ. 11 వేల కోట్లు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మూలధన వ్యయ కేటాయింపులు భారీగా పెంచడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన వడ్డీలేని రుణాలని పేర్కొంటున్నారు.
రాష్ట్రాలకు రూ. 5 లక్షల కోట్ల వరకు వడ్డీలేని రుణాలిస్తామని, కానీ వాటిని మూలధన వ్యయం కిందనే వెచ్చించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మూలధన వ్యయ కేటాయింపులను పెంచిందని వివరిస్తున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ పరిమాణం ఈసారి దాదాపు రూ. 34 వేల కోట్లు పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు మూలధన వ్యయాన్ని ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment