సందర్భం
కొన్ని నిర్ణయాలు చరిత్ర గతినే మారుస్తాయి. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేర సైనిక చర్య జర పాలనే నిర్ణయం ఇందుకొక నిదర్శనం. 1984 జూన్‌లో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో మకాం చేసుకున్న సిక్కు తీవ్రవాదులను బయటికి రప్పించడానికి మరో మార్గం లేక ప్రధాని ఇందిరాగాంధీ (67) భారత సైన్యాన్ని పంపాల్సి వచ్చింది. దీనికి దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. ఊహించని ఆ చర్యతో సిక్కు తీవ్రవాదం ఓ విధంగా సద్దుమణిగింది. కానీ, ఆ తర్వాత ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాజీ, జవసత్వాలు ఉడిగిన అబలగా ప్రవర్తించారని అంటారు.
ప్రభుత్వ కార్యభారాలు చాల వరకు తగ్గించుకుని ఆమె, ప్రధాని నివాసం... 1, సఫ్దర్ జంగ్ రోడ్డుకే పరి మితం అయ్యారు. రాత్రి పూట ఆమెకు ఏవో పీడ కలలు కూడా వచ్చేవట. తన కుటుంబ సభ్యులను ఏవో శక్తులు కిడ్నాప్ చేస్తాయని తెలీని ఆందోళన ఆమెలో ఆవహించ సాగింది. వీలు దొరికితే సామాన్య మహిళలా, రాత్రి కొడుకు, కోడలు, మనవడు (రాహుల్), మనవరాలు (ప్రియాంక)తో కలిసి డిన్నర్ చేయటానికి ఉవ్విళ్ళూరేవారట. 12 ఏళ్ల ప్రియాంకతో, పెద్దయాక, తను వాడే పట్టుచీరలు ధరించి రాయ బరేలి, ఆమేథి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లా లని, నవ్వుతూ అనేదట (వింత కోరికలు!).
‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా సిక్కు సమాజం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా ప్రభుత్వానికి దూరమయింది. ఇందిరా భక్తుడు, ప్రముఖ పాత్రి కేయుడు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డును వాపస్ చేశారు. అప్పటి పరిస్థితుల దరిమిలా ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ప్రధానిని కొంతకాలం సిక్కు యువతకు దూరంగా ఉండాలని తేల్చాయి.
సెక్యులర్ దేశానికి ప్రధానిగా ఉండి అలా చేయడం బావోదని, తన నివాసంలో ఉన్న ఇద్దరు సిక్కు సెక్యూ రిటీ యువకులను మార్చనీయలేదు ఇందిర. 22 ఏళ్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ సత్వంత్ సింగ్‌ను చూపిస్తూ ఒకసారి... ‘ఈ బహదూర్ నౌ జవాన్ పర్యవేక్షణలో నాకు ఏ ప్రాణహాని లేదని’ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆశ్చర్యం! వారంలోపే అదే యువకుని తుపాకి తూటాలకు ఆమె బలైపోయారు.
1984 అక్టోబర్ 31 బుధ వారం ప్రొద్దుట రాహుల్, ప్రియాంకలను స్కూలుకెళ్ళే ముందు నానమ్మ ఇందిర, దగ్గరకి తీసుకుని గట్టిగా వాటేసుకుంది. ఏదో ఉద్వేగ పూరిత అనుభూతి ఆమెతో అలా చేయించింది. ఆ తర్వాత 9 గంటలకు, ముదురు ఆవరంగు కాటన్ శారీలో వడి వడిగా అడుగు లేస్తూ, ప్రక్కనే ఉన్న 1, అక్బరు రోడ్డులోని పార్టీ ఆఫీసు వైపు నడుస్తున్నా రామె. ఆమె వెంట పర్సనల్ స్టాఫ్ నారాయణ్ సింగ్ ఆమెకు ఎండ తగులకుండా గొడుగు పడుతూ పోతున్నాడు.
అతని వెనకాలే ‘మేడం మేన్ ఫ్రైడే’గా పేరొందిన పీఏ... ఆర్‌కే థావన్ కూడా నడుస్తున్నాడు. బ్రిటన్ యాక్టర్ పీటర్ ఉస్తినోవ్, ఐరిష్ టీవీ యూనిట్‌తో ప్రధానిని ఇంటర్వ్యూ షూటింగ్ కోసం అక్కడ ఎదిరి చూస్తూ, రిస్ట్ వాచి చూసుకున్నాడు. సరిగ్గా 9.10 గంటలు. మేడం పది నిమిషాలు లేటు, ఎందుకో అని అనుకుంటుండగానే, అటు వైపు గన్ ఫైరింగ్ సౌండ్! ప్రధాని సెక్యూరిటీ స్టాఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బియాంత్ సింగ్... వెళ్తున్న ప్రధానికి ఎదురెళ్లి శాల్యూట్ చేస్తూనే, సర్వీస్ రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు.
ఈ హఠాత్ పరిణామానికి జడుసుకుని నారాయణ్ సింగ్ గొడుగును గాలిలో వదలి ‘బచావ్’ అంటూ కేక లేశాడు. అంతలోనే, అటు సత్వంత్ సింగ్ స్టెర్లింగ్ సబ్ మెషిన్ గన్ నుండి 30 బుల్లెట్లు మేడం శరీరంలో కెళ్ళాయి. క్షణాల్లో రక్త ప్రవాహంతో నేల కొరిగింది ఇందిర. గత కొద్ది రోజులుగా పొంచి ఉన్న మృత్యువు హుటాహుటిన ఆమెను అలా తీసుకెళ్ళింది.
రక్తం చుక్కల డైలాగ్...
క్రితం రోజే (అక్టోబరు 30) సాయంత్రం, భువ నేశ్వర్ (ఒరిస్సా) అసెంబ్లీ ఆవ రణలో జరిగిన బహిరంగ సమా వేశంలో ఇందిరాజీ ప్రసంగిస్తూ, ‘... మై ఆజ్ యహన్ హూ. కల్ శాయద్ యహాన్ న రహూ. ముఝే చింతా నహి. జబ్ మై మరూంగీతో, మేరీ ఖూన్ కా ఏక్ ఏక్ బూంద్ భారత్ కో మజ్బూత్ కర్నేమే లగేగా’ (ఇవ్వాళ నేను ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు ఇక్కడ లేకపోవచ్చు. నాకు బెంగ లేదు. నేను ఒకవేళ చనిపోతే, నా ప్రతీ రక్తం చుక్క దేశ పటిష్ఠతకు తోడ్పడుతుంది) అని అన్నారు. ఆవేశపూరితమైన ఈ రక్తం చుక్కల డైలాగు, ఆమెతో మృత్యు దేవతే పలికించిందని అప్పటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోసాగారు. ఇందిర హత్యానంతరం రాజధాని డిల్లీలో చెలరేగిన మత ఘర్షణల్లో 3 వేల మంది సిక్కులు చనిపోయారని ఖుష్వంత్ సింగ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
జిల్లా గోవర్ధన్
(రషీద్ కిద్వాయి రాసిన ‘24, అక్బర్ రోడ్ ’ ఆధారం)
వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై
(రేపు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు)
Comments
Please login to add a commentAdd a comment