monetary exchange bill
-
19 పద్దులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మూడో శాసనసభ మూడో విడత సమావేశాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం ఒక ప్రభుత్వ బిల్లుతో పాటు 2024–25 వార్షిక బడ్జెట్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 19 పద్దులపై చర్చ జరిగింది. మంత్రుల సమాధానాల అనంతరం సభ వాటికి ఆమోదం తెలిపింది. పద్దులపై సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చ మంగళవారం తెల్లవారుజామున 3.10 గంటల వరకు కొనసాగింది.తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా పద్దులపైనే చర్చించింది. పశు మత్స్య పరిశ్రమ, క్రీడలు యువజన సేవలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకారం, పర్యాటక, కళలు.. సాంస్కృతిక, ధర్మాదా య, అడవులు, శాస్త్ర సాంకేతికత, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖల పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు పాల్గొన్నారు.పద్దులను ఆమోదించిన అనంతరం శాసన సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం (స్కిల్స్ యూనివర్సిటీ), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య బిల్లు–2024ను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. అసెంబ్లీ ఉభయ సభల్లో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుంది. దీంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ వేర్వేరుగా బులెటిన్లు జారీ చేశారు. -
అసెంబ్లీ సమావేశాలకు నేటితో తెర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం జరిగిన ఎనిమిదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. నీటిపారుదల, గవర్నర్, మంత్రిమండలి, సాధారణ పాలన, వాణిజ్య పన్నుల నిర్వహణ, వైద్య, ఆరోగ్యం, పశు, మత్స్య పరిశ్రమ, హోం, జైళ్లు, వ్యవసాయ, సహకార, పంచాయతీరాజ్, గ్రామీణ శాఖలకు సంబంధించిన పద్దులను శాసనసభ ఆమోదించింది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ నేరుగా ప్రశ్నోత్తరాలను చేపట్టింది. ‘2023 ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లుతో పాటు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ఆమోదించింది. విరామం అనంతరం తిరిగి సమావేశమైన శాసన సభ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కాగా ఆదివారం వార్షిక బడ్జెట్ 2023–24 ద్రవ్య వినిమయ బిల్లు ఉభయసభల్లో చర్చకు రానున్నది. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడనుంది. ఆదివారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. ఈ బిల్లును శాసనసభ ఆమోదించిన తర్వాత శాసనమండలికి పంపుతారు. శాసనమండలిలోనూ ఈ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడుతుంది. అర్ధరాత్రి వరకు కొనసాగిన అసెంబ్లీ అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. సుమారు 14 గంటల పాటు సమావేశం జరగ్గా శనివారం సాయంత్రం ఐదున్నర వరకు పద్దులపై సభ్యులు ప్రసంగించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తమ శాఖలపై జరిగిన చర్చకు సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజలకు అవసరమైన ముఖ్య పద్దులపై చర్చ జరుగుతున్నా మూడు రోజులుగా బీజేపీ సభ్యులు గైర్హాజరు కావడంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పద్దులపై ఇచ్చిన కోత తీర్మానాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటింగ్ నిర్వహించారు. పద్దులను ఆమోదించినట్లు ప్రకటిస్తూ సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. -
ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. అయితే శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో ఆమోదించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో మండలి డిప్యుటీ చైర్మన్ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
'ఉద్యోగుల ఉసురు టీడీపీకి తగులుతుంది'
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్లనే ఉద్యోగులకు జీతాలు రాలేదని, అందుకు టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ' టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడంతోనే మాకు జీతాలు రాలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తేదీన జీతాలు రావాలి. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు.యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులు మేలు జరలేదు.. అశోక్ బాబు ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ద్రవ్యవినిమాయ బిల్లును అడ్డుకున్నారు.' అంటూ తెలిపారు. (ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?) ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ' పథకం ప్రకారం మండలి చైర్మన్ ద్రవ్యవినిమయ బిల్లును అడ్డుకున్నారు. బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్సీలు పావుగా వాడుకున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారు. జీతాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు..కౌన్సిల్ లో టీడీపీ ఎమ్మెల్సీ లు వ్యవహరించిన తీరును తీవ్రంగా కండిస్తున్నాము. బిల్లు పాస్ కాకపోతే జీతాలు రావని తెలిసి కూడా అశోక్ బాబు మాట్లాడకపోవడం దారుణం.' అంటూ వెల్లడించారు. (ఏపీలో 845 కొత్త పాజిటివ్ కేసులు) -
కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్ బుక్ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. ► నారా లోకేశ్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్‌పై గూండాల్లా దాడి చేశారు. ► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్ దాడికి తెగబడ్డారు. ► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. ► గతంలో చైర్మన్ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. ► చైర్మన్ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లోకేశ్ డైరెక్షన్లోనే దాడి చంద్రబాబు, లోకేశ్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్‌కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ వేదికగా లోకేశ్ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్ మాఫియా గూండా దీపక్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్ సెల్ఫోన్లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. -
మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!
సాక్షి, అమరావతి: అర్థవంతమైన చర్చలు, సలహాలు, సూచనలతో ఆదర్శంగా నిలవాల్సిన శాసనమండలి టీడీపీ రాజకీయ కుయుక్తులకు వేదికైంది. విపక్ష సభ్యులు మరోసారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో దౌర్జన్యంగా వ్యవహరించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుని దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించారు. నిబంధనల మేరకు సభ నడపాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు అభ్యర్థించినా ఆలకించలేదు. రూల్ 90 ప్రకారం చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటించకుండా అప్పటికప్పుడు చైర్మన్‌కు నోటీసు ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు రభస చేశారు. సంఖ్యా బలంతో జాప్యం చేయడం మినహా బిల్లులను అడ్డుకోలేమని తెలిసినా డ్రామాలకు తెరతీయడంపై ప్రజాస్వామికవాదులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఇతర బిల్లులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఆందోళనకరం.ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఆమోదించడం రాజ్యాంగ విధి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను, బిల్లును రాజ్యసభ ఆమోదిస్తున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఆర్థిక బిల్లును అడ్డుకున్నా లావాదేవీలు ఆగవు. కాకుంటే కాస్త ఆలస్యమవుతాయి. – పీజే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పెద్దల సభ పరిధి సలహాల వరకే.. ‘ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయి. శాసనమండలి అనేది పెద్దల సభ. కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే దాని పరిధి. బడ్జెట్‌పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది. మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాంటి ప్రజలు ఎనుకున్న శాసనసభకే సర్వాధికారాలు ఉంటాయి తప్ప శాసనమండలికి ఏమీ అధికారం ఉండదు. సలహాలు ఇచ్చి అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం కాకుండా అంతకు మించి అక్కడ వ్యవహారాలు కొనసాగుతుండడం విపరీతంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు. శాసనమండలి ఆమోదంతో శాసనసభకు కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. శాసనసభ ఆమోదించినందున ప్రభుత్వం దాని ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రారంభించవచ్చు. శాసనమండలికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభదే తుది నిర్ణయం అవుతుంది’ – కేఆర్ సురేష్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)కు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,28,738 కోట్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించిన ఈ బిల్లును సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. అలాగే గడిచిన మూడు మాసాలకు గానూ బడ్జెట్ వినియోగానికి ఇచ్చిన ఆర్డినెన్స్‌కూ సభ ఆమోద ముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాలు (సప్లిమెంటరీ ఎస్టిమేట్స్)కు శాసనసభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. ► అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5.58 గంటల పాటు జరిగినట్లు స్పీకర్ చెప్పారు. ► ద్రవ్య వినిమయ బిల్లుతో సహా 15 బిల్లులు పాస్ చేసినట్టు పేర్కొన్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసే సమయంలో స్పీకర్.. మీకేమైనా వేతనాలు తగ్గాయా అంటూ ఛలోక్తి విసిరారు. దీనికి సభ్యులు ఒక్కసారిగా నవ్వి.. తమకు ఎలాంటి కోతలూ లేవని అన్నారు. ► ఈ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరఫున 151 మంది, టీడీపీ తరఫున 23 మంది, జనసేన పార్టీ తరఫున ఒకరు పాల్గొన్నారని స్పీకర్ తెలిపారు. ► 2020–21 బడ్జెట్‌కు సంబంధించి వివిధ శాఖల పద్దులను కూడా శాసనసభ ఆమోదించింది. ► రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ శాఖల పద్దులను విడివిడిగా ఆమోదించాల్సిందిగా అన్ని శాఖల తరఫున ఆర్థిక మంత్రి శాసనసభను కోరారు. ► అనంతరం సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయా శాఖల పద్దులకు సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. -
నిష్పక్షపాతమే మా విధానం
సాక్షి, అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నది తమ ప్రభుత్వ విధానమైతే టీడీపీ నాయకులకు అనుకూలంగా పని చేయాలన్నది గత సర్కారు విధానమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యక్తం చేసిన విమర్శలు, అభ్యంతరాలపై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. నిక్కచ్చిగా ఉండండి... మావాళ్లకు సపోర్టు చేయండి ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఎవరు చేసినా సహించవద్దని, శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, పార్టీలు, వ్యక్తులని చూడవద్దని తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో పాల్గొంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా సరే వదలొద్దన్నారు. ఇదే విషయం మీడియాలోనూ వచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం 2014 సెప్టెంబర్‌లో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సమావేశంలో.. నాకు మీరు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. మా వాళ్లు ఏం చేసినా మీరు (కలెక్టర్లు, ఎస్పీలు) సపోర్టు చేయాలి..’ అని బాహాటంగానే చెప్పారు’ అని బుగ్గన గుర్తు చేశారు. జన్మభూమి కమిటీల వేధింపులతోనే... ‘శాంతి భద్రతల పరిరక్షణలో మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా అక్కడో ఇక్కడో గ్రామాల్లో కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. అవి వ్యక్తుల వ్యక్తిగత కోపతాపాల వల్ల జరిగినవే. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాల, వేధింపులకు గురైన వారు ఆగ్రహావేశాలతో అక్కడక్కడా దాడులకు పాల్పడి ఉంటే రాష్ట్రం మొత్తానికి, ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు’ అని బుగ్గన చెప్పారు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని అమలు చేయడం లేదని టీడీపీ సభ్యులు ప్రస్తావించడంపై స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగానే రెండేళ్ల కిందటే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించి ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చొప్పున ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ‘మిడ్నైట్’ ప్యాకేజీలతో నష్టమిదీ పోలవరం ఆలస్యం కావడానికి గత పాలకుల పాపమే కారణమని బుగ్గన విమర్శించారు. ‘2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైతే 2016 సెప్టెంబర్‌లో ‘‘మిడ్ నైట్ ప్యాకేజీ’’ మాట్లాడుకునే వరకు రెండున్నర ఏళ్లు ఏం చేసినట్లు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పోలవరం సత్వరమే పూర్తికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు, రాయలసీమ ప్రాంతానికి అందించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటిపైనా ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. విపక్ష నాయకుడు, ఆ పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అంత భయం ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలిసారి.. ‘జగనన్న అమ్మ ఒడి’ ‘తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరగ రాయాలనుకున్న తల్లులకు ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తోందని బుగ్గన పేర్కొన్నారు. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని దేశంలో తొలిసారిగా తెస్తున్న రాష్ట్రం మనదేనన్నారు. నాడు మీరేం చేశారు? మూడేళ్లుగా కరువు నెలకొంటే జీఎస్డీపీ పెరిగిందంటూ చంద్రబాబు చేపల కథలు చెబుతున్నారని బుగ్గన దుయ్యబట్టారు. అందులో ఏదో మతలబు ఉందని తాము గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. మత్స్యకారులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సూచిస్తున్న టీడీపీ అధికారంలో ఉండగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘బడ్జెట్లో గృహనిర్మాణ రంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. గతంలో వాళ్లు చేసిన ఖర్చు రూ.3,189 కోట్లు కాగా మేం రూ.3,617 కోట్లు బడ్జెట్లో పెట్టాం. పేదల ఇళ్ల పట్టాలకు భూసేకరణ కోసం రూ.5,000 కోట్లు కేటాయిస్తే చాలదంటున్నారు. ప్రభుత్వ భూములు సరిపోనప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తాం’ అని బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ సర్కారు అవినీతికి ఇదిగో నిదర్శనం ‘గత పాలకులు అర్బన్ హౌసింగ్‌ను టిడ్కోకు ఇచ్చి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,200 చొప్పున చెల్లించారు. మేం చదరపు అడుగుకు రూ.1,200 – 1,300 తోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. అసెంబ్లీ భవనం నిర్మాణానికి అడుగుకు రూ.11,000 చొప్పున వెచ్చించారు. హైదరాబాద్ మహా నగరంలోనే భూమి విలువతో కలుపుకొని చదరపు అడుగు ఇల్లు రూ.5,000కే వస్తోంది. ఇక్కడ భూమి విలువతో సంబంధం లేకుండా చదరపు అడుగు నిర్మాణానికే రూ.11,000 చొప్పున ఇచ్చారంటే ఎంత అవినీతి జరిగిందో చూడండి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుంది’ అని బుగ్గన చెప్పారు. మూడు బడ్జెట్లలో భృతికి సున్నా.. బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసుకుని టీడీపీ సర్కారు మూడు బడ్జెట్లలో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించలేదని బుగ్గన ధ్వజమెత్తారు. 2017– 18లో రూ.500 కోట్లు బడ్జెట్లో చూపించినా రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 2018– 19లో రూ.1,000 కోట్లు కేటాయించి రూ.273 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేసేందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని బుగ్గన వివరించారు. గత పాలకులు పింఛన్లకు ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ. 5,507 కోట్లు కేటాయించగా తమ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లోనే రూ.15,600 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్య వినిమయ బిల్లును రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. 2019 ఏప్రిల్ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2.32 లక్షల కోట్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించిన ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును బలపరుస్తూ మొదట ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన బడ్జెట్ అద్భుతంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశంసించారు. ఈ బడ్జెట్ తమ బడ్జెట్ అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తున్నారని ప్రస్తుతించారు. అలాగే, అవినీతి రహిత పారదర్శక పాలనే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశంలో ఆమోదించిన విప్లవాత్మక బిల్లులు.. సంక్షేమ, ప్రగతికారక బడ్జెట్‌ను దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తోందని కొనియాడారు. నామినేషన్‌పై ఇచ్చే పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన బిల్లు దేశంలోనే విప్లవాత్మకమైనదని వివరించారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కూడా చరిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు బాలరాజు, అప్పలరాజు, టీడీపీ సభ్యులు సాంబశివరావు, వాసుపల్లి గణేష్ తదితరులు ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టమైన వివరణ ఇచ్చిన అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులకు విజ్ఞప్తిచేయగా.. అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాల మధ్య సభ ఈ బిల్లును ఆమోదించింది. -
తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా
-
ఇదీ బడ్జెట్ సమావేశాల రికార్డు
⇒ తక్కువ వ్యవధిలో..ఎక్కువ పద్దులపై చర్చ ⇒ రెండు వారాల్లోనే ముగిసిన సమావేశాలు ⇒ మొత్తం 72 గంటల 33 నిమిషాలపాటు చర్చలు ⇒ అయిదు బిల్లులకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా ⇒ బడ్జెట్.. పద్దులపై చర్చా సమయం సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కేవలం 13 రోజుల్లోనే ముగిశాయి. చివరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లు, కాగ్ నివేదికలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 24 రోజులు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఈ నిబంధనను సవరించారు. బీఏసీతో సంప్రదింపుల మేరకు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులుండాలనేది స్పీకర్ నిర్ణయానికి అప్పగించారు. అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాలు రికార్డు స్థాయిలో 2 వారాల్లోనే ముగిశాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 72.33 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. 168 ప్రశ్నలు, 192 అనుబంధ ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు 29 గంటల 09 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో టీఆర్ఎస్ 11.14 గంటలు, కాంగ్రెస్ 15.14 గంటలు, ఎంఐఎం 5.07 గంటలు, బీజేపీ 6.32 గంటలు, టీడీపీ 2.57 గంటలు, సీపీఐ 6 నిమిషాలు, సీపీఎం 1.48 గంటల పాటు మాట్లాడినట్లుగా రికార్డయింది. నాలుగ్గంటలు మాట్లాడిన సీఎం: మొత్తం సమావేశాల్లో సీఎం కేసీఆర్ 4.12 గంటలు మాట్లాడగా ప్రతిపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ 2.08 గంటలు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2.34 గంటలు మాట్లాడారు. ఈనెల 23వ తేదీన రికార్డు స్థాయిలో ఉదయం పది గంటలకు మొదలైన సభ రాత్రి 10.36 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశాల్లో అయిదు బిల్లులు ఆమోదం పొందాయి. కీలకమైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుతో పాటు భూదాన్ చట్ట సవరణ బిల్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్సుల చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందాయి. తొలి రోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు చివరి రోజున 2015–16 ఆర్థిక సంవత్సరపు కాగ్ ఆడిట్ నివేదికల సమర్పణతో ముగిశాయి. గవర్నర్ ప్రసం గిస్తుండగా సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంగా టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సమావేశాలు ముగిసేంత వరకు బహిష్కరించారు. పద్దుల పైనే ఎక్కువ చర్చ బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత ప్రారంభించటం ఆనవాయితీ. ఆరోజు ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేకపోవటంతో బీజేపీ చర్చను ప్రారంభించింది. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాగా వ్యవహరించటంతో అర్థవంతమైన చర్చలకు ఎక్కువ సమయం దొరికింది. మొత్తం సెషన్లో కేవలం 27 నిమిషాల సభా సమయం దుర్వినియోగమైంది. గతంతో పోలిస్తే బడ్జెట్‌పై సాధారణ చర్చ కంటే పద్దులపై ఎక్కువగా చర్చించేందుకు అధికార, విపక్ష సభ్యులు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్లో ప్రకటించిన వాటితో పాటు విపక్ష సభ్యుల సూచనల మేరకు విద్యార్థుల మెస్‌చార్జీల పెంపు, హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని చివరి రోజున సీఎం ప్రకటించటం గమనార్హం. ‘ సమావేశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. పద్దులపై ఇంత గొప్పగా ఎన్నడూ చర్చ జరగ లేదు. మా పార్టీ సభ్యులతో పాటు విపక్ష సభ్యులు సైతం సందర్భో చితంగా హూందాగా వ్యవహరించారు...’అని హరీశ్ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతి పాలన కొనసాగింపు
ఉత్తరాఖండ్‌లో రేపు బలపరీక్ష ఉండదన్న సుప్రీంకోర్టు ♦ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైకోర్టు ఉత్తర్వులపై స్టే ♦ కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈనెల 29న అసెంబ్లీలో బలపరీక్ష లేదని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలనను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వుల వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా న్యాయయూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఏడు క్లిష్టమైన ప్రశ్నలు సంధించింది. వీటితోపాటు అవసరమనుకుంటే మరికొన్ని ప్రశ్నలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అటార్నీ జనరల్ (ఏజీ)కు సూచించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదావేసింది. వచ్చే నెల మధ్య నుంచి కోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున ఆలోపే తీర్పు రావచ్చు. విచారణలో తనను అనుమతించాలన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినతిపై బెంచ్ మండిపడింది. ఆయన చేసేదేం లేదంది. కేసు పరిష్కారానికి బలపరీక్ష నిర్వహించడమొక్కటే మార్గంగా కనిపిస్తోందని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందని రాష్ట్రపతి పాలన నిర్ణయంలో సహేతుకత లేకపోతే బలపరీక్ష జరపాల్సి వుంటుందని పేర్కొంది. దీనిపై సూచనలు ఇవ్వాలని అటార్నీ జనరల్ రోహత్గీని కోరింది. రాష్ట్రపతి పాలనను కోర్టు ఎత్తివేయకపోతే మే 27 వరకు అది అమల్లో ఉంటుందని, తర్వాత బలపరీక్ష నిర్వహణ ప్రభుత్వ విచక్షణపైన ఆధారపడి ఉంటుందని రోహత్గీ చెప్పారు. కేంద్రానికి ఏడు ప్రశ్నాస్త్రాలు సబలపరీక్ష ఆలస్యమైతే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందా? సఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటుకు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతిపాలనకూ సంబంధముందా? సకేంద్ర పాలననిర్ణయం కోసం అసెంబ్లీ వ్యవహారాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారా?సఆర్టికల్ 175(2) ప్రకారం బలపరీక్ష నిర్వహిస్తున్నట్లు గవర్నర్ చెప్పారా?సగవర్నర్, స్పీకర్ ఇద్దరూ రాజ్యాంగ అధికారాలున్న వారైనందున డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని గవర్నర్ సూచించవచ్చా?సనిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందనప్పుడు ఆ విషయాన్ని స్పీకర్ చెప్పకపోతే ఎవరు చెప్తారు?రాష్ట్రపతి పాలన విధిస్తే ద్రవ్యవినిమయ బిల్లు పరిస్థితి ఏంటి? -
బాబు సర్కార్ మళ్లీ పరార్
- మరోమారు పలాయనం చిత్తగించిన ప్రభుత్వం - ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌కు ససేమిరా - ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేసినా పట్టించుకోని స్పీకర్ - ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు - సభలో విలువలకు, నిబంధనలకు తిలోదకాలు - ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే తాపత్రయం - ‘డివిజన్’పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న ప్రతిపక్షనేత సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నిబంధనలు లేవు.. విలువలు లేవు.. సంప్రదాయాలు - శాసనసభ ఔన్నత్యం సంగతి సరేసరి... అన్నీ ‘చంద్రా’ర్పణం. సభ హుందాతనం గురించి తరచూ లెక్చర్లిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభా సంప్రదాయాలన్నిటినీ తుంగలో తొక్కారు. విలువలను పాతాళానికి దిగజార్చారు. సభలో తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరపకుండా పలాయనం చిత్తగించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులంతా ముక్తకంఠంతో డివిజన్‌కు డిమాండ్ చేస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా.. సభా మర్యాదను మంటగలుపుతూ మూజువాణితో మమ అనిపించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముగింపు రోజు కూడా చంద్రబాబు మూజువాణి మంత్రాన్ని పఠించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సందర్భంలోనూ అధికారపక్షం ఇలానే వ్యవహరించింది. నిబంధనలకు తిలోదకాలిచ్చింది. విలువలకు పాతరేసింది. బుధవారం మూజువాణి ఓటుతో ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తున్నపుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘కౌల్ అండ్ షక్దర్’లోని నిబంధనలను సభకు వివరించే ప్రయత్నం చేస్తుంటే మైక్ కట్ చేశారు. ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ప్రజలంతా చూస్తున్నారన్న బెరుకు లేకుండా నిస్సిగ్గుగా సభా సంప్రదాయాలను ఇలా తుంగలో తొక్కడం, ప్రతిపక్షం గొంతునొక్కడం మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకోవడం కోసమే ఓటింగ్ జరక్కుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నదని విమర్శకులంటున్నారు. ఓటింగ్ జరక్కుండా కాపాడుకునేందుకు స్పీకర్ వ్యవస్థనూ రాష్ర్ట ప్రభుత్వం దుర్వినియోగపరచడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షనేత సహా సభ్యులంతా పట్టుబట్టినా డివిజన్‌కు అనుమతించకపోవడం నిబంధనలకు విరుద్ధమే కాదు అన్యాయం కూడా అని సీనియర్ పార్లమెంటేరియన్లు పేర్కొంటున్నారు. ప్రతిపక్షనేత లేచి నిలబడి నిబంధనలను చదివి వినిపిస్తుంటే పట్టించుకోకుండా పదేపదే మైక్ కట్ చేయడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఈ స్థాయిలో ప్రతిపక్షం గొంతు నొక్కిన సందర్భాలు మునుపెన్నడూ కనీ విని ఎరుగమని విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ ఆఫ్ ఓట్ ను కోరడమనేది రాజ్యాంగపరంగా ప్రతిపక్ష సభ్యులకు లభించిన హక్కు. అయితే ఓటింగ్ జరిగితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి బైటపడిపోతుంది కాబట్టి వారు అనర్హులయిపోతారు కాబట్టి వారిని కాపాడేందుకే ప్రభుత్వం ఇలా నిస్సిగ్గుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనేది నిర్వివాదాంశమని పరిశీలకులంటున్నారు. ఇక సభ్యుల బలాబలాలను ప్రకటించేటపుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది అని స్పీకర్ ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది, సస్పెన్షన్‌కు గురైన ఒక ఎమ్మెల్యేని తీసివేస్తే వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 56 మాత్రమే. కానీ స్పీకర్ అత్యంత జాగ్రత్తగా 67 అని ప్రస్తావించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సాంకేతికంగా కూడా ఎలాంటి అవకాశం లేకుండా చేయడానికే స్పీకర్ అలా ప్రకటించారని ప్రతిపక్షసభ్యులు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారి చేత రాజీనామా చేయించడం, లేదంటే అనర్హత వేటు వేయడం, తిరిగి ప్రజాభిప్రాయం కోరేందుకు ఆ స్థానాల్లో ఎన్నికలకు సిద్ధపడాలి. కానీ అధికార పక్షం ఈ మూడింటికీ సిద్ధంగా లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ను బహిష్కరించారు. హామీలు నెరవేర్చకుండా అవినీతి వ్యవహారాలలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో పరువు పోగొట్టుకుందని, అందుకే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడానికి గానీ, అనర్హత వేటు వేయడానికి గానీ చంద్ర బాబు వెనకాడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. స్పీకర్ డివిజన్‌కు అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలకు కాలరాసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు గానీ నైతికంగా ఓటమిపాలయ్యినట్లేనని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు. ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు పార్లమెంటరీ వ్యవహారాల్లో సహజ న్యాయం పరిరక్షణకే ప్రాధాన్యత ఉంటుంది. శాసన వ్యవస్థల అధిపతులు కూడా పరిస్థితులను బట్టి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తారు. సభలో ఏ అంశం మీదైనా మూజువాణి ఓటును ఎవరైనా ప్రశ్నిస్తే.. తప్పకుండా ‘డివిజన్ ఆఫ్ ఓట్’కు వెళ్లాల్సి ఉంటుందని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుసరిస్తున్న పద్దతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలే కాదు అది ఓ సాంప్రదాయంగా కూడా పాటిస్తూ వస్తున్నారు. కౌల్ అండ్ షక్దర్ 917వ పేజీలో ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే కాకుండా, సభ ఆమోదం కోసం వచ్చే ఏ అంశంలో అయినా.. మూజువాణి ఓటును ఏ ఒక్క సభ్యుడు ప్రశ్నించినా.. సభాపతి స్థానంలో ఉన్న వారు మరింత స్పష్టత కోసం ‘డివిజన్’కు వెళ్లాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. ఎవరూ ప్రశ్నించకపోతే.. మూజువాణి ఓటుతో సరిపెట్టవచ్చు. కానీ రెండు సందర్భాలలో స్పీకర్ హడావిడిగా మూజువాణి ఓటుతో సరిపెట్టేశారు. ‘డివిజన్’కు అవకాశమివ్వలేదు. -
మహారాష్ట్రలో ‘ద్రవ్య’ బిల్లుపై డివిజన్
2014 ఏప్రిల్ 16న మహారాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్ సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టాలని, డివిజన్ (అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను స్పష్టంగా నిర్ధారించడానికి వీలుగా సభలో నిర్వహించే ఓటింగ్ ప్రక్రియ)కు అవకాశం లేదంటూ ఏపీ శాసనసభలో బుధవారం అధికార పక్షం చేసిన వాదనలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ బిల్లుపై డివిజన్‌కు అవకాశం కల్పిం చడం.. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర శాసనసభలో నూ జరగలేదని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన దాంట్లోనూ నిజం లేదని తేలింది. 2014 ఏప్రిల్ 15న మహారాష్ట్ర శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ మూజువాణి ఓటు తో ఆమోదం తెలిపిన తర్వాత.. అప్పటి ప్రతిపక్షం (బీజేపీ, శివసేన) డివిజన్ కోరింది. అప్పటి స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్.. ప్రతిపక్షం డిమాండ్ కు సానుకూలంగా స్పందించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌కు అంగీకరించారు. బిల్లుకు అనుకూలంగా 105, వ్యతిరేకంగా 72 ఓట్లు వచ్చాయి. బిల్లుకు ఆమో దం లభించిందని స్పీకర్ ప్రకటించారు. -
'అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయింది'
హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయిందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాజువాణి ఓటింగ్ నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మెజార్టీ ఉందని బాబు సర్కారు రాక్షసపాలన సాగిస్తోందని విమర్శించారు. బిల్లుపై అధికారముందని తప్పించుకున్న ప్రభుత్వం.. ప్రజలు నుంచి తప్పించుకోలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. మరో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు సీఎం చంద్రబాబు అవాస్తవాలు, అర్థ సత్యాలు వల్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం!
♦ ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో ఉత్తమ్ ♦ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చర్యల్లేవు ♦ రైతులను రుణ విముక్తులను చేసేందుకు దయ కలగడం లేదా? ♦ అప్పుల ఊబిలో రాష్ట్రం.. భావితరాలకు ప్రమాదకరం ♦ 56 ఏళ్లలో రూ.75వేల కోట్ల అప్పుచేస్తే.. ♦ ఈ మూడేళ్లలోనే రూ.లక్ష కోట్ల రుణాలా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కరువు కారణంగా పంటలు తగ్గిపోయాయని, రైతులు నష్టాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ‘రుణమాఫీ’ చేసి రైతులను రుణ విముక్తులను చేసే విషయంలో ప్రభుత్వానికి ఎందుకు దయ కలగడం లేదని నిలదీశారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న 74 శాతం మంది ప్రజల ఆదాయం తగ్గిపోయిందని... కరువు కారణంగా పంటల సాగు లేక దీనావస్థలో చిక్కుకున్నారని చెప్పారు. వరిసాగు 34 శాతం తగ్గిపోయిందని, మొక్కజొన్న 30 శాతం, ఇతర ధాన్యాల సాగు 33 శాతం పడిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.4,670 కోట్లు కేటాయించారని... అందులోనుంచైనా లేదా వేరే ఏ పద్దులోనైనా కోతపెట్టి రుణ మాఫీ చేసి, 35 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేయాలని కోరారు. అప్పుల ఊబిలో రాష్ట్రం రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, ఇది భావితరాలకు ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రం గత 56 ఏళ్లలో రూ.75వేల కోట్ల అప్పు చేస్తే.. ఈ మూడేళ్లలోనే రూ.లక్ష కోట్ల అప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2017 వరకు నేరుగా రూ.57వేల కోట్లు, కార్పొరేషన్ల పేరుతో రూ.45వేల కోట్లు రుణాలు తీసుకోబోతున్నారని చెప్పారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్... అధికారంలోకి వచ్చాక భూములు అమ్మి రూ.10,500 కోట్లు సమకూర్చుకోవాలని చూడడమేమిటని నిలదీశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూనే.. జీవోలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై సమాజంలో అన్నివర్గాల్లో అసంతృప్తి, ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రత్యేక నిధిని భారీగా పెట్టుకోవడం అప్రజాస్వామికమని ఆరోపించారు. కరువు కనిపించడం లేదా? రాష్ట్రంలోని 443 మండలాల్లో కేవలం 231 మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రకటించారని.. మిగతా మండలాల్లో కరువు లేదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కరువు ఉన్న ప్రాంతాలన్నింటినీ కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. ఇక రెండేళ్లుగా బడ్జెట్లో కేటాయింపులకు, ఖర్చులకు మధ్య చాలా తేడా ఉంటోందని ఉత్తమ్ స్పష్టం చేశారు. 2014-15లో లక్ష కోట్ల బడ్జెట్లో రూ.62వేల కోట్లే ఖర్చు చేశారని... 2015-16 బడ్జెట్లో 1.15 లక్షల కోట్లు కేటాయిస్తే రూ.85 వేల కోట్లే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ప్రణాళికా కేటాయింపుల్లో సగమే ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్ అయినా వాస్తవాలకు దగ్గరగా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్లో కేటాయించిన రూ.67 వేల కోట్ల ప్రణాళికా వ్యయం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
రేవంత్ వర్సెస్ తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు జోక్యం చేసుకోవడంతో కొద్దిసేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో పాలమూరు ఎత్తిపోతల, ప్రాణహిత-కాళేశ్వరం వంటి కొత్త ప్రాజెక్టులకు బదులు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మహబూబ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఐదు ప్రాజెక్టులు పూర్తవుతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో తుమ్మల లేచి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణానదులపై ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త వాటిని మొదలుపెడతామన్నారు. వెంటనే రేవంత్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఇప్పుడూ మంత్రులుగా ఉన్నారని, అప్పటి టీడీపీ హయాంలో తెలంగాణకు మేలు జరిగిందని చెబితే బాగుండేదని పేర్కొన్నారు. ‘జూరాల, ఎస్ఎల్బీసీ రెండోదశ, తెలంగాణకు నీళ్లు తెచ్చినప్పుడు ఆ సభ్యుడు (రేవంత్) లేడు. నిన్నగాక మొన్నొచ్చి తెలంగాణ.. టీడీపీ అంటున్నడు. అప్పుడు ఉంటే తెలిసేది’ అని తుమ్మల అన్నారు. ‘కే బినెట్ మొత్తం టీడీపీనే కదా. మాదగ్గర ట్రైనింగ్ పొందిన వారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. మీతో పాటు నర్సన్న (నాయిని), లక్ష్మన్న (లక్ష్మారెడ్డి) కూడా టీడీపీ నుంచి పోయినోళ్లే’ అని రేవంత్ అనడంతో ‘మీ అధ్యక్షుడికి కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చాం’ అంటూ తుమ్మల కౌంటర్ ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. విపక్షాల సూచనలను పాటిస్తున్నామని, కీలక అంశాలపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు. అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ద్రవ్య వినిమయ బిల్లులో ఆర్థిక అంశాలపై స్పష్టత లేదని విమర్శించారు. కేటాయింపులు చేసిన విధంగా నిధుల వ్యయం లేదంటూ సభలో నిరసన తెలిపారు. -
'బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి'
హైదరాబాద్: ఈ నెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ విప్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులందరూ సభకు హాజరై.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. ఆదివారం అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా... సభకు హాజరు కాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని అన్నారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఈ నెల 21నే వైఎస్ఆర్సీపీ శాసనసభ సభ్యులందరికీ విప్ జారీ చేశామని చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు. -
స్పీకర్‌కు వైఎస్సార్ సీఎల్పీ లేఖలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు శనివారం రెండు లేఖలు రాసింది. ఓ లేఖలో ద్రవ్య వినిమయ అంశం, మరో లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యేల పేర్ల జాబితాను పొందుపరిచారు. ఈ లేఖలను పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు అందించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. -
ద్రవ్య బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ శుక్రవారం ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాగా, శాసనసభ బడ్జెట్‌ను ఆమోదించినందున, కేటాయింపులకు అనుగుణంగా సంబంధిత శాఖలు వ్యయం చేయాలని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. -
వాస్తవదూరంగా ‘ద్రవ్య’ బిల్లు
* సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే బడ్జెట్ పెట్టారు * బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి * పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వికార సంస్కృతి * ప్రభుత్వం తీరుపై అంతటా అసంతృప్తి ఉందని వ్యాఖ్య * ఉత్తమ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్లో చూపిన గణాంకాలపై సాధ్యాసాధ్యాల ను లోతుగా పరిశీలించకుండానే గారడీ చేశారని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌పైనా, ప్రభుత్వ వ్యవహారశైలిపై అన్నివర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్న ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ శాసనసభా పక్షంపూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తప్పుపట్టారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. తన ప్రసంగంలో గత ప్రభుత్వాల్లో ఆదాయం, వృద్ధిరేటు మొదలుకొని ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావించిన లోటు భర్తీ, భూముల అమ్మకం, భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణం, రుణమాఫీ, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్ వంటి అన్ని అంశాలను ప్రస్తావించారు. మొత్తం బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.21 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2012-13లో రూ.7,600కోట్లు, 2013-14లో రూ.8,991కోట్లు వచ్చిందని, ఈ లెక్కన ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ.10 వేల కోట్ల వరకు అంచనా వేయొచ్చని, కానీ ప్రభుత్వం చెబుతున్న రూ.21 వేలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా సాధ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూముల అమ్మకాలను చేపడితే వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రస్తుతం భూములు అమ్మితే రూ.6,500 కోట్లువస్తాయని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. కేవలం 4 నెలల కాల వ్యవధిలో భూములను గుర్తించి, టెండర్లు పిలిచి, వాటిని అమ్మి ఆదాయం సమకూర్చుతామనడం ఎలా సాధ్యమన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ప్రణాళిక వ్యయం కింద చూపిన రూ.48 వేల కోట్లలో సగానికి మించి ఖర్చు చేయడం సాధ్యమయ్యేలా లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఏమాత్రం సరిపోదని అన్నారు. కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ కారణం అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్ర వాటా 54 శాతం సాధ్యమైందని, ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి, భూపాలపల్లి, సింగరేణిల ద్వారా మరో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం దక్కిందన్నారు. ఆ రిజర్వేషన్లు సాధ్యమేనా? 9.3శాతం ఉన్న గిరిజనులకు 12, అలాగే 11 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యేదేనా?. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని ఉత్తమ్ ప్రశ్నించారు. గతంలో మంజూరై ప్రస్తుత నిర్మాణం కొనసాగుతున్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ కొట్లాడితే, కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వికార సంస్కృతిని టీఆర్ఎస్ మానుకోవాలన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. -
ప్రజల ఆశలను వమ్ము చేయకండి: ఎర్రబెల్లి
రైతులకు భరోసా ఇచ్చే చర్యలు చేపట్టండి: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంపై ప్రజలంతా గంపెడాశలతో ఉన్నారని, వాటిని వమ్ము చేయవద్దని టీడీపీపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాల న్నారు. ముఖ్యంగా గిరిజనులు, దళితులకు ఉద్దేశించిన పథకాల అమలులో చిత్తశుధ్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇవ్వాలని విన్నవించారు. కరెంట్ విషయంలో పక్క రాష్ట్రాలను విమర్శించడం మాని, చర్చలకు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ‘ఇళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు. వీటితో నియోజకవర్గానికి 36 నుంచి 40 ఇళ్లకు ఎక్కువ నిర్మించలేం. ఇందులో పాత ఇళ్లకు సంబంధించిన బకాయిలే రూ.1,500 కోట్లు ఉన్నాయి. అప్పుడు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం’ అని ప్రశ్నిం చారు. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో రాజకీయ నేతలు కోట్లు గడించారని, వారంతా ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఉద్యోగాల విషయంలో ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్థులను పిలిచి మాట్లాడాలని సూచించారు. పారిశ్రామిక విధానంపై సీఎంలో మార్పు వచ్చినట్లు కనబడుతోందని కొందరు తనకు ఫోన్ చేశారని, ఇదే వైఖరిని ఇక ముందూ కొనసాగించాలని, రెచ్చగొట్టే, తిట్టే ధోరణిని మార్చుకోవాలని సూచించారు. అమర వీరుల కుటుంబాలు మొత్తంగా 1,600 ల వరకు ఉంటే వారికి ప్రస్తుత బడ్జెట్లో ఇచ్చిన రూ.100 కోట్ల బడ్జెట్ సరిపోదని అన్నారు. వీటిని పెంచాలన్నారు. మేము పాండవులం.. మీరు కౌరవులు చివరలో ఎర్ర బెల్లి అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ స్వయంగా తెలంగాణ ఇచ్చినా వారు 10 ఏళ్లలో చేసిన పాపాల కారణంగా వారిని పక్కన పెట్టారు. మేమంతా పాండవులం. టీడీపీకి ప్రస్తుతం వనవాసం నడుస్తోంది. 15 ఏళ్ల వనవాసం చేయాలని మాకు శని ఉంది. అందుకే తప్పు చేయకున్నా వనవాసం చేస్తున్నాం. మరో నాలుగేళ్లలో వనవాసం ముగిస్తే మేమే అధికారంలోకి వస్తాం. టీఆర్ఎస్ సభ్యులంతా కౌరవులు. వారు మా అర్జునుడైన రేవంత్‌రెడ్డిని చూస్తేనే దడదడలాడిపోతున్నారు. భయపడుతున్నారు. ఇప్పటికైనా కౌరవులు దౌర్జన్యాలు, కుట్రలు మానాలి’ అన్నారు. ప్రతిసారీ కేంద్రాన్ని, టీడీపీని, పక్క రాష్ట్రా నేతలను తిట్టడం మాని వారితో సఖ్యతతో మెలగండని సూచించారు. -
ఎర్రబెల్లి వర్సెస్ స్పీకర్!
రేవంత్‌కు మైక్ ఇవ్వకపోవడంపై టీడీపీ పక్ష నేత వాదులాట బిల్లుపై మాట్లాడనీయకుండా రేవంత్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ సభ్యులు టీడీపీ వాకౌట్, ఏ అభిప్రాయం చెప్పకుండా తిప్పించుకునే వ్యూహం సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. గురువారం సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడిన తర్వాత.. తాను మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డి లేచారు. యథావిధిగా టీఆర్ఎస్ సభ్యులు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ గొడవకు దిగారు. స్పీకర్ కల్పించుకొని ‘ఫ్లోర్ లీడర్లే మాట్లాడాలి. దయాకర్రావుగారూ... మీరు మాట్లాడండి’ అని రేవంత్ మైక్ కట్ చేశారు. దీంతో రేవంత్‌రెడ్డి ‘ఇదేం అన్యాయం అధ్యక్షా.. శాసనసభ నిబంధనల్లో ఏముందో మీకు తెలియజేశాం. క్షమాపణ చెప్పాలని ఎక్కడుంది..’ అంటూ ఏదో చెప్పబోయారు. ఇదేమీ పట్టించుకోకుండా దయాకర్ రావును మాట్లాడాలని లేదంటే లక్ష్మణ్ (బీజేపీ) మాట్లాడాల్సి వస్తుందని స్పీకర్ స్పష్టంచేశారు. తర్వాత లక్ష్మణ్‌కు మైక్ ఇచ్చారు. మాట్లాడేందుకు లక్ష్మణ్ ఉద్యుక్తుడు కాగానే.. రేవంత్‌రెడ్డి, దయాకర్ రావు ఇద్దరూ లేచి స్పీకర్‌తో వాదించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పక్ష నేత లక్ష్మణ్‌పైనా రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిత్రపక్షమై ఉండి, మాకు అవకాశం ఇవ్వకపోతే సపోర్టు చేస్తారా? మీరే మాట్లాడుతారా?’ అని ప్రశ్నించారు. స్పీకర్ కల్పించుకొని లక్ష్మణ్ మాట్లాడకపోతే... అక్బరుద్దీన్‌కు అవకాశం ఇస్తానని చెప్పారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకుని.. ‘రేవంత్‌రెడ్డి దళిత సభ్యుడిని పట్టుకొని బూట్లు నాకుతావా అని అన్నడు. అది రికార్డుల్లో ఉంది’ అని అన్నారు. ‘రేవంత్‌రెడ్డి తప్పుగా మాట్లాడితే స్పీకర్‌గా మీరే నిర్ణయం తీసుకున్నా దానికి సిద్ధమని చెప్పాం. మీరు రూలింగ్ ఇవ్వండి. కానీ సభ్యుడికి మాట్లాడే హక్కును లేకుండా చేయడం ఏంటి’ అని స్పీకర్‌తో ఎర్రబెల్లి అన్నారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి కల్పించుకుంటూ ‘బూట్లు నాకడం’ అనే పదం రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. ‘అలా ఉంటే ఫ్లోర్‌లీడర్లను పిలిచి మాట్లాడి మీరు ఏ రూలింగ్ ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటం. తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధం’ అని ఎర్రబెల్లి చెప్పారు. సభ్యులను తాను శిక్షించనని, మాట్లాడిన సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తానని స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభ్యులకు విప్ జారీ చేసినా.. ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఫ్లోర్‌లీడర్లు మాత్రమే మాట్లాడాలని స్పీకర్ పదేపదే చెపుతున్నా రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని దయాకర్ కోరినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి మాట్లాడడాన్ని అధికారపక్ష సభ్యులు ఒప్పుకోరు కాబట్టి, వాకౌట్ చేయడం ద్వారా బిల్లుకు ఆమోదం తెలపడమా, వ్యతిరేకించడమా అనే సమస్య ఉత్పన్నం కాదని, అందుకే సభ నుంచి బయటకు వెళ్లినట్లు ఓ ఎమ్మెల్యే తెలిపారు. -
విప్ ‘జారీ’పోయింది!
‘ద్రవ్య’ బిల్లుకు మద్దతు సాక్షి, హైదరాబాద్ : తమ సభ్యులకు జారీ చేసిన విప్‌ను ఉపసంహరించుకుని కాంగ్రెస్‌పార్టీ వ్యూహాన్ని మార్చింది. టీఆర్ఎస్కు వలస పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని రుజువు చేసేందుకు పన్నిన వ్యూహం నుంచి తన కు తానే వెనక్కు తగ్గడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని కాంగ్రెస్ తొలుత భావించింది. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారమే విప్ జారీ చేశారు. టీఆర్ఎస్లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేయనున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఇదే అంశంపై సీఎల్పీనేత జానారెడ్డి, ఉపనేత జీవన్‌రెడ్డి, కార్యదర్శి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. తర్జన భర్జనల అనంతరం విప్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే జానారెడ్డి సభలో మాట్లాడుతూ, ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, యావత్‌దేశానికి అంతా కలిసికట్టుగా ఉన్నామన్న సందేశం ఇవ్వడానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలుపుతున్నాం. విప్‌ను ఉపసంహరించుకుంటున్నాం’ అని ప్రకటించారు. -
18 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు
* రేపటి నుంచి వచ్చే నెల 12 వరకు.. * 20న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల * 22న వ్యవసాయ బడ్జెట్ రూ. లక్ష కోట్లతో సాధారణ బడ్జెట్ * కౌన్సిల్లో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు 18 రోజులపాటు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమయ్యే సమావేశాలు సెప్టెంబర్ 12న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ముగుస్తాయి. 18వ తేదీ ఉదయం 8 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ సమావేశమవుతుంది. 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థారుు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. వ్యవసాయ, సాగునీటి రంగాలు, అనుబంధ రంగాలకు చెందిన కేటాయింపులన్నింటినీ ఒక చోటకు తీసుకొస్తూ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పేరుతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. లక్ష కోట్ల రూపాయలతో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రూ. 20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు ప్రణాళిక వ్యయంగా, రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 85 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను రూ.15 వేల కోట్లతో ప్రవేశపెడతారు. పురపాలక మంత్రి డాక్టర్ పి. నారాయణ 20న వార్షిక బడ్జెట్‌ను, 22న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇంకా పూర్తికాని మరమ్మతులు శాసన సభ ఆవరణలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన సమావేశ మందిరంలో ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. గత సమావేశాల సందర్భంగా సీట్లు సౌకర్యంగా లేవని సభ్యులు ఫిర్యాదు చేయటంతో మరమ్మతులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో సమావేశాలు ప్రారంభమవుతున్నారుు. అరుునా మరమ్మతులు సాగుతూనే ఉన్నారుు. శాసనసభలో ఇన్నర్ లాబీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌లకు ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు కె. సత్యనారాయణ, ఎస్. రాజాసదారం వినియోగిస్తున్న కార్యాలయాలను కేటాయించినప్పటికీ, వారింకా వాటిని ఖాళీ చేయలేదు. సర్కారు హామీలపైనే విపక్షం పట్టు ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావొస్తుండటంతో, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభలో గట్టిగా పట్టుబట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు వంటి తక్షణం కార్యరూపంలోకి తేవలసిన అంశాలతో పాటు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీయాలను ఆ పార్టీ భావిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమవుతోంది.