సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 తర్వాత మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసారి తాత్కాలిక (ఓటాన్ అకౌంట్) బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసేలా తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆర్థిక సంఘం పర్యటన పూర్తయ్యాకే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లోపే దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన రైతు రుణ మాఫీ, రైతు బంధు, ఆసరా పెన్షన్ల మొత్తం పెంపుపై తాత్కాలిక బడ్జెట్‌లోనే ప్రభుత్వం నిధులను కేటాయించనుంది. ఎన్నికల షెడ్యూల్‌లోపే దీన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ప్రభుత్వం అసెంబ్లీలో తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
19న సీఎం సమక్షంలో ఆర్థిక సంఘం భేటీ...
ఈ నెల 18న ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు రానుంది. ఆర్థిక సంఘం కార్యదర్శి అర్వింద్ మెహతా, సభ్యులు శక్తికాంత్‌దాస్, అనూప్ సింగ్, రమేశ్ చంద్, అశోక్ లాహిరితో కూడిన ఈ బృందం మొదటి రోజు స్థానిక సంస్థలు, వాణిజ్య, పరిశ్రమల రంగాల ప్రతినిధులతో సమావేశం కానుంది. 19న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 20న ఆర్థిక నిపుణులతో సమావేశమవుతారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తారు. ఆర్థిక సంఘానికి అందించేందుకు వీలుగా రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజె క్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, టీఎస్–ఐపాస్, కేసీఆర్ కిట్, కేజీ టు పీజీ తదితర ప్రాధాన్యత అంశాలపై అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో ఆర్థిక, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. దీంతో ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
20 తర్వాత బడ్జెట్ సమావేశాలు
Published Sat, Feb 9 2019 12:43 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment