
ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్న దర్యాప్తు సంస్థలు
డిజిటల్ స్కామ్‌లకు వాడిన 7.81 లక్షల సిమ్‌లు బ్లాక్
రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రోజుకో తరహా మోసంతో అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరిట మోసగాళ్ల ఆగడాలు బాగా పెరగడంతో వారికన్నా ఒకడుగు ముందుకేసి, వారు మోసాలకు వినియోగిస్తున్న సిమ్‌కార్డు లు, స్కైప్ ఐడీలు, వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ స్కామ్‌లకు వాడిన సుమారు 7.81 లక్షల సిమ్‌లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
సైబర్ నేరాలకోసం వినియోగిస్తున్న 2,08,469 ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దేశంలో జరుగుతున్న డిజిటల్ స్కామ్‌లు, సైబ ర్ నేరాలపై ఇటీవల ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) కృషి చేస్తోందన్నారు.
వార్తా పత్రికలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, ఆకాశవాణి.. తదితర మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలర్‌ట్యూన్ ప్రచా రాన్ని ప్రారంభించామన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు 7 నుంచి 8 సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ స్కామ్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందిçస్తున్నామని చెప్పారు.
డిజిటల్ స్కామ్‌ల కోసం ఉపయోగించిన 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఐ4సీ గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్స్‌ను కూడా గుర్తించి అరికడుతున్నట్లు తెలిపారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల ఫిర్యాదుల ఆధారంగా రూ.4,386 కోట్లు నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకున్నట్లు బండి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment