
ఇదీ బడ్జెట్ సమావేశాల రికార్డు
⇒ తక్కువ వ్యవధిలో..ఎక్కువ పద్దులపై చర్చ
⇒ రెండు వారాల్లోనే ముగిసిన సమావేశాలు
⇒ మొత్తం 72 గంటల 33 నిమిషాలపాటు చర్చలు
⇒ అయిదు బిల్లులకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా
⇒ బడ్జెట్.. పద్దులపై చర్చా సమయం
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కేవలం 13 రోజుల్లోనే ముగిశాయి. చివరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లు, కాగ్ నివేదికలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 24 రోజులు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఈ నిబంధనను సవరించారు.
బీఏసీతో సంప్రదింపుల మేరకు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులుండాలనేది స్పీకర్ నిర్ణయానికి అప్పగించారు. అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాలు రికార్డు స్థాయిలో 2 వారాల్లోనే ముగిశాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 72.33 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. 168 ప్రశ్నలు, 192 అనుబంధ ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు 29 గంటల 09 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో టీఆర్‌ఎస్ 11.14 గంటలు, కాంగ్రెస్ 15.14 గంటలు, ఎంఐఎం 5.07 గంటలు, బీజేపీ 6.32 గంటలు, టీడీపీ 2.57 గంటలు, సీపీఐ 6 నిమిషాలు, సీపీఎం 1.48 గంటల పాటు మాట్లాడినట్లుగా రికార్డయింది.
నాలుగ్గంటలు మాట్లాడిన సీఎం:
మొత్తం సమావేశాల్లో సీఎం కేసీఆర్ 4.12 గంటలు మాట్లాడగా ప్రతిపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ 2.08 గంటలు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2.34 గంటలు మాట్లాడారు. ఈనెల 23వ తేదీన రికార్డు స్థాయిలో ఉదయం పది గంటలకు మొదలైన సభ రాత్రి 10.36 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశాల్లో అయిదు బిల్లులు ఆమోదం పొందాయి. కీలకమైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుతో పాటు భూదాన్ చట్ట సవరణ బిల్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్సుల చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందాయి. తొలి రోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు చివరి రోజున 2015–16 ఆర్థిక సంవత్సరపు కాగ్ ఆడిట్ నివేదికల సమర్పణతో ముగిశాయి. గవర్నర్ ప్రసం గిస్తుండగా సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంగా టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సమావేశాలు ముగిసేంత వరకు బహిష్కరించారు.
పద్దుల పైనే ఎక్కువ చర్చ
బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత ప్రారంభించటం ఆనవాయితీ. ఆరోజు ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేకపోవటంతో బీజేపీ చర్చను ప్రారంభించింది. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాగా వ్యవహరించటంతో అర్థవంతమైన చర్చలకు ఎక్కువ సమయం దొరికింది. మొత్తం సెషన్‌లో కేవలం 27 నిమిషాల సభా సమయం దుర్వినియోగమైంది. గతంతో పోలిస్తే బడ్జెట్‌పై సాధారణ చర్చ కంటే పద్దులపై ఎక్కువగా చర్చించేందుకు అధికార, విపక్ష సభ్యులు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్‌లో ప్రకటించిన వాటితో పాటు విపక్ష సభ్యుల సూచనల మేరకు విద్యార్థుల మెస్‌చార్జీల పెంపు, హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని చివరి రోజున సీఎం ప్రకటించటం గమనార్హం. ‘ సమావేశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. పద్దులపై ఇంత గొప్పగా ఎన్నడూ చర్చ జరగ లేదు. మా పార్టీ సభ్యులతో పాటు విపక్ష సభ్యులు సైతం సందర్భో చితంగా హూందాగా వ్యవహరించారు...’అని హరీశ్ వ్యాఖ్యానించారు.