సాక్షి, హైదరాబాద్: పులుల అభయారణ్యాల్లో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. అయితే మరోవైపు జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ చర్యలవల్ల పులుల సంరక్షణకు నష్టం వాటిల్లుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని కొమురంభీం ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో (జాతీయరహదారి–363)ని రోడ్డును (94 కి.మీ పొడవు) ‘ఫోర్ లేనింగ్ నేషనల్ హైవే’గా మార్చాలనే ప్రతిపాదనపై ఇటీవల పునర్‌వ్యవస్థీకరించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి ఈ నెల 1న జరిగిన తొలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది.
దీనితో పాటు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మాఖుది, రేచ్ని రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య కాగజ్‌నగర్ డివిజన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో (కారిడార్ ఏరియా) పరిధిలో మూడో కొత్త బ్రాడ్‌గ్రేజ్ లైన్‌ను వేసేందుకు 168.43 హెక్టార్ల అటవీభూమిని మళ్లించడంపైనా ఈ భేటీ ఆమోదం తెలిపింది.డబ్ల్యూఎల్‌ఎం వరంగల్ డివిజన్‌లోని ఉరాట్టం–ఐలాపురం రోడ్డు అప్‌గ్రెడేషన్‌కు 31.759 హెక్టార్ల అటవీభూమిని మళ్లించేందుకు ఈ బోర్డు అంగీకరించింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో గోదావరి నదిపై తుపాకుల గూడెం గ్రామం వద్ద పి.వి.నరసింహారావు కాంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–1, ప్యాకేజ్–1లో భాగంగా బ్యారేజీ నిర్మాణానికి 27.9133 హెక్టార్ల వన్యప్రాణి ప్రాంతాల్లోని అటవీభూమిని సైతం మళ్లించడంపై వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది.
పులులకు తీరని నష్టం...
అభయారణ్యాల్లో పులుల తిరుగాడే ప్రధాన ›ప్రాంతం (కోర్ ఏరియా), మహారాష్ట్ర సరిహద్దులోని పులులకు కీలకమైన ప్రాంతాల్లో భాగమైన ఆయాచోట్ల రోడ్ల విస్తరణ, కొత్తరైల్వేలైన్ల నిర్మాణం సరికాదని పర్యావరణ వేత్తలు, జంతుప్రేమికులు వాదిస్తున్నారు.మహారాష్ట్రలోని తడోబా ఆంథేరి టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణకు పులుల వలస మొదలు కావడంతోపాటు కవ్వాల్ టైగర్ అభయారణ్యం పరిధిలో ఇక్కడే పిల్లలు కూడాపెడుతున్నాయి. ఈ తరుణంలో పులుల వృద్ధికి, వాటి సంచారానికి, వలసలకు కీలకమైన ఈ ప్రాంతంలో నాలుగు లేన్ల రోడ్లు వేయడం, కొత్త రైల్వేలైను వేయడం వల్ల పులులసంఖ్య పెరిగేందుకు ప్రతికూలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచిర్యాల–చంద్రపూర్ మార్గంలో 94 కి.మీ పొడవున నాలుగు లేన్ల రోడ్డు వేయాలనే ప్రతిపాదనపై వన్యప్రాణి సంరక్షణకు తగిన చర్యలు తీసుకున్నాకే ఆమోద ముద్ర వేసినట్టుగ రాష్ట్ర వన్యప్రాణి మండలి సభ్యులు చెబుతున్నారు. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఆయా అంశాలు పరిశీలించి, అత్యవసరమైన సందర్భాల్లోనే ఆమోదం తెలుపు తున్నట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment