న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 1978లో చీలిపోయిన తర్వాత ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్(ఐ) కోసం ఏనుగు, సైకిల్, హస్తం గుర్తులు పరిశీలనకు రాగా, ఇందిర ‘హస్తం’ గుర్తుకు ఆమోద ముద్ర వేశారని పొలిటికల్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తెలిపారు. ఇటీవలే విడుదలైన తన పుస్తకం ‘బ్యాలెట్– టెన్ ఎపిసోడ్స్ దట్ హావ్ షేప్డ్ ఇండియాస్ డెమొక్రసీ’లో కిద్వాయ్ వివరించారు. కాంగ్రెస్(ఐ) ఏర్పాటుతో ఇందిర ‘ఆవు–దూడ’ గుర్తును వదులుకోవాల్సి వచ్చిందని కిద్వాయ్ ఈ పుస్తకంలో తెలిపారు.
‘అప్పటి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బూటా సింగ్ తమకు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించాలని ఈసీకి లేఖ రాశారు. దీంతో ఏనుగు, హస్తం, సైకిల్ గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని ఈసీ సూచించింది. ఈ సమయంలో ఇందిర ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నేత పీవీ నరసింహారావుతో సమావేశమై ఉన్నారు. ఎన్నికల గుర్తుపై తుది నిర్ణయం తీసుకోలేని సింగ్.. ఇందిరకు వెంటనే ఫోన్ చేశారు. హస్తం గుర్తును ఎంపిక చేద్దామని సూచించారు. అయితే సాంకేతిక కారణమో లేక సింగ్ ఉచ్ఛారణ సరిగ్గా లేకపోవడంతోనో ఫోన్‌లో ఇందిరకు హాత్(హస్తం) అన్న పదం హాథీ(ఏనుగు)గా విన్పించింది.
బూటా సింగ్ ఏనుగు గుర్తునే మళ్లీ మళ్లీ సిఫార్సు చేస్తున్నారని ఆగ్రహించిన ఇందిర.. చివరికి ఫోన్‌ను పీవీ నరసింహారావు చేతికిచ్చా రు. బహుభాషా పండితుడైన నరసింహారావు రిసీవర్ అందుకున్న వెంటనే సింగ్ చెబుతున్నదేంటో అర్థం చేసుకున్నారు. హాత్ అనడం ఆపి పంజా అనాలని పీవీ ఆయనకు ఫోన్లో గట్టిగా జవాబిచ్చారు. చివరికి పీవీ అసలు విషయాన్ని ఇందిరకు చెప్పడంతో హస్తం గుర్తుకు ఆమె అంగీకరిం చారు’ అని కిద్వాయ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment