
నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మూడో శాసనసభ మూడో విడత సమావేశాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం ఒక ప్రభుత్వ బిల్లుతో పాటు 2024–25 వార్షిక బడ్జెట్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 19 పద్దులపై చర్చ జరిగింది. మంత్రుల సమాధానాల అనంతరం సభ వాటికి ఆమోదం తెలిపింది. పద్దులపై సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చ మంగళవారం తెల్లవారుజామున 3.10 గంటల వరకు కొనసాగింది.
తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా పద్దులపైనే చర్చించింది. పశు మత్స్య పరిశ్రమ, క్రీడలు యువజన సేవలు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి, పౌర సరఫరాలు, వ్యవసాయం, సహకారం, పర్యాటక, కళలు.. సాంస్కృతిక, ధర్మాదా య, అడవులు, శాస్త్ర సాంకేతికత, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖల పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు పాల్గొన్నారు.
పద్దులను ఆమోదించిన అనంతరం శాసన సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే యువ భారత నైపుణ్యాల విశ్వవిద్యాలయం (స్కిల్స్ యూనివర్సిటీ), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య బిల్లు–2024ను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. అసెంబ్లీ ఉభయ సభల్లో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుంది. దీంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ వేర్వేరుగా బులెటిన్లు జారీ చేశారు.