approved
-
Indiramma Illu: అద్దె ఇంట్లో ఉన్నందుకు ‘ఇందిరమ్మ’ రాలేదు
చిగురుమామిడి (కరీంనగర్ జిల్లా): అద్దె ఇంట్లో ఉంటుందన్న కారణంతో ఓ మహిళకు అధికారులు ఇందిరమ్మ ఇల్లు (Indiramma Illu) మంజూరు చేయ లేదు. దీంతో కూలి పనితో కుటుంబ పోష ణ చేసుకుంటున్న తనకు న్యాయం చేయా లని ఆ మహిళ వేడుకుంటోంది. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన వేల్పుల అంజలి భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందారు. ఇద్దరు ఆడ పిల్లలతో నివాసం ఉంటున్న ఆమె పెంకుటిల్లు ఐదేళ్లక్రితం కూలిపోయింది. కొంతకాలం కూలిన ఇంటిపైనే రేకులు వేసుకుని జీవనం సాగించింది. అయితే గాలి దుమారం, కోతుల బెడదతో వేగ లేక ఆ ఇంటిని ఖాళీ చేసింది. ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. కూలిపని చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తోంది. కనీసం గుంట భూమి కూడా లేని ఆమె, ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ గురువారం జరిగిన గ్రామసభలో ప్రకటించిన జాబితాలో అంజలి పేరు రాలేదు. ఈ విషయమై అక్కడి అధికారులను నిలదీయగా.. అద్దె ఇంట్లో ఉంటున్నందున ఇల్లు మంజూరు కాలేదని కార్యదర్శి సమాధానం ఇచ్చారని వెల్లడించింది. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూ రు చేయాలని అంజలి వేడుకుంటోంది. -
టీబీ నుంచి డెంగ్యూ వరకూ.. 8 టీకాల పరీక్షకు అనుమతి
న్యూఢిల్లీ: టీకాలతో కరోనాకు అడ్డుకట్టవేడంలో విజయం సాధించిన అనంతరం ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం ఎనిమిది కొత్త వ్యాక్సిన్లను పరీక్షించడానికి ఆమోదించింది.ఇందులో టీబీ నుండి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వరకూ టీకాలు ఉన్నాయి. ఈ ఎనిమిదింటిలో నాలుగు వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి. ఈ టీకాల సాయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రయోజనాలను పొందవచ్చు. వచ్చేరెండేళ్లలో ఈ టీకాల పరీక్షలన్నీ పూర్తవుతాయని అంచనా. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు ఎనిమిది వేర్వేరు వ్యాక్సిన్లపై ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన నిపుణుల ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎస్ఈసీ) సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్- ఈ కంపెనీకి డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్ బీ (ఆర్డిఎన్ఎ), ఇన్‌యాక్టివేటెడ్ పోలియోమైలిటిస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి వ్యాక్సిన్లపై ఫేజ్- II ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. న్యూమోకాకల్ పాలీశాకరైడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కూడా ఈ కంపెనీ అనుమతి పొందింది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ న్యుమోకాకల్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. అదేవిధంగా డెంగ్యూ వ్యాక్సిన్‌పై మూడవ దశ ట్రయల్ నిర్వహించేందుకు పనేసియా బయోటెక్ కంపెనీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.టీబీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చాలా కాలంగా బీసీజీ వ్యాక్సిన్‌పై కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా టీబీ వ్యాధి నివారణకు బీసీజీ వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీకి అనుమతి లభించింది. ట్రయల్లోని ప్రాథమిక ఫలితాల ఆధారంగా సీడీఎస్సీఓ దశ- III ట్రయల్‌ను ప్రారంభించడానికి కూడా అనుమతిని ఇచ్చింది. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్వీ)తో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని సీడీఎస్సీఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఊపిరితిత్తులు,శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనికి కూడా ప్రభుత్వ వ్యాక్సిన్ పాలసీ జాబితాలో స్థానం దక్కింది. దీని కోసం మూడవ దశ ట్రయల్‌కు జీఎస్కే కంపెనీకి అనుమతి లభించింది. -
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్ ధార, ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపిఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజ్ఞాన్ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది.రిటైర్మెంట్కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
11 ‘విద్యుత్’ ఒప్పందాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య జరిగిన 11 పాత, కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సుమోటోగా ఆమోదించింది. జెన్కో కొత్తగా నిర్మించిన/నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల కేటీపీఎస్–7వ దశ, 600 మెగావాట్ల కేటీపీపీ–2, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో సంస్థకు చెందిన ఇతర పాత విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ ఆవిర్భావం తర్వాత డిస్కంలు పీపీఏలను కుదుర్చుకున్నాయి. విద్యుత్ చట్టం–2003 నిబంధనల ప్రకారం ఈ పీపీఏలను ఈఆర్సీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఏలపై బహిరంగ విచారణ నిర్వహించి వివిధ వర్గాల నుంచి సలహాలను ఈఆర్సీ స్వీకరించింది. అనంతరం పలు మార్పులతో పీపీఏలను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గడువు తీరిన పీపీఏల స్థానంలో కొత్త ఒప్పందాలు 1956 నుంచి 1998 మధ్య పాత థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జరిగిన పీపీఏల వ్యవధి 2019లో ముగిసింది. దీంతో 400 మెగావాట్ల కేటీపీఎస్ ఏబీసీ, 500 మెగావాట్ల కేటీపీఎస్–5వ దశ, 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్ స్టేషన్–బీ, 875.6 మెగావాట్ల నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం, 54 మెగావాట్ల సింగూరు/పోచంపాడు/పాలేరు/నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రాలు, 9.16 మెగావాట్ల పెద్దపల్లి జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు జెన్కోతో కొత్త పీపీఏలు చేసుకున్నాయి. ఈ పీపీఏలను సైతం ఈఆర్సీ తాజాగా ఆమోదించింది. యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై అభ్యంతరాలు నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం భారీగా పెరిగిపోతోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణవ్యయం రూ. 30 వేల కోట్లకు పెరగనుందని జెన్కో అంచనా వేసింది. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం సైతం రూ. 8,536 కోట్లకు పెరగనుందని ఈఆర్సీకి తెలిపింది. 800 మెగావాట్ల కేటీపీఎస్– 7వ దశ నిర్మాణానికి రూ. 5,548.44 కోట్లు, 600 మెగావాట్ల కేటీపీపీ–2కు రూ. 4,334 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరగడంపట్ల వాటి పీపీఏలపై ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూసేకరణ, పునరావాసం కోసం రూ. 845 కోట్లు, ప్రాజెక్టు ప్రదేశానికి యంత్ర పరికరాలను తరలించడం, అమర్చడం వంటి పనుల కోసం రూ. 1,617 కోట్లు, సివిల్ వర్క్స్ కోసం రూ. 5,057 కోట్లు, కంటిజెన్సి కింద రూ. 201 కోట్లను జెన్కో అనవసరంగా ఖర్చు చేసిందని, ఈ వ్యయాలను అనుమతించరాదని ఈఆర్సీని కోరారు. నిబంధనల మేరకే ఖర్చులు చేసినట్లు జెన్కో సమర్థించుకోగా విద్యుత్ కేంద్రాల నిర్మా ణం పూర్తయ్యాక రానున్న వాస్తవ వ్యయంపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ పేర్కొంది. -
భారత్‌లో లైన్ క్లియర్.. జాన్సన్ – జాన్సన్ వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ‘జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడంతో మన దేశంలో వ్యాక్సిన్ల సంఖ్య అయిదుకి చేరుకుంది. కోవిడ్–19పై దేశం చేస్తున్న సమష్టి పోరాటానికి ఈ వ్యాక్సిన్ మరింత ఊతమిస్తుంది’’ అని మాండవీయ ట్వీట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసి పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ , స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్‌కి చెందిన కొవాగ్జిన్, రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్–వీ అందుబాటులో ఉండగా , ఇటీవల అమెరికాకి చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. శుక్రవారం నాడు జే అండ్ జే కంపెనీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అదే రోజు డీసీజీఐ అనుమతినిచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కీలక ముందడుగు: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్‌కు అనుమతులివ్వడం కీలక ముందడుగు అని భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 18 ఏళ్లు అంతకంటే పై బడిన వారికి జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతులు లభించాయని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో జే అండ్ జే కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో నిర్వహించడానికి దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అదే సమయంలో వ్యాక్సిన్‌తో నరాలకు సంబంధించిన దుష్ప్రభావాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ తర్వాత తమ వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు లేవని పలు అధ్యయనాలు తేల్చిన తర్వాత భారత్‌లో విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించి అనుమతులు పొందింది. ఎన్నెన్నో ప్రత్యేకతలు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ చాలా అంశాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. అవేంటో చూద్దాం ► ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంటే జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్క డోసు (0.5ఎంఎల్) తీసుకుంటే సరిపోతుంది. ► ఈ వ్యాక్సిన్ 85% సామర్థ్యంతో పని చేస్తుందని, అత్యంత సురక్షితమైనదని అమెరికా, దక్షిణాఫ్రికాలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ► ఫైజర్, మోడెర్నా మాదిరిగా ఈ వ్యాక్సిన్‌కు అత్యంత శీతల వాతావరణంతో పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీంతో ఈ వ్యాక్సిన్‌ను కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయవచ్చు. ► అమెరికాలోని ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్‌లో వినియోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ టీకాలో వాడలేదు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా టీకా మాదిరిగా ఇది ఎడెనోవెక్టర్ వ్యాక్సిన్. కరోనా వైరస్ జన్యువుల్లోని స్పైక్ ప్రొటీన్‌ను ఎడెనోవైరస్తో సమ్మేళనం చేసి ఈ టీకాను తయారు చేశారు. ఇది శరీరంలో ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి స్పైక్ ప్రొటీన్‌పై పోరాడడానికి సిద్ధమవుతుంది. దీంతో శరీరంలో యాంటీబాడీలు వచ్చి చేరుతాయి. ► ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన కీలకమైన ఫార్ములా కరోనా వైరస్ బట్టబయలు కావడానికి పదేళ్లకు ముందే అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. బేత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్‌కు చెందిన వైరాలజిస్టు డాన్ బరౌచ్, ఆయన బృందం జన్యుపరంగా మార్పులు చేసుకునే రోగకారకాలను మానవ కణజాలంలోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన వెక్టర్ (వాహకం)ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ వాహకాన్నే ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌లో వినియోగించారు. వివాదాలేంటి ? ఈ వ్యాక్సిన్ చుట్టూ పలు వివాదాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలు పెట్టాక ఏప్రిల్‌లో కొందరిలో రక్తం గడ్డ కట్టే సమస్య తలెత్తింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల్లోనే ఈ దుష్ప్రభావం కనిపించింది. దీంతో కొన్నాళ్లు టీకా పంపిణీని నిలిపి వేశారు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం విచారించి ఈ వ్యాక్సిన్‌తో జరిగే ప్రయోజనమే అత్యధికమని నిర్ధారించి మళ్లీ పంపిణీని మొదలు పెట్టింది. ఆ తర్వాత అరుదుగా వచ్చే నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఈ టీకా ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రమాదఘంటికలు మోగా యి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజుల తర్వాత శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ దుష్ప్రభావం కూడా చాలా తక్కువ మందిలో ఉండడంతో టీకా తీసుకోవడానికి ఎలాంటి భయాం దోళనలు అక్కర్లేదని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలదా ? ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా డెల్టా వేరియెంట్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా అడ్డుకోగలదని దక్షిణాఫ్రికా తాజా సర్వేలో వెల్లడైంది. సిస్నోక్ అనే పేరుతో చేపట్టిన ఈ సర్వేలో డెల్టాతో పాటుగా బీటా వేరియంట్‌పై కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తోందని తేలిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ సోకితే ఆస్పత్రి చేరే అవసరం 71% మందికి రాదని, అదే బీటా వేరియంట్ అయితే 67% మందికి ఇంట్లోనే వ్యాధి నయం అయిపోతుంది. ఇక మరణాల రేటుని 96% తగ్గిస్తుంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజలెవరూ ఆస్పత్రిపాలయ్యే అవకాశం ఉండదని, ప్రాణం మీదకి రావడం దాదాపుగా అసంభవమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిండా గెయిల్ వెల్లడించారు. -
ఏపీ: రూ.10,350.21 కోట్ల పెట్టుబడులకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.10,350.21 కోట్ల పెట్టుబడులతో కీలకమైన ఐదు భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 12,454 మందికి ఉపాధి లభించనుంది. నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్, నాయుడుపేట సెజ్‌లో గ్రీన్‌టెక్ విస్తరణ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్యాపిటల్ బిజినెస్ పార్క్ నిర్మించే టెక్స్టైల్ పార్క్, చిత్తూరు జిల్లాలో అమ్మయప్పర్ గార్మెంట్స్ తయారీ యూనిట్, విశాఖలో సెయింట్ గోబెయిన్ ప్రాజెక్టులకు అనుమతులు, ప్రత్యేక రాయితీలు ఇస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టుల వారీగా ఆ వివరాలు ఇవీ గ్రీన్‌టెక్ భారీ విస్తరణ నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏపీ సెజ్‌లోని ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థ గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు స్టీల్ కాస్టింగ్ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం రూ.627 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా 2,200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ విస్తరణ పనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు యూనిట్ చార్జీ ఒక రూపాయిని తిరిగి ఇవ్వనుంది. గరిష్టంగా రూ.3.75 కోట్లు ఇవ్వనున్నారు. 2020–23 పారిశ్రామిక పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. చిత్తూరులో గార్మెంట్ యూనిట్.. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం ఎలకట్టూర్లో రూ.29.05కోట్లతో డెనిమ్ మెన్స్, కిడ్స్ గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 2,304 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ యూనిట్‌కు యూనిట్ విద్యుత్ ఒక రూపాయి చొప్పున ఇవ్వడంతోపాటు ఐదేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపులు, స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో సెయింట్ గోబెయిన్.. విశాఖ సమీంపలోని అచ్యుతాపురం సెజ్‌లో సెయింట్ గోబెయిన్ సంస్థ రూ.2,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జిప్సం ప్లాస్టర్ బోర్డ్, ఫోట్ గ్లాస్ తయారీ యూనిట్ పనుల కాలపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్, లాక్డౌన్ కారణంగా తొలి దశ పనులు ఆలస్యం కావడంతో కాలపరిమితి పొడిగించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం ఆమోదించింది. తొలిదశ పనుల పూర్తికి గడువును 2022 జూన్ వరకు పొడిగించింది. సెయింట్ గోబెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరును సెయింట్ గోబెయిన్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్పునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ జిందాల్ స్టీల్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్లతో టీఎం టీ బార్స్, వైర్ రాడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా 15, 000 మందికి ఉపాధి లభించనుంది. జిందాల్ గ్రూపు ఇందుకోసం జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ నెలకొల్పేందుకు నెల్లూరు జిల్లా చిల్లకూర్ మండలం మోమ్మిడి గ్రామం వద్ద 860 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ధరను ఏపీఐఐసీ నిర్ణయిస్తుందని, ఇంటిగ్రేటెడ్ స్టీల్ యూనిట్ ఏర్పాటు సమయంలో ఆర్ అండ్ ఆర్ చార్జీలు చెల్లించాల్సి వస్తే జిందాల్ సంస్థే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. తాడేపల్లిలో మెగా రిటైల్ పార్క్ గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రూ.194.16 కోట్లతో అప్పారెల్ అండ్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి క్యాపిటల్ బిజినెస్ పార్క్ ఎల్ఎల్పీ ముందుకొచ్చింది. సుమారు 900 టెక్స్టైల్ షాపులు ఏర్పాటు చేసే విధంగా 7 లక్షల చదరపు అడుగుల్లో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రతిపాదనకు ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీ 2021–26 ప్రకారం రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తే రిటైల్ పార్క్ మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు చెల్లిస్తారు. 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
దివాలా తీసిన విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు
ముంబై: ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. జూన్ 22 నుంచి 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. ఒకవేళ గడువు పొడిగించాల్సిన అవసరం వస్తే ట్రిబ్యునల్‌ను జలాన్ కల్రాక్ కన్సార్షియం మరోసారి ఆశ్రయించవచ్చని మౌఖికంగా పేర్కొంది. అటు విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థ పరిశీలించాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ తెలిపింది. మరోవైపు ఎన్సీఎల్టీ రాతపూర్వక ఆదేశాలు వచ్చాక తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్లు జలాన్ కల్రాక్ కన్సార్షియం పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ను తిరిగి పునరుద్ధరించేందుకు సంబంధిత వర్గాలందరితో కలిసి పనిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగలవని కంపెనీ పరిష్కార నిపుణుడు, గ్రాంట్ అండ్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ ఆశీష్ ఛాచ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండేళ్ల నుంచి కంపెనీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ‘రెండేళ్ల మా శ్రమకు ఫలితం దక్కింది. జెట్ ఎయిర్వేస్ 2.0 పునరుద్ధరణకు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు తోడ్పడతాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కీలకంగా స్లాట్లు.. రెండేళ్ల క్రితం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత జెట్‌కి ఉన్న స్లాట్లు ఇతర ఆపరేటర్లకు దక్కాయి. కంపెనీ సర్వీసులు పునఃప్రారంభం కావడానికి ఇవి కీలకంగా ఉండనున్నాయి. ఇదే విషయాన్ని ఆశీష్.. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ (ఎంవోసీఏ) దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. అయితే, గత చరిత్ర ఆధారంగా జెట్ ఎయిర్వేస్కు స్లాట్లను కేటాయించడం కుదరదని, నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడే కేటాయింపు ఉంటుందని ఎన్సీఎల్టీకి దాఖలు చేసిన సంయుక్త అఫిడవిట్లో డీజీసీఏ, ఎంవోసీఏ స్పష్టం చేశాయి. మరోవైపు స్లాట్ల అంశం ఎప్పటికి పరిష్కారమవుతుందన్నది చెప్పడం కష్టం అయినప్పటికీ.. నిర్దేశిత గడువులోగా ఒక కొలిక్కి రాగలదని ఆశిస్తున్నట్లు ఆశీష్ పేర్కొన్నారు. పలు విమానాశ్రయాలు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో తగు స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు. రూ. 8,000 కోట్ల బకాయిలు బ్యాంకులకు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాకీపడిన జెట్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోవడం తెలిసిందే. కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను గతేడాది అక్టోబర్‌లో రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించగా, తాజాగా ఎన్సీఎల్టీ కూడా ఓకే చెప్పింది. బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కలిసి ఈ కన్సార్షియం ఏర్పాటు చేశారు. షేరు జూమ్.. పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసిందన్న సానుకూల వార్తతో జెట్ షేరు మంగళవారం 5 శాతం (అప్పర్ సర్క్యూట్) ఎగిసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రూ. 99.45 వద్ద ముగిసింది. మరోవైపు, రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిచిపోయినప్పట్నుంచీ జెట్ షేరు ధర దాదాపు సగానికి పైగా పడిపోయింది. సర్వీసుల నిలిపివేతకు ఒక్క రోజు ముందు 2019 ఏప్రిల్ 16న బీఎస్ఈలో షేరు రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత పరిణామాలతో ఒకదశలో సుమారు రూ. 59కి కూడా పడిపోయింది. ప్రస్తుతం రూ. 99.45 వద్దకు తిరిగి కోలుకుంది. రెండేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 1,617 కోట్ల మేర హరించుకుపోయింది. తాజా పరిణామాలతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 1,130 కోట్లుగా ఉంది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఇలా.. లీజుకు తీసుకున్న నాలుగు బోయింగ్ విమానాలతో, జెట్ ఎయిర్వేస్ 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటరుగా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత 1995లో పూర్తి స్థాయి షెడ్యూల్ క్యారియర్‌గా మారింది. 2004 మార్చిలో చెన్నై నుంచి కొలంబోకు ఫ్లయిట్‌తో అంతర్జాతీయంగా సర్వీసులు ప్రారంభించింది. 2019 ఏప్రిల్ 17: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కారణంగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం .. ఎన్సీఎల్టీలో జూన్ 19న కంపెనీపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2020 మార్చి 13: టేకోవర్ చేసేందుకు బిడ్డర్లు ఎవరూ రాకపోవడంతో పరిష్కార ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని జెట్ కోరింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న ప్రాపర్టీని విక్రయించి, కొన్ని రుణాలను సెటిల్ చేసుకునేందుకు జూన్‌లో కంపెనీకి ఎన్సీఎల్టీ అనుమతులు ఇచ్చింది. 2020 అక్టోబర్ 17: జలాన్ కల్రాక్ కన్సార్షియం పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించింది. గత చరిత్ర ఆధారంగా స్లాట్లను కూడా మళ్లీ కేటాయించాలని ఎన్సీఎల్టీని కన్సార్షియం కోరింది. 2021 ఫిబ్రవరి 21: జలాన్ కల్రాక్ కన్సార్షియం అభ్యర్థ్ధనపై స్పందించేందుకు డీజీసీఏకి ఎన్సీఎల్టీ మరింత సమయం ఇచ్చింది. స్లాట్ల విషయంలో తామేమీ భరోసా ఇవ్వలేమని మార్చిలో డీజీసీఏ తెలియజేసింది. కంపెనీ గత చరిత్ర ఆధారంగా స్లాట్లు కేటాయించలేమని జూన్ 3న ఎన్సీఎల్టీకి డీజీసీఏ, ఎంవోసీఏ తెలియజేశాయి. -
రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 95% స్థానికులతోనే ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్ కోటా 5 శాతం మాత్రమే ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇక ముందు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నిజానికి 2018లోనే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చింది. ఈ మార్పులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదించడంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా చాలా పోస్టులు ఓపెన్ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్ కోటానే. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కిందే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. ఇక గ్రూప్–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్ పోస్టులు ఉండేవి. మల్టీజోన్ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త జోనల్ విధానంతో.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లా పోస్టులతోపాటు 61 కీలక విభాగాల్లోని 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. స్టేట్ కేడర్ నుంచి మార్చడంతో.. కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 34 రకాల స్టేట్ కేడర్ (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ విధానం నుంచి తొలగించి.. మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చింది. కొన్ని కేటగిరీల్లో కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే.. ఆ ఉద్యోగాలు పొందిన వారు సర్వీసు పరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీ జోనల్ స్థాయిలో చేసినా.. పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్ర స్థాయి కేడర్‌లో ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్‌కు ప్రమోట్ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో అత్యధికం పదోన్నతులపైనే భర్తీ కానున్నాయి. మల్టీజోన్ పరిధిలోకి వచ్చే స్టేట్ కేడర్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ గ్రేడ్–2 ట్రెజరర్, అకౌంట్స్ ఆఫీసర్; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్, డీఎస్పీ (కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయుష్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులివీ.. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హార్టికల్చర్ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ట్యూటర్, ఫిజికల్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్. మల్టీజోన్లు.. వాటి పరిధిలోని జోన్లు మల్టీజోన్-1: కాళేశ్వరం-1, బాసర-2, రాజన్న-3, భద్రాద్రి-4 మల్టీజోన్-2: యాదాద్రి-5, చార్మినార్-6, జోగులాంబ-7 -
పండుగ బొనాంజా : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ జారీతో పండుగ సీజన్లో డిమాండ్ పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని ఈ నిర్ణయం ప్రకటిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్‌ను అందుకోనున్నారు. మరోవైపు దుర్గా పూజ లోగా సామర్ధ్యం ఆధారిత బోనస్‌ను విడుదల చేయనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రెండు ప్రధాన రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు హెచ్చరించాయి. చదవండి : ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్ -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల వ్యతిరేకత మధ్య పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 20న పార్లమెంట్ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి అభ్యర్ధించారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.మరోవైపు ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. హరియాణ, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు. ఈ బిల్లులతో రైతులను కార్పొరేట్ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థ కనుమరుగవుతుందని విపక్ష నేతలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతుల ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తాయని, దళారీ వ్యవస్థ దూరమై రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి : ‘ఆ బిల్లులను అడ్డుకోండి’ -
విజయా‘భివృద్ధి’మస్తు..
తరతరాల వెనుకబాటు తనాన్ని కూకటివేళ్లతో పెకిలించే గొప్ప నిర్ణయం... ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలకు చరమగీతం పాడే చారిత్రక చట్టం... పురుడుపోసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాహసోపేత పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం లభించింది. ఇకపై విశాఖపట్నం రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారనుంది. ఫలితంగా ఉత్తరాంధ్రలో విశాఖను ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లాకే ప్రధానంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయం తెలిసి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులు, ప్రజలు... ఒకరేమిటి... జిల్లా అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకప్పుడు విజయనగర వైభవాన్ని చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టి చూసేది. ఇక్కడి విశేషాలను విని ఆశ్చర్యపడేది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు, శ్రీరాముడు కొలువైన రామతీర్థం దేవస్థానం, తాటి పూడి రిజర్వాయర్, శంబర పోలమాంబ జాతర, విజయనగరం రాజకోట వంటి ఎన్నో అద్భుతాలు ఈ జిల్లాలో కొలువై ఉన్నాయి. గురజాడ అప్పారావు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కోడిరామ్మూర్తి, డి.వై. సంపత్‌కుమార్, సర్ విజ్జి, పి.సుశీల వంటి ప్రముఖులెందరికో జన్మనిచ్చిన నేల ఇది. కానీ కొన్ని దశాబ్దాలుగా జిల్లా వెనుకబాటుతనంతో వైభవాన్ని కోల్పోయింది. పాలకుల నిర్లక్ష్యం, ఉపాధి అవకాశాల కొరతతో ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు రూపుమాపే అవకాశం లభించనుంది. విజయనగరం జిల్లాకు మరలా పూర్వవైభవం రానుంది. పరిమిత వనరులతోనే అద్భుతాలు తూర్పున శ్రీకాకుళం, దక్షిణం, పశ్చిమాన విశాఖపట్నం జిల్లాలు, వాయువ్యంలో ఒడిశా రాష్టం, ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా 1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా ఏర్పడింది. జిల్లా మొత్తం విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు. 23.44 లక్షల మంది జనాభా ఉన్నారు. నేటికీ అక్షరాస్యత శాతం తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం అది 58.89 శాతం మాత్రమే. 68 శాతం వ్యవసాయాధారితమైన విజయనగరం జిలాలను విజయనగరం, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. పార్వతీపురం డివిజన్ గిరిజన గ్రామాలతో కలిపి ఐటీడీఏలో ఉంది. జిల్లాలో మొత్తం 34 మండలాలు, 920 పంచాయతీలు, 1582 గ్రామాలు, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలున్నాయి. 51 బ్యాంకులు, 67 తపాలా కార్యాలయాలు, 66 కళాశాలలు, 16 మోడల్ స్కూళ్లు, 78 ఎన్జీఓలు, 103 హాస్పిటళ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో పోష¯ణ్ అభియాన్, గ్రామస్వరాజ్ అభియాన్, కృషి కళ్యాణ్ అభియాన్ జాతీయ అవార్డులను జిల్లా సొంతం చేసుకుంది. ఇటీవల మూడు స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. పరిమిత వనరులతోనే ఇంతటి ఘనత సాధించిన జిల్లాకు మరింత ఆసరా లభిస్తే అద్భుతాలు సాధిస్తుంది. జంటనగరాలుగా విజయనగరం, విశాఖ ఉత్తరాంధ్ర అభివద్ధి కోసం విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం సంకల్పించింది. ఈ ప్రక్రియ పూర్తవడంతో మొదటగా లాభపడుతున్నది మన విజయనగరం జిల్లానే. విశాఖ–విజయనగరం మధ్య దూరం చాలా తక్కువ. యాభై కిలోమీటర్లు నాన్‌స్టాప్ బస్సులో ప్రయాణిస్తే గంటంపావులో విశాఖలో ఉంటాం. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్య, వ్యాపార సంస్థలు వెలిశాయి. రాజధాని వస్తే ఇవి మరింతగా పెరుగుతాయి. విశాఖ ప్రజల దాహార్తిని విజయనగరంలోని తాటిపూడి రిజర్వాయర్ తీరుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీసుతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు విజయనగరం సరిహద్దులను ఆనుకుని ఉన్న రుషికొండ, భీమిలి, తరగపువలస, మధురవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలను విజయనగరంలోనూ ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. విశాఖ మెట్రోరైలును కూడా భోగాపురం వరకూ పొడిగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ జరిగితే విశాఖపట్నం –విజయనగరం జిల్లాలు జంటనగరాలుగా అవతరిస్తాయి. జాతీయ స్థాయి విద్యా, వ్యాపార సంస్థలు వస్తాయి. రాజధాని స్థాయి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ఇవే అంశాలు జిల్లా ప్రజలను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. రాజధాని సమీప జిల్లా వాసులుగా మారుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు, ఇంతటి వరాన్ని తమకు అందించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు. శ్రావణ శుక్రవారం రోజున మంచి కానుక మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రావణ శుక్రవారం రోజున గవర్నర్ మంచి కానుక ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచీ నేటివరకూ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు త్వరలో మారిపోతాయి. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టడం వల్ల ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మంచి భరోసా లభించింది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజల తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాను. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఉత్తరాంధ్రవాసుల అదృష్టం మూడు రాజధానుల ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం. ఇంతవరకు వచ్చిన నాయకులు వట్టిమాటలు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను వదిలేసిన నాయకులనే చూశాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం ముదావహం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటారు. – పాముల పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవకాశం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించడం శుభపరిణామం. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండటం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుంది. బోగాపురం ఎయిర్‌పోర్టు, ఫిషింగ్ హార్బర్, గిరిజన యూనివర్శిటీ రావడం వల్ల నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధికి కొదవుండదు. – బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ వెనుకబాటు ఉండదు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడం ఉత్తరాంధ్ర ప్రజల పూర్వ జన్మసుకృతం. అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇది గొప్ప వరం. పేదరికం, వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలోనే ఉపాధి మెరుగవుతుంది. వలస బాధ ఉండదు. ఉత్తరాంధ్ర ప్రజల తరపున సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ణతలు. – శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీజిల్లా అధ్యక్షుడు -
కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్ధలను పటిష్టం చేసేందుకు కేంద్ర నిధులతో ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజ్ కింద రాష్ట్రాలకు కేంద్రం రూ 15,000 కోట్లు సమకూరుస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి 2024 మార్చి వరకూ మూడు దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ వందన గుర్నానీ వెల్లడించారు. ఎమర్జెనీ కోవిడ్-19 రెస్పాన్స్ నిధులతో వ్యాధి నివారణ, సన్నద్ధతలను పరిపుష్టం చేయడం, అత్యవసర వైద్య పరికరాల సేకరణ, మందుల సేకరణ, లేబొరేటరీల ఏర్పాటు, బయో సెక్యూరిటీ సన్నద్ధత వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఓ ప్రకటనలో గుర్నానీ పేర్కొన్నారు. ఈ ప్యాకేజ్‌లో తొలి దశ అమలు జూన్ వరకూ కొనసాగుతుందని అన్ని రాష్ట్రాల వైద్య శాఖ సంచాలకులు, కమిషనర్లను ఉద్దేశించి పంపిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. చదవండి : ‘చచ్చిబతికాను.. వాళ్లే హీరోలు’ -
4 సవరణ బిల్లులకు సభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: లాభదాయక పదవుల జాబితా నుంచి 29 చైర్మన్ పదవులను మినహాయిస్తూ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం నుంచి హెచ్ఎండీఏ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్స్, డైరెక్టర్లు, రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రాంతీయ బోర్డుల డైరెక్టర్లు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి, ఎంబీసీ, మూసీ రివర్ ఫ్రంట్, కార్మిక సంక్షేమ బోర్డు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్లు, యాదగిరిగుట్ట, వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థలు తదితరాల చైర్మన్లను మినహాయిస్తూ ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆదివారం సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, 1953 (యాక్ట్ 2 ఆఫ్ 1954) సెక్షన్ 10లో పొందుపరిచిన మేరకు.. వివిధ సంస్థల చైర్మన్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే వారు లాభదాయక పదవులు కలిగి ఉన్నందుకు అనర్హత వేసే నిబంధన వర్తించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గతంలో 23 చైర్మన్ పదవులుండగా, తాజాగా ఆ జాబితాలో మరో 29 చైర్మన్ పదవులను అదనంగా కలుపుతూ సవరణ చట్టం చేశారు. ఇంకా జాబితాలోకి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, స్పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ షీప్, గోట్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ, తెలుగు అకాడమీ, హాకా, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, స్టేట్ హజ్ కమిటీ, తెలంగాణ ఫుడ్ కమిషన్, సెట్విన్, తెలంగాణ సాహిత్య అకాడమీ, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్స్, తెలంగాణ స్టేట్ యోగాధ్యయన పరిషత్ చైర్మన్ పదవులున్నాయి. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. మరో మూడు సవరణ బిల్లులకు ఆమోదం... వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ, అభయహస్తం పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) కో కాంట్రిబ్యూటరీ పింఛను చట్టం రద్దు, తెలంగాణ లోకాయుక్త–2020 సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్రం ఆదేశించిన మేరకు సీజీఎస్టీ చట్టానికి అవసరమైన సవరణలు చేసుకోవడంలో భాగంగా ఈ చట్ట సవరణ చేపడుతున్నట్టు సీఎం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తెలిపారు. ఇందులో భాగంగా టీడీఎస్ సమయం పొడిగింపు అధికారం కమిషనర్‌కు ఇవ్వడం, రిజిస్ట్రేషన్‌కు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపడం, తదితరాలను చేర్చారు. లోకాయుక్త చట్టంలో ఏపీ ఉన్న చోట తెలంగాణగా మార్పు చేస్తూ 2019లో తెలంగాణ చట్టం తీసుకురాగా, గతంలో లోకాయుక్త పదవికి మాజీ చీఫ్ జస్టిస్‌ను నియమించాలని ఉంటే ఆ స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించుకునేలా చట్ట సవరణ చేశారు. ఈ చట్ట సవరణను హరీశ్‌రావు ప్రతిపాదించగా సభ ఆమోదించింది. అభయహస్తం కింద 60 ఏళ్లకు పైబడిన వారికి నెలకు రూ.500 చొప్పున పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం ఆసరా వృద్ధాప్య పించన్లను 57 ఏళ్ల వారికి కూడా రూ.2,016కు పెంచి ఇస్తున్నందున గతంలోని అభయహస్తం పథకం రద్దుకు ఈ చట్టసవరణ ప్రతిపాదించిన పీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అదేవిధంగా ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కో కాంట్రిబ్యూటరీ పింఛన్ చట్టం రద్దుకు చట్ట సవరణ ద్వారా ప్రతిపాదించినట్టు తెలియజేశారు. ఈ చట్ట సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది. -
టీవీఎస్ మోటార్ కంపెనీ రెండో డివిడెండ్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.1.40 చొప్పున(140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ నెల 18నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20లోపు ఈ డివిడెండ్‌ను చెల్లిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నామని పేర్కొంది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.2.10 డివిడెండ్‌ను ప్రకటించింది. -
అభయారణ్యాల్లో రోడ్లకు.. రైలు మార్గాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: పులుల అభయారణ్యాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ చర్యలవల్ల పులుల సంరక్షణకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో (జాతీయరహదారి–363)ని రోడ్డును (94 కి.మీ పొడవు) ‘ఫోర్ లేనింగ్ నేషనల్ హైవే’గా మార్చాలనే ప్రతిపాదనపై ఇటీవల పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాఖుది, రేచ్ని రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య కాగజ్‌నగర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో (కారిడార్ ఏరియా) పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గ్రేజ్ లైన్‌ను వేసేందుకు 168.43 హెక్టార్ల అటవీభూమిని మళ్లించడంపైనా ఈ భేటీ ఆమోదం తెలిపింది.డబ్ల్యూఎల్ఎం వరంగల్ డివిజన్లోని ఉరాట్టం–ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని మళ్లించేందుకు ఈ బోర్డు అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో గోదావరి నదిపై తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–1, ప్యాకేజ్–1లో భాగంగా బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల వన్యప్రాణి ప్రాంతాల్లోని అటవీభూమిని సైతం మళ్లించడంపై వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. పులులకు తీరని నష్టం... అభయారణ్యాల్లో పులుల తిరుగాడే ప్రధాన ›ప్రాంతం (కోర్ ఏరియా), మహారాష్ట్ర సరిహద్దులోని పులులకు కీలకమైన ప్రాంతాల్లో భాగమైన ఆయాచోట్ల రోడ్ల విస్తరణ, కొత్తరైల్వేలైన్ల నిర్మాణం సరికాదని పర్యావరణ వేత్తలు, జంతుప్రేమికులు వాదిస్తున్నారు.మహారాష్ట్రలోని తడోబా ఆంథేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలు కావడంతోపాటు కవ్వాల్ టైగర్ అభయారణ్యం పరిధిలో ఇక్కడే పిల్లలు కూడాపెడుతున్నాయి. ఈ తరుణంలో పులుల వృద్ధికి, వాటి సంచారానికి, వలసలకు కీలకమైన ఈ ప్రాంతంలో నాలుగు లేన్ల రోడ్లు వేయడం, కొత్త రైల్వేలైను వేయడం వల్ల పులులసంఖ్య పెరిగేందుకు ప్రతికూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో 94 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదనపై వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోద ముద్ర వేసినట్టుగ రాష్ట్ర వన్యప్రాణి మండలి సభ్యులు చెబుతున్నారు. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయా అంశాలు పరిశీలించి, అత్యవసరమైన సందర్భాల్లోనే ఆమోదం తెలుపు తున్నట్టు స్పష్టం చేశారు. -
హెల్త్ క్యాలెండర్‌కు సబ్ కమిటీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన ‘హెల్త్ క్యాలెండర్’కు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 24 అంశాలతో, 71 పేజీల్లో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను త్వరలో అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకూ ఏ నెలలో ఏ వ్యాధులకు అవకాశం ఉంది? దాని లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు వంటి పలు వివరాలతో ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. నిర్మాణం జరిగి ఉపయోగంలో లేకుండా ఉన్న 1,500 పడకలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వెయ్యి ఫాగింగ్ మిషన్లతో రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు స్ప్రే చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పెన్నార్’ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హైదరాబాద్: పెన్నార్ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్(పెబ్స్), పెన్నార్ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్ ప్రకారం, ప్రతి 13 పెబ్స్ షేర్లకు 23 పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్ డేట్‌ను గత ఏడాది ఏప్రిల్ 1గా ఎన్సీఎల్టీ ఆమోదించింది. వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2–3 నెలల సమయం పడుతుందని అంచనా. విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్–ప్రెసిడెంట్ (కార్పొరేట్ స్ట్రాటజీ) కె.ఎమ్. సునీల్ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. అనుబంధ కంపెనీల విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం లభించిన నేపథ్యంలో పెన్నార్ ఇండస్ట్రీస్ షేర్ 1.7 శాతం నష్టంతో రూ.31.35 వద్ద ముగిసింది. పెబ్స్ షేర్ 4.4 శాతం నష్టంతో రూ. 52.15వద్దకు చేరింది. -
మెట్రోలో ప్రమాణాలకు కమిటీ
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రోరైల్ వ్యవస్థలకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఢిల్లీ మెట్రో విస్తరణలో భాగంగా బహదూర్గఢ్–ముండ్కా మార్గాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. పట్టణాల్లో సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో లభించే రవాణా వ్యవస్థలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘మెట్రోరైళ్లకు సంబంధించి మా ప్రభుత్వం ఓ విధానం తీసుకొచ్చింది. మెట్రో వ్యవస్థల మధ్య సమన్వయం ఉండాలనీ, కొన్ని ప్రాథమిక ప్రమాణాల ప్రకారమే అవి పనిచేయాలని మేం భావిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ‘దేశంలో వివిధ నగరాల్లోని మెట్రోరైల్ నెట్‌వర్క్‌లను నిర్మించేందుకు ఇతర దేశాలు మనకు సాయం చేశాయి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయా దేశాల్లోని మెట్రో రైళ్లకు బోగీలను మన దేశంలో తయారుచేయడం ద్వారా వారికి మనం సాయం చేస్తున్నాం’ అని మోదీ తెలిపారు. -
ఆయుధ సామగ్రికి 15వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాలకు అవసరమైన యుద్ధసామగ్రిని దేశీయంగా తయారుచేసేందుకు రూ. 15 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు ఆర్మీ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకుల కోసం వివిధ రకాల మందుగుండు, యుద్ధ సామగ్రిని భారత్‌లోనే తయారుచేస్తారు. సైన్యానికి అవసరమైన మందుగుండు దిగుమతుల్లో భారీ జాప్యాన్ని నివారించడంతో పాటు.. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అవసరమయ్యే మందుగుండు నిల్వల పరిమాణాల్ని తగ్గించేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 11 ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. దీని అమలును ఆర్మీ, రక్షణ శాఖలోని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఎంతో రహస్యంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు తక్షణ లక్ష్యం.. యుద్ధం సమయంలో 30 రోజులకు అవసరమైన యుద్ధ సామగ్రిని అందించడం కాగా.. దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం. ‘మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 15 వేల కోట్లు.. 10 ఏళ్లకు సంబంధించి తయారు చేయాల్సిన యుద్ధ సామగ్రి పరిమాణంపై లక్ష్యాన్ని పెట్టుకున్నాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. మొదటి దశలో రాకెట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఆర్టిలరీ గన్స్, పదాతి దళం కోసం యుద్ధ వాహనాలు, గ్రనేడ్ లాంచర్లు, యుద్ధ రంగంలో వాడే వివిధ ఆయుధాల్ని నిర్దేశిత గడువులోగా తయారుచేస్తారు. మందుగుండు నిల్వలు వేగంగా తగ్గిపోవడంపై కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధ సామగ్రి తయారీపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది. -
ఏనుగు..సైకిల్.. హస్తం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 1978లో చీలిపోయిన తర్వాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్(ఐ) కోసం ఏనుగు, సైకిల్, హస్తం గుర్తులు పరిశీలనకు రాగా, ఇందిర ‘హస్తం’ గుర్తుకు ఆమోద ముద్ర వేశారని పొలిటికల్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తెలిపారు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం ‘బ్యాలెట్– టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమొక్రసీ’లో కిద్వాయ్ వివరించారు. కాంగ్రెస్(ఐ) ఏర్పాటుతో ఇందిర ‘ఆవు–దూడ’ గుర్తును వదులుకోవాల్సి వచ్చిందని కిద్వాయ్ ఈ పుస్తకంలో తెలిపారు. ‘అప్పటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బూటా సింగ్ తమకు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని ఈసీకి లేఖ రాశారు. దీంతో ఏనుగు, హస్తం, సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించింది. ఈ సమయంలో ఇందిర ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నేత పీవీ నరసింహారావుతో సమావేశమై ఉన్నారు. ఎన్నికల గుర్తుపై తుది నిర్ణయం తీసుకోలేని సింగ్.. ఇందిరకు వెంటనే ఫోన్ చేశారు. హస్తం గుర్తును ఎంపిక చేద్దామని సూచించారు. అయితే సాంకేతిక కారణమో లేక సింగ్ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడంతోనో ఫోన్లో ఇందిరకు హాత్(హస్తం) అన్న పదం హాథీ(ఏనుగు)గా విన్పించింది. బూటా సింగ్ ఏనుగు గుర్తునే మళ్లీ మళ్లీ సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహించిన ఇందిర.. చివరికి ఫోన్‌ను పీవీ నరసింహారావు చేతికిచ్చా రు. బహుభాషా పండితుడైన నరసింహారావు రిసీవర్ అందుకున్న వెంటనే సింగ్ చెబుతున్నదేంటో అర్థం చేసుకున్నారు. హాత్ అనడం ఆపి పంజా అనాలని పీవీ ఆయనకు ఫోన్లో గట్టిగా జవాబిచ్చారు. చివరికి పీవీ అసలు విషయాన్ని ఇందిరకు చెప్పడంతో హస్తం గుర్తుకు ఆమె అంగీకరిం చారు’ అని కిద్వాయ్ వివరించారు. -
‘ఖేల్‌రత్న’లకు ఆమోదముద్ర
న్యూఢిల్లీ: భారత హాకీ ఆటగాడు సర్దార్ సింగ్, పారాలింపియన్ దేవేంద్ర జజరియా ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’ అవార్డు ఎంపిక అధికారికంగా ఖరారైంది. సెలక్షన్ కమిటీ కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి పేర్లను ప్రతిపాదించగా... కేంద్ర క్రీడా శాఖ మంగళవారం వీటికి ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ పురస్కారాల కోసం ప్రతిపాదించిన జాబితాను కూడా కేంద్రం ఆమోదించింది. హైదరాబాద్‌కు చెందిన హకీమ్ (ఫుట్‌బాల్) ధ్యాన్‌చంద్ అవార్డును, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగుల ప్రసాద్ (బ్యాడ్మింటన్) ద్రోణాచార్య (లైఫ్‌టైమ్) అవార్డును అందుకోనున్నారు. ‘అర్జున’ విజేతలకు జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా ‘అర్జున’ అవార్డులకు ఎంపికైన తెలుగు క్రీడాకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన 17 మంది ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్)లకు ‘అర్జున’ అవార్డులు దక్కాయి. -
మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇటీవలే రూ. 16,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను పూర్తిచేసింది. ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు రూ. 13,000 కోట్లు, 3.4 బిలియన్ డాలర్ల చొప్పున బైబ్యాక్ లేదా డివిడెండ్ల రూపంలో చెల్లించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డు కూడా రూ. 3,500 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. విప్రో కూడా ఇదే బాటలో ఉంది. -
ఎయిర్ ఇండియా విక్రయానికి గ్రీన్ సిగ్నల్
పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం విధివిధానాల ఖరారుకు మంత్రుల బృందం ఏర్పాటు: జైట్లీ న్యూఢిల్లీ: భారీ అప్పుల భారంతో నెట్టుకొస్తున్న ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు. ప్రభుత్వరంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఒడ్డున పడేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. ప్రజల పన్నుల ఆదాయంతో ఎయిరిండియాను నడపడం ఎంత మాత్రం సరికాదని అరుణ్ జైట్లీ లోగడే పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రక్రియ ఎయిరిండియాలో వాటా విక్రయం అన్నది దీర్ఘకాలం పాటు కొనసాగే ప్రక్రియగా ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు ఒకటికిమించిన కేబినెట్ ఆమోదాలు అవసరమంటున్నారు. ప్రస్తుతం ఇచ్చింది సూత్రప్రాయ ఆమోదమే. ఎంత వాటా విక్రయించాలి, అందుకు ఏ విధానం అనుసరించాలన్నది మంత్రుల బృందం ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అర్హతగల పెట్టుబడిదారుని గుర్తించడం, వాటా విక్రయించడం ఈ సుదీర్ఘ ప్రక్రియ దృష్ట్యా వాటా విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18)లో పూర్తి కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం... ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం ఇచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ, పౌర విమానయాన శాఖ సదరు సంస్థ విలువను తేల్చే పనిని ప్రారంభిస్తాయి. కొనుగోలుదారుల అర్హతలను ఖరారు చేస్తాయి. తర్వాత ఈ అర్హతలకు తగ్గ కొనుగోలుదారును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎయిరిండియాకు ఉన్న అప్పులు, ఆస్తుల విలువలను తేల్చాల్సి ఉంటుంది. ఉద్యోగులతో చర్చలు, ఆర్థిక, న్యాయ సలహాదారుల ఎంపిక ఇవన్నీ తదుపరి ప్రక్రియలు. ఇదంతా ముగిసిన తర్వాత తిరిగి ఈ అంశం తుది ఆమోదం కోసం మరోసారి కేబినెట్ ముందుకు వస్తుంది. పలు ప్రతిపాదనలపై చర్చ వాస్తవానికి ఎయిరిండియా విషయమై గతంలో పలు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వమే దీన్ని నడిపించాలనేది అందులో ఒకటి. ఇది సాధ్యం కాదని భావించడంతో ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవడం, రుణదాతలు అంగీకరిస్తే అప్పులను సంస్థలో వాటాగా మార్చడం, ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను విక్రయించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం, వాటా కొనుగోలుకు విదేశీ కంపెనీని అనుమతించడంపైనా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రేసులో ‘టాటా’ ఎయిరిండియాలో నియంత్రిత వాటా (కనీసం 51 శాతం)ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎయిరిండియాలో వాటా విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎయిర్ ఇండియా 1948కి ముందు టాటాల ఆధ్వర్యంలోనే నడిచింది. వాటా అమ్మొద్దు.. రుణాలు మాఫీ చేయండి ఎయిరిండియా ఉద్యోగుల డిమాండ్ ఎయిరిండియాలో ప్రభుత్వ వాటా విక్రయ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. వాటా విక్రయానికి బదులు సంస్థ రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. ఎయిరిండియా ఎంప్లాయీస్ యూనియన్ బుధవారం నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా ను కలసి ఈ మేరకు డిమాండ్ చేసింది. రూ.52,000 కోట్ల రుణ భారంతో ఉన్న ఎయిరిండియాను ప్రైవేటు పరం చేయడమే ఉత్తమమని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ‘‘రూ.30,000 కోట్ల రుణాలను రద్దు చేయండి. జాతీయ సంస్థగా నిర్వహణకు అవకాశం ఇవ్వండి’’ అని ఎయిరిండియా ఉద్యోగుల సంఘం పనగారియాకు ఓ వినతిపత్రాన్ని అందజేసింది. ఒకవేళ విక్రయించాలనుకుంటే ఉద్యోగుల బకాయిలన్నీ తీర్చేయాలని యూనియన్ ప్రతినిధులు కోరడం గమనార్హం. తొందరపాటు నిర్ణయాలు, 111 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడం, లాభదాయక మార్గాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వంటి ప్రభుత్వ తప్పుడు విధానాలే సంస్థ భారీగా నష్టాలు ఎదుర్కోవడానికి కారణమని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులను చివరి వేతనంపై నియమించడం, సురేష్రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్‌సింగ్ వంటి వారి వల్ల సంస్థపై కోట్లాది రూపాయల భారం పడిందన్నారు. సంస్థను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయిస్తే పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని ఎయిరిండియాకు చెందిన ఏడు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఎయిరిండియాలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
‘ఏకీకృత సర్వీస్’కు న్యాయశాఖ ఆమోదం
ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయ శాఖ ఆమోదించిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డితో కలసి వేణుగోపాలాచారి గురువారం కేంద్ర న్యాయశాఖ లెజిస్లేటివ్ కార్యదర్శి నారాయణ రాజుతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రా ల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సంబంధిత ఫైలును లెజిస్లే టివ్ కార్యదర్శి ఆమోదించి, కేంద్ర హోంశాఖ కు పంపినట్టు తెలిపారు. ఇది ఆమోదం పొందితే తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్న 3లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర హోం శాఖకు పంపిన ఈ ఫైలు త్వర లోనే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందే అవకాశం ఉంద ని వారు వెల్లడించారు. ‘భగీరథ’కు బదలాయించండి... మిషన్ భగీరథ పనుల నిమిత్తం కొన్ని ప్రాం తాల్లో పైప్లైన్ల ఏర్పాటుకు ఇవ్వాల్సిన అను మతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిద్ మాధవ్ దవేను వేణుగోపాలాచారి కోరారు. పైప్లైన్ల ఏర్పాటుకు అవసరమైన అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలా యించి అనుమతులు ఇవ్వాలన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తోనూ సమావేశమై కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయా లని, సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ కింద రావాల్సిన నిధులను విడు దల చేయాలని వేణుగోపాలాచారి కోరారు. -
5 సెజ్‌లకు అనుమతి
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఐదు కొత్త ప్రత్యేక ఆర్థిక మండలాలు(స్పెషల్ ఎకనామిక్ జోన్–సెజ్)ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన వాటిల్లో ఒరాకిల్ ఇండియా, ఎల్ అండ్‌టీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఒరాకిల్ ఇండియా కంపెనీ కర్నాటకలో ఐటీ, ఐటీఈఎస్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నది. ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా రెండు ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌లను ఇదే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నది. కర్నాటకలోనే ఐటీ జోన్ ఏర్పాటు చేస్తామన్న మోడర్న్ అసెట్ అండ్ మోడర్న్ అసెట్(ఫేజ్ టూ) ప్రతిపాదన కూడా ఆమోదం పొందింది. -
తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా
-
ఇదీ బడ్జెట్ సమావేశాల రికార్డు
⇒ తక్కువ వ్యవధిలో..ఎక్కువ పద్దులపై చర్చ ⇒ రెండు వారాల్లోనే ముగిసిన సమావేశాలు ⇒ మొత్తం 72 గంటల 33 నిమిషాలపాటు చర్చలు ⇒ అయిదు బిల్లులకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా ⇒ బడ్జెట్.. పద్దులపై చర్చా సమయం సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కేవలం 13 రోజుల్లోనే ముగిశాయి. చివరి రోజైన సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లు, కాగ్ నివేదికలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మదుసూధనాచారి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు కనీసం 24 రోజులు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఈ నిబంధనను సవరించారు. బీఏసీతో సంప్రదింపుల మేరకు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులుండాలనేది స్పీకర్ నిర్ణయానికి అప్పగించారు. అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాలు రికార్డు స్థాయిలో 2 వారాల్లోనే ముగిశాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 72.33 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం 65 మంది సభ్యులు సభలో మాట్లాడారు. 168 ప్రశ్నలు, 192 అనుబంధ ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు 29 గంటల 09 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో టీఆర్ఎస్ 11.14 గంటలు, కాంగ్రెస్ 15.14 గంటలు, ఎంఐఎం 5.07 గంటలు, బీజేపీ 6.32 గంటలు, టీడీపీ 2.57 గంటలు, సీపీఐ 6 నిమిషాలు, సీపీఎం 1.48 గంటల పాటు మాట్లాడినట్లుగా రికార్డయింది. నాలుగ్గంటలు మాట్లాడిన సీఎం: మొత్తం సమావేశాల్లో సీఎం కేసీఆర్ 4.12 గంటలు మాట్లాడగా ప్రతిపక్ష నేత జానారెడ్డి 3.15 గంటలు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ 2.08 గంటలు, బీజేపీ నేత కిషన్‌రెడ్డి 2.34 గంటలు మాట్లాడారు. ఈనెల 23వ తేదీన రికార్డు స్థాయిలో ఉదయం పది గంటలకు మొదలైన సభ రాత్రి 10.36 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశాల్లో అయిదు బిల్లులు ఆమోదం పొందాయి. కీలకమైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుతో పాటు భూదాన్ చట్ట సవరణ బిల్లు, ప్రజాప్రతినిధుల జీతాలు, అలవెన్సుల చట్ట సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందాయి. తొలి రోజున గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు చివరి రోజున 2015–16 ఆర్థిక సంవత్సరపు కాగ్ ఆడిట్ నివేదికల సమర్పణతో ముగిశాయి. గవర్నర్ ప్రసం గిస్తుండగా సభలో అనుచితంగా వ్యవహరించారనే కారణంగా టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను సమావేశాలు ముగిసేంత వరకు బహిష్కరించారు. పద్దుల పైనే ఎక్కువ చర్చ బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రధాన ప్రతిపక్ష నేత ప్రారంభించటం ఆనవాయితీ. ఆరోజు ప్రతిపక్ష నేత జానారెడ్డి సభలో లేకపోవటంతో బీజేపీ చర్చను ప్రారంభించింది. సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాగా వ్యవహరించటంతో అర్థవంతమైన చర్చలకు ఎక్కువ సమయం దొరికింది. మొత్తం సెషన్లో కేవలం 27 నిమిషాల సభా సమయం దుర్వినియోగమైంది. గతంతో పోలిస్తే బడ్జెట్‌పై సాధారణ చర్చ కంటే పద్దులపై ఎక్కువగా చర్చించేందుకు అధికార, విపక్ష సభ్యులు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్లో ప్రకటించిన వాటితో పాటు విపక్ష సభ్యుల సూచనల మేరకు విద్యార్థుల మెస్‌చార్జీల పెంపు, హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని చివరి రోజున సీఎం ప్రకటించటం గమనార్హం. ‘ సమావేశాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. పద్దులపై ఇంత గొప్పగా ఎన్నడూ చర్చ జరగ లేదు. మా పార్టీ సభ్యులతో పాటు విపక్ష సభ్యులు సైతం సందర్భో చితంగా హూందాగా వ్యవహరించారు...’అని హరీశ్ వ్యాఖ్యానించారు. -
పద్దులపై చర్చించాకే ఆమోదం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత పద్దులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదింప జేసుకున్నామని, ఇది ప్రభుత్వం సాధించిన సానుకూలాంశమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పద్దులపై చర్చించకుండానే గిలిటెన్ చేసే సంప్రదాయం కొనసాగగా, అందుకు విరుద్ధంగా అన్ని పద్దులపై చర్చించాకే ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. 20 ఏళ్ల తర్వాత స్పీకర్ కార్యాలయం, ఐ అండ్ పీఆర్ వంటి పద్దులపైనా సభలో చర్చ జరగడం శుభపరిణామమన్నారు. శనివారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. పద్దులపై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేసిన ప్రతీ ఒక్కరికీ అవకాశం లభించిందన్నారు. ఇక మాట్లాడేవారెవరూ లేకపోవడంతో నిర్ణీత సమయానికి ముందే సభను వాయిదా వేయాల్సి వచ్చిందని నవ్వుతూ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. -
రెండు చట్టసవరణ బిల్లులకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ గురువారం రెండు చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలి ఫికేషన్ యాక్ట్–1953 చట్టానికి.. భూదాన్ అండ్ గ్రామ్‌దాన్ యాక్ట్ 1965 చట్టానికి సవర ణలను ఆమోదించింది. అయితే భూదాన్ చట్ట సవరణపై ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. భూదాన్ చట్టం కింద కేటాయించిన భూమి పట్టణ ప్రాంత పరిధి లోకి వచ్చినప్పుడు, లేదా వ్యవసాయ భూమిగా లేనప్పుడు ఆ భూమిని బోర్డు తీసు కుంటుందన్న నిబంధనలను తప్పుబట్టారు. భూదాన్ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే ఈ సవరణ చేపట్టారని ఆరోపించారు. ఇటీవల గాంధీభవన్‌లో ఉన్న భూదాన్ బోర్డు కార్యాలయం తలుపులను పోలీసులు అర్ధరాత్రి పగలగొట్టి ఫైళ్లు పట్టుకెళ్లారని పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వ విప్ జి.సునీత కల్పించుకుని సభను తప్పుదోవ పట్టించవద్దని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి స్పందిస్తూ.. సునీతను ‘ఆవిడ’ అంటూ సంబోధించడంతో అధికార పక్షం అభ్యంతరం తెలిపింది. మహిళ సభ్యురాలిని ఆవిడ అని సంబోధించడం సరి కాదని, క్షమాపణ చెప్పాలని హరీశ్ పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కల్పించుకుని శాంతింపజేశారు. సెలెక్ట్ కమిటీకి నివేదించండి.. గందరగోళం తగ్గాక.. భూదాన్ అంశంపై నేరుగా ప్రశ్న అడగాలని చిన్నారెడ్డికి స్పీకర్ సూచించారు. దీంతో చిన్నారెడ్డితోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకుని.. భూదాన్ చట్ట సవరణ బిల్లును ఆమోదిం చకుండా సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక రూల్స్‌లో దళితులు, ప్రభుత్వ అవసరాలకు భూములను కేటాయించేలా నిబంధనలను పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక వేతనాల చెల్లింపు, పెన్షన్‌కు సంబంధించిన బిల్లులో వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వేతనం చెల్లించే అంశాన్ని పొందుపరచడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. -
ఎంఫసిస్ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం
1.73కోట్ల షేర్ల బైబ్యాక్ @రూ.1,103 కోట్లు న్యూఢిల్లీ: ఎంఫసిస్ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26% వాటా) బైబ్యాక్ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్ చేస్తామని, ఈ బైబ్యాక్ విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌కు 60.42% వాటా ఉంది. ప్రజల వద్ద 39.58% వాటా ఉంది. గత శుక్రవారం బీఎస్ఈలో ఈ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.573 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీలో మెజారిటీ వాటా పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ చేతిలో ఉంది. -
డిజిటల్ అక్షరాస్యతకు 2,351 కోట్లు
పలు ద్వైపాక్షిక ఒప్పందాలకూ కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: ‘ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్’ (పీఎంజీదిశ) ద్వారా 6 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ అక్షరాస్యత అందించే కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో రూ.2,351.38 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును 2019 మార్చికల్లా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా 2.75 కోట్ల మందికి 2017–18లో, 3 కోట్ల మందికి 2018–19లో శిక్షణ అందించనున్నారు. 2.50లక్షల గ్రామపంచాయతీల్లో ఒక్కో గ్రామం నుంచి 200–300 మంది అభ్యర్థులను ఇందుకోసం ఎంపికచేయనున్నారని కేంద్ర ప్రకటన పేర్కొంది. ఈ కార్యక్రమం ద్వారా మొబైల్ ఫోన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం, డిజిటల్ వాలెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థపై పూర్తి అవగాహన కలుగుతుందని ప్రకటన వెల్లడించింది. దీంతోపాటుగా భారత–సెనెగల్ దేశాల మధ్య ఆరోగ్యం, వైద్యం విషయంలో (ఎయిడ్స్ నియంత్రణలో సహకారం, ఆసుపత్రుల నిర్వహణ, డ్రగ్స్–ఫార్మాసూటికల్ ఉత్పత్తులు, ఆసుపత్రుల పరికరాలు, సాంప్రదాయ వైద్యం, వ్యాధులపై నిఘా–తక్షణ ఉపశమనం) చేసుకున్న ఒప్పందాలపై సంతకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత–వియత్నాం మధ్య శాంతియుత అవసరాల కోసం అంతరిక్ష ప్రయోగాల విషయంలో కుదిరిన ఒప్పందాలపైనా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. బీపీఫ్రాన్స్ (ఫ్రాన్స్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు), సాంకేతికాభివృద్ధి బోర్డు (టీడీబీ), శాస్త్ర, సాంకేతిక విభాగాల మధ్య ఒప్పందంపై సంతకాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
కాలం చెల్లిన105 చట్టాల రద్దుకు ఓకే
న్యూఢిల్లీ: కాలం చెల్లిన 105 చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన చట్టాలున్నాయి. ఈ చట్టాల రద్దు కోసం ‘రద్దు–సవరణ బిల్లు–2017’ను తీసుకురావాలన్న న్యాయ శాఖ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ప్రధాని కార్యాలయం, లా కమిషన్, శాసన విభాగాలు ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చిందని న్యాయమంత్రి రవిశంకర్ మీడియాతో చెప్పారు. 139 చట్టాల రద్దుకు వివిధ మంత్రిత్వ శాఖలు ఒప్పుకోలేదు. యూఏఈతో ఒప్పందానికి ఓకే జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి రూ. 200.78 కోట్లు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. తూర్పు భారతంలో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రోడ్డు రవాణా, రహదారుల రంగంలో సహకారం కోసం ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ఆర్బీఐ ఆ నోట్లను రద్దెప్పుడు చేసిందో తెలుసా?
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగం. ఈ ప్రసంగానికి కొన్ని గంటల ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించేసిందట. అయితే ఈ విషయానికి ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది అనుకూలించారో మాత్రం ఆర్బీఐ రికార్డు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. నవంబర్ ఎనిమిదిన బోర్డు మీటింగ్ నిర్వహించిన ఆర్బీఐ సాయంత్రం 5.30 గంటలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించిందని ఆర్టీఐలో వెల్లడైంది. అనంతరం ప్రధాని రాత్రి ప్రసంగంలో తెలిపారు. బ్యాంకు బోర్డు మీటింగ్‌లో గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్‌లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వంటి పలువురు ప్రముఖులున్నారు. అయితే కరెన్సీ రద్దుతో ఏర్పడే నగదు కొరతకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు ప్లాన్స్ సిద్ధం చేసుకుందో ఆర్బీఐ తెలుపలేదు. రోజుకు ఎన్ని కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆర్బీఐ సమాధానం చెప్పలేదు. పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షిస్తూనే ఉన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని నిరుపయోగంగా మార్చేస్తూ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పలు పరిణామాల్లో ఆర్బీఐ పలు సార్లు తడబడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆర్బీఐ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. -
ఆమోదం
► నామినేషన్లు ఓకే ► నేడు అభ్యర్థుల జాబితా ► కోర్టుకు ‘అమ్మ’ ► వేలిముద్ర వ్యవహారం ఉప ఎన్నికల రేసులో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. పరిశీలన ప్రక్రియ ముగియడంతో శుక్రవారం తుది జాబితా ప్రకటించనున్నారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫామ్‌లో అమ్మ వేలి ముద్ర వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారంతో ముగి సిన విషయం తెలిసిందే. పంచముఖ సమరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన గురువారం జరిగింది. ఆ మేరకు తంజావూరులో డీఎంకే, అన్నాడీఎంకేల అభ్యర్థులో పాటు 29 మంది, తిరుప్పర గుండ్రంలో 37 మంది, అరవకురిచ్చిలో 59 మంది నామినేషన్లను పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమో దం లభించింది. అరవకురిచ్చిలో మా త్రం డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వ్యతిరేకత వ్యక్తం చేసినా, చివరకు అధికారుల వివరణతో ఆమోద ముద్ర పడింది. పుదుచ్చేరిలో సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ స్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్లతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్‌లు ఏకమైనా, తన విజయానికి ఢోకా లేదని నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. నేడు జాబితా: శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉప సంహరణ ప్రక్రియ సాగనుంది. తదుపరి సాయంత్రం ఐదున్నర, ఆరు గంటల సమయంలో రేసులో నిలబడే అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించనున్నారు. గెలుపు లక్ష్యంగా అభ్యర్థులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, మదురైలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నగదు, నగలు పట్టుబడగా, గురువారం జరిగిన తనిఖీల్లో రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిపిన తనిఖీల్లో డెబ్బై లక్షల మేరకు నగదు, కోటి రూపాయలకుపైగా వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నారు. కోర్టుకు అమ్మ వేలి ముద్ర: అన్నాడీఎంకే అభ్యర్థుల బీ-ఫామ్ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిందే. తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరినెల్లితోపు బరిలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులు ఎన్నికల యంత్రాంగానికి సమర్పించిన బీ-ఫామ్‌లో జయలలిత సంతకంకు బదులుగా వేలి ముద్ర ఉండడం చర్చకు దారి తీసి ఉన్న విషయం తెలిసిందే. ఈ వేలి ముద్రను ఎన్నికల యంత్రాంగం పరిగణలోకి తీసుకుంది. అరుుతే, ఇది చట్ట విరుద్ధంగా పేర్కొంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేలి ముద్ర విషయంగా ఎన్నికల యంత్రాంగానికి లేఖ రాసినట్టు, వారి నుంచి సమాధానం లేని దృష్ట్యా, కోర్టులో పిటిషన్ వేసినట్టు వివరించారు. అన్నాడీఎంకే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నారుు. ఎన్నికల్లో వీరప్పన్ బంధువు ఉప ఎన్నికల బరిలో చందనపు దొండ వీరప్పన్ బంధువు నిలబడిఉన్నారు. ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీప గ్రామానికి చెందిన అగ్ని శ్రీరామచంద్రన్(36)చివరి రోజు బుధవారం చివరిక్షణంలో తన నామినేషన్ సమర్పించి ఉన్నాడు. ఇతడు చందనపు స్మగ్లర్ వీరప్పన్ బంధువు. తంజావూరునియోజకవర్గం ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు, తన మామ వీరప్పన్ అభిమానులు తనకు అండగా నిలబడాలని అగ్ని శ్రీరామచంద్రన్ మీడియా ద్వారా పిలుపు నివ్వడం గమనార్హం. -
అన్నీ ఆయన ఆమోదంతోనే...
ముంబై: జపనీస్ సంస్థతో టెలికాం ఒప్పందం నేపథ్యంలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్న టాటా-మిస్త్రీ వివాదం మళ్లీ రాజుకుంది. రెండు రోజుల మౌనం తరువాత ఈ వ్యవహారంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (48)మరోసారి టాటాలపై విరుచుకుపడ్డారు. డొకొమో వివాదం రతన్ టాటా వ్యవహార సరళికి భిన్నమైనదనీ, టాటా విలువలకు, సంస్కృతికి వ్యతిరేకంగా మిస్త్రీ వ్యవహరించారన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆరోపించారు. 2009లో జపాన్ సంస్థతో డొకొమో ఒప్పంద సంతకాలు మిస్త్రీ నియామకానికి ముందే జరిగాయని మిస్త్రీ కార్యాలయ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి. టాటా డొకొమో ఒప్పంద నిర్ణయాలు మిస్త్రీ సొంతంగా తీసుకున్నారని, సంస్థకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలు తీవ్రంగా ఖండించాయి. మొదటినుంచి చివరి వరకూ ప్రతి అడుగూ ఆయన ఆమోదంతోనే పడిందని తెలిపాయి. ఒప్పంద చర్చలు టాటా బోర్డ్ ఆధ్వర్యంలోనే జరిగినట్టు వివరణ ఇచ్చారు. ఇవన్నీ టాటా సన్స్ బోర్డు ఆమోదంతోనే తీసుకున్న సమిష్టి నిర్ణయాలని చెప్పారు. నిర్ణయాలు టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవ ఆమోదం తో నిర్ణయాలని చెప్పారు. అలాగే ఈ మొత్తం సమాచారాన్ని రతన్ టాటా, సూనావాలా, ట్రస్టీలకు ఎప్పటికపుడు అందించినట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో లీగల్ కౌన్సిల్ సమావేశాల్లో, మిస్త్రీతో ప్రత్యేక సమావేశాల్లో కూడా వీరు పాల్గొన్నారని స్పష్టం చేశాయి. వాస్తవాలు ఇలా ఉండగా 'టాటా విలువలు', లేదా రతన్ టాటా, సూన్ వాలా అభిమతానికి విరుద్ధంగా మిస్త్రీ తన స్వంత నిర్ణయం తీసుకున్నారనడం బూటకమనీ, దుర్మార్గమని వాదించాయి. -
జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రధాని మోదీ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు మరో అడుగు ముందుకు పడింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కాగా, త్వరలో దీనిపై పన్ను రేటు, సెస్, సర్‌చార్జీలు నిర్ణయించనున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను. ఆగస్టు 8న ఈ బిల్లు ఆమోదానికి కేంద్రం అన్ని రాష్ట్రాల అంగీకారం కోరింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లును మొదట 17 రాష్ట్రాలకు పంపించగా, అస్సాం మొట్టమొదట అంగీకరించింది. అనంతరం ఏపీ, బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నాగాలాండ్, మహారాష్ట్ర, హరియాణా, సిక్కిం, మిజోరం, తెలంగాణ, గోవా, ఒడిశా, రాజస్తాన్ ఆమోదించాయి. -
ఆరు ఎఫ్డీఐప్రతిపాదనలకు ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ మంత్రిత్వశాఖల విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్ (ఎఫ్ఐపీబీ) ఆరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదనల విలువ దాదాపు రూ.105 కోట్లు. మొత్తం 13 ప్రతిపాదనలను పరిశీలించి ఆరింటిని ఖరారు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. నేడు ఆమోదం పొందిన పెట్టుబడుల్లో రూ.88 కోట్ల సెవా శాంటి యానిమేలీ ప్రధానమైనది. పలు రంగాలకు సంబంధించి ఎఫ్‌డీఐలను భారత్ ఆటోమేటిక్ రూట్లోనే ఆమోదిస్తోంది. -
పదోన్నతులకు పాలకమండలి ఆమోదం
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కెరీర్ అడ్వాన్స్ స్కీం కింద పలువురికి అసోసియేట్, ప్రొఫెసర్ పదోన్నతులకు ఎట్టకేలకు పాలకమండలి ఆమోదం లభించింది. ఎస్కేయూ పాలకమండలి సమావేశం బుధవారం ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చ జరిగింది. ఎజెండాలో చేర్చిన అంశాలపై జరిగిన చర్చలో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల నియామకం, దూరవిద్య విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా అధ్యయన కేంద్రాల మంజూరు, టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో అభివృద్ధిపనులు వంటి అంశాలపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా సమగ్రంగా విశ్లేషణ జరిగినట్లు సమాచారం. సాక్షిలో ఈ అంశాలన్నింటిపై అనేక కథనాలు వచ్చాయి. వీటిన్నింటిపై పాలకమండలి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య జి. శ్రీధర్ , రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ. మల్లిఖార్జున రెడ్డి, ఆచార్య ఫణీశ్వరరాజు, నాగజ్యోతిర్మయి, విజయారావు, ఆచార్య సుధాకర్ బాబు, ఎం. రామయ్య, ప్రిన్సిపల్ సెక్రెటరీ సుమిత్రా దావ్రా, ఫైనాన్స్ అదనపు సెక్రెటరీ సుబ్రమణ్యం పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాలకమండలిలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి. ∙ఇంజనీరింగ్, ఫార్మసీ , బీఈడీ కళాశాలలో అడ్హాక్ కాంట్రాక్టు బేసిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్, ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సమగ్రంగా చర్చించిన అనంతరం కమిటీ వేసిన తరువాత ఎంత మంది అవసరం అవుతారో వారిని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ∙8 అసిస్టెంట్, 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రీవైజ్డ్ పేస్కేలు, అరియర్స్ ఇవ్వాలనే ప్రతిపాదనకు హైకోర్టులో ఉన్న కేసులు సాకుగా చూపించి తిరస్కరించారు. ∙డాక్టర్ నరేంద్ర మద్దు అమెరికాకు వెళ్లడానికి రామన్ ఫెలోషిప్ ప్రాజెక్టుకు వెళ్లడానికి అనుమతి నిరాకరణ. ∙ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఏజెన్సీ ఏడాది సమయం పూర్తయిన వెంటనే ఈ– ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు అప్పగించాలని నిర్ణయం. ∙దూరవిద్య విభాగంలో నూతనంగా డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన నూతన అధ్యయన కేంద్రాల రద్దు చేస్తున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు సమావేశంలో పేర్కొన్నారు. -
లైన్ క్లియర్
ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా టీఎస్ఐఐసీ కన్సల్టెన్సీ సహకారంతో డీపీఆర్‌కు తుదిరూపు రాష్ట్రానికే తలమానికంగా ఫార్మాసిటీ రూపకల్పన ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూములకు పరిహారం కూడా చెల్లించింది. నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లోనూ భూములను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఇక ఫార్మా పనులు వేగం పుంజుకోనున్నాయి. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఔషధనగరికి మార్గం సుగమమైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 12,500 ఎకరాల్లో ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ అంకురార్పణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల్లో మూడో వంతు మనరాష్ట్రంలో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఔషధ రంగానికి చిరునామాగా మార్చాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ సర్కారు ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రంగా ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఔషధ దిగ్గజ కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని తొలి పర్యటనను ఇక్కడే చేశారు. అదేరోజు ఫార్మాసిటీ స్థాపనపైనా ప్రకటన చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిం చిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు జిల్లాలో 10,628.36 ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనలమండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించడం.. కనిష్టంగా 12,500 ఎకరాలుంటే గానీ ఈ హోదా వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని పెంచింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదలచేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఇరుజిల్లాల్లో కలిపి 15 వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. దీంట్లో ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూముల కు పరిహారం కూడా చెల్లించింది. అలాగే నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో కూడా భూములను సమీకరించే ప్రక్రియలో వేగం పెంచింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలంలోని భూ ములను ఆ జిల్లా యంత్రాంగం సమకూర్చుతోంది. కాగా, ప్రభుత్వం సమీకరిస్తున్న భూమిలో అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి. రాష్ట్రానికి సిరి.. ఔషధనగరి ఔషధ ఉత్పత్తుల్లో రాష్ట్రం ముందంజ లో ఉంది. బల్క్‌డ్రగ్ ఉత్పత్తులో మూడోవంతు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు జీవం పోసిన ప్రభుత్వం.. ఇక్కడ జీవశాస్త్ర, జీవ సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ పరిశోధన, నూతన ఔషధాల ఆవిష్కరణలకు ఫార్మాసిటీని కేంద్రంగా మలచాలని యోచిస్తోంది. దీనికి ‘నిమ్జ్’ హోదాను ఇచ్చేందుకు అనుమతించడంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరవాలని నిర్ణయించింది. ఔషధనగరి ఏర్పాటులో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ ఇప్పటికే పలు ఔషధ తయారీ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపింది. పలు కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పే విధంగా ఒప్పించగలిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం.. కాలుష్య ఉద్గారాలు రాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో శుద్ధియంత్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగా నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని అధికారుల బృందం ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటించింది. ఈ మేరకు ఎస్టీపీల స్థాపనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించింది. తాజాగా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఫార్మా పనులు మరింత వేగంగా ముందుకు సాగేందుకు దోహదం చేయనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు కేబినెట్ ఓకే
♦ 2017 సెప్టెంబర్‌కల్లా ఏర్పాటు ♦ 650 బ్రాంచీలతో కార్యకలాపాలు న్యూఢిల్లీ: పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలతో ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల కార్పస్‌తో పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటవుతుందని బుధవారం నాడు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో రూ.400 కోట్ల ఈక్విటీకాగా, రూ.400 కోట్లు గ్రాంట్. దేశంలో మొత్తం 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఇందులో 1.39 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక అనుసంధానం జరుగుతుందని భావిస్తున్నట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహించే ఈ బ్యాంక్, పటిష్ట స్థాయి నిర్వహణకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్ శాఖ, వ్యయ నిర్వహణ శాఖ, ఆర్థిక సేవల శాఖల సహా పలు ఇతర ప్రభుత్వ శాఖలు సైతం బ్యాంక్ సక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. పోస్టాఫీసులకు సంబంధించి కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంపొందించే క్రమంలో 2017 మార్చి నాటికి ‘గ్రామీణ డాక్ సేవకులు’ అందరికీ ఐపాడ్, స్మార్ట్ఫోన్లు అందించే విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసుల కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకన్నా అధికంగా ఉంది. ఎస్బీఐ 1,666 కోర్ బ్యాంకింగ్ బ్రాంచీలు కలిగివుండగా, పోస్టాఫీసులకు సంబంధించి ఈ సంఖ్య 22,137గా ఉంది. -
కార్యకలాపాల విస్తరణలో ఎన్సీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్, విజయవాడలో అదనంగా రెడీ-మిక్స్ కాంక్రీట్ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రూ. 195 కోట్ల ఆదాయంపై రూ. 12 కోట్ల లాభం నమోదు చేసింది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ. 178 కోట్లు కాగా లాభం రూ. 19 కోట్లు. నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లు సమీకరించగా, ఇందులో రూ. 103 కోట్లను రుణాల చెల్లింపునకు వినియోగించినట్లు పేర్కొంది. మధ్యంతర డివిడెండు రూ. 1తో కలిపి పూర్తి ఆర్థిక సంవత్సరానికి షేరు ఒక్కింటిపై రూ. 2 మేర తుది డివిడెండు ప్రకటించింది. -
వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు
సర్క్యులర్ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం రాష్ట్ర వైద్యుల సంఘంతో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉన్నం దున పాక్షిక పదోన్నతులకు మంత్రి లక్ష్మారెడ్డి అంగీకరించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం కోసం.. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల మీద నిషేధం ఉందన్నారు. మరోవైపు ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా పూర్తికాలేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 695 పదోన్నతులు, బదిలీలపై సడలింపు ఇచ్చిందన్నారు. దీంతో పాక్షిక బదిలీలు, పదోన్నతులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై సమీక్ష... మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆస్పత్రిలో సేవలపై సమీక్ష నిర్వహించారు. ఎమర్జెన్సీ సేవలను వేగంగా ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) సీఈవో ను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఈవో లక్ష్మారెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జె.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారుల కట్టడి చట్టానికి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన అప్పులను బలవంతంగా వసూలు చేయడం, అధిక వడ్డీ తీసుకోవడం వంటి చర్యలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కుల వృత్తిదారుల నుంచి బలవంతంగా అప్పులను వసూలు చేసినా, అధిక వడ్డీ తీసుకున్నా .. అలాంటి వ్యాపారులను ఇక నుంచి కొత్త చట్ట ప్రకారం శిక్షించనున్నారు. బుధవారం శాసనసభలో డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ ఆలీ ‘స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రిలీఫ్-2016’ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. -
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
♦ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం ♦ మద్దతు ప్రకటించిన విపక్షాలు ♦ మహిళలకూ కోటా కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి ♦ అంగీకరించిన ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు బిల్లుకు సవరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇక రిజర్వేషన్ విధానం అమలు కానుంది. పాలకమండళ్ల నియామకం విషయంలో రిజర్వేషన్లకు అవకాశం కల్పించేలా చట్టసవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం శాసనసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విధానం మరెక్కడా లేదని ప్రభుత్వం పేర్కొనగా, ఈ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో సభ ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపింది. కేవలం కులాలవారీగా రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచగా, అందులో మహిళలకూ రిజర్వేషన్ ద్వారా చోటు కల్పించాలన్న కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచనను సభ పరిగణనలోకి తీసుకుంది. దాన్ని బిల్లులో పొందుపరచాల్సిందిగా సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించడంతో అప్పటికప్పుడు సవరణ చేసి ఆమోదించడం విశేషం. విపక్షాలు చేసే ఇలాంటి మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, ఇదేవిధంగా బంగారు తెలంగాణకు అంతా కలసి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుల ఆమోదం అయిన వెంటనే మంత్రి హరీశ్‌రావు మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో సామాజిక న్యాయం పాటించేలా రిజర్వేషన్ విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. అయితే కులపరమైన రిజర్వేషన్లతో సరిపుచ్చకుండా లింగభేదాన్ని కూడా అందులో చేరిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ‘చిన్నారెడ్డి మంచి సూచన చేశారు. మహిళలకు ప్రాధాన్యం అవసరం. 33 శాతం కోటాను వారికి కేటాయించేలా మార్చి బిల్లుకు ఆమోదం తెలిపితే బాగుంటుంది’ అంటూ స్పీకర్‌ను కోరారు. ఆయన సూచన మేరకు సిబ్బంది అప్పటికప్పుడు బిల్లుకు సవరణ చేశారు. గుజరాత్లో అమలులో ఉన్నట్టు రైతులే పాలకమండలిని ఎన్నుకునే విధానం అందుబాటులోకి తేవాలని చిన్నారెడ్డి సూచించారు. ముందుగా రిజర్వేషన్ల ప్రకారం కొత్త కమిటీలు వేసి మార్కెట్లను పటిష్ట పరచిన తర్వాత దాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. మహిళల కోటా ప్రకటించటం పట్ల అధికార పక్ష సభ్యురాలు సురేఖ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో మైనారిటీలను కూడా చేర్చాలని దేశం సభ్యుడు సండ్ర సూచించగా, ఆ విషయం బిల్లులో ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకూ మార్కెట్ కమిటీలో చోటు కల్పించేలా రిజర్వేషన్ అమలు చేయాలని తాము ప్రతిపాదిద్దామనుకున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రే స్పందిం చటం సంతోషంగా ఉందని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇది మంచి నిర్ణయమని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్, మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్‌లు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డులలో ఆన్లైన్ విధానం: హరీశ్‌రావు లోపభూయిష్టంగా ఉన్న మార్కెట్‌యార్డులను పటిష్టపరిచి అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా గడ్డిఅన్నారం, బోయిన్పల్లి మార్కెట్లలో ప్రవేశపెడితే వాటి ఆదాయం పెరిగిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. రూ. 1,024 కోట్లతో కొత్తగా గోడౌన్లు నిర్మిస్తున్నామని, త్వరలో కొన్ని మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని వెల్లడించారు. సీఎంకు మహిళా ఎమ్మెల్యేల కృతజ్ఞతలు మహిళల సంక్షేమానికి పాటు పడడంతో పాటు వారికి సముచిత గౌరవం దక్కేవిధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి సభలో బిల్లు పాసయిన అనంతరం టీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్పద్మా దేవేందర్‌రెడ్డి, వి.సునీత, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవా లక్ష్మి, అజ్మీరా రేఖా నాయక్ తదితరులు సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. సీఎం నిర్ణయాలు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంచే విధంగా ఉన్నాయని వారన్నారు. -
రూ.6,500 కోట్ల విలువైన 13 ఎఫ్‌డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.6,500 కోట్ల విలువైన 13 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. దీంట్లో రూ.5,900 కోట్ల విలువైన వయామ్ నెట్వర్క్స్ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) ఓకే చేసింది. వయామ్ నెట్‌వర్క్‌లో ఏటీసీ(అమెరికా టవర్ కార్పొరేషన్) ఆసియా పసిఫిక్ పీటీఈ మెజారిటీ వాటాను రూ.5,900 కోట్లకు కొనుగోలు చేయనుంది. రూ.400 కోట్ల విలువైన ఆల్స్టోమ్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా ప్రతిపాదన, రూ.150 కోట్ల విలువైన సిప్లా ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఎఫ్ఐపీబీ 26 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించింది. -
రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతులకు రెండో విడత రుణమాఫీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ, బ్యాంకర్లు పంపిన ప్రతిపాదనను అంగీకరించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదలపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపడంతో ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విషయంపై శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, సంచాలకులు ప్రియదర్శిని సహా రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అంశాలపై సమీక్ష జరిపారు. ఇప్పటివరకు బ్యాంకులు పూర్తిస్థాయిలో వినియోగపత్రాలు (యూసీ) అందజేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. యూసీలు రాకుంటే రెండో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయడం సాంకేతిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. -
వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం!