ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): వేములవాడలో రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం వస్తున్న భక్తులు, అవసరాల కోసం బయటకు వచ్చే స్థానికులతో వేములవాడ పట్టణంలోని రోడ్లు జన సమ్మర్థంగా మారుతున్నాయి. సోమవారం, పండుగల రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందలు అన్నీ.. ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘రోడ్ల విస్తరణ’ అంశంపై శుక్రవారం ‘జూమ్ డిబేట్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్‌పర్సన్ హామీ ఇవ్వడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చొరవ సమస్య పరిష్కారానికి ముందడుగు అని అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.
ఆశలు చిగురించాయి
వేములవాడలో ఇరుకైన రోడ్లతో బండిపై వెళ్లడం భయంగానే ఉంటుంది. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్‌తోనైన పనులు చేపడతారని ఆశ చిగురించింది. ఎన్నో ఏళ్లుగా చెబుతున్నరు.. ఇప్పటికీ పనులు చేపట్టలేదు.
– బి.నరేశ్, స్థానికుడు
రోడ్లు వెడల్పు చేయాలి
ఇరుకైన రోడ్లతో వేములవాడ ఎదుగుతలేదు. గుడితోని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా.. రోడ్ల విస్తరణను పట్టించుకోవడం లేదు.
– వి.రవి, చిరువ్యాపారి
అధికారులు స్పందించాలి
పెద్ద బజార్‌కు పోవాలంటేనే భయంగా ఉంటుంది. ఎటునుంచి ఎవరు వస్తరో అర్థం కాదు. ‘సాక్షి’ పేపరోళ్లు మంచి కార్యక్రమం ముందేసుకున్నరు. అధికారులు పనులు చేయాలి.
– జి.మాధవి, గృహిణి, వేములవాడ
ఎటు చూసినా సందులే..
నేను చిన్నగున్నప్పటి నుంచి సూత్తున్న ఈ రోడ్లు మారుతనే లేవు. కూరగాయలకు పోదామన్నా తిప్పలుగా ఉంది.
– సీహెచ్.మల్లవ్వ, గృహిణి
పాలకుల్లో మార్పు రావాలి
నేను ఇక్కడే పుట్టి, పెరిగిన. రోడ్లు వెడల్పు చేస్తారని చిన్నప్పటి నుంచి అంటున్నరు. చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్ హర్షనీయం. ఇకనైన పాలకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.
– ఎండీ.ఖాజాపాషా, రిౖటైర్డ్ కండక్టర్, వేములవాడ
కదలికలు మొదలయ్యాయి
వేములవాడలో రోడ్ల విస్తరణపై ‘సాక్షి’లో కథనం చూసి ఆనందం వేసింది. అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. జూమ్ డిబేట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను పాలకుల వద్దకు తీసుకొచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. వేములవాడలో వెంటనే రోడ్లు వెడల్పు చేపట్టాలి.
– బింగి శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్, వేములవాడ
పేపర్ చూస్తే సంతోషమైంది
వేములవాడ ప్రజలు, రాజన్న భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల విస్తరణ. ఈ సమస్యపై ఈరోజు ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనం చూస్తుంటే చాలా సంతోషమైంది. ఉమ్మడిరాష్ట్రంలో వేములవాడకు ఏమీ జరుగలేదు. కనీసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైన రోడ్ల విస్తరణకు మోక్షం రాకపోవడం బాధాకరం. ఇప్పటికైన పాలకులు కాస్త స్పందించాలి. – చిలుక, రమేశ్, స్థానికుడు, వేములవాడ
Comments
Please login to add a commentAdd a comment