వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. చిత్రంలో మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు
వికారాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, దీంతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతుసమస్యలపై నిర్వహించిన ధర్నాలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘ఢిల్లీలో ఉన్నోడు.. గల్లీలో ఉన్నోడు కూడబలుక్కొని డ్రామాలాడుతున్నరు.. ప్రచార మాధ్యమాల్లో ప్రజాసమస్యలపై చర్చ రాకుండా చేస్తున్నారు’ అని అన్నారు. కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే టీఆర్‌ఎస్ ఓటేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేవెళ్ల– ప్రాణహిత ప్రాజెక్టు కింద రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో రూ. 8 వేల కోట్లు రంగారెడ్డి జిల్లాలోనే ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో డిజైన్ మార్చి పాలమూరు పథకాన్ని పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దర్యాప్తు సంస్థలతో నాటకాలు
ఈడీ, సీబీఐ, సిట్‌ల పేరుతో దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఈడీ నోటీసులిస్తే, వ్యవస్థలను గౌరవించి వెళ్లి సమాధానాలు చెప్పి రాలేదా అని పేర్కొన్నారు. మరి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇస్తే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని, కవితకు సీబీఐ నోటీసులు ఇస్తే ఇంట్లో కూర్చొని సమాధానమిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేసీఆర్‌కు కాంగ్రెస్ ఉసురు
పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న కేసీఆర్.. ఇప్పుడు తన వరకు వచ్చే సరికి ఏడుస్తున్నారని రేవంత్ విమర్శించారు. నాడు రూ.30 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. నేడు మారు బేరంలో వంద కోట్లిస్తే అమ్ముడు పోకుండా ఉంటాడా? అని నిలదీశారు. తనను జైళ్లో పెట్టినప్పుడు కూతురు నిశ్చితార్థం కోసం ఒక్కరోజు బెయిల్ గురించి ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకోవటం నిజం కాదా? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయన కూతురు వరకు వచ్చే సరికి గగ్గోలు పెట్టడమెందుకని అన్నారు. మీడియా సామాజిక బాధ్యతను మరచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు.
ఆ రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యత
కామారెడ్డి జిల్లాలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకున్న ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ట్వీట్ చేశారు. ‘రైతును కాపాడేందుకు సమ యం ఉన్నా స్పందించని యంత్రాంగం. కేసీఆర్ పాలనలో మొద్దుబారిన వ్యవస్థల దుర్మార్గానికి నిదర్శనం ఇది’ అని ట్వీట్‌లో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment