
తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులను నిర్బంధించి సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా స్కామ్‌స్టర్లు
బ్యాంకాక్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట ఆన్‌లైన్‌లో ప్రకటనలిచ్చి బురిడీ
అక్కడికి వెళ్లాక పాస్‌పోర్టులు లాక్కున్న వైనం.. ఎన్‌ఆర్‌ఐలను మోసగించే ‘ఉద్యోగం’ చేయాలని హుకుం
ఇంగ్లిష్ రాని వారికి హనీట్రాప్ ‘పనుల’ అప్పగింత.. నిరాకరిస్తే చిత్రహింసలు
కాపాడాలంటూ ‘సాక్షి’ని ఫోన్‌లో కోరిన కరీంనగర్‌కు చెందిన ఓ బాధితుడు
ఆదుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మొర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్‌స్టర్లు ఆన్‌లైన్‌లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
విమాన టికెట్ పంపి మరీ..
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు.
ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.
గత్యంతరం లేకపోవడంతో..
అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు.
అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్‌స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.
కాపాడాలని వేడుకోలు..
అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment