సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణకు ఉన్న డిమాండ్‌పై ఏమాత్రం స్పందించడం లేదని.. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర వాటాతో పాటు సావరిన్ గ్యారంటీల పేరిట పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని మండిపడ్డారు.
అయినా హైదరాబాద్ ప్రజల ఆకాంక్ష, పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ప్రాజెక్టు విస్తరణ కోసం కృషి చేస్తోందని చెప్పారు.
శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపు అంశంపై సభ్యులు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, భట్టి విక్రమార్క.. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)పై ఎంఐఎం సభ్యులు.. ఎస్‌ఎన్‌డీపీపై దానం నాగేందర్, వివేకానంద అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదని, శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘కాంగ్రెస్ హయాంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు ఒప్పందం మేరకే ప్రస్తుతం మూడు కారిడార్లలో ఎల్‌అండ్‌టీ సంస్థ ద్వారా నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. రూ.6,250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. రాయదుర్గ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రోను మూడేళ్లలో పూర్తిచేయనున్నాం. హైదరాబాద్ మెట్రో ఉద్యోగాల్లో 80 శాతం వరకు తెలంగాణ వాళ్లే ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో కుదిరిన ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ ఒప్పందంలో భాగంగా మెట్రో టికెట్ ధరలను పెంచుకునే అధికారాన్ని నిర్వహణ సంస్థకే ఇచ్చారు. అయినా ఇష్టానుసారం ధరలు పెంచకూడదని ప్రభుత్వం తరఫున చెప్పాం. ఆర్టీసీ ధరలతో పోల్చి మెట్రో టికెట్ ధరలు ఉండాలన్నాం. పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించే విషయంలో ఇటీవలే ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌తో సమావేశమయ్యాను. ముందుగా రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పూర్తిచేసి పనులు చేపట్టనున్నాం.
హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. చార్మినార్ సంరక్షణ కోసం పాదచారుల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఎన్ని అధునాతన భవంతులు వెలిసినా హైదరాబాద్ ఆత్మ ఎప్పటికీ చెదిరిపోదు. మూసీనదిపై అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పెడస్ట్రియన్ బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం.
మరో పెడస్ట్రియన్ బ్రిడ్జిని నయాపూల్ వద్ద నిర్మించే యోచనలో ఉన్నాం. గుల్జార్‌హౌస్, మీరాలం మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం. మదీనా నుంచి పత్తర్‌ఘట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయి. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టాం.
చార్మినార్ నుంచి దారుల్–ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. హెరిటేజ్ భవంతుల పూర్వ వైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోం.
ఎస్‌ఎన్‌డీపీ ఏ నగరంలోనూ లేదు
హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి (స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఎన్‌డీపీ)) చేపట్టాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశాం. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకుగాను 2 పూర్తిచేశాం. నగరంలో వందేండ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయి. పలుచోట్ల నాలాలపై 28వేల మంది పేదలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్–2కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పలు కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గింది..’’ అని కేటీఆర్ వివరించారు.
9 నెలల్లో పిల్లలు వస్తారు – మీరు రారు!
సభలో మొదట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు వచ్చిందని, కానీ ఇప్పుడు ఆదాయాన్ని మొత్తంగా నిర్వహణ సంస్థకే దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘‘60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆమాత్రం చేయలేరా?’’ అని నవ్వుతూ అంటూనే.. ‘‘మాట్లాడితే తొమ్మిది నెలల్లో మేం వస్తాం అంటున్నారు.
తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు. మీరు రారు’’ అని వ్యాఖ్యానించారు. దీనితో సభలో అంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఇక సంగారెడ్డి మెట్రో ప్రాజెక్టు గురించి జగ్గారెడ్డి అడుగుతున్న విషయాన్ని కేటీఆర్ ప్రసంగం తర్వాత గుర్తుచేయగా నవ్వుతూ.. ‘‘9 నెలల్లో వస్తారుగా.. అప్పుడు చూసుకోండి’’ అని పేర్కొన్నారు. అప్పటికే మైక్ ఆపేయడంతో ఆ మాటలు రికార్డులకు ఎక్కలేదు.
ప్రతిపాదనలన్నీ వెనక్కే..
కోటీ 20లక్షల మంది నివసిస్తున్న హైదరాబాద్‌కు నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంపై పగబట్టినట్టుగా తెలంగాణపై కక్షగట్టి వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లో మెట్రో పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలుద్దామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.
అధికారులను పంపించినా సానుకూల స్పందన రాలేదు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించాం. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే వయబిలిటీ లేదని, ఇతర కారణాలు చూపుతూ నిధులు కేటాయించడం లేదు.
వడ్డించేవాళ్లు మనవాళ్లయితే అన్నట్టుగా కేంద్రం
వ్యవహరిస్తోంది. బెంగళూరు మెట్రోకు కేంద్రం 20 శాతం వాటాతోపాటు రూ.29వేల కోట్లకుపైగా సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది. చెన్నై మెట్రోకు కేంద్రం వాటా, సావరిన్ గ్యారంటీ కలిపి రూ.58,795 కోట్లు కేటాయించింది. యూపీ లోని ఆరు పట్టణాలకు 20 శాతం వాటాతో పాటు సావరిన్ గ్యారంటీ ఇస్తోంది.
– మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment