2016లో సోనియా రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2016 సంవత్సరంలో రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? తన 70వ పుట్టినరోజు నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తోంది సీనియర్ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ పుస్తకం. గత పుట్టినరోజు నాడు(డిసెంబర్ 9, 2012) పార్టీ సీనియర్ నేతలకు తన రిటైర్మెంట్ ఆలోచన గురించి సోనియా చెప్పారని, దాంతో కంగుతిన్న ఆ నేతలు పార్టీ బాధ్యతలు రాహుల్‌గాంధీ తీసుకునేంత వరకు ఆ నిర్ణయం వాయిదా వేసుకోవాలని కోరినట్లు అందులో వెల్లడించారు.
దాంతో అప్పట్నుంచి పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకోవాలంటూ పార్టీ సీనియర్ నేతలతోపాటు ప్రధాని మన్మోహన్సింగ్ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చారని దానికి ఆయన ససేమిరా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాహుల్ అనాసక్తి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తోందని, అందువల్ల కేబినెట్లో బెర్త్ కానీ, పార్టీ ఉపాధ్యక్ష పదవి కానీ తీసుకోవాలని ప్రధాని కోరారని వెల్లడించారు. దాంతో రాహుల్ పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునేందుకే మొగ్గు చూపారని తెలిపారు. అలా ఈ సం వత్సరం జనవరి 19న జైపూర్‌లో జరిగిన పార్టీ ‘చింతన్ శిబిర్’లో రాహుల్‌కు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారని వివరించారు. అయినా సోనియా రిటైర్మెంట్ నిర్ణయం పార్టీ వర్గాలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని పేర్కొంది. మరోవైపు, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్లాలని కూడా రాహుల్ తీవ్రంగా ఆలోచించారని, అయితే ఆ ఆలోచనను పార్టీ మొగ్గలోనే తుంచేసిందని ఆ పుస్తకం వెల్లడించింది. కేవ లం ఒక్క రాష్ట్రానికే పరిమితం చేస్తే రాహుల్‌ను భవి ష్యత్ ప్రధాని చేయాలన్న ప్రణాళికకు విఘాతం కలుగుతుందేమోనని పార్టీ ఆలోచించిందని పేర్కొంది. ఆ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుని కాం గ్రెస్ దారుణ ఓటమి పాలైన విషయం తెలిసిందే.