సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన ఎనిమిదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సాధారణ పాలన, వాణిజ్య పన్నుల నిర్వహణ, వైద్య, ఆరోగ్యం, పశు, మత్స్య పరిశ్రమ, హోం, జైళ్లు, వ్యవసాయ, సహకార, పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలకు సంబంధించిన పద్దులను శాసనసభ ఆమోదించింది.
శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ నేరుగా ప్రశ్నోత్తరాలను చేపట్టింది. ‘2023 ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లుతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించింది. విరామం అనంతరం తిరిగి సమావేశమైన శాసన సభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కాగా ఆదివారం వార్షిక బడ్జెట్ 2023–24 ద్రవ్య వినిమయ బిల్లు ఉభయసభల్లో చర్చకు రానున్నది.
ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఆదివారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత శాసనమండలికి పంపుతారు. శాసనమండలిలోనూ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడుతుంది.
అర్ధరాత్రి వరకు కొనసాగిన అసెంబ్లీ
అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. సుమారు 14 గంటల పాటు సమావేశం జరగ్గా శనివారం సాయంత్రం ఐదున్నర వరకు పద్దులపై సభ్యులు ప్రసంగించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తమ శాఖలపై జరిగిన చర్చకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు.
ప్రజలకు అవసరమైన ముఖ్య పద్దులపై చర్చ జరుగుతున్నా మూడు రోజులుగా బీజేపీ సభ్యులు గైర్హాజరు కావడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పద్దులపై ఇచ్చిన కోత తీర్మానాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటింగ్ నిర్వహించారు. పద్దులను ఆమోదించినట్లు ప్రకటిస్తూ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment