Munugode By Poll Results 2022: TRS Party Win in Munugode Bypoll With Over 10000 Votes Majority - Sakshi
Sakshi News home page

ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్‌ఎస్ జయకేతనం

Published Mon, Nov 7 2022 1:54 AM | Last Updated on Mon, Nov 7 2022 10:26 AM

Telangana KCR TRS Win Munugode Bypoll With Over 10000 Majority - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్‌ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. 

ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్‌ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్‌ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్‌ఎస్‌కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్‌కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. 

బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే.. 
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్‌ఎస్‌ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ హవా కనిపించింది. కాంగ్రెస్‌ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్‌లో బీజేపీపై టీఆర్‌ఎస్‌ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్‌లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్‌లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్‌లో 817, 6వ రౌండ్‌లో 638, 7వ రౌండ్‌లో 399, 8వ రౌండ్‌లో 532, 9వ రౌండ్‌లో 852, 10వ రౌండ్‌ 488 ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్‌ సాధించింది.

అప్పటిదాకా ప్రతిరౌండ్‌లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్‌ఎస్‌కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్‌లో 1,361, 12 రౌండ్‌లో 2వేల ఓట్లు, 13వ రౌండ్‌లో 1,345 ఓట్లు, 14వ రౌండ్‌లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్‌/సర్వీస్‌ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. 

ఆద్యంతం ఉత్కంఠగా.. 
ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్‌ నుంచి 10వ రౌండ్‌ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గింది. 12వ రౌండ్‌ సమయానికి టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

డిపాజిట్‌ దక్కించుకోని కాంగ్రెస్‌ 
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్‌ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్‌ దక్కినట్టు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్‌:  ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్‌లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్‌ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు.

సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్‌ నేతలు, హిమాయత్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు.
చదవండి: పక్కా వ్యూహంతో విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement