ఫోర్త్‌సిటీకి మెట్రో | Hyderabad Metro Rail Phase II to Fourth City | Sakshi
Sakshi News home page

ఫోర్త్‌సిటీకి మెట్రో

Published Sun, Nov 3 2024 5:21 AM | Last Updated on Sun, Nov 3 2024 9:44 AM

Hyderabad Metro Rail Phase II to Fourth City

రూ.8,000 కోట్లతో 40 కిలోమీటర్ల నిర్మాణం

రెండోదశ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం 

రూ. 24,269 కోట్లతో పరిపాలన అనుమతులు 

ఐదు కారిడార్లు.. 76.4 కిలోమీటర్లు  

ఆరో కారిడార్‌గా ఫోర్త్‌సిటీకి మెట్రో కనెక్టివిటీ 

మొత్తం ప్రాజెక్టు  వ్యయం రూ.32,237 కోట్లు  

కేంద్రంతో కలిసి 50:50 విధానంలో జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్‌–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్‌–బీలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీ (స్కిల్స్‌ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్‌మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  

జాయింట్‌ వెంచర్‌గా నిర్మాణం 
రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్‌ వెంచర్‌ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్‌ ఇంటర్నేషన్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా), ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ), న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు.  


ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్‌ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్‌ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్‌ డీపీఆర్‌ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్‌ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్‌ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది.  

కొత్త హైకోర్టును కలుపుతూ.. 
మెట్రో రైల్‌ రెండో దశ డీపీఆర్‌ల రూపకల్పనపై సీఎం రేవంత్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) ట్రాఫిక్‌ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చారు. 



మెట్రో మార్గాల్లో ట్రాఫిక్‌ అంచనాలను సీఎంపీతో క్రాస్‌–చెక్‌ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్‌లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్‌మెంట్‌లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్‌లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ ను ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్‌ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు.  

ఐదు కారిడార్‌ల అలైన్‌మెంట్‌లు ఇలా.. 
కారిడార్‌ –4 (ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కారిడార్‌): నాగోల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్‌బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్‌డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరామ్‌ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్‌ జంక్షన్‌ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్‌బి నగర్, చంద్రాయన్‌ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్‌లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్‌ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్‌ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి 

కారిడార్‌ 5: రాయదుర్గ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి కోకాపేట నియోపోలిస్‌ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్‌ రామ్‌ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్‌ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్‌ కారిడార్‌. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. 

కారిడార్‌ 6 (ఓల్డ్‌ సిటీ మెట్రో): ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న గ్రీన్‌ లైన్‌ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్‌ సిటీలోని మండి రోడ్, దారుల్‌షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. 

ఈ రూట్‌లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్‌లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్‌ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్‌ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్‌ మెట్రో. 

కారిడార్‌ 7: ముంబై హైవేపై రెడ్‌ లైన్‌ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి పటాన్‌చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్‌ ఆలి్వన్‌ క్రాస్‌ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్, ఇక్రిసాట్‌ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్‌ కారిడార్‌. 

కారిడార్‌ 8: విజయవాడ హైవేపై ఎల్‌.బి నగర్‌ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్‌ లైన్‌ పొడిగింపుగా హయత్‌నగర్‌ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్‌ నిర్మిస్తారు. ఈ లైన్‌ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్‌ కారిడార్‌. ఈ లైన్‌లో 6 స్టేషన్లు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement